ఉపాధి కర్మాగారం!
ఖైదీల్లో ఆత్మస్థైర్యం
స్వయం ఉపాధితో ఆర్థిక ఆసరా
భవిష్యత్తుపై భరోసా
విశాఖ సెంట్రల్ జైల్ ఖైదీల్లో ఆత్మస్థైర్యం పెంచుతోంది. ఎవరికి నచ్చిన పనిలో వారు నైపుణ్యం సాధించేందుకు చేయూతనిస్తోంది. ఉపాధి కల్పించి ఆర్థిక ఆసరా కల్పిస్తూ భావి జీవితానికి భరోసానిస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాకా ఇక్కడ నేర్చుకున్న చేతి వృత్తితో ఉపాధి కల్పించుకుని తమ కుటుంబ సభ్యులతో సగర్వంగా జీవించే పరిస్థితి కల్పిస్తోంది.
సాగర్‌నగర్ : విశాఖ కేంద్ర కారాగారం కర్మాగారంగా మారుతోంది. జైలులో ఏర్పాటు చేసిన పలు చిన్న పరిశ్రమలు రానురాను అభివృద్ధి చెందుతూ ఖైదీలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. క్షణికావేశంలో తప్పుచేసి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా ఉంటూ నాలుగు గోడల మధ్య ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న ఖైదీల స్వయం ఉపాధికి దారి చూపుతున్నాయి. ఎవరికి ఇష్టమైన పనిని వారు ఎంచుకుని ఆ పనుల్లో నైపుణ్యం సాధిస్తూ ఆర్థికంగా కాస్త సంపాదించుకుంటున్నారు. జైలు అధికారులు కూడా వారికి తగిన సహకారం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
విస్తరిస్తున్న పరిశ్రమలు
వ్యవసాయంతో పాటు జౌళి, టైలరింగ్, స్టీల్, బుక్ బైండింగ్, జీడి పప్పు ప్యాకింగ్, చీపుర్లు, ప్రింటింగ్ ప్రెస్, విస్తర్లు, కార్పెట్ల తయారీ, పెయింటింగ్ తదితర పరిశ్రమలను జైలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో వందల మంది ఖైదీలు పనిచేస్తూ వేతనాలు పొందుతున్నారు. చీపుర్లు తయారీ వంటి చిన్న పరిశ్రమల్లోనూ రిమాండ్ ఖైదీలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ కంపెనీల వల్ల జైలు సంక్షేమ నిధికి ఏడాదికి లక్షల్లో ఆదాయం లభిస్తోంది. ఇక్కడ ఓలం కంపెనీ నిర్వహిస్తున్న జీడి పిక్కల పరిశ్రమలో పనిచేస్తున్న ఖైదీలకు రోజుకు రూ.100లు చెల్లిస్తారు. ఇందులో 100 మందికి పైగా ఖైదీలు పనిచేస్తున్నారు. మిగిలిన పరిశ్రమల్లో జైళ్ల శాఖ నిర్ణయించిన విధంగా నైపుణ్యం గల ఖైదీలకు రోజుకు రూ.70లు, నైపుణ్యంలేని ఖైదీలకు రూ.50లు చొప్పున వేతాలు చెల్లిస్తున్నారు. ఆ ఆదాయం వారి బ్యాంక్ ఖాతాకు చేరుతుంది. దానిలో కొంత జైల్లో వారి అవసరాలకు ఉపయోగించుకొంటున్నారు. ఈ పరిశ్రమల ద్వారా వచ్చి ఆదాయం కొంత జైళ్ల సంక్షేమ నిధికి చేరుతుంది.
కార్పెట్ల యూనిట్‌కు కొత్త యంత్రాలు
కార్పెట్ల తయారీ యూనిట్‌కు కొత్త యంత్రాలు వచ్చాయి. ఇంతవరకు ఇక్కడ 6 యంత్రాలుండేవి. ఇటీవల మరో 8 యంత్రాల(మగ్గాలు)ను అధికారులు ఇక్కడకు తీసుకొచ్చారు. దీంతో వాటి ఉత్పత్తి పెరిగింది. ఆరు యంత్రాలపై తయారైన కార్పెట్లు ఇక్కడ ఖైదీలకు చాలక గతంలో వరంగల్ జైల్ నుంచి కొనుగోలుచేసి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఇక్కడే అధికంగా ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని మిగిలిన కారాగారాలకు సరఫరా చేస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా నెలకు 150 కార్పెట్లు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 28 మంది ఖైదీ లు పనిచేస్తున్నారు.
ఖైదీలలో పరివర్తన కోసమే...
ఖైదీలలో పరివర్తనం కోస మే ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించాం. తమ కుటుంబం ఎలా గడుస్తుం దోనని శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కుమిలిపోకుండా వారి లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తున్నాం. అందుకోసమే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు సహాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. ఓలం కంపెనీని తీసుకొచ్చాం. గతంలో స్టీల్‌ప్లాంట్ సహకారంతో కలర్ ప్రింటింగ్ మెషీన్ ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఖైదీలలో ఉన్న కళలు బహిర్గతం చేయడానికి పలు అవకాశాలు కల్పిస్తున్నాం. చెక్కపని చేస్తూ బొమ్మల తయారీ చేసేవారికి, పెయింటింగ్ చేసేవారికి సహకారం అందిస్తున్నాం. వారి పనితనాన్ని బట్టి తగిన పారితోషికం అందజేస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిశ్రమల నుంచి గత ఏడాది జైల్ సంక్షేమ నిధికి రూ.35,10,000ల ఆదాయం లభించింది.
-ఇండ్ల శ్రీనివాస్, సూపరింటెండెంట్,
కేంద్ర కారాగారం,
విశాఖపట్టణం