
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడగులు పడే ప్రమాదం ఉందని.. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల తీవ్రత ఉండన్నాయని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
కాగా, తెలంగాణలో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రానున్న రెండు రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి.
అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
దక్షిణాది జిల్లాలకు వర్ష సూచన
ప్రస్తుతం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశంం ఉంది.