
ఉమామహేశ్వరరావు, శైలజ మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
మా కొడుకు, కోడలు, బంధువులను సర్కారే బలిగొంది
మమ్మల్ని రోడ్డు పాల్జేసి కుటుంబాల్లో నిరాశ నింపింది
ప్రాణాలు తీయడానికే.. నాణ్యత లేని గోడ కట్టారు
ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమైంది?
సింహాచలం ఘటనలో మృతిచెందిన ఉమామహేశ్వరరావు తల్లిదండ్రుల ప్రశ్న
చందనోత్సవానికి వెళ్లి ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం
వీరిలో విశాఖ చంద్రంపాలెం సాఫ్ట్‌వేర్ దంపతులు ఉమామహేశ్వరరావు, శైలజ
ఇదే దుర్ఘటనలో శైలజ తల్లి, మేనత్త కూడా మృతి
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట యువకుడు, అతడి స్నేహితుడు సైతం
చేతికంది వచ్చిన బిడ్డల దుర్మరణంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు
గోడ నిర్మాణం నాసిరకం.. నా భర్త ప్రాణాలు తీయడానికే కట్టారా?
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటరావు, భార్య మహాలక్ష్మి
అన్యోన్యంగా ఉండే ఆ సాఫ్ట్‌వేర్ దంపతులు ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు..అలా వీరి ఆనందానికి తోడుగా యువతి తల్లి, మేనత్త కూడా బయల్దేరారు..సొంత కాళ్లపై నిలదొక్కుకున్న ఆ కుర్రాడు స్నేహితుడితో కలిసి వచ్చాడు.. కుమారులు స్థిరపడడంతో జీవితంలో నిశ్చింతగా ఉన్నాడు ఆ ఉద్యోగి....ఇలా చీకూచింత లేని వీరంతా అప్పన్న నిజరూపాన్ని దర్శించుకుని తరించాలని భావించారు. కానీ, గోడ మృత్యు రూపంలో ఎదురొచ్చింది. కూలి.. జీవితాలను కుప్పకూల్చింది.. ..తన ఇంటితో పాటు భర్త లేని చెల్లెలు కుటుంబానికి అండగా ఉంటున్న యువకుడిని బలిగొంది..కుమారుడికి రేపోమాపో పెళ్లి చేయాలనుకుంటున్న తండ్రికి తీరని గుండెకోతను మిగిల్చింది..పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నప్పటికీ భర్తను చూసుకుంటూ ఉన్న భార్యను కుదేలు చేసింది.....ఇప్పుడు ఈ కుటుంబాల మాట ఒక్కటే.. అప్పన్నా ఇక మాకు దిక్కెవరు అని?
మధురవాడ, డాబా గార్డెన్స్/ఆరిలోవ (విశాఖ)/అంబాజీపేట: ‘‘మా పిల్లలు, బంధువులను ప్రభుత్వమే చంపేసింది. చందనోత్సవం పుణ్యమా అని సర్కారు మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో నిరాశ నింపింది. ఎన్నికల్లో మా అబ్బాయి ఉమామహేశ్వరరావు బంధువులందరితో టీడీపీకి ఓటు వేయించాడు. చివరకు ఆ ప్రభుత్వమే నా కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది’’ అని సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉమామహేశ్వరరావు తండ్రి అప్పలనాయుడు, తల్లి శాంతి గుండెలు బాదుకుంటూ విలపించారు.
‘‘సింహాచలం కొండపై నాణ్యత లేని గోడ కట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. మా వాళ్ల ప్రాణాలు తీయడానికే అక్కడ గోడ నిర్మించారు. అధికారులు, కాంట్రాక్టర్‌ను జైలుకు పంపాలి. ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమైంది? గోడ పనుల్లో నాణ్యత చూడలేదా?’’ అని శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలేనికి చెందిన పిల్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (28) దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరికి 2022 నవంబరులో వివాహమైంది.
ఉమా మహేశ్వరరావు హైదరాబాద్ హెచ్‌సీఎల్‌లో, శైలజ విశాఖ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగులు. అయితే, విశాఖలోని నివాసానికి సమీపంలో ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడినుంచే పనిచేస్తున్నారు. అన్యోన్యమైన ఈ జంటకు దైవ భక్తి ఎక్కువ. ఎక్కడికైనా కలిసే వెళ్తారు. తరచూ టూర్లు వేస్తుంటారు. ఇటీవలే ఊటీ, కొడైకెనాల్, పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి వచ్చారు. వీకెండ్స్ కచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్తారు. బుధవారం రాత్రి 9.30 ప్రాంతంలో మహేష్, శైలజ సింహాచలం బయల్దేరారు. ఇది తెలిసి హెచ్‌బీ కాలనీలో ఉండే శైలజ తల్లి వెంకటరత్నం (45), మేనత్త గుజ్జారి మహాలక్ష్మి (60) కూడా వారితో పయనమయ్యారు.
అప్పన్నను కళ్లారా చూసే తరుణం ఆసన్నం కాగా గోడ రూపంలో మృత్యువు కబళించింది. కుమారుడి మరణ వార్త తెలిసి అప్పలనాయుడు, శాంతి హతాశులయ్యారు. తమ కుటుంబంలోని నలుగురిని ఆ దేవుడు ఒకేసారి తీసుకుపోయాడంటూ రోదించారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు మంచి ఉద్యోగాలతో స్థిరపడుతున్న సమయంలో అర్థంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రోడ్డునపడ్డ రెండు కుటుంబాలు
ఉమామహేశ్వరరావు కుటుంబంలో అతడే పెద్ద దిక్కు. మూడేళ్ల కిందట భర్తను కోల్పోయిన చెల్లి చంద్రకళ ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింట్లోనే ఉంటోంది. అలా రెండు కుటుంబాలకు ఇతడే ఆధారం. ఉమా మహేశ్వరరావు మృతితో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
పెళ్లి చేద్దామనుకుంటుండగా..
‘‘విశాఖలో ఇంటీరియర్ వర్క్స్ చేస్తూ పాతిక మందికి ఉపాధి కల్పిస్తున్నా నాన్నా అని మా అబ్బాయి చెప్పేవాడు. దీనికి ఎంతో సంబరపడేవాడిని. వివాహం జరిపించాలనుకునే సమయంలో దేవుడు తీసుకుపోయాడంటూ’’ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొర్లపాటివారిపాలెంకు చెందిన పత్తి దుర్గాస్వామినాయుడు (28) తండ్రి వీర వెంకట సత్యనారాయణ బోరున విలపించాడు. దుర్గాస్వామి విశాఖ సీతమ్మపేటలో ఉంటూ.. సీతమ్మధారలో న్యూ డైమండ్ ఇంటీరియర్స్ దుకాణం నడుపుతున్నాడు. సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనానికి తమ ఊరికే చెందిన స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (శివ) (33)తో కలిసి వెళ్లాడు. గోడ కూలిన ఘటనలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి
‘‘సింహాచలంలో ఆ గోడ ఇప్పుడు ఎందుకు కట్టారో. నా భర్త ప్రాణాలు తీయడానికేనేమో? వారం క్రితమే నిర్మించారని అందరూ అంటున్నారు. అదీ సరిగా కట్టలేదట. అధికారులు ఏమయ్యారు. వారి నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నేను ఎలా బతకాలి’’ అని స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ విభాగం ఉద్యోగి, విశాఖ పాత అడవివరంనకు చెందిన ఎడ్ల వెంకటరావు భార్య మహాలక్ష్మి రోదించారు. పల్పెట్ ఆపరేటర్‌గా అందరితో కలివిడిగా ఉండే వెంకటరావు మృతి చెందడాన్ని సహోద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చందనోత్సవ స్వామి దర్శనానికి భార్యతో కలిసి వెళ్దామని అనుకున్నా.. చివరకు ఒక్కడే బయల్దేరారు. ‘‘ఒంటరిగా వెళ్లారు. మమ్మల్ని వదిలేశారంటూ’’ మహాలక్ష్మి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మహాలక్ష్మి అడవివరం దగ్గర్లోని రెసిడెన్షియల్ స్కూల్‌లో హెల్త్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరీ ఇద్దరు కుమారులు బెంగళూరులో ఉంటున్నారు. ఒకరు ఇంజనీర్ కాగా.. మరొకరు డాక్టర్. ఇటీవలే డాక్టర్‌కు వివాహం చేశారు. ఇక వెంకట్రావు సోదరుడు.. ‘‘ఎవరూ లేని నాకు అన్నయ్యే దిక్కు. ఆయన నన్ను వదిలిపోయాడంటూ’’ రోదిస్తూ సొమ్మసిల్లాడు.
డాడీ.. నీ పేరిట అన్నదానం చేయిస్తా అన్నాడు..
ఈశ్వర శేషారావు మెట్రో కమ్ కంపెనీలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటారు. ఎదిగొచ్చిన కుమారుడు ఉద్యోగం చేసి ఆదుకుంటాడని అనుకుంటున్న సమయంలో కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శేషారావు తండ్రి శ్రీనివాసరావు, తల్లి సీతామహాలక్ష్మి రోదించారు. ‘మంగళవారం రాత్రి ఫోన్ చేసి డాడీ.. నీ పేరిట సింహాచలం దేవస్థానంలో అన్నదానం చేస్తున్నా అని చెప్పాడు. తెల్లవారేసరికి మాకు దూరమయ్యాడు’ అని వాపోయారు.
చందనోత్సవం ముందు పనులు చేయడమేంటి?
ఏటా చందనోత్సవానికి వేలాదిమంది భక్తులు వస్తారని తెలుసు. అయినా దర్శనాల తేదీ దగ్గరగా ఉన్న సమయంలో పనులు చేయడం ఏమిటి? ఒకవేళ చేసినా ప్రమాదం ఉందని గ్రహిస్తే వేరే దారిలో భక్తులను పంపించాలి కదా. పోయిన ప్రాణాలను ఎవరు తెస్తారు? ఆ కుటుంబాలకు దిక్కెవరు?
– ఐ.నరసయ్యమ్మ, ఉమామహేశ్వరరావు సమీప బంధువు
భక్తిభావంతో మెలిగేవారు
మహాలక్ష్మి ఎంతో భక్తిభావంతో మెలిగేవారు. అలాంటి వారి ఇంట ఇంత ఘోరమైన దుర్ఘటన జరగడం హృదయాన్ని కలిచివేస్తోంది.
– పొట్నూరి సూర్యకుమారి, వెంకోజీపాలెం
కళ్లముందు పెరిగింది
మధురవాడలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ దంపతుల మృతుల్లో ఒకరైన శైలజ వెంకోజీపాలెం శెట్టిబలిజ వీధికి చెందిన పైలా కనకరావు, వెంకటరత్నం కుమార్తె. మా కళ్ల ముందు పుట్టి పెరిగిన అమ్మాయి. మూడేళ్ల క్రితమే పెళ్లయ్యింది. ఇంతలోనే ఇంత విషాదం జరిగింది.
–అప్పలనర్సమ్మ, శెట్టిబలిజ వీధి
ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం : సీపీఎం
ఇటీవల నిర్మించిన గోడ అత్యంత నాసిరకంగా ఉందని, చిన్న వర్షానికే కూలిపోయిందంటే ఇందులో ఎంత అవినీతి జరిగిందో అధికారులు, ప్రభుత్వం పాత్ర ఎంత ఉందో అర్థమవుతోందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతి ఘటన నుంచి ప్రభుత్వం ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదని.. ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. సింహాచలం చందనోత్సవం ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు.
రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : సీపీఐ
సింహాచలం చందనోత్సవం విశాఖ ప్రజలకు విషాదాన్ని మిగిల్చిందని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేసి, కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.