తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు
పుత్తూరులో 18 సెంటీమీటర్ల వర్షం
తీవ్ర వాయుగుండంగా మారిన ఫెంగల్
తీరం దాటినా మందగమనమే
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: ఫెంగల్ తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద నెమ్మదిగా బలహీనపడింది. తీరం దాటిన తర్వాత కూడా 6 గంటలకుపైగా భూమిపై తుపానుగానే స్థిరంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కి.మీ., విల్లుపురానికి 40 కి.మీ., చెన్నైకి 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి ఇంకా బలహీనపడి వాయుగుండంగా.. ఆ తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
మూడు జిల్లాల్లో ఎడతెగని వర్షాలు
తుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం కూడా ఎడతెగని వర్షాలు కురిశాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా పుత్తూరులో 18.7సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పుత్తూరు మండలం రాచలపాలెంలో 15.2 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ, చిత్తమూరు, దొరవారిసత్రం, నాయుడుపేట, వెంకటగిరిలో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా నగరి, నిండ్ర, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కొడవలూరు, సైదాపురం మండలాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ చాలాచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 10 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగుల్లోకి పెద్దఎత్తున నీరు చేరి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లే అనేక బస్సులను రద్దు చేశారు. సోమవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తిరుపతి జిల్లాలో జోరువాన
తిరుపతి జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. వర్షం ప్రభావంతో 116 ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేశారు. 21 గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు వెళ్లడం లేదు. చెన్నైకి వెళ్లే పలు సర్వీసులకు బ్రేక్ పడింది. ఏసీ సర్వీసులను నిలుపుదల చేశారు. జిల్లాలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువ తదితర 21 కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఇతర ప్రాంతాల్లోనూ వానలు
కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిశాయి. 19,500 ఎకరాల్లో వరి నేలవాలింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపైనే రాశులు పోయగా.. తడిసిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా మోస్తరు జల్లులు కురిశాయి. పూత దశలో ఉన్న కంది, మిరప గాలులకు రాలిపోయింది. మబ్బుల కారణంగా పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో 9.2 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.6 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట పలుచోట్ల నేల వాలింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం చిరు జల్లుల కారణంగా సార్వా మాసూళ్ల (నూర్పిడి) పనులు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. భోగాపురం, గరివిడి, ఎస్.కోట, డెంకాడ, గుర్ల, చీపురుపల్లి, పూసపాటిరేగ, కొత్తవలస, బొండపల్లి, గజపతినగరం, వేపాడ, నెల్లిమర్ల, మెంటాడ, విజయనగరం, రామభద్రపురం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.
కాకినాడ జిల్లాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి చేలు నేలకొరిగాయి. సుమారు 30 శాతం వరిచేలు నేలనంటాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వరిపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. కూనవరం మొగ మూసుకుపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోయింది. రొయ్యలను కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
తిరుమలలో విరిగిపడుతున్న కొండ చరియలు
తిరుమలలోని రెండో ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్లలోనూ దిట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తిరుమలలో ఆదివారం కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వరి, టమాటా, బొప్పాయి ఇతర ఆకు కూరల తోటలు దెబ్బతిన్నాయి. పొగ మంచు రావడంతో రహదారులపై వాహనదారులు కష్టతరంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment