సాక్షి, నెల్లూరు, తిరుపతి: పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో - పెన్నా పరివాహక ప్రాంతాలలో ఆకస్మిక వరదలు వస్తాయంటూ కేంద్ర జల శక్తి శాఖ నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పెన్నా నదితో పాటు దాని ఉపనదుల సమీపాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. రైతుల పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది.రెండు రోజులు పాటు వర్షాలు కురిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆనందు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి.
తిరుమల: పెంగల్ తుపాను ప్రభావం తిరుపతి జిల్లాపై పడింది. తిరుమలలో శుక్రవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతి ఎయిర్‌పోర్టులో 9 విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు, పెరిగిన చలి కారణంగా.. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. పాపవినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏర్పేడు మండలంలో సీత కాలువ పొంగిపొర్లుతుండటంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయాయి. వర్షాల నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సెలవులు ప్రకటించారు.
కాగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా మారింది. దీనకి పెంగల్‌గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ శనివారంమధ్యాహ్నం తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయని తెలిపింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment