బెయిల్‌ రాదు..కేసు పోదు | No bail..case does not go | Sakshi
Sakshi News home page

బెయిల్‌ రాదు..కేసు పోదు

Published Thu, Aug 31 2017 5:28 AM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM

బెయిల్‌ రాదు..కేసు పోదు - Sakshi

బెయిల్‌ రాదు..కేసు పోదు

►  రిమాండ్‌లోనే మగ్గిపోతున్న గంజాయి నిందితులు
►  వారితోనే నిండిపోయిన కేంద్ర కారాగారం
►  నిందితులందరూ కూలీలు.. ఇతర రాష్ట్రాలవారే..
►  బెయిల్‌ కావాలంటే లక్షల్లో పూచీకత్తు ఇవ్వాలి

     
అది సాధ్యం కాక.. కేసులు పరిష్కారం కాక.. నెలలు, ఏళ్ల తరబడి జైలులోనే..గంజాయి ఘాటుతో కేంద్ర కారాగారం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఊపిరి సలుపుకోలేకపోతోంది.. అంటే దీనర్థం అక్కడ గంజాయి పండిస్తున్నారని కాదు సుమా!.. గంజాయి కేసుల్లో రిమాండ్‌ పొందిన నిందితులందరినీ విశాఖ కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు.ఫలితంగా కారాగారం కిటకిటలాడిపోతోంది. ఇప్పటికే సామర్థ్యానికి మించి ఖైదీలున్న ఈ జైలులో.. గంజాయి నిందితుల సంఖ్య 550కి పైగా ఉంది..ఆరు నెలలు.. ఏడాది.. అంతకుముందు నుంచీ రిమాండ్‌లోనే మగ్గిపోతున్నవారూ వీరిలో ఉన్నారు.

ఇతరత్రా కేసుల్లో రిమాండ్‌ పడిన నిందితులు పూచీకత్తు చెల్లించి రోజుల వ్యవధిలోనే వెళ్లిపోతుంటే.. గంజాయి కేసుల నిందితులు మాత్రం నెలలు సంవత్సరాల తరబడి రిమాండ్‌లోనే మగ్గిపోతున్నారు.. కారణమేంటంటే.. ఈ కేసుల్లో బెయిల్‌ పొందాలంటే లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది.. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో దాదాపు అందరూ కూలీస్థాయి వారే కావడం.. పైగా చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ష్యూరిటీలు ఇవ్వలేకపోతున్నారు..మరోవైపు ఈ కేసుల పరిష్కారంలో జరుగుతున్న తీవ్ర జాప్యం.. వీరిని జైలులోనే మగ్గబెట్టేస్తోంది.


ఆరిలోవ (విశాఖ తూర్పు): గంజాయి కేసుల నిందితులతో విశాఖ కేంద్ర కారాగారం నిండిపోతోంది. ఈ కేసుల్లో రిమాండ్‌ పడి ఇక్కడికి రావడమే తప్ప.. బెయిల్‌పై బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోజురోజుకూ వీరి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ ఏడాదికి పైగా బెయిల్‌ రాక రిమాండ్‌లో ఉన్నవారు కొందరైతే, ఆరు నెలలగా మగ్గుతున్నవారు ఇంకొందరున్నారు. గత నెల రోజుల్లోనే రిమాండ్‌పై జైలుకు వచ్చిన వారు 50 మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఖైదీలు రిమాండులో ఉన్న నిందితుల్లో గంజాయి కేసులకు సంబంధించిన వారే 550 మంది వరకు ఉన్నారని జైలు అధికారులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాలవారే అధికం
గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న వారిలో మన రాష్ట్రంతోపాటు బీహార్, మహరాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. గంజాయి రావాణా చేస్తూ విశాఖ జిల్లా పరిధిలో పట్టుబడినవారిలో సుమారు 70 శాతం మంది ఇతర రాష్ట్రాల వారే కావడం విశేషం. విశాఖ జిల్లాలోని పాడేరు, అరుకు, ముంచుంగిపుట్టు, సీలేరు తదితర ప్రాంతాలకు చెందిన వారు 30 శాతం వరకు ఉన్నారు. కాగా జైల్లో మగ్గుతున్నవారంతా కూలీలే. గంజాయి స్మగ్లర్లందరూ బయట ప్రపంచంలో దర్జాగా తిరుగుతుంటే.. వీరు మాత్రం జైలులో మగ్గిపోతున్నారు.

కుటుంబాలకు దూరమవుతున్నారు. ఏజెన్సీలో సాగువుతున్న గంజాయిని స్మగ్లర్లు కొనుగోలు చేసి.. ఇతర ప్రాంతాలకు తరలించడానికి గిరిజనలు, ఇతర కూలీలను వాడుకుంటుంటారు. వారికి డబ్బులు ఇచ్చి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల్లో తరలిస్తుంటారు. రవాణా సమయంలో పోలీసులు పలువురిని పట్టుకొని కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి కోసం గంజాయిని తీసుకొచ్చినవారు కూడా విశాఖ పరిధిలో పోలీసులకు పట్టుబడి జైలుపాలవుతున్నారు. వారంతా ఎప్పుడు బయట ప్రపంచంలోకి చేరుతామా అంటూ ఎదురు చూస్తున్నారు.

ష్యూరిటీలు కట్టలేక.. వాయిదాలకు రాలేక..
గంజాయి కేసుల్లో నిందితులకు బెయిల్‌ లభించడం చాలా కష్టం. అందుకోసం లక్షల్లో పూచీకత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఒక నిందితుడికి ఇద్దరు వ్యక్తులు కేసు స్థాయిని బట్టి కనీసం రూ.లక్ష చొప్పున పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇతర కేసుల్లో రిమాండ్‌లో ఉన్న వారు కేసు తీవ్రతను బట్టి రూ.5 వేలు నుంచి రూ. 30 వేల వరకు పూచీకత్తు ఇస్తే బెయిల్‌ వచ్చేస్తుంది. గంజాయి నిందితుల్లో అధికశాతం చిన్నస్థాయి కూలీలే కావడంతో అంత మొత్తంలో ష్యూరిటీ తెచ్చుకోలేకపోతున్నారు.

దీనికితోడు నిందితుల్లో అధిక శాతం ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్న నేపథ్యంలో.. ఒకవేళ కష్టపడి బెయిల్‌ పొందిన కేసు ప్రతి వాయిదాకు అంత దూరం నుంచి విశాఖకు రావడం కష్టం. విచారణకు రాలేకపోతే ష్యూరిటీ ఇచ్చినవారితో పాటు నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టుపరంగా ఇబ్బందులు తప్పవు. ఈ కారణాలతో బెయిల్‌ పొందే అవకాశం లేక.. ఉన్నా కావాలనే తీసుకోకుండా.. నెలలు, సంవత్సరాల తరబడి రిమాండ్‌లోనే ఉండిపోతున్నారు.

సామర్థ్యానికి మించి..
విశాఖ కేంద్ర కారాగారం 914 మంది ఖైదీలు ఉండేందుకే సరిపోతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ 1330 మంది ఉన్నారు. వీరిలో 550 మందికి పైగా గంజాయి కేసుల్లో రిమాండ్‌ పడిన వారే ఉన్నారు. దీర్ఘకాల శిక్షలు పడిన ఖైదీలు సుమారు 400 మంది ఉన్నారు. మిగిలిన వారు ఇతరత్రా కేసుల్లో రిమాండ్‌లో ఉన్నవారు. సాధారణంగా రిమాండ్‌లో ఉన్న ఇతర నిందితులు వారం రోజుల్లోనే బెయిల్‌పై వెళ్లిపోతుంటారు. గంజాయి కేసుల్లో మాత్రం తిరిగి వెళ్లే అవకాశం లేక.. వారితోనే జైలు నిండిపోతోంది.

జైలు సామర్థ్యం..                            914
ప్రస్తుత ఖైదీల సంఖ్య...                  1330
గంజాయి నిందితులు..                    550
శిక్షలు పడిన ఖైదీలు..                    400
ఇతర కేసుల్లో రిమాండ్‌ ఖైదీలు .   . 380.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement