నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు | Public Suffering with Power Cuts In Chandrababu TDP Govt | Sakshi
Sakshi News home page

నిరంతర ‘కోత’లు!.. అల్లాడుతున్న ప్రజలు

Published Tue, Apr 29 2025 4:49 AM | Last Updated on Tue, Apr 29 2025 8:37 AM

Public Suffering with Power Cuts In Chandrababu TDP Govt

విద్యుత్‌ కోతతో పశ్చిమ గోదావరి జిల్లా రామన్నగూడెంలో అలుముకున్న అంధకారం

నగరాలు, పట్టణాల్లో నిత్యం గంటల తరబడి కరెంట్‌ కోతలు 

గ్రామాల్లో ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియని దుస్థితి

అనధికారిక విద్యుత్‌ కోతలతో అల్లాడుతున్న ప్రజలు 

ఉక్కపోతతో అవస్థలు.. పొలాలకు నీరందక రైతన్నల అగచాట్లు 

వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్‌ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి  కనీసం ఏడు గంటలు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేసిన సర్కారు 

ఇప్పటికే జనం నెత్తిన రూ.15,485 కోట్ల చార్జీల బాదుడే బాదుడు.. 

అయినా విద్యుత్‌ సక్రమంగా ఇవ్వకుండా ఎడాపెడా కోతలపై సర్వత్రా ఆగ్రహం 

గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే డిమాండ్‌ తగ్గినా అది కూడా సరఫరా చేయలేక కోతలు 

ఓల్టేజ్‌ హెచ్చు తగ్గులతో దెబ్బ తింటున్న ఉపకరణాలు

చంటిపిల్లలతో అల్లాడిపోతున్నాం.. 
విద్యుత్‌ కోత వల్ల మేం సక్రమంగా నిద్రపోయి చాలా రోజులైంది. ఏ పనీ చేసుకోలేక పోతున్నాం. ఉక్కపోత వల్ల చంటి పిల్లలతో  అల్లాడిపోతున్నాం. పట్టించుకునే నాధుడే లేడు. విద్యుత్‌ సరఫరా లేక వీధుల్లో నిరీక్షించాల్సి వస్తోంది. 
– చల్లపల్లి మంగ, తారకరామ కాలనీ, బొబ్బిలి.

సాక్షి, అమరావతి: ఒకపక్క ముచ్చెమటలు పట్టిస్తున్న బిల్లులు.. మరోపక్క విద్యుత్తు కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకర్రలే శరణ్యమనే స్థితికి తెచ్చింది. 

అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా రూ.15,485 కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంట్‌ సరఫరాలో దారుణంగా విఫలమైందని.. నిరంతర విద్యుత్తు దేవుడెరుగు.. నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌’లో అన్నదాతల అగచాట్లు, పట్టణాలు, పల్లెల్లో ప్రజల దుస్థితి వ్యక్తమైంది. ఏప్రిల్‌ నెలలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్‌ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది. 

పల్లెల్లో అగమ్యగోచరం..
నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు, పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికా­రికంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. వారంలో ఒక రోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపి వేస్తున్నారు. పట్టణాల్లో ప్రాంతాలవారీగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్‌ కోత పెడుతున్నారు. ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి తలెత్తింది. 

గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్ధితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు. ఎల్‌సీ, లైన్ల మరమ్మతులు, సబ్‌ స్టేషన్‌ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు. 


బాబు హయాంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే..
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 242.849 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. గతేడాది ఇదే సమయంలో 250.804 మిలియన్‌ యూనిట్ల వినియో­గం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 3.17 మిలియన్‌ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కారు అనధికారిక కోతలు విధిస్తోంది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వాడకం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం డిమాండ్‌ గతేడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది. 

ఇక మే నెలలో రోజువారీ వినియోగం 260 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇక అప్పడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘పవర్‌ హాలిడే’ పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. దీంతో కుటీర పరిశ్రమలు మూత­పడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే దుర్భర పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆందోళన పారిశ్రా­మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది.

విజయనగరం జిల్లా బొబ్బిలి తారకరామ కాలనీలో విద్యుత్‌ కోతల వల్ల ఇళ్లలో ఉక్కపోత భరించలేక అర్ధరాత్రి చంటి బిడ్డతో సహా ఆరుబయట కూర్చుని జాగారం చేస్తున్న జనం  

భవిష్యత్‌ కోసం..
భవిష్యత్‌లో విద్యుత్‌ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29  పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజె­క్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్‌ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ) నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది.

నాడు విద్యుత్తు వెలుగులు
ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి విద్యుత్‌ డిమాండ్‌ ప్రధాన సూచి­కగా భావిస్తుంటారు. వినియోగ­దా­రులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది. తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు  రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొన్నప్పటికి ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్‌ సరఫ­రాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. ఫలితంగా 2020 నుంచి 2024కి 22.5 శాతం విద్యుత్‌ సరఫరా వృద్ధి చెందింది. 

తాజాగా కేంద్ర విద్యుత్‌ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020లో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద 65,414 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా ఉండగా 2024లో 80,151 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తింది. భారత్‌కు చైనా బొగ్గు దిగుమతులు పడిపోయాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. జపాన్‌లోనూ విద్యుత్‌ సంక్షోభం తాండవించింది. 


శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తులు వాడి హీటర్లకు విద్యుత్‌ వినియోగం తగ్గించాలని అక్కడి ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 15 శాతం విద్యుత్‌ వినియోగంతో పాటు సహజ ఇంధనం ధరలు పెరగడంతో ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్‌ బకాయి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టు విద్యుత్‌ను ఎలాంటి కోతలు లేకుండా గత ప్రభుత్వం  ప్రజలకు అందించింది.

మా బతుకుల్లో వెలుగు కరువు
పగలు రెండు గంటలు, రాత్రి రెండు గంటలు కరెంట్‌ తీసేస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా భోజనాల వేళకు కరెంట్‌ పోతోంది. వారంలో ఒక రోజు రోజంతా కరెంట్‌ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటికి ఎలాంటి మంచి జరగలేదు. నా భర్తకు పక్షవాతం వస్తే కనీసం పింఛన్‌ ఇవ్వడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో, మా బతుకుల్లో ఈ ప్రభుత్వం వల్ల వెలుగు లేకుండా పోయింది.
    –దిద్దె రత్నకుమారి, జ్యోతి కాలనీ, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లా

ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో
ఉపాధి కోసం పిండి మర పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఓల్టేజ్‌ ఎక్కువ, తక్కువ అవుతోంది. దీనివల్ల మోటార్లు కాలిపోతున్నాయి. 
    –కిశోర్, నాగమణి పిండిమిల్లు, టీఆర్‌ కాలనీ, బొబ్బిలి

తెల్లార్లూ కూర్చునే ఉంటున్నాం..
కరెంటు కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. తెల్లార్లూ కూర్చునే ఉండాల్సిన పరిస్థితి. సాయంత్రం తీసి తెల్లవారు జామున 3 గంటలకు ఇస్తున్నారు. అందాకా మెలకువగానే ఉంటున్నాం. ఇదేనా నాణ్యమైన విద్యుత్తు?  
–సీహెచ్‌ లక్ష్మి, బొబ్బిలి

ఏం ప్రభుత్వమో ఏమో?
గత ప్రభుత్వంలో నగరంలో విద్యుత్‌ సరఫరా ఆగడం ఎప్పుడూ చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెట్టుకొమ్మలు నరుకుతున్నాం, ట్రాన్స్‌ ఫార్మర్‌ బాగు చేస్తున్నాం.. అంటూ ఏదో ఒక సాకుతో వారంలో ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కరెంటు కట్‌ చేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏమో? వేసవిలో విద్యుత్‌ కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా..? మరి ఎందుకు పట్టించుకోరు?   
  –డి.లలిత, విశాఖపట్నం

పసిపాప అల్లాడుతోంది..
మా అమ్మగారింటికి వచ్చా. ఇక్కడ కరెంట్‌ అసలు ఉండటం లేదు. అస్తమానూ తీసేస్తున్నారు. చిన్నపాప ఉక్కపోతకు అల్లాడి పోతోంది. మా పరిస్థితి ఏమని  చెప్పుకుంటాం. కరెంటు కట్‌ చేయొచ్చు కానీ రాత్రిళ్లు కూడా లేకుండానా? కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం.    
–దివ్య, బొబ్బిలి

బిల్లుల మోత.. 
విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల మోత మోగిస్తున్న ప్రభుత్వం కోతలను  పట్టించుకోవడం లేదు. 
– షేక్‌ మహమ్మద్‌ అలి, కంభం, ప్రకాశం జిల్లా

రైతన్న కష్టం వృథా...!
నాకున్న ఎకరం పొలానికి తోడు మూడెకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. చివరి నేలకు తడి లేకపోతే ఇన్ని నెలల కష్టం వృథా అవుతుంది. ఎకరాకు కనీసం రూ.35 వేలు చొప్పున కౌలు చెల్లించాలి. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్‌ ఒకే విడతలో ఇచ్చేవారు. 

ఇప్పుడు రోజులో రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. అది కూడా 7 గంటలు మించడం లేదు. దీంతో తడిసిన నేలే మళ్లీ తడిచి పంటలు ఎండిపోతున్నాయి. గతంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు అదీ లేదు.
    –యాతం రామాంజనేయులు, కడియద్ద, పశ్చిమ గోదావరి జిల్లా

ఏ పురుగో పుట్రో కరిస్తే...!
ఏం ప్రభుత్వమో ఏంటో..! చచ్చిపోతున్నాం ఆఫీసుల చుట్టూ తిరగలేక. నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. పంట ఎండిపోతోందంటే ఎవరూ వినిపించుకోవడం లేదు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా కొత్తది ఇవ్వడం లేదు. గతంలో 9 గంటలు కరెంటు ఇచ్చేవారు. 

ఇప్పుడు 7 గంటలు ఇస్తే అదే ఎక్కువ. తెల్లవారుజామున 4 గంటలకు ఇస్తుండటంతో ఆ సమయంలో పొలానికి వచ్చి చేలకు నీరు పెట్టుకుంటున్నాం. ఏ పురుగో పుట్రో కరిస్తే మా పరిస్థితి ఏంటి? ఇదేం బాలేదు. ప్రభుత్వం ఇవన్నీ చూసుకోవాలి కదా!! 
    –మదుకూరి కొండల రాజు, కృష్ణాపురం, పశ్చిమగోదావరి జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement