Visakhapatnam Central Jail
-
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని బంగారు ఆభరణాల షాపులో చోరీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 6.181 కిలోల బంగారు ఆభరణాలు, 90.52 గ్రాముల వెండి బ్రాస్లెట్లు, రూ.15 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ దీపిక శనివారం విలేక రుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చోరీ నిందితుడు లోకేష్ శ్రీవాస్‌ది ఛత్తీస్‌గఢ్. ఓ కేసులో విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. విజయనగరం జిల్లా కేంద్రంగా జనవరి 16న తొలిసారిగా పద్మజ ఆస్పత్రిలో చోరీ చేశాడు. మళ్లీ ఈ నెల 14న సీఎంఆర్‌లో చోరీకి పాల్పడ్డాడు. వారం వ్యవధిలో ఈ నెల 21న పట్టణంలో రెక్కీ నిర్వహించి రవి జ్యుయలరీ, పాండు జ్యుయలరీ షాపుల్లో దొంగతనానికి దిగాడు. రవి జ్యుయలర్స్‌లో ఉన్న 8 కిలోల బంగారు ఆభరణాలు దొంగిలించి పరారయ్యాడు. నాలుగు పోలీస్ బృందాలు గాలించి నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్నాయి. -
నకిలీ ఇన్వాయిస్లతో రూ.18 కోట్లు స్వాహా
సాక్షి, విశాఖపట్నం: నకిలీ ఇన్వాయిస్లతో కోట్లాది రూపాయల జీఎస్టీ క్రెడిట్ కొల్లగొట్టిన వ్యవహారాన్ని విశాఖపట్నం సెంట్రల్ జీఎస్టీ ఎగవేత–నిరోధక విభాగం బట్టబయలు చేసింది. వివరాలు.. విజయవాడకు చెందిన మదన్‌మోహన్‌రెడ్డి అనపర్తి కేంద్రంగా డ్యూడ్రాప్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణసాయి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు నిర్వహిస్తున్నాడు. రెండు కంపెనీలకు వేర్వేరు ఎండీలు, డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒకే చిరునామా ఉండటంతో సెంట్రల్ జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే సోదాలు నిర్వహించగా.. కోట్లాది రూపాయల మోసం బట్టబయలైంది. ఏ వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా.. వీటిని చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు. సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఈదర రవికిరణ్ మాట్లాడుతూ.. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు సృష్టించి ఇన్పుట్ క్రెడిట్ సొంతం చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు రూ.18 కోట్లకు పైగా జీఎస్టీ క్రెడిట్ బదిలీ అయినట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి మదన్‌మోహన్‌రెడ్డి సహా ముగ్గుర్ని జీఎస్టీ అధికారులు అరెస్టు చేసి.. విశాఖలోని ఆర్థిక నేరాల కోర్టులో బుధవారం హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించడంతో.. వీరిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
‘కారాగారం’లో కరోనాకు సంకెళ్లు
సాక్షి, అమరావతి: జైళ్లలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంపై జైళ్ల శాఖ దృష్టి సారించింది. ఏపీలోని 91 జైళ్లలో 6,915 మంది ఖైదీలు ఉండగా సెకండ్ వేవ్‌లో 294 మంది వైరస్ బారిన పడి కోలుకుంటున్నారు. రాజమండ్రి, విశాఖ సెంట్రల్ జైళ్లల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. సెకండ్ వేవ్‌లో 177 మంది జైళ్ల శాఖ సిబ్బంది వైరస్ బారిన పడగా వారిలో 5 గురు మృతి చెందారు. జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది. వైరస్‌కు అడ్డుకట్ట ఇలా... ఏపీలోని అన్ని జైళ్లలోనూ శిక్ష పడిన, రిమాండ్ ఖైదీలతో వారి బంధుమిత్రుల ములాఖత్‌లను రద్దు చేసి వారంలో 2 సార్లు కుటుంబీకులతో ఫోన్ మాట్లాడుకునే వెసులుబాటును ఖైదీలకు కల్పించారు. జైలు ఆవరణలో రోజువారీ పనుల పద్ధతిని నిలిపివేశారు. జైలు గదుల్లో అతి తక్కువ మందిని ఉంచుతున్నారు. కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలు, రిమాండ్ ఖైదీలకు కోవిడ్ పరీక్షను తప్పనిసరి చేశారు. నెగిటివ్ వస్తే జైలులోకి ,పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తున్నారు.సెంట్రల్ జైళ్లలో మాస్క్‌లు తయారు చేయించి అన్ని జైళ్లకు సరఫరా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అర్హత ఉన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నారు. 7 ఏళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలకు మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. ఇటువంటి ఖైదీలు ఏపీలో 430 మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 110 మందిని విడుదల చేశారు. మధ్యంతర బెయిల్‌పై వెళుతున్న వారి నుంచి రూ.50 వేల పూచీకత్తు తీçసుకుంటారు. వారికి బెయిల్ 90 రోజులు ఉంటుంది. ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ కొనసాగించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, ప్రతి సెంట్రల్ జైలులో ముగ్గురు, జిల్లా జైలుకు ఒకరు చొప్పున డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని జైళ్ల శాఖ ఐజీ జయవర్థన్ చెప్పారు. డాక్టర్లతో ఎప్పటికప్పుడు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్ చేసి ప్రత్యేక గదిలో ఉంచుతున్నామని తెలిపారు. -
విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ పేరిట పలువురికి ఫోన్ చేసి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత నూతన్ నాయుడికి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించారు. దళిత యువకుడు శ్రీకాంత్‌కు శిరోముండనం చేసిన కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య ప్రియామాధురి సహా ఏడుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. ► శ్రీకాంత్‌పై దాడి చేసేటప్పుడు, శిరోముండనానికి ముందు నూతన్ తన భార్యతో వీడియో కాల్ మాట్లాడినట్లు నిర్ధారణ కావడంతో ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ► తన పేరిట పైరవీలకు పాల్పడుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి పి.వి రమేశ్ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పారిపోతున్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పట్టుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ► అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో విశాఖకు తీసుకొచ్చారు. ► అనంతరం కరోనా టెస్ట్‌తో పాటు వైద్యపరీక్షలు నిర్వహించారు. ► కరోనా టెస్ట్ నెగిటివ్ రావడంతో ఆదివారం ఆయనని కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ► పి.వి.రమేశ్ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి. -
శ్రీనివాసరావు సేవలో ముగ్గురు ఖైదీలు!
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు విశాఖ సెంట్రల్ జైల్లో వీఐపీ మర్యాదలు అందుతున్నాయి. చిత్రావతి హై అలర్ట్ బ్లాక్‌లో రిమాండ్ ఖైదీగా ఒంటరిగా ఉంచిన శ్రీనివాసరావుకు సదుపాయాలను సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు ఉంటున్న గదిని శుభ్రం చేయడం, వ్యక్తిగత పనులు, భోజనం గదికి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఖైదీలను ఏర్పాటు చేశారు. బిహార్‌కు చెందిన భాయ్, జలీల్, ఒడిశాకు చెందిన మిధుల్ అనే ఖైదీలను శ్రీనివాసరావుకు సేవలు చేసేందుకు నియమించారు. ఇతర రిమాండ్ ఖైదీలు కలవకుండా కట్టడి.. జైల్లో శ్రీనివాస్ ఉంటున్న గది వద్దకు నలుగురు కాపలా పోలీసులు, సేవలు అందిస్తున్న ముగ్గురు ఖైదీలు, జైలు ఉన్నతాధికారులు మినహా ఇతరులు ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిందితుడికి జైల్లో జరుగుతున్న రాచ మర్యాదలు ప్రతిపక్ష నేతపై హత్యాయత్నాన్ని ఓ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పెద్దలే చేయించారనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. (అల్లిన కథే.. మళ్లీ) శ్రీనివాస్‌కి సేవలు చేస్తే రోజూ నాన్‌వెజ్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైలుకి తరలించినప్పుడు అతడికి అవసరమైన సేవలు చేస్తే రోజూ శ్రీనివాసరావుకు అందించే మాంసాహారాన్నే ఇస్తామని జైలు అధికారులు ఖైదీలకు ఆఫర్ ఇచ్చారు. ఆసక్తి చూపిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖైదీలను కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేశారు. -
బెయిల్ రాదు..కేసు పోదు
► రిమాండ్‌లోనే మగ్గిపోతున్న గంజాయి నిందితులు ► వారితోనే నిండిపోయిన కేంద్ర కారాగారం ► నిందితులందరూ కూలీలు.. ఇతర రాష్ట్రాలవారే.. ► బెయిల్ కావాలంటే లక్షల్లో పూచీకత్తు ఇవ్వాలి అది సాధ్యం కాక.. కేసులు పరిష్కారం కాక.. నెలలు, ఏళ్ల తరబడి జైలులోనే..గంజాయి ఘాటుతో కేంద్ర కారాగారం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఊపిరి సలుపుకోలేకపోతోంది.. అంటే దీనర్థం అక్కడ గంజాయి పండిస్తున్నారని కాదు సుమా!.. గంజాయి కేసుల్లో రిమాండ్ పొందిన నిందితులందరినీ విశాఖ కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు.ఫలితంగా కారాగారం కిటకిటలాడిపోతోంది. ఇప్పటికే సామర్థ్యానికి మించి ఖైదీలున్న ఈ జైలులో.. గంజాయి నిందితుల సంఖ్య 550కి పైగా ఉంది..ఆరు నెలలు.. ఏడాది.. అంతకుముందు నుంచీ రిమాండ్‌లోనే మగ్గిపోతున్నవారూ వీరిలో ఉన్నారు. ఇతరత్రా కేసుల్లో రిమాండ్ పడిన నిందితులు పూచీకత్తు చెల్లించి రోజుల వ్యవధిలోనే వెళ్లిపోతుంటే.. గంజాయి కేసుల నిందితులు మాత్రం నెలలు సంవత్సరాల తరబడి రిమాండ్‌లోనే మగ్గిపోతున్నారు.. కారణమేంటంటే.. ఈ కేసుల్లో బెయిల్ పొందాలంటే లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది.. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో దాదాపు అందరూ కూలీస్థాయి వారే కావడం.. పైగా చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ష్యూరిటీలు ఇవ్వలేకపోతున్నారు..మరోవైపు ఈ కేసుల పరిష్కారంలో జరుగుతున్న తీవ్ర జాప్యం.. వీరిని జైలులోనే మగ్గబెట్టేస్తోంది. ఆరిలోవ (విశాఖ తూర్పు): గంజాయి కేసుల నిందితులతో విశాఖ కేంద్ర కారాగారం నిండిపోతోంది. ఈ కేసుల్లో రిమాండ్ పడి ఇక్కడికి రావడమే తప్ప.. బెయిల్‌పై బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోజురోజుకూ వీరి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ ఏడాదికి పైగా బెయిల్ రాక రిమాండ్‌లో ఉన్నవారు కొందరైతే, ఆరు నెలలగా మగ్గుతున్నవారు ఇంకొందరున్నారు. గత నెల రోజుల్లోనే రిమాండ్‌పై జైలుకు వచ్చిన వారు 50 మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఖైదీలు రిమాండులో ఉన్న నిందితుల్లో గంజాయి కేసులకు సంబంధించిన వారే 550 మంది వరకు ఉన్నారని జైలు అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలవారే అధికం గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న వారిలో మన రాష్ట్రంతోపాటు బీహార్, మహరాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. గంజాయి రావాణా చేస్తూ విశాఖ జిల్లా పరిధిలో పట్టుబడినవారిలో సుమారు 70 శాతం మంది ఇతర రాష్ట్రాల వారే కావడం విశేషం. విశాఖ జిల్లాలోని పాడేరు, అరుకు, ముంచుంగిపుట్టు, సీలేరు తదితర ప్రాంతాలకు చెందిన వారు 30 శాతం వరకు ఉన్నారు. కాగా జైల్లో మగ్గుతున్నవారంతా కూలీలే. గంజాయి స్మగ్లర్లందరూ బయట ప్రపంచంలో దర్జాగా తిరుగుతుంటే.. వీరు మాత్రం జైలులో మగ్గిపోతున్నారు. కుటుంబాలకు దూరమవుతున్నారు. ఏజెన్సీలో సాగువుతున్న గంజాయిని స్మగ్లర్లు కొనుగోలు చేసి.. ఇతర ప్రాంతాలకు తరలించడానికి గిరిజనలు, ఇతర కూలీలను వాడుకుంటుంటారు. వారికి డబ్బులు ఇచ్చి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో తరలిస్తుంటారు. రవాణా సమయంలో పోలీసులు పలువురిని పట్టుకొని కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి కోసం గంజాయిని తీసుకొచ్చినవారు కూడా విశాఖ పరిధిలో పోలీసులకు పట్టుబడి జైలుపాలవుతున్నారు. వారంతా ఎప్పుడు బయట ప్రపంచంలోకి చేరుతామా అంటూ ఎదురు చూస్తున్నారు. ష్యూరిటీలు కట్టలేక.. వాయిదాలకు రాలేక.. గంజాయి కేసుల్లో నిందితులకు బెయిల్ లభించడం చాలా కష్టం. అందుకోసం లక్షల్లో పూచీకత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఒక నిందితుడికి ఇద్దరు వ్యక్తులు కేసు స్థాయిని బట్టి కనీసం రూ.లక్ష చొప్పున పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇతర కేసుల్లో రిమాండ్‌లో ఉన్న వారు కేసు తీవ్రతను బట్టి రూ.5 వేలు నుంచి రూ. 30 వేల వరకు పూచీకత్తు ఇస్తే బెయిల్ వచ్చేస్తుంది. గంజాయి నిందితుల్లో అధికశాతం చిన్నస్థాయి కూలీలే కావడంతో అంత మొత్తంలో ష్యూరిటీ తెచ్చుకోలేకపోతున్నారు. దీనికితోడు నిందితుల్లో అధిక శాతం ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్న నేపథ్యంలో.. ఒకవేళ కష్టపడి బెయిల్ పొందిన కేసు ప్రతి వాయిదాకు అంత దూరం నుంచి విశాఖకు రావడం కష్టం. విచారణకు రాలేకపోతే ష్యూరిటీ ఇచ్చినవారితో పాటు నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టుపరంగా ఇబ్బందులు తప్పవు. ఈ కారణాలతో బెయిల్ పొందే అవకాశం లేక.. ఉన్నా కావాలనే తీసుకోకుండా.. నెలలు, సంవత్సరాల తరబడి రిమాండ్‌లోనే ఉండిపోతున్నారు. సామర్థ్యానికి మించి.. విశాఖ కేంద్ర కారాగారం 914 మంది ఖైదీలు ఉండేందుకే సరిపోతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ 1330 మంది ఉన్నారు. వీరిలో 550 మందికి పైగా గంజాయి కేసుల్లో రిమాండ్ పడిన వారే ఉన్నారు. దీర్ఘకాల శిక్షలు పడిన ఖైదీలు సుమారు 400 మంది ఉన్నారు. మిగిలిన వారు ఇతరత్రా కేసుల్లో రిమాండ్‌లో ఉన్నవారు. సాధారణంగా రిమాండ్‌లో ఉన్న ఇతర నిందితులు వారం రోజుల్లోనే బెయిల్‌పై వెళ్లిపోతుంటారు. గంజాయి కేసుల్లో మాత్రం తిరిగి వెళ్లే అవకాశం లేక.. వారితోనే జైలు నిండిపోతోంది. జైలు సామర్థ్యం.. 914 ప్రస్తుత ఖైదీల సంఖ్య... 1330 గంజాయి నిందితులు.. 550 శిక్షలు పడిన ఖైదీలు.. 400 ఇతర కేసుల్లో రిమాండ్ ఖైదీలు . . 380. -
మల్లెల ఓం ప్రకాష్‌కు కట్టుదిట్ట భద్రత
కేజీహెచ్ : మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శీనును అనంతపురం జిల్లా రాప్తాడు జైల్లో మట్టుబెట్టిన కేసులో ముద్దారుు అరుున మల్లెల ఓం ప్రకాష్‌కు పోలీస్ యంత్రాంగం భద్రతను కట్టు దిట్టం చేసింది. మూడు నెలలుగా విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంటున్న ఓం ప్రకాష్ కిడ్నీ సమస్యతో బాధపడుతుండంతో డయాలసిస్ కోసం కేజీహెచ్‌కు బుధ, శనివారాల్లో తీసుకువస్తున్నారు. జైలు నుంచి భారీ భద్రత మధ్య ఆయనను కేజీహెచ్‌కు తీసుకురావాల్సి ఉంది. అరుుతే పోలీసులు, ముద్దాయి అన్న తేడా లేకుండా కలసిమెలసి, చెట్టపట్టాలు వేసుకొని కేజీహెచ్‌కు ఓం ప్రకాష్‌ను తీసుకు వస్తుండడంపై ‘సాక్షి’ బృందం కొన్ని రోజుల పాటు నిఘా వేసింది. మల్లెల ఓం ప్రకాష్, ఆయన రక్షణ కోసం వస్తున్న పోలీసుల తీరును ప్రత్యేక కథనం ద్వారా ఎండగట్టింది. ‘ముద్దాయి అయినా.. మల్లెల మజా’ పేరిట ఈనెల 6న ప్రచురితమైన కథనం పోలీస్ యంత్రాంగంలో వణుకు పుట్టించింది. అప్రమత్తమై డయాలసిస్‌కు వస్తున్న మల్లెల ఓం ప్రకాష్‌ను భద్రతను కట్టుదిట్టం చేసింది. మప్తీలో వచ్చిన పోలీసుల తీరుపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఏఆర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను రక్షణగా నియమించింది. ప్రతి బుధ, శనివారాల్లో ఆయుధాల సహాయంతో రక్షణ కల్పించి, ఆయనను కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారు. -
జీవిత ఖైదీ షేక్ జిలానీ మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తున్న షేక్ జిలానీ (37) గురువారం మృతి చెందాడు. కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షేక్ జిలానీ మరణించాడు. జిలానీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు కేజీహెచ్‌కి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ... ఈ రోజు కన్నుమూశాడు. జిలానీ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. అయితే అతడి మృతిపై కుటుంబసభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. -
ఉపాధి కర్మాగారం!
ఖైదీల్లో ఆత్మస్థైర్యం స్వయం ఉపాధితో ఆర్థిక ఆసరా భవిష్యత్తుపై భరోసా విశాఖ సెంట్రల్ జైల్ ఖైదీల్లో ఆత్మస్థైర్యం పెంచుతోంది. ఎవరికి నచ్చిన పనిలో వారు నైపుణ్యం సాధించేందుకు చేయూతనిస్తోంది. ఉపాధి కల్పించి ఆర్థిక ఆసరా కల్పిస్తూ భావి జీవితానికి భరోసానిస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాకా ఇక్కడ నేర్చుకున్న చేతి వృత్తితో ఉపాధి కల్పించుకుని తమ కుటుంబ సభ్యులతో సగర్వంగా జీవించే పరిస్థితి కల్పిస్తోంది. సాగర్‌నగర్ : విశాఖ కేంద్ర కారాగారం కర్మాగారంగా మారుతోంది. జైలులో ఏర్పాటు చేసిన పలు చిన్న పరిశ్రమలు రానురాను అభివృద్ధి చెందుతూ ఖైదీలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. క్షణికావేశంలో తప్పుచేసి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా ఉంటూ నాలుగు గోడల మధ్య ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న ఖైదీల స్వయం ఉపాధికి దారి చూపుతున్నాయి. ఎవరికి ఇష్టమైన పనిని వారు ఎంచుకుని ఆ పనుల్లో నైపుణ్యం సాధిస్తూ ఆర్థికంగా కాస్త సంపాదించుకుంటున్నారు. జైలు అధికారులు కూడా వారికి తగిన సహకారం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. విస్తరిస్తున్న పరిశ్రమలు వ్యవసాయంతో పాటు జౌళి, టైలరింగ్, స్టీల్, బుక్ బైండింగ్, జీడి పప్పు ప్యాకింగ్, చీపుర్లు, ప్రింటింగ్ ప్రెస్, విస్తర్లు, కార్పెట్ల తయారీ, పెయింటింగ్ తదితర పరిశ్రమలను జైలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో వందల మంది ఖైదీలు పనిచేస్తూ వేతనాలు పొందుతున్నారు. చీపుర్లు తయారీ వంటి చిన్న పరిశ్రమల్లోనూ రిమాండ్ ఖైదీలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ కంపెనీల వల్ల జైలు సంక్షేమ నిధికి ఏడాదికి లక్షల్లో ఆదాయం లభిస్తోంది. ఇక్కడ ఓలం కంపెనీ నిర్వహిస్తున్న జీడి పిక్కల పరిశ్రమలో పనిచేస్తున్న ఖైదీలకు రోజుకు రూ.100లు చెల్లిస్తారు. ఇందులో 100 మందికి పైగా ఖైదీలు పనిచేస్తున్నారు. మిగిలిన పరిశ్రమల్లో జైళ్ల శాఖ నిర్ణయించిన విధంగా నైపుణ్యం గల ఖైదీలకు రోజుకు రూ.70లు, నైపుణ్యంలేని ఖైదీలకు రూ.50లు చొప్పున వేతాలు చెల్లిస్తున్నారు. ఆ ఆదాయం వారి బ్యాంక్ ఖాతాకు చేరుతుంది. దానిలో కొంత జైల్లో వారి అవసరాలకు ఉపయోగించుకొంటున్నారు. ఈ పరిశ్రమల ద్వారా వచ్చి ఆదాయం కొంత జైళ్ల సంక్షేమ నిధికి చేరుతుంది. కార్పెట్ల యూనిట్‌కు కొత్త యంత్రాలు కార్పెట్ల తయారీ యూనిట్‌కు కొత్త యంత్రాలు వచ్చాయి. ఇంతవరకు ఇక్కడ 6 యంత్రాలుండేవి. ఇటీవల మరో 8 యంత్రాల(మగ్గాలు)ను అధికారులు ఇక్కడకు తీసుకొచ్చారు. దీంతో వాటి ఉత్పత్తి పెరిగింది. ఆరు యంత్రాలపై తయారైన కార్పెట్లు ఇక్కడ ఖైదీలకు చాలక గతంలో వరంగల్ జైల్ నుంచి కొనుగోలుచేసి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇక్కడే అధికంగా ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని మిగిలిన కారాగారాలకు సరఫరా చేస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా నెలకు 150 కార్పెట్లు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 28 మంది ఖైదీ లు పనిచేస్తున్నారు. ఖైదీలలో పరివర్తన కోసమే... ఖైదీలలో పరివర్తనం కోస మే ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించాం. తమ కుటుంబం ఎలా గడుస్తుం దోనని శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కుమిలిపోకుండా వారి లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తున్నాం. అందుకోసమే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు సహాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. ఓలం కంపెనీని తీసుకొచ్చాం. గతంలో స్టీల్‌ప్లాంట్ సహకారంతో కలర్ ప్రింటింగ్ మెషీన్ ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఖైదీలలో ఉన్న కళలు బహిర్గతం చేయడానికి పలు అవకాశాలు కల్పిస్తున్నాం. చెక్కపని చేస్తూ బొమ్మల తయారీ చేసేవారికి, పెయింటింగ్ చేసేవారికి సహకారం అందిస్తున్నాం. వారి పనితనాన్ని బట్టి తగిన పారితోషికం అందజేస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిశ్రమల నుంచి గత ఏడాది జైల్ సంక్షేమ నిధికి రూ.35,10,000ల ఆదాయం లభించింది. -ఇండ్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్, కేంద్ర కారాగారం, విశాఖపట్టణం -
ఉదయభాస్కర్‌కు ఘనస్వాగతం
అడ్డతీగల : విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై శనివారం విడుదలైన వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు) ఆదివారం తన స్వగ్రామమైన ఎల్లవరం వచ్చారు. రంపచోడవరం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్, నియోజకవర్గం పరిశీలకుడు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్ తదితరులు వెంట రాగా అనంత ఉదయ భాస్కర్ అడ్డతీగల మండలంలోకి ప్రవేశించగానే మహిళలు పూలమాలలతో ముంచెత్తి హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. గొంటువానిపాలెం, తిమ్మాపురం, బొంగరాల పాడు, నాయుడుపాకలు గ్రామాల్లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ఉదయభాస్కర్ ముందుకు సాగారు. ఎల్లవరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ పార్టీని, కార్యకర్తలను దెబ్బతీయాలనే ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఉదయభాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మానసికంగా కుంగిపోతుందని తనపై కేసులు పెట్టి అరెస్టు చేయించారన్నారు. పార్టీ మారితే వేధింపులు ఉండవు అంటున్నారు... ప్రాణం ఉన్నంత వరకూ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ లోనే కొనసాగుతా అంటూ ఉద్వేగంగా అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు రాత్రింబగళ్లు కృషి చేసినందుకు వారు తనకు ఇచ్చిన బహుమతి తొమ్మిది రోజులు జైలు జీవితం అన్నారు. తనపై పెట్టిన కేసులను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కుట్ర పూరిత వ్యవహారమన్నారు. ప్రజాభిమానం ఉన్న నాయకుడిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఖైదీల్లో ఆనంద హేల..
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ కేంద్రకారాగారం జీవిత ఖైదీల్లో ఆనందం నెలకొంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైదీలకు ప్రభుత్వం ఎట్టకేలకు క్షమాభిక్ష పెట్టింది. రాష్ట్రంలో క్షమాభిక్షకు అర్హులైన 398 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించింది. దీంతో ఇక్కడ కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో అర్హులైన 37 మంది విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి శనివారం రాత్రి ఇక్కడ జైలు అధికారులకు ఉత్తర్వులందాయి. రాత్రికి రాత్రే వారిని విడుదల చేయాలని అదేశాలు రావడంతో అఘమేగాలపై అర్హులైన ఖైదీల రికార్డులు తయారు చేశారు. వారిలో అర్ధరాత్రి దాటిన తర్వాత 36 మంది ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మరో ఖైదీ పెరోల్‌పై ఉన్నాడు. ఆ ఖైదీ వ చ్చిన వెంటనే క్షమాభిక్షపై విడుదల కానున్నాడు. విడుదలైన వారిలో 65 ఏళ్లు దాటిన ఇద్దరు వృద్ధులు, మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎడాది గాంధీ జయంతి సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 28న క్షమాభిక్ష జీవోను విడుదల చేసింది. గాంధీ జయంతి నాటికి జీవోలో నిబంధనల ప్రకారం జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు చేరడానికి ఎక్కువ సమయం పట్టడంతో అప్పట్లో ఖైదీల విడుదలకు జాప్యం జరిగింది. ఆ జీవో ప్రకారం సిద్ధం చేసిన జాబితాను పరిశీలించి వారిలో అర్హులైన వారిని వెంటనే విడుదల చేయాలని జైలు అధికారులకు ఉత్తర్వులు పంపింది. సెప్టెంబరులో జారీ అయిన జీవో ప్రకారం విశాఖ కారాగారంలో విడుదలకు అర్హులైన సుమారు 40 మంది జీవిత ఖైదీల జాబితాను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. వారిలో 37 మం ది అర్హులుగా తేల్చి వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. వారిలో ఓపెన్ ఎ యిర్ జైల్‌కు చెందిన వారు 20 మంది, మిగిలిన వారు 17 మంది ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఇదే విడుదల.. గతంలో 2011 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నుంచి 36 మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. అప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ క్షమాభిక్ష జీవో విడుదల చేకుండా ప్రభుత్వం ఆలస్యం చే సింది. ఇప్పటికైనా విడుదల చేసినందుకు ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటామని అంటున్నారు. జైల్లో పరివర్తనం చెందామని, సమాజంలో నీతిగా మెలుగుతామని వారు తెలిపారు.