
గోడ కూలిన ప్రదేశం
హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి.. సింహాచలంలో ఏడుగురు భక్తులు సజీవ సమాధి
కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మాణం
క్యూలైన్‌లో వెళ్తున్న భక్తులపై గాలి వానకే కూలిన గోడ
చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం
2 లక్షల మంది తరలి వస్తారని తెలిసినా సర్కారు నిలువెల్లా నిర్లక్ష్యం
రెగ్యులర్ ఈవోను నియమించని వైనం
వీఐపీల దర్శనాలు, టికెట్ల విక్రయాలపైనే దృష్టి.. సామాన్య భక్తులను కనీసం పట్టించుకోని యంత్రాంగం
దర్శనం అనంతరం చల్లగా ఢిల్లీకి జారుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్
పత్తా లేకుండా పోయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా?
నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు?
ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు?
పోస్ట్‌మార్టంలోనూ రాజకీయమే..
వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాల తరలింపు
పోస్టుమార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ
భక్తులకు యమపాశాలుగా మారుతున్న కూటమి సర్కారు పాపాలు
గత 11 నెలలుగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, అనూహ్య ఘటనలు
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు.
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు.
చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి.
ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు.
ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యం
ఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టి
పవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్‌చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్‌చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.
హడావుడిగా తాత్కాలిక గోడ
కేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది.
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు.

ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల ఫైల్ ఫొటోలు
ముందస్తు జాగ్రత్తలేవి?
లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు.
భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!
ఒకవైపు ఆలయ ఇన్‌చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్‌లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు.
ఇన్‌చార్జి ఈవోనే దిక్కు...!
ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మృతుల వివరాలు..
పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలు
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.
రాహుల్ విచారం
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.