డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): చీమ చిటుక్కుమన్నా జగన్ ప్రభుత్వం వల్లేనంటూ పచ్చ పత్రికలు రోత రాతలు రాయడం, వాటిని పట్టుకొని తెలుగుదేశం పార్టీ అండ్ కో హడావుడి చేయడం.. రాష్ట్రంలో ఇదో తంతుగా మారింది. విశాఖలో నిర్మాణంలో ఉన్న బస్ బే ఓ పక్కకు ఒరిగిన ఘటనపై ఇటువంటి అబద్ధాల కథనమే ఈనాడు రాసింది. దానిపై టీడీపీ హడావుడి మొదలెట్టింది. వాస్తవానికి అసలా బస్ బే నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదు. ఇటీవలి వర్షాల వల్ల పనులు ఆగిపోయాయి. అందులో ఓ భాగం పక్కకు ఒరిగింది.
ఈ చిన్న ఘటనపై ఈనాడు, ఇతర పచ్చ మీడియా, టీడీపీ హడావుడి చేస్తున్నాయి. వాస్తవాలేంటో ఓసారి పరిశీలిస్తే.. నగరవాసుల సౌకర్యం కోసం జీవీఎంసీ పరిధిలో రూ.4.62 కోట్లతో 20 బస్ బేల నిర్మాణం చేపట్టారు. 17 బస్‌బేల నిర్మాణం పూర్తయింది. మరో 3 నిర్మాణం జరుగుతున్నాయి. నాణ్యత నియంత్రణ సంస్థ పర్యవేక్షణలోనే వీటిని పటిష్టంగా నిర్మిస్తున్నారు. థర్డ్ పార్టీ (ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం) ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ దక్షిణం వైపు ఉన్న బస్‌బే కూడా నిర్మాణంలో ఉంది.
రూ.16.94 లక్షలతో పీఈ స్ట్రక్చర్‌తో దీనిని నిర్మిస్తున్నారు. శనివారం సాయంత్రం వర్షం పడటంతో కార్మికులు పనులు ఎక్కడివక్కడే విడిచి పెట్టి వెళ్లిపోయారు. తూర్పు భాగంలో 10 మీటర్ల కాంటిలీవర్ షెడ్‌ను నిలువు పైపులకు అనుసంధానించే ప్రాంతంలో వెల్డింగ్ పనులు కూడా నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం కాంటిలీవర్ కొంత భాగం ఒరిగింది. సివిల్ కట్టడాల్లో ఎలాంటి లోపం లేదు. కాంట్రాక్టర్ క్లీట్‌లను వాడకుండా వెల్డింగ్ పనులు చేపట్టడం వల్లే పాక్షికంగా ఒరిగింది. దీనినే పెద్ద ప్రమాదంగా పచ్చ పత్రికలు చిత్రీకరించాయి.
ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు: మేయర్
అన్ని బస్‌బేలు సరైన పద్ధతిలో డిజైన్ చేశామని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి చెప్పారు. నాణ్యత నియంత్రణ సంస్థ పర్యవేక్షణలోనే పనులన్నీ జరుగుతున్నాయన్నారు. ‘ఆర్టీసీ బస్టాండ్ దక్షిణం వైపు బస్‌బేను 33 మీటర్ల పొడవుతో కాంటిలీవర్ షెడ్‌తో నిర్మిస్తున్నాం. పనులు చివరి దశలో ఉన్నాయి. శనివారం రాత్రి వర్షం వల్ల స్ట్రక్చరల్ ఫ్రేమ్ వెల్డింగ్ చేయలేదు. ఆదివారం ఉదయం పని ప్రారంభించే లోపే పక్కకు ఒరిగింది.
ఇందులో ఎలాంటి ప్రజా ధనం దుర్వినియోగం జరగలేదు. కాంట్రాక్టర్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. చిన్న సంఘటనను ఘోర ప్రమాదంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. మిగిలిన బస్‌బేలని థర్డ్ పార్టీ ద్వారా మరోసారి పరిశీలిస్తాం. బస్ బేల కాంట్రాక్టర్లకు ఇంతవరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదు. అన్ని పనులు సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ జరిగిన తర్వాతే బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment