సాక్షి, విశాఖపట్నం: కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో న ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది.
రాష్ట్రంలో పలుచోట్ల ఆనకట్టలు దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు నాలుగు వేల క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment