సాక్షి, విశాఖ: తమిళనాడుతో పాటు ఏపీని కూడా తుపాను భయపెడుతోంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంటోంది. ఫెంగల్ తుపాను సమీపించే కొద్దీ.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయని హెచ్చరిస్తోంది.
.. ఇప్పటికే దక్షిణ కోస్తా భారీ వర్షాలు, తీవ్ర గాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ పనులు చేసే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అధికార యంత్రాంగం. ఇక.. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.
.. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కి.మీ, పుదుచ్చేరికి 470 కి.మీ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. తుపానుగా మారే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అన్నారాయన.
ఏపీపై తుపాను ప్రభావం వారంపాటు కొనసాగనుంది. రేపు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో.. దక్షిణ కోస్తా. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఈ నెల 30వ తేదీ దాకా మత్య్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు ఇదివరకే జారీ అయ్యాయి. ఇంకోవైపు.. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది అక్కడి విద్యాశాఖ.
Comments
Please login to add a commentAdd a comment