నేడు ‘మోంథా’ తుపానుగా మారనున్న తీవ్రవాయుగుండం
ప్రస్తుతం విశాఖకు 790, కాకినాడకు 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
మంగళవారానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం
27, 28, 29 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు, పెనుగాలులు
28న 14 జిల్లాలకు.. 29న 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్
28న సాయంత్రం లేదా రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం
తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు
రాకాసి అలలతో జాగ్రత్తగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరానికి ఉప్పెన అవకాశం పొంచి ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 8 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో 790 కి.మీ., కాకినాడకు ఆగ్నేయంగా 780 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది క్రమంగా పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ 28న మంగళవారం ఉదయానికి మరింత బలపడి మోంథా తుపానుగా (Cyclone Montha) మారనుంది. మోంథాగా మారిన అనంతరం వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం మధ్యాహ్నం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. ఆ తరువాత ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
మోంథా.. తీవ్ర తుపానుగా మారిన సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ., గరిష్టంగా 110 నుంచి 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీనపడుతూ వాయుగుండంగా మారుతుందని ఈ సమయంలో పెనుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
28న 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్
28వ తేదీన తీవ్ర తుపాను తీరం దాటే సమయం కావడంతో రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కోస్తా, రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిలా్లలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
29న 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్
29వ తేదీన కూడా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 30వ తేదీన కూడా తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
రాకాసి అలలు విరుచుకుపడతాయ్
కోస్తాంధ్ర తీరమంతటా బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవరూ సముద్రం వైపు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. విశాఖలో ముఖ్యమైన బీచ్‌ల వద్దకు సందర్శకులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 28న మోంథా తీరం దాటే వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఉప్పెనలా ఎగిసి పడతాయని హెచ్చరించారు.
ముఖ్యంగా తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీరంలో అలలు విరుచుకుపడతాయని.. సముద్రం ఒడ్డున ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని సముద్ర తీరంలో అలలు 2 నుంచి 3.5 మీటర్లు, విశాఖపట్నం నుంచి పశ్చిమగోదావరి తీరం వెంబడి 2.1 నుంచి 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు విరుచుకుపడనున్నాయి.

తీరం దాటే ప్రాంతంలో అలలు ఉప్పెనలా ఎగిసిపడి తీరం కోతకు గురి చేస్తాయని.. సమీపంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లోకి నీరు చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
మోంథా విరుచుకుపడనున్న నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరికతో పాటు సిగ్నల్ నంబర్–5ని జారీ చేశారు.
కళింగపట్నం, వాడరేవు, భీమునిపట్నం పోర్టుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుపాను సమాచారం, సహాయక చర్యలు అవసరమైన వారి కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవసరమైతే ప్రజలు 112, 1070, 1800–425–0101 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
నేడు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్
కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.
జిల్లాల్లో ప్రత్యేక అధికారుల నియామకం
తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్‌లని నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు చక్రధర్‌బాబు, విజయనగరం జిల్లాకు రవి సుభాష్, పార్వతీపురం మన్యం జిల్లాకు నారాయణ భరత్‌గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్‌జైన్, అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లాలకు వాడ్రేవు వినయ్‌చంద్, తూర్పుగోదావరికి కె.కన్నబాబు, కాకినాడకు కృష్ణతేజ, కోనసీమకు విజయరామరాజు, పశ్చిమగోదావరికి ప్రసన్న వెంకటేష్, ఏలూరుకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు ఆమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశిభూషణ్‌కుమార్, గుంటూరుకు ఆర్పీ సిసోడియా, బాపట్లకు వేణుగోపాల్‌రెడ్డి, ప్రకాశం జిల్లాకు కోన శశిధర్, నెల్లూరుకు యువరాజ్, తిరుపతికి అరుణ్‌బాబు, చిత్తూరు జిల్లాకు గిరీషాను నియమించారు.
శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇన్‌చార్జిగా అజయ్‌జైన్‌ని నియమించగా.. పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇన్‌చార్జిగా ఆర్పీ సిసోడియాని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


