
2024–25లో రూ. 1,114.91 కోట్లు విడుదల
వాటా కన్నా అధికంగా రూ.176 కోట్లు కేటాయింపు
దీంతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత మెరుగు పరిచే అవకాశం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మెరుగైన వైద్య సేవల కోసం ఉద్దేశించిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధులు ఈసారి గణనీయంగా పెరిగాయి. జనాభాకు అనుగుణంగా రాష్ట్రానికి రావలసిన వాటా విషయంలో పదేళ్లుగా సవతి తల్లి ప్రేమ చూపిన కేంద్రం 2024–25 కింద ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా రూ. 176 కోట్లు విడుదల చేయడం విశేషం. ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 వాటాతో నిధులను వెచి్చంచాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు, జిల్లా ఆసుపత్రుల నిర్మాణం, ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడం, మాతా శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, ఇమ్యునైజేషన్ డ్రైవ్‌ల కోసం ఈ నిధులు వినియోగిస్తారు.
రాష్ట్రం ఇవ్వాల్సింది ఇంకా రూ.56.35 కోట్లు
ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్ర నిధుల పంపిణీ రాష్ట్రాల జనాభా, ఆరోగ్య సూచికలు, పనితీరు ఆధారంగా ఉంటుంది. తెలంగాణ జనాభా సుమారు 3.93 కోట్లుగా అంచనా వేస్తే భారత దేశ జనాభా సుమారు 143 కోట్లు. అంటే దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.75 శాతం. 2024–25 కేంద్ర నేషనల్ హెల్త్ మిషన్ బడ్జెట్ రూ. 36,000 కోట్లు. ఇందులో 2024–25లో కేంద్రం నుంచి రూ. 938.42 కోట్లు రావలసి ఉండగా, రూ.176.49 అదనంగా కలిపి రూ.1,114.91 కోట్లను విడుదల చేసింది.
ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు రూ. 743.27 కోట్లు జమచేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 682.92 కోట్లు విడుదల చేసింది. మరో రూ.56.35 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం అదనంగా నిధులు ఇవ్వడంతో రాష్ట్రంలో మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించే అవకాశం ఉంది.
2014–15 నుంచి కోతలే..
రాష్ట్రానికి ఎన్‌హెచ్‌ఎం కింద కేంద్రం ఇచ్చే వాటాలో 2014–15 నుంచి 2023–24 వరకు కోతలే ఉన్నాయి. ఏటా 10 నుంచి 40 శాతం వరకు బకాయిపెట్టింది. పదేళ్లలో రూ.7012.35 కోట్లు రావాల్సి ఉండగా, రూ.5,961.81 కోట్లు వచ్చాయి. రూ.1,050.54 కోట్లకు కేంద్రం కోతలు పెట్టింది. గత 11 ఏళ్లలో 2024–25 సంవత్సరంలోనే వాటా కంటే అదనంగా రూ.176.49 కోట్లు కేటాయించడం విశేషం.