Department of Prisons
-
ఖైదీలపై అనంతబాబు దాడి పూర్తి అవాస్తవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలని, అవాస్తవాలతో కట్టుకథలు అల్లి, లేనిని ఉన్నట్టు చెప్పడం సరికాదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. జైల్లోని ఖైదీలను ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టారని, జైల్లో రాచమర్యాదలు.. అని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని పేర్కొంటూ జైళ్ల శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును కేంద్ర కారాగారంలోని ఓ బ్లాకులో సింగిల్ సెల్లో ఉంచినట్టు రాజారావు తెలిపారు. సెక్యూరిటీ రీత్యా సెల్లో 24 గంటలూ సిబ్బంది పహారా, నిత్య పర్యవేక్షణ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందువలన తోటి ఖైదీలతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు పడే అవకాశమే లేదన్నారు. ఇతర ఖైదీలకు కల్పించే సదుపాయాలనే ఆయనకూ కల్పించామని.. పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశామన్నది పూర్తి అబద్ధమన్నారు. నిబంధనల ప్రకారం అందరు ఖైదీల మాదిరే దిండు, డర్రీ, వులెన్ బ్లాంకెట్, దుప్పటి ఇచ్చామని, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అనంతబాబును కలిసేందుకు వస్తున్న వారికి నిబంధనల ప్రకారమే ములాఖత్, ఇంటర్వ్యూ అవకాశాలిస్తున్నట్టు చెప్పారు. అలా వచ్చిన వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించాకనే అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. ములాఖత్‌కు వస్తున్న వారి ఫోన్‌తో అనంతబాబు మాట్లాడారనేది కూడా పూర్తి అవాస్తవమని రాజారావు స్పష్టం చేశారు. -
ఎన్ఎస్యూఐ విద్యార్థులతో రాహుల్ ములాఖత్‌కు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలను కలిసేందుకు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుమతివ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతల బృందంతో జితేందర్‌ను కలసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ములాఖత్‌పై విజ్ఞప్తిని పరిశీలించి తమ నిర్ణయం వెల్లడిస్తామని డీజీ తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అధికార పార్టీ ఒత్తిడి తీసుకువస్తోందని, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైల్లో ఉన్న విద్యార్థి నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన విషయంలో కూడా టీఆర్ఎస్ కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. కనీసం శనివారం విద్యార్థి నేతలను జైల్లో పరామర్శించాలన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము ఇప్పటికే జైలు సూపరింటెండెంట్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని, అ యితే ఉన్నతాధికారులను కలసి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించడంతో డీజీ జితేందర్‌ను కలసినట్టు వెల్లడించారు. జైళ్ల శాఖ డీజీని కలసిన వారిలో కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, సంపత్, మానవతారాయ్ ఉన్నారు. ఎంత అడ్డుకుంటే అంత ప్రతిఘటిస్తాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు చూస్తోందని, కానీ ఎంత అడ్డుకుంటే అంతకన్నా ఎక్కువ బలంగా ఎదుర్కొంటామని రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఓయూ జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌తో పాటు మరో ఏడుగురు ప్రగతిభవన్ ముట్టడికి రాగా వారిని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని పరామర్శిం చేందుకు రేవంత్‌రెడ్డి తదితరులు ఠాణాకు వచ్చారు. వైట్ చాలెంజ్‌కు రాహుల్ సిద్ధమా? రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ సహా పలు చోట్ల ఫ్లెక్సీ లు, పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ బయటపడ్డ సమయంలో మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి ‘వైట్ చాలెంజ్’విసిరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నేపాల్‌లోని ఓ క్లబ్లో రాహుల్‌గాంధీ కనిపించడంతో.. ఆయన ఫొటోలతో ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన పలువురు టీఆర్ఎస్ నేతలు ‘వైట్ చాలెంజ్‌కు సిద్ధమా?’అంటూ రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు. -
డిప్యూటీ జైలర్ ఆత్మహత్యాయత్నం
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని మహిళా ప్రత్యేక కారాగారంలో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న ఇమాంబీ(26) బుధవారం తాను ఉంటున్న క్వార్టర్స్‌లో ఆత్మహత్యకు యత్నించారు. జైళ్ల శాఖ అధికారుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన షేక్ చిన్న ఇమాంబీ డిప్యూటీ జైలర్‌గా ఏడాది నుంచి కడప మహిళా ప్రత్యేక కారాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 6 గంటలకు విధులకు రావాల్సి ఉండగా హాజరుకాలేదు. దీంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో సిబ్బంది వెళ్లేసరికి ఇమాంబీ తాను ఉంటున్న క్వార్టర్‌లోనే చేతికి రక్తం కారుతూ.. అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే కడప కేంద్ర కారాగారానికి సంబంధించిన అంబులెన్స్‌లో కడపలోని ఎం.ఎం. హాస్పిటల్లో వైద్యసేవల కోసం తీసుకెళ్లారు. ఘటనపై ఎం.ఎం. హాస్పిటల్ యాజమాన్యం ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు)ను నమోదు చేసుకోవాలని వన్‌టౌన్ పోలీసులకు సిఫారసు చేశారు. వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇమాంబీ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. రిమ్స్ పోలీసులను విచారణ కోసం పంపించారు. ఈ స్టేట్మెంట్లో మాత్రం డిప్యూటీ జైలర్ షేక్ ఇమాంబీ తాను ఆత్మహత్యకు యత్నించలేదని, కత్తితో కూరగాయలను కోస్తుండగా, ఎడమచేయి పొరపాటున తెగిందని తెలియజేసింది. కడప మహిళా ప్రత్యేక కారాగారం సూపరింటెండెంట్ వసంతకుమారి మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నమా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కాగా, జైలు అధికారుల మధ్య విభేదాలే ఘటనకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ మహిళా ఖైదీ ప్రత్యేక కారాగారంలో ఆత్మహత్యకు యత్నించిన విషయమై ఇమాంబీని విచారించారని తెలుస్తోంది. సమగ్రంగా విచారిస్తున్నాం.. ఈ విషయమై జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మాట్లాడుతూ.. కడప మహిళా ప్రత్యేక కారాగారంలో జరుగుతున్న విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే శాఖాపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. -
ఐఏఎస్‌లకు జైలు శిక్ష నిలుపుదల
సాక్షి, అమరావతి: పలువురు ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. కోర్టు ధిక్కార కేసులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్‌కు నెల జైలు, రూ.2 వేల జరిమానా, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, అప్పటి మరో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్వీ చక్రధర్‌లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం ఈ ఉత్తర్వులను ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌కు భూమి కేటాయించేందుకు వెంకటాచలం మండలం ఎర్రగుంటకు చెందిన తాళ్లపాక సావిత్రమ్మకు చెందిన మూడెకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సావిత్రమ్మకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిహారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం అయినా కూడా పరిహారం ఇవ్వకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. చివరకు ఈ ఏడాది మార్చి 3న పరిహారం మొత్తాన్ని సావిత్రమ్మ బ్యాంకు ఖాతాలో వేశారు. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన నాలుగేళ్ల తర్వాత పరిహారం డిపాజిట్ చేయడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యానికి రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, అప్పటి, ప్రస్తుత కలెక్టర్లే బాధ్యులని తేల్చి వారికి జైలుశిక్ష, జరిమానా విధించారు. ఈ తీర్పుపై ముత్యాలరాజు, మన్మోహన్ సింగ్లతోపాటు మిగిలిన అధికారులు కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేశారు. -
179 మంది ఖైదీలే విడుదల కావడం ఏమిటి!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 179 మంది ఖైదీలు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారని జైళ్ల శాఖ డీజీ తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి హైకోరుకు మంగళవారం నివేదించారు. జైళ్లలో 6,620 మంది ఖైదీలుంటే కేవలం 179 మంది మాత్రమే మధ్యంతర బెయిల్‌పై విడుదల కావడం ఏమిటని హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఖైదీల విడుదలకు అనుసరించిన విధానం, మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఎవరు అనర్హులో తెలియజేస్తూ మెరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా జైళ్లలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ఓ ఉన్నత స్థాయి కమిటీ పలు తీర్మానాలు చేసింది. కమిటీ తీర్మానం ప్రకారం.. 90 రోజులపాటు ఖైదీలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. -
‘కారాగారం’లో కరోనాకు సంకెళ్లు
సాక్షి, అమరావతి: జైళ్లలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంపై జైళ్ల శాఖ దృష్టి సారించింది. ఏపీలోని 91 జైళ్లలో 6,915 మంది ఖైదీలు ఉండగా సెకండ్ వేవ్‌లో 294 మంది వైరస్ బారిన పడి కోలుకుంటున్నారు. రాజమండ్రి, విశాఖ సెంట్రల్ జైళ్లల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. సెకండ్ వేవ్‌లో 177 మంది జైళ్ల శాఖ సిబ్బంది వైరస్ బారిన పడగా వారిలో 5 గురు మృతి చెందారు. జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది. వైరస్‌కు అడ్డుకట్ట ఇలా... ఏపీలోని అన్ని జైళ్లలోనూ శిక్ష పడిన, రిమాండ్ ఖైదీలతో వారి బంధుమిత్రుల ములాఖత్‌లను రద్దు చేసి వారంలో 2 సార్లు కుటుంబీకులతో ఫోన్ మాట్లాడుకునే వెసులుబాటును ఖైదీలకు కల్పించారు. జైలు ఆవరణలో రోజువారీ పనుల పద్ధతిని నిలిపివేశారు. జైలు గదుల్లో అతి తక్కువ మందిని ఉంచుతున్నారు. కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలు, రిమాండ్ ఖైదీలకు కోవిడ్ పరీక్షను తప్పనిసరి చేశారు. నెగిటివ్ వస్తే జైలులోకి ,పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తున్నారు.సెంట్రల్ జైళ్లలో మాస్క్‌లు తయారు చేయించి అన్ని జైళ్లకు సరఫరా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు అర్హత ఉన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నారు. 7 ఏళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలకు మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. ఇటువంటి ఖైదీలు ఏపీలో 430 మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 110 మందిని విడుదల చేశారు. మధ్యంతర బెయిల్‌పై వెళుతున్న వారి నుంచి రూ.50 వేల పూచీకత్తు తీçసుకుంటారు. వారికి బెయిల్ 90 రోజులు ఉంటుంది. ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ కొనసాగించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. కాగా, ప్రతి సెంట్రల్ జైలులో ముగ్గురు, జిల్లా జైలుకు ఒకరు చొప్పున డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని జైళ్ల శాఖ ఐజీ జయవర్థన్ చెప్పారు. డాక్టర్లతో ఎప్పటికప్పుడు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్ చేసి ప్రత్యేక గదిలో ఉంచుతున్నామని తెలిపారు. -
ఖైదీలకు తాత్కాలిక బెయిల్!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, మధ్యంతర బెయిల్‌పై ఖైదీల విడుదల తదితర అంశాలపై చర్చించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ (లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్), జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి (హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్), హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్ల శాఖ డీజీ మహ్మద్ అసన్ రెజాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమావేశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ఈ కమిటీ పలు తీర్మానాలు చేసింది. ప్రాథమికంగా 90 రోజుల పాటు.. ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా డీజీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనలు ఇవ్వాలి. జిల్లా జడ్జీలంతా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని మేజిస్ట్రేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు సూచనలు చేయాలి. గత ఏడాది కమిటీ తీర్మానాల మేరకు మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న అర్హులైన ఖైదీలను, అండర్ ట్రయిల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. విడుదలైన తరువాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటామని వారు హామీ ఇవ్వాలి. దీన్ని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి కస్టడీలోకి తీసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకునేలా హోంశాఖ, జైళ్ల శాఖ తగిన రవాణా సదుపాయం కల్పించాలి. ప్రాథమికంగా మధ్యంతర బెయిల్ 90 రోజులకు మంజూరు చేయాలి. బెయిల్ బాండ్ల మొత్తం సమంజసంగా ఉండాలి. వెబ్సైట్లో వివరాలుంచాలి.. దీనికి సంబంధించి హైకోర్టులో ఓ బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రార్ జనరల్ తీర్మానాల కాపీని ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలి. ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో పిటిషన్‌ను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో జైళ్ల సామర్థ్యం, ఎంత మంది ఖైదీలున్నారన్న విషయాలను జైళ్ల శాఖ వెబ్సైట్లో పొందుపరచాలి. ఈ వివరాలను ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పంచుకోవాలి. ఉన్నత స్థాయి కమిటీ గత ఏడాది చేసిన అన్ని తీర్మానాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ, హోంశాఖ, హైకోర్టు వెబ్సైట్లలో పొందుపరచాలి. జైళ్లలో వేగంగా వ్యాక్సినేషన్ ఖైదీలు, సిబ్బంది విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, వైద్య సాయం, రోజూ శానిటేషన్ తదితర వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి జైళ్ల శాఖ వివరించింది. ఇప్పటి వరకు 643 మంది ఖైదీలు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు జైళ్ల శాఖ డీజీ వివరించారు. మిగిలిన 6 వేల మంది ఖైదీలు, సిబ్బందికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. -
రాజమండ్రి జైల్లో ఖైదీలకు కరోనా
సాక్షి, అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలులో నెల రోజుల్లో 22 మంది ఖైదీలకు కరోనా సోకింది. దీంతో జైళ్ల శాఖ అప్రమత్తమై.. ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 81 జైళ్లలో 7,090 మంది ఖైదీలున్నారు. వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైలుకు వచ్చే కొత్త ఖైదీలకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారినే జైలులోకి అనుమతిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే.. జైలు రికార్డుల్లో నమోదు చేసి వారిని వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. బ్యారక్‌లలో తక్కువ మందిని ఉంచుతున్నారు. అల్పాహారం, భోజన సమయాల్లో అందర్నీ ఒకేసారి వదలకుండా పది మంది చొప్పున జైలు ఆవరణలో విడిచిపెడుతున్నారు. బ్యారక్ లోపల, జైలు ఆవరణలోనూ ఖైదీలు భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. ఖైదీలకు అవసరమైన మాస్కులను జైళ్లలోనే తయారు చేస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం.. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఇప్పటివరకు 150 మందికిపైగా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కానీ, కరోనా వల్ల ఏ ఒక్క ఖైదీ కూడా చనిపోలేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌లో రాజమండ్రి కాకుండా.. పలు జైళ్లలో ఉన్న ఆరుగురు ఖైదీలకు కరోనా సోకినట్టు ఇప్పటి వరకు రిపోర్టు వచ్చింది. కరోనా సోకిందని నిర్ధారణ కాగానే జైలుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నాం. ఖైదీ కోలుకున్న అనంతరం ప్రత్యేక బ్యారెక్‌లో పెట్టి వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. – జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్థన్ వారంతా కోలుకున్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో గత నెల రోజుల్లో 22 మందికి కరోనా సోకింది. బయటి నుంచి వచ్చిన ముగ్గురు రిమాండ్ ఖైదీల వల్ల అదే బ్యారెక్‌లో ఉన్న మిగిలిన వారికి కరోనా వ్యాపించింది. వారిని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాం. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. వారిని ప్రత్యేక బ్యారెక్‌లో పెట్టి పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం ఖైదీలకు ఎలాంటి ఇబ్బందిలేదు. – రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శ్రీరామ రాజారావు -
మహిళా ఖైదీలకు స్వేచ్ఛావాయువు
సాక్షి, అమరావతి: శుక్రవారం వారి జీవితాల్లో కొత్తవెలుగు తెచ్చింది. బంధించిన నాలుగు గోడల మధ్య నుంచి స్వేచ్ఛాప్రపంచంలోకి తీసుకొచ్చింది. జీవితఖైదు అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్ష అమలుచేసింది. 53 మంది మహిళలకు కొత్త జీవితం ప్రసాదించింది. జైలునుంచి బయటకు వచ్చిన వారి ఆనందం వర్ణనాతీతం. స్వాగతం చెప్పేందుకు వచ్చిన ఆతీ్మయులను ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తమకు స్వేచ్ఛా జీవితం ప్రసాదించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతతో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్షతో ఖైదీలు విడుదలైన విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడప జైళ్ల వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్రంలోని మహిళా జీవితఖైదీలను విడుదల చేసేలా ప్రభుత్వం జీవో నంబరు 131 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు మేరకు 53 మందికి క్షమాభిక్ష పెట్టారు. వీరిలో కడప జైలు నుంచి ఒక మహిళాఖైదీ వారం రోజుల కిందట బెయిల్‌పై విడుదల కావడంతో శుక్రవారం 52 మందిని విడుదల చేసినట్టు జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. కడప జైలునుంచి 26 మంది, నెల్లూరు జైలునుంచి ఐదుగురు, రాజమండ్రి జైలునుంచి 19 మంది, విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు మహిళా ఖైదీలు విడుదలయ్యారు. వీరిని ఆగస్టు 15నే విడుదల చేయాల్సి ఉండగా కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆలస్యంగా విడుదల చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్న మహిళా ఖైదీలు... చిత్రంలో నాలుగేళ్ల చిన్నారి వరకట్న వేధింపులకు పాల్పడిన వారే అధికం జీవితఖైదీలుగా శిక్ష అనుభవిస్తూ విడుదలైన మహిళా ఖైదీల్లో ప్రధానంగా వరకట్న వేధింపుల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నవారే అధికంగా ఉన్నారు. వీరిలో అరవై ఏళ్ల వయసు పైబడిన వారూ ఉన్నారు. వీరంతా స్రత్పవర్తన కారణంగా ప్రభుత్వ క్షమాభిక్షతో విడుదలయ్యారు. జైలులో వివిధ రకాల శిక్షణ తీసుకున్న మహిళా ఖైదీల్లో పలువురు పీజీ చేయగా, ఇద్దరు డిగ్రీ పట్టాను అందుకున్నారు. మూడు నెలలకోసారి పోలీస్ స్టేషన్‌కు విడుదలైన 53 మంది మహిళా ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జైలు అధికారులు సూచించారు. మంచి ప్రవర్తనతో మెలుగుతామంటూ వారినుంచి రూ.50 వేల అంగీకార పూచీకత్తు (బాండ్)లు తీసుకున్నారు. వారికి విధించిన శిక్షాకాలం గడువు ముగిసే వరకు మూడు నెలలకోసారి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి హాజరుకావాలి. మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడినా అరెస్ట్ చేసి, ముందుస్తు విడుదల రద్దుచేస్తామని ప్రభుత్వం షరతులు విధించింది. మహిళలు తమ కాళ్లపై నిలబడేలా శిక్షణ వాస్తవంగా జైలుకు వెళ్లొచ్చిన మహిళల పట్ల సమాజంలో కొంత చిన్నచూపు ఉంటుంది. కుటుంబాలకు ఆధారమైన ఆ మహిళలు తమ కాళ్లపై నిలబడేలా జైళ్లలోనే టైలరింగ్, అల్లికలు, తదితర చేతి వృత్తుల్లో శిక్షణ ఇచ్చారు. క్షణికావేశంలో నేరం చేశామని, ప్రభుత్వ క్షమాభిక్షతో తమ వాళ్ల దగ్గరికి చేరుతున్నామని పలువురు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టిన క్షమాభిక్ష తమ కుటుంబాల్లో ఎంతో ఆనందం నింపిందని సంతోషం వ్యక్తం చేశారు. కుట్టుమిషన్ల పంపిణీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీలకు త్రిదండి చినజీయర్ స్వామి ట్రస్ట్ ఔదార్యంతో కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు, మహిళా జైలు సూపరింటెండెంట్ కె.కృష్ణవేణి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా వీటిని అందజేశారు. స్వచ్ఛంద సేవాసంస్థకు చెందిన ప్రతినిధులు చీరలు పంపిణీ చేశారు. రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ ఆరి్థక సహాయంతో జైలు నుంచి విడుదలైన 19 మందికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులతోపాటు, వారు ఇళ్లకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.500 చొప్పున నగదును అందించారు. కడపలో కూడా చినజీయర్ స్వామి ట్రస్ట్ కుట్టుమిషన్లు అందజేసింది. బాలింతగా జైలుకు.. నాలుగేళ్ల కుమార్తెతో సహా విడుదల రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన 19 మంది మహిళా ఖైదీల్లో ఒకరు నాలుగేళ్ల కుమార్తెతో సహా విడుదలైంది. ఆరోనెల గర్భిణిగా ఉండగా శిక్షపడటంతో ఆమె జైలుకు వచ్చింది. జైలులోనే పురుడు పోసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం నాలుగేళ్ల వయస్సున్న పసిపాప రాజమహేంద్రవరం అంగన్వాడీ స్కూల్లో చదువుతోంది. తల్లితోపాటు నాలుగేళ్లు జైలులోనే ఉండి శుక్రవారం స్వేచ్ఛాలోకంలోకి అడుగుపెట్టింది. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి వుంటాం మహిళల ప్రాధాన్యతను గుర్తించి శిక్షపడిన ఖైదీలను విడుదల చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా జీవిస్తాం. జీవితకాలం వైఎస్ జగన్ పేరు చెప్పుకొంటాం. – గ్రేసమ్మ, కడప జైలు నుంచి విడుదలైన కర్నూలు జిల్లా వాసి మహిళలను గుర్తించిన సీఎం కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే. మాకు విముక్తి కల్పించిన ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. మా కుటుంబాల సంక్షేమానికి పాటుపడిన ఆయన రుణం తీర్చుకోలేనిది. – నారాయణమ్మ, అనిమెల, విఎన్‌పల్లె, వైఎస్సార్ జిల్లా -
నిర్మాణ రంగంలోకి జైళ్ల శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోన్న జైళ్లశాఖ.. ఖైదీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో సఫలీకృతమైంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 17 జైళ్లు మూసివేసింది. 2014లో 80 వేల మంది ఖైదీలు ఉండగా 2018కి 55 వేలకు తగ్గడమే ఇందుకు కారణం. ఇపుడు వాటిని యాచకులు, వృద్ధులకు పునరావాస కేంద్రాలుగా మార్చి పలువురి చేత శభాష్ అనిపించుకుంది. 1.25 లక్షలమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దింది. మరో సంచలనం దిశగా ఆ శాఖ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిపుణులైన ఖైదీలు, నిష్ణాతులైన జైలు ఉద్యోగులు, మాజీ ఉద్యోగులతో రాష్ట్రంలో రెండు చోట్ల హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వరంగల్, హైదరాబాద్‌లో ఏర్పాటు రాష్ట్రంలో 2 చోట్ల ఈ హౌసింగ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ప్రతిపాదించారు. మొదటిది వరంగల్‌లో, రెండోది హైదరాబాద్ శివారులో. ఒక్కో హౌసింగ్ సొసైటీకి దాదాపు 20 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. దీనికి ఇప్పటికే వరంగల్, హైదరాబాద్‌లోని శంషాబాద్, శ్రీశైలం రోడ్డులో స్థలాలను పరిశీలించారు. అనువైన స్థలం దొరకగానే ఆ భూముల్లో హౌసింగ్ సొసైటీలను నిర్మించనున్నారు. ఇప్పటికే పలువురు ఖైదీలు నిర్మాణరంగం, ఎలక్ట్రిసిటీ, కార్పెంటరీ, పెయింటింగ్, ప్లంబింగ్ పను ల్లో నైపుణ్యం సాధించారు. వీరి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటే ఖైదీలకు అనుభవం, మానవ వనరుల వినియోగం 2 విధాలా మంచి ఫలితాలు సాధించాలన్నది యోచన. ఇందుకోసం జైలు ఉన్నతాధికారులు, కొందరు విశ్రాంత ఉద్యోగులతో కలసి ఈ సొసైటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏం చేస్తారు: పలు భారీ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందం లేదా ప్రభుత్వ ఆర్డర్ల ప్రకారం.. భారీ నిర్మాణాలను చేపట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం జైళ్లశాఖ ఓ నివేదిక రూపొందిస్తోంది. అది పూర్తయి, అనుమతి వస్తే, నిర్మాణ రంగంలోకి జైళ్లశాఖ రాక ఇక లాంఛనమే కానుంది. ఖైదీల్లో సత్ప్రవర్తన కోసమే రాష్ట్ర జైళ్లను ఖైదీల రహిత జైళ్లుగా మార్చాలన్న ఉద్దేశంతో చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తుండటం శుభపరిణామం. ఇపుడు మేం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నాం. ఇప్పటికే జైళ్లలో ఖైదీలకు నిర్మాణం, కార్పెంటరీ, ఎలక్ట్రిక్ పనుల్లో శిక్షణ ఇస్తున్నాం. నేరస్తులను నిపుణులైన ఉద్యోగులుగా మలిచి బయటికి పంపడమే లక్ష్యంగా వీటిని చేపడుతున్నాం. కొత్త ఉపాధి కలిపిస్తే వారి జీవితాల్లో తప్పకుండా పరివర్తన ఉంటుంది. – వీకే సింగ్ డీజీ, జైళ్ల శాఖ -
207 వాంటెడ్
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 207 మంది కరడుగట్టిన నేరగాళ్లు ఆచూకీ లేకుండా పోయారు. వీరంతా జైలు శిక్ష అనుభవించి విడుదలైనవారే. సాధారణంగా జైలుకు వచ్చినప్పుడు ఖైదీల చిరునామానే అధికారులు తీసుకుంటారు. గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. జైల్లో ఉండగానే అధికారులు వీరికి రకరకాల పనుల్లో ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్యార్హతలు ఉన్నా పెద్ద వ్యాపారాలు చేస్తూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడేవారు తిరిగి నేరాలకు పాల్పడటం చాలా అరుదు. కానీ, నేరాల వృత్తిగా జీవించే నేరస్థులు, రౌడీ షీటర్లు పదేపదే జైలుకు వస్తుంటారు. ఇక్కడ కొందరి సావాసంతో మరింత రాటుదేలి బయటికి వెళ్లి తిరిగి నేరాలు చేస్తుంటారు. ఇలాంటి వారిపై జైలు నుంచి విడుదలైన తరువాత కూడా జైళ్ల శాఖ నిఘా పెడుతుంది. వీరిలో దాదాపు అందరికీ ఏదో ఒక ఉపాధిలో శిక్షణ ఇస్తుంటారు. అదే ఉపాధిపై ఆసక్తి ఉన్నవారికి వ్యాపారం చేసుకోవడానికి లేదా వృత్తి పనులు చేసుకోవడానికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం కూడా జైళ్ల శాఖ అందిస్తుంది. వీరిలో చాలా మంది జైళ్ల శాఖ చేపట్టిన పరివర్తన కార్యక్రమాలతో తిరిగి నేరాల బాట పట్టకుండా బుద్ధిగా జీవిస్తారు. కానీ, నేరాలే వృత్తిగా చేసుకున్న కరడుగట్టిన రౌడీ షీటర్లు మాత్రం తమ తీరు మార్చుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జాబితాలో మొత్తం 958 మంది.. 2014 ఫిబ్రవరి తరువాత తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 958 మంది నేరస్థుల జాబితాను జైళ్ల శాఖ రూపొందించింది. సాధారణంగా నేరం చేసే వారంతా ఆర్థిక పరిస్థితులు, పేదరికం, సరైన ఉపాధి లేకపోవడం, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడం, చెడు సావాసం వంటి వాటి వల్ల పదేపదే నేరాలకు పాల్పడుతున్నట్లు జైళ్ల శాఖ గుర్తించింది. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి 31 పరివర్తనా బృందాలను ఏర్పాటు చేసింది. వీరిలో ప్రతీ టీము విడుదలైన ఖైదీ ఇంటికి వెళ్లి అతన్ని పలకరిస్తుంది. అతను నేరం చేయడానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తుంది. వివిధ ఎన్జీవోలు, సంస్థల సాయంతో అతను స్వయం ఉపాధిపై నిలదొక్కుకునేలా అన్ని రకాల సాయం అందిస్తుంది. ఆచూకీ లేకుండా పోయిన 207 మందిలో పలువురు ఇచ్చిన చిరునామాలు మార్చగా, మరికొందరు తప్పుడు చిరునామాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారి ఆచూకీ కనిపెట్టాలని పోలీసు శాఖకు జైళ్ల శాఖ విజ్ఞప్తి చేసింది. -
రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ శిక్షణా సంస్థ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంకుల ద్వారా 2020 నాటికి రూ.100 కోట్ల ఆదాయం, 2025 నాటికి రూ.200 కోట్ల ఆదాయం గడించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్న విధంగానే, జైళ్ల శాఖ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సరసమైన ధరలకే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మధ్య తరగతికి ఇళ్లు కట్టి ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విడుదలైన ఖైదీలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు. జైళ్ల శాఖ ఏ వ్యాపారం చేపట్టినా విజయవంతమైందని, ఈ ప్రాజెక్టు కూడా విజయం సాధిస్తుందన్నారు. మరో 3 నెలల వ్యవధిలో 20 నూతన పెట్రోల్ బంకులను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రైవేటు భూముల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణ పెద్ద సమస్యగా మారిందని, వాటి నిర్వహణను ప్రభుత్వం జైళ్ల శాఖకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. మరో 6 నెలల్లో 400 మంది విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నేరాల అదుపు వల్ల 49 జైళ్లలో 17 మూసివేశామన్నారు. ఆ జైళ్లలో ఆశ్రమాలను నెలకొల్పేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. హౌసింగ్ సొసైటీ ద్వారా వరంగల్, హైదరాబాద్ జైళ్ల సిబ్బందికి సొంత ఇళ్లు అందించనున్నట్లు తెలిపారు. -
ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డికి రాష్ట్రపతి మెడల్
సాక్షి, న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన (మెరిటోరియస్) పోలీసులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఏసీబీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.మధుసూదన్‌రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం దక్కింది. మరో 13 మందిని ప్రతిభా పురస్కారాలు వరించాయి. పతకాలకు ఎంపికైన అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట, 15 మందికి ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఏపీ నుంచి స్పెషల్ ఇంటెలిజెన్స్(బీఆర్ఏ) ఎస్పీ అడ్డాలవెంకటరత్నం, విశాఖ డీఎస్పీ కె.వెంకటరామకృష్ణప్రసాద్లను రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి. తెలంగాణ నుంచి ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన వారు.. ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ, సంగారెడ్డి; ఎం.నారాయణ, ఏఐజీ శాంతిభద్రతలు; సంగిపాగి ఫ్రాన్సిస్, అస్సాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్; బి.రామ్‌ప్రకాశ్, కమాండెంట్ టీఎస్ఎస్పీ, ఖమ్మం; ఇ.రామచంద్రారెడ్డి, ఎస్పీ ఎన్సీ, రాచకొండ; డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ, కొత్తగూడెం; ఎస్. ప్రభాకర్‌రావు, డీఎస్పీ, (ఫింగర్‌ప్రింట్స్); వి.సూర్యచంద్ర రావు, డీఎస్పీ, ఎస్సీఆర్బీ; ఖాజా మొయినుద్దీన్, ఎస్ఐ, హైదరాబాద్; సయ్యద్ మక్బూల్ పాషా, ఎస్ఐ, వరంగల్; మహ్మద్ ఆలీఖాన్ ముక్తార్, ఏఆర్ఎస్ఐ, హైదరాబాద్; జి.లక్ష్మీనరసింహారావు, హెడ్‌కానిస్టేబుల్, హైదరాబాద్; మహ్మద్ అజీజుద్దీన్, హెడ్‌కానిస్టేబుల్, ఏసీబీ వరంగల్. ఏపీ నుంచి ప్రతిభా పురస్కారాల గ్రహీతలు.. ఎస్.హరికృష్ణ, ఎస్పీ ఇంటెలిజెన్స్, విజయవాడ; వి.సత్తిరాజు, డీఎస్పీ (ఏఆర్), రాజమహేంద్రవరం; కేఎస్.వినోద్‌కుమార్, డీఎస్పీ, కర్నూలు; కె.జనార్దననాయుడు, డీఎస్పీ, ఇంటెలిజెన్స్, తిరుపతి; పి.మోహన్ ప్రసాద్, అదనపు కమాండెంట్, విశాఖపట్నం; పి.కిరణ్‌కుమార్, అస్సాల్ కమాండర్ గ్రేహౌండ్స్, హైదరాబాద్; వి.వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సీఐ సెల్, విజయవాడ; బి.రాజశేఖర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పీటీసీ), ఒంగోలు; ఎం.వెంకటగణేశ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏసీబీ, విశాఖపట్నం; ఎన్.గుణశేఖర్, ఎస్ఐ, రోడ్ సేఫ్టీ, బంగారుపాళ్యం; షేక్ ముస్తాక్ అహ్మద్ బాషా, ఏఆర్ఎస్ఐ ఎస్ఏఆర్ సీపీఎల్, హైదరాబాద్; జి.వెంకటరామారావు, హెడ్‌కానిస్టేబుల్, విశాఖపట్నం; గోపిశెట్టి సుబ్బారావు, హెడ్‌కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్, విజయవాడ; వై.వీరవెంకట సత్యసాయిప్రకాశ్, హెడ్‌కానిస్టేబుల్, పోరంకి; జి.వెంకటేశ్వరరావు, రైల్వే పోలీస్ కానిస్టేబుల్, విజయవాడ. తెలంగాణ నుంచి జైళ్ల శాఖలో ముగ్గురికి.. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జైళ్ల శాఖ అధికారులకు కేంద్రం ‘కరెక్షనల్ సర్వీస్ మెడల్స్’ ప్రకటించింది. తెలంగాణ నుంచి ముగ్గురు.. ఏపీ నుంచి ముగ్గురు అధికారులను పతకాలు వరించాయి. తెలంగాణ నుంచి చీఫ్ హెడ్ వార్డర్లు ఎస్.వెంకటేశ్వర్లు (మహబూబాబాద్), జి.ముక్తేశ్వర్ (రిటైర్డ్, నల్లగొండ), సయ్యద్ ఖాజాపాషా (చర్లపల్లి)లకు పురస్కారాలు దక్కాయి. ఏపీ నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి సబ్‌జైలు హెడ్‌వార్డర్ వేమూరి వెంకటకోటి వీరదుర్గాప్రసాద్కు విశిష్ట సేవా పతకం లభించింది. ఏపీ నుంచి జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్ధన్‌కు, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ గంగ సాయిరామ్ ప్రకాశ్లకు ప్రతిభా పురస్కారాలు వరించాయి. -
రాష్ట్రంలో ఐదు సబ్ జైళ్ల మూసివేత
ఆర్మూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదు సబ్ జైళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ జీవో నంబర్ 6158ని విడుదల చేశారు. నిర్వహణ భారం కారణంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్ సబ్ జైళ్లతో పాటు వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, ఖమ్మం జిల్లాలోని మదిర సబ్ జైళ్లను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్య పాలకుల హయాంలోనే ఆర్మూర్ సబ్ జైలును మూసి వేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డప్పటికీ స్థానికులు, న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసారు. ఆర్మూర్ సబ్ జైలులో పది మంది రిమాండ్ ఖైదీలను ఉంచడానికి సరిపడా సౌకర్యాలు ఉండగా, 20 నుంచి 25 మంది రిమాండ్ ఖైదీలను ఇక్కడ ఉంచడానికి అవకాశం ఉంది. కానీ, జైళ్ల శాఖకు నిర్వహణ భారం అధికం అవుతుండటంతో తాత్కాలికంగా సబ్ జైలును మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. -
భారీగా ఐపీఎస్‌ల బదిలీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన అధికారులతో పాటు పలు జిల్లా ఎస్పీలను సైతం బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు పోలీస్ శాఖలో చర్చ సాగుతోంది. డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు 4 గంటలకు పైగా కసరత్తు చేసినట్టు తెలిసింది. రెండ్రోజులుగా ఇదే అంశంపై ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులతో ప్రతిపాదనలపై కసరత్తు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ముగ్గురితో పాటు.. రాష్ట్ర కేడర్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి రిపోర్టు చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీపీ సంతోశ్మెహ్రా, ఐజీలు అనిల్ కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్‌లకు పోస్టింగ్స్ కల్పించాల్సి ఉంది. వీరిని నియమించాలంటే పలువురు అధికారులకు స్థానచలనం తప్ప దని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో శాంతిభద్రతల ఐజీ పోస్టు ఖాళీగా ఉంది. నగర కమిషనరేట్‌లోని ట్రాఫిక్ అదనపు కమిషనర్ పోస్టు ఐజీ క్యాడర్ పోస్టు. ఈ రెండింటినీ అనిల్‌కుమార్, దేవేంద్ర సింగ్ చౌహాన్‌తో భర్తీ చేస్తారని, సైబరాబాద్ కమిష నర్ సందీప్ శాండిల్య సైతం బదిలీ కాబో తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానంలో మహిళా ఐపీఎస్ అధికారి ఒకరికి అవకాశం కల్పించే యోచన ఉన్నట్టు సమాచారం. నగర కమిషన రేట్ పరిధిలోని శాంతి భద్రతల అదనపు కమిషనర్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్లను మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా రని తెలిసింది. వరంగల్ కమిషనర్ సుధీర్ బాబు రెండేళ్లు పూర్తి చేయడంతో అక్కడ మరో డీఐజీ స్థాయి అధికారిని నియమించే అవ కాశం ఉంది. వరంగల్ జోన్‌లోని ముగ్గురు ఎస్పీలు, హైదరాబాద్ జోన్‌లోని ఒక ఎస్పీకి స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వంపై మంత్రుల ఒత్తిడి పదోన్నతులు పొందబోతున్న నాన్ క్యాడర్ ఎస్పీలను జిల్లా బాధ్యులుగా నియమించుకోవాలన్న ఆలోచనలో పలు వురు మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అనుభవం లేకుండా పదే పదే పొరపాట్లు చేస్తున్న జూనియర్ ఎస్పీలను మార్చి వారి స్థానంలో నాన్‌క్యాడర్ ఎస్పీ లను నియమించుకునేందుకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు సిఫారసు లేఖలను ప్రభుత్వ పెద్దలకు అందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాచకొండ జాయింట్ కమిషనర్ తరుష్జోషీ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ స్థానంలో డీఐజీ స్థాయి అధికారిని నియ మించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోం ది. ఫైర్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్, జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌లకు స్థాన చలనం ఉండనున్నట్టు తెలుస్తోంది. సంతోశ్ మెహ్రాను జైళ్ల శాఖ డీజీగా, వీకేసింగ్ను ఫైర్ విభాగం, రాజీవ్ రతన్‌ను ఆపరేషన్స్ లేదా ఆర్గనైజేషన్‌కు మార్చే అవకాశాలున్నట్టు సమాచారం. వీకేసింగ్, గోపీకృష్ణ, సంతోశ్ మెహ్రా వచ్చే ఏడాది డైరెక్టర్ జనరల్ హోదా పదోన్నతి పొందనున్నారు. -
జైళ్ల శాఖకు స్కోచ్ స్మార్ట్ అవార్డు
ఈ–ములాఖత్, ఈ–మేనేజ్మెంట్తో గుర్తింపు హైదరాబాద్: రాష్ట్ర జైళ్ల శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఖైదీలు, వారి కుటుంబీకులతో మాట్లాడుకునేలా కల్పించిన ఈ–ములాఖత్, ఈ–ప్రిజన్ మేనేజ్మెంట్ కార్యక్రమానికి స్కోచ్ స్మార్ట్ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఓ ప్రకటనలో ఆనందం వ్యక్తంచేశారు. అదే విధంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మై–నేషన్ ఆయుర్వేద వైద్యశాలకు ప్రభుత్వ గుర్తింపు లభించిందని ఆయన తెలిపారు. ఈ నెల 16న జీవో నంబర్ 169తో ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఆయుర్వేద చికిత్సకు సంబంధించి వైద్యులు తమ వైద్యశాలకు పంపించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబీకులు రీయింబర్స్మెంట్ కింద వైద్యసేవలు పొందవచ్చని వీకే సింగ్ వెల్లడించారు. కేరళ నుంచి ప్రత్యేక ఆయుర్వేద వైద్య నిపుణులు తమ వద్ద అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. -
ఆన్లైన్లో ఖైదీల వివరాలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వివరాలు, ఇతర సమాచారం ఇక నుంచి ఒక క్లిక్‌తో లభించనుంది. ఖైదీల వివరాలకు సంబంధించిన ‘డేటా బ్యాంక్’ను రూపొందించేందుకు జైళ్ల శాఖ ‘ఇ-ప్రిజన్’ అనే పథకాన్ని చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సెంట్రల్, 27 జిల్లా, 10 ఓపెన్, 172 సబ్ జైళ్లు ఉన్నాయి. ముంబై, పుణేలో మహిళల కోసం ప్రత్యేక కారాగాలున్నాయి. జైళ్లలో ప్రస్తుతం శిక్ష అనుభివస్తున్న ఖైదీల వివరాలు, ఇతర సమాచారం కాగితాలపై నమోదు చేస్తున్నారు. దీంతో ఖైదీలు తప్పుడు చిరునామ ఇస్తూ, పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఖైదీల సమాచారం ఆన్లైన్లో పోగుచేసి అందుకు అవసరమైన డేటా బ్యాంక్ తయారు చేయనున్నట్లు జైళ్ల శాఖ ప్రత్యేక ఐజీ బిపిన్‌కుమార్ సింగ్ చెప్పారు. ఖైదీ నివాసముండే ప్రాంతం, ఏ నేరం కింద, ఏ జైలులో, ఎన్ని రోజులు ఉన్నాడు? లేదా ఉంటాడు? తదితర వివరాలు క్లిక్ చేస్తే చాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ఈ వివరాలు సామాన్య ప్రజలకే కాకుండా పోలీసు శాఖకు కూడా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అనేక సందర్భాలలో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు లభిస్తున్నాయి. కొందరు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగా అవి జైలులోకి వస్తున్నాయి. దీంతో ఖైదీలు జైలులో ఉండి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వ్యాపారులను బెదిరించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడడం లాంటి పనులు చేస్తున్నారు. దీంతో జైలు పరిసరాల్లో మొబైల్ జామర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
అవినీతి రహితంగా జైళ్లశాఖ: నాయిని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ల శాఖను అవినీతి రహితంగా మారుస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన చంచల్‌గూడ జైలును సందర్శించారు. ఇటీవల జైళ్ల శాఖ ప్రారంభించిన విద్యాదాన్ యోజనలో భాగంగా మహిళల జైల్లో టీసీఎస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ తరగతులను ఆయన ప్రారంభించారు. చంచల్‌గూడ జైలుతో తనకు అవినాభావ సంబంధం ఉందనీ.. ఎమర్జెన్సీ సమయంలో 18 నెలల పాటు ఇదే జైల్లో గడిపినట్లు ఈ సందర్భంగా నాయిని గుర్తు చేసుకున్నారు. ఆయన జైల్లో ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యాదాన్ యోజన బాగుందని తద్వారా చదువులేని ఖైదీలను అక్షరాస్యులుగా మార్చవచ్చన్నారు. వివిధ కేసులకు సంబంధించి అయిదేళ్లు శిక్ష పూర్తి చేసుకున్న తమను క్షమాభిక్ష కింద విడుదల చేయాలని ఖైదీలు ఈ సందర్భంగా కోరారు. ఈ విషయమై సీఎంతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ జైల్లో మగ్గుతున్న జీవిత ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల జైల్లోని బేకరీ యూనిట్‌ను సందర్శించి కొన్ని వస్తువులను నాయిని కొనుగోలు చేశారు. జైలు బయట ఔట్లెట్లు ప్రారంభించి బేకరీలను నడపాలని అధికారులకు మంత్రి నాయిని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్, ఇన్చార్జ్ ఐజీ చంద్రశేఖర్ నాయుడు, పురుషుల జైలు సూపరింటెండెంట్ సైదయ్య, మహిళల జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తదితరులు ఉన్నారు. -
జైళ్ల శాఖలో సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: జైళ్ల శాఖలోని 569 మంది కొత్త వార్డర్లకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వార్డర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని జైళ్ల వార్డరను జోన్ల వారిగా గాక, రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు చేసేలా నిబంధనలు ఉన్నాయి. దీంతో వారు నివసించే ప్రాంతాల నుంచి సుదూర ప్రాం తాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనిపై స్పందించిన జైళ్ల శాఖ డీజీ కృష్ణరాజు.. వార్డర్లకు సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. హోంశాఖ దీనికి ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 569 మంది వార్డర్లకు (ఇందులో 34మంది మహిళలు) సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వనున్నామని జైళ్ల శాఖ ఐజీ సునీల్ కుమార్ తెలిపారు. -
నిరీక్షణ ఫలించింది
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తూ ఏళ్ల తరబడి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్న ఖైదీల నిరీక్షణ ఫలించింది. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి, కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో హాయిగా గడపాలనే వారి కల నెరవేరనుంది. రెండేళ్ల పాటు క్షమాభిక్ష జీఓ ఇదిగో, అదిగో అంటూ ఖైదీలను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 28న జీఓఎంఎస్ నంబర్ 220ను విడుదల చేసింది. అక్టోబర్ 2వ తేదీ వరకు శిక్ష కాలాన్ని లెక్కించి మార్గదర్శకాల ప్రకారం విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కేంద్ర కారాగార ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎంఆర్ రవికరణ్ సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను తయారుచేసే పనిలో నిగమ్నమైయ్యారు. క్షమాభిక్ష జీఓ విడుదల కావడంతో జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. క్షమాభిక్ష జీఓ గతంలో నెల నుంచి రెండు నెలల ముందుగానే జిల్లా కేంద్ర కారాగారానికి అందేది. అధికారులు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను వెంటనే తయారుచేసి ఉన్నతాధికారులకు పంపేవారు. దీంతో జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి సంబరాల్లోనే క్షమాభిక్ష పొందిన ఖైదీలను విడుదల చేసేవారు. ఈ సారి మాత్రం ప్రభుత్వం రెండు రోజుల ముందు జారీ చేయడంతో ఖైదీల విడుదల ప్రక్రియ ఆలస్యం కానుంది. అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్‌లో కాని ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. 2011 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర కారాగారం నుంచి క్షమాభిక్ష కింద 13 మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. తాజాగా గాంధీజయంతి (ఖైదీల సంక్షేమ దినోత్సవం) సందర్భంగా జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా నూతన మార్గదర్శకాలను జారీచేసింది. జిల్లా కేంద్రకారాగారంలో 255 మంది జీవితఖైదు అనుభవిస్తుండగా, నూతన మార్గదర్శకాల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన 27 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఇదిలా ఉంటే తాజా మార్గదర్శకాలు కొందరు ఖైదీల విడుదలకు ప్రతిబందకాలుగా మారాయి. దీంతో వారు ఆవేదన చెందుతున్నారు. 27 మంది విడుదల : ఎంఆర్ రవికిరణ్, ఇన్చార్జి జైలు సూపరింటెండెంట్ ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం 27 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది. జాబితాను తయారు చేశాం. జాబితాను జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ద్వారా ప్రభుత్వానికి పంపుతాము. జాబితాను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం ఖైదీలను విడుదల చేస్తాం.