పుదుచ్చేరి నుంచి ఒడిశా వరకూ వణికించిన తుపాను
అరేబియా వైపు కదులుతూ వాయుగుండంగా బలహీనపడిన తుపాను
రెండో వారంలో నైరుతి బంగాళాఖాతంలో మరో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఎక్కడో నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు దగ్గరలో ఏర్పడింది... పుదుచ్చేరి దగ్గర తీరం దాటింది... కానీ దాని ప్రభావం మాత్రం దాదాపు 1,500 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒడిశాపైనా చూపించింది. ఇదీ... ఫెంగల్ తుపాను విరుచుకుపడిన తీరు. తుపానుగా మారిన కొద్ది సేపటికే బలహీనపడటం.. మళ్లీ తుపానుగా మారడం.. ఇలా భిన్న రూపాలతో ఫెంగల్ ఇబ్బంది పెట్టింది. నవంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటలకు నైరుతి బంగాళాఖాతం నుంచి చెన్నై వైపుగా కదిలింది. అనంతరం 11.30 గంటలకు చెన్నై తీరానికి సమీపంలోకి వచ్చి అక్కడే దాదాపు 10 గంటల వరకు స్థిరంగా ఉండిపోయింది.
చెన్నై దగ్గర తీరం దాటుతుందని భావించగా.. తర్వాత నెమ్మదిగా వెనక్కి కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్లిపోయింది. సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఎవరూ ఊహించనట్లుగా మళ్లీ దక్షిణ తమిళనాడు వైపునకు ముందుకు నెమ్మదిగా దూసుకొచి్చంది. కానీ ఈ నెల ఒకటో తేదీన రూట్ మార్చి మరక్కానం, పుదుచ్చేరి వైపు కదిలింది. ఆ తర్వాత తీరం దాటింది. అయితే.. సాధారణంగా తుపానులు తీరం దాటిన తర్వాత వేగాన్ని పుంజుకోవడంతోపాటు బలహీనపడతాయి. కానీ, ఫెంగల్ మాత్రం తీరం దాటినా..
6 గంటల వరకు తుపానుగానే కొనసాగి పుదుచ్చేరిలో విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే దాని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితోపాటు దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉంటుంది. ఫెంగల్ తుపాను మాత్రం ఒడిశాలోని గోపాల్‌పూర్ వరకు చూపించింది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం మంగళవారం సాయంత్రంతో తగ్గుముఖం పడుతుందని, అప్పటి వరకు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో ఒకటి, రెండుచోట్ల మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
కసుమూరులో 7.9 సెంటీమీటర్ల వర్షం తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోను పలుచోట్ల భారీ వర్షాలుపడ్డాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె, రాజంపేట, బాపట్ల జిల్లా నిజాంపట్నం, తిరుపతి జిల్లా వాకాడు, పుత్తూరు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోను అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పలు గ్రామాల్లో ధాన్యం రాశులు తడిచిపోయాయి. పొలాల్లో వరి పనలు నీట మునిగాయి.
మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
ఫెంగల్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై సోమవారం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మొత్తం 53 మండలాల్లో తుపాను ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, దీనికి అవసరమైన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.
పొంచి ఉన్న మరో ముప్పు.!
తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందనీ, అయితే తుపానుగా బలపడుతుందా.. లేదా.. అనే దానిపై ఈ వారాంతంలో అంచనా వేయగలమని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment