
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇమాంబీ
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని మహిళా ప్రత్యేక కారాగారంలో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న ఇమాంబీ(26) బుధవారం తాను ఉంటున్న క్వార్టర్స్‌లో ఆత్మహత్యకు యత్నించారు. జైళ్ల శాఖ అధికారుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన షేక్ చిన్న ఇమాంబీ డిప్యూటీ జైలర్‌గా ఏడాది నుంచి కడప మహిళా ప్రత్యేక కారాగారంలో విధులు నిర్వహిస్తున్నారు.
రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం 6 గంటలకు విధులకు రావాల్సి ఉండగా హాజరుకాలేదు. దీంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో సిబ్బంది వెళ్లేసరికి ఇమాంబీ తాను ఉంటున్న క్వార్టర్‌లోనే చేతికి రక్తం కారుతూ.. అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే కడప కేంద్ర కారాగారానికి సంబంధించిన అంబులెన్స్‌లో కడపలోని ఎం.ఎం. హాస్పిటల్‌లో వైద్యసేవల కోసం తీసుకెళ్లారు. ఘటనపై ఎం.ఎం. హాస్పిటల్ యాజమాన్యం ఎంఎల్‌సీ (మెడికో లీగల్ కేసు)ను నమోదు చేసుకోవాలని వన్‌టౌన్ పోలీసులకు సిఫారసు చేశారు.
వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇమాంబీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. రిమ్స్ పోలీసులను విచారణ కోసం పంపించారు. ఈ స్టేట్‌మెంట్‌లో మాత్రం డిప్యూటీ జైలర్ షేక్ ఇమాంబీ తాను ఆత్మహత్యకు యత్నించలేదని, కత్తితో కూరగాయలను కోస్తుండగా, ఎడమచేయి పొరపాటున తెగిందని తెలియజేసింది. కడప మహిళా ప్రత్యేక కారాగారం సూపరింటెండెంట్ వసంతకుమారి మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నమా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కాగా, జైలు అధికారుల మధ్య విభేదాలే ఘటనకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ మహిళా ఖైదీ ప్రత్యేక కారాగారంలో ఆత్మహత్యకు యత్నించిన విషయమై ఇమాంబీని విచారించారని తెలుస్తోంది.
సమగ్రంగా విచారిస్తున్నాం..
ఈ విషయమై జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మాట్లాడుతూ.. కడప మహిళా ప్రత్యేక కారాగారంలో జరుగుతున్న విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే శాఖాపరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment