‘మోంథా’ పెను ముప్పు! | Cyclone Montha Effect To Andhra Pradesh Heavy rains in Telangana too | Sakshi
Sakshi News home page

Cyclone Montha: ‘మోంథా’ పెను ముప్పు!

Oct 28 2025 1:11 AM | Updated on Oct 28 2025 8:42 AM

Cyclone Montha Effect To Andhra Pradesh Heavy rains in Telangana too

విశాఖలోని పెదజాలరిపేట తీరం వద్ద ఈదురుగాలులకు ఊగిపోతున్న చెట్లు

కాకినాడకు చేరువలో తుపాను.. కోస్తాకు గండం.. 

ఏపీపై పెను ప్రభావం.. తెలంగాణలోనూ భారీ వర్షాలు

ఏపీలో 17 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్, తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌  

ఏపీలో తీరం అల్లకల్లోలం... 

విశాఖలో భారీ ఈదురు గాలులు, ఎడతెగని వర్షం 

హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతికి పలు విమానాలు రద్దు 

30కిపైగా విమానాలు, 97 రైలు సర్వీసుల రద్దు 

కాకినాడ– అమలాపురం మధ్య బుధవారం 

తెల్లవారుజామున తుపాను తీరాన్ని దాటే అవకాశం  

తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. ప్రచండ వేగంతో గాలులు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి.   

కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. 
తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా  కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.   


ప్రచండ వేగంతో.. 
తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.  

విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. 
మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్‌ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్‌ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. 

అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్‌ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి.  

విశాఖ బీచ్‌లో కోస్టల్‌ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు  

నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు..  
తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  

రేపు కూడా కుండపోతే..! 
ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. 

భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్‌ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్‌ కె.విజయానంద్‌ ఆదేశించారు. 

శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం   

ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్‌ ఇన్‌చార్జి అజయ్‌జైన్‌ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్‌ఎఫ్, ఆరు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

అన్నదాతల్లో ఆందోళన.. 
అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెను­గాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన 
చెందుతున్నారు.  

నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌..
ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టా­­లంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్‌ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు.  

పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు
తుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్‌ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో పోలీసులు, మెరైన్‌ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్‌ అలెర్ట్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్‌ రోడ్డులో కృష్ణ మందిర్‌ వద్ద కోతకు గురైన తీరం   

కోనసీమకు పెను గండం..!
సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట టెర్మినల్‌ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పిం­చారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు.  

భయం గుప్పెట్లో కాకినాడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు, యాంకరేజ్‌ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్‌ రోడ్డు, బీచ్‌ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్‌లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు.  

రెడ్‌ అలెర్ట్‌ జిల్లాలివే..
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.

ఆరెంజ్‌ అలెర్ట్‌ జిల్లాలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, నంద్యాల

ఎల్లో అలెర్ట్‌ జిల్లాలు
చిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు 
మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 

8 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌  
తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్‌... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

విమానాల రద్దు 
మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. 

విజయవాడ డివిజన్‌ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్‌ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్‌ఎస్‌ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్‌ వార్నింగ్‌ సిగ్నల్‌–4  ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  

తమిళనాడు, ఒడిశాలో.. 
తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement