తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ | imd issues Red Alert for Tirupati and Nellore Districts: Andhra prdesh | Sakshi
Sakshi News home page

తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Published Sun, Dec 1 2024 4:13 AM | Last Updated on Sun, Dec 1 2024 4:13 AM

imd issues Red Alert for Tirupati and Nellore Districts: Andhra prdesh

అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ 

7 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ 

రాష్ట్రమంతటా ఫెంగల్‌ తుపాను ప్రభావం 

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు 

అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఎడతెగని వానలు 

తడ, సూళ్లూరుపేటలో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షం 

సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్‌వర్క్‌: బంగా­ళా­ఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుపాను నెమ్మ­దిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలో­మీట­ర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలి­పింది. మహాబలిపురానికి 50 కిలో­మీటర్లు, పుదుచ్చే­రికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలో­మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శని­వారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళ­నాడు–­పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహా­బలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.

తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతు­న్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని     అధికారులు తెలిపారు. ఇప్ప­టికే తుపాను ప్రభావంతో  దక్షిణకోస్తా, రాయ­ల­సీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.

భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్‌ 2 వరకూ కొనసాగే అవకాశాలు­­న్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరి­కలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావర­ణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురు­స్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్‌ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురు­స్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

రెండు జిల్లాల్లో కుండపోత
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్న­మయ్య, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారు­హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురు­స్తున్నాయి.

ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరా­యం కలిగింది.

తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గుర­య్యారు.  చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, 
వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు.  

విమాన సర్వీస్‌లు రద్దు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి.  

భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లు
శనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్‌పోలూర్‌లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.

సముద్రం అల్లకల్లోలం
విశాఖ సముద్ర తీరం భారీ కెరటా­లతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖ­లోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్‌ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదా­వరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదా­వరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకా­కుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా శని­వారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసా­రిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.

తుపానుపై సీఎం సమీక్ష 
సాక్షి, అమరావతి: ఫెంగల్‌ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.  ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు.   కాగా, ఫెంగల్‌ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్‌ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ శనివారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement