సాక్షి, అమరావతి: జైళ్లలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంపై జైళ్ల శాఖ దృష్టి సారించింది. ఏపీలోని 91 జైళ్లలో 6,915 మంది ఖైదీలు ఉండగా సెకండ్ వేవ్‌లో 294 మంది వైరస్ బారిన పడి కోలుకుంటున్నారు. రాజమండ్రి, విశాఖ సెంట్రల్ జైళ్లల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. సెకండ్ వేవ్‌లో 177 మంది జైళ్ల శాఖ సిబ్బంది వైరస్ బారిన పడగా వారిలో 5 గురు మృతి చెందారు. జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది.
వైరస్‌కు అడ్డుకట్ట ఇలా...
ఏపీలోని అన్ని జైళ్లలోనూ శిక్ష పడిన, రిమాండ్ ఖైదీలతో వారి బంధుమిత్రుల ములాఖత్‌లను రద్దు చేసి వారంలో 2 సార్లు కుటుంబీకులతో ఫోన్ మాట్లాడుకునే వెసులుబాటును ఖైదీలకు కల్పించారు. జైలు ఆవరణలో రోజువారీ పనుల పద్ధతిని నిలిపివేశారు. జైలు గదుల్లో అతి తక్కువ మందిని ఉంచుతున్నారు. కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలు, రిమాండ్ ఖైదీలకు కోవిడ్ పరీక్షను తప్పనిసరి చేశారు. నెగిటివ్ వస్తే జైలులోకి ,పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తున్నారు.సెంట్రల్ జైళ్లలో మాస్క్‌లు తయారు చేయించి అన్ని జైళ్లకు సరఫరా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అర్హత ఉన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నారు. 7 ఏళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలకు మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. ఇటువంటి ఖైదీలు ఏపీలో 430 మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 110 మందిని విడుదల చేశారు.
మధ్యంతర బెయిల్‌పై వెళుతున్న వారి నుంచి రూ.50 వేల పూచీకత్తు తీçసుకుంటారు. వారికి బెయిల్ 90 రోజులు ఉంటుంది. ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ కొనసాగించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, ప్రతి సెంట్రల్ జైలులో ముగ్గురు, జిల్లా జైలుకు ఒకరు చొప్పున డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని జైళ్ల శాఖ ఐజీ జయవర్థన్ చెప్పారు. డాక్టర్లతో ఎప్పటికప్పుడు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్ చేసి ప్రత్యేక గదిలో ఉంచుతున్నామని తెలిపారు.
‘కారాగారం’లో కరోనాకు సంకెళ్లు
Published Mon, May 24 2021 4:49 AM | Last Updated on Mon, May 24 2021 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment