
సాక్షి, హైదరాబాద్: నగరంలో హోలీ ముసుగులో గంజాయి వినియోగం కలకలం సృష్టించింది. ఎస్‌టీఎఫ్ దాడులతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్‌లతో పాటు గంజాయి బాల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోలీ అంటేనే రంగుల పండుగ. తెలంగాణ మహా రాజధాని హైదరాబాద్‌లో విభిన్న రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు జరుపుకుంటారు.
కానీ.. నగరంలో కొందరు హోలీకి భిన్నంగా లోయర్ ధూల్‌పేట్‌లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్‌లో గంజాయి, బర్ఫీ స్వీట్‌లో గంజాయి, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారనే సమాచారం ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్ పోలీసులకు అందింది.
ఎస్టీఎఫ్ టీం అంజిరెడ్డి గ్రూపులోని ఎక్సైజ్ పోలీసులు గంజాయి ముసుగులో జరుగుతున్న హోలీ వేడుకల్లో దాడులు నిర్వహించి గంజాయితో తయారైన 100 కుల్ఫీ ఐస్ క్రీమ్‌ను, 72 బర్ఫీ స్వీట్లను, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అమ్మకాలు నిర్వహించే సత్యనారాయణపై కేసు నమోదు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment