
సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగితే వేతనాలు నిలుపుదల
కనీసం చర్చలు జరుపకపోగా వేధింపులు.. ఆరోగ్యకేంద్రాల్లో నిలిచిన వైద్యసేవలు
అవస్థలు పడుతున్న ప్రజలు
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాటపట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లపై కూటమి సర్కారు కాఠిన్యం ప్రదర్శించింది. సమ్మె చేస్తున్న వారికి ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించకుండా నిలిపేసింది. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు శుక్రవారం వేతనాలు చెల్లించారు. ఈ క్రమంలో సమ్మెలో ఉన్న 9వేల మందికి ప్రభుత్వం వేతనాలు జమ చేయలేదని సీహెచ్‌వోలు వెల్లడించారు. వేతనాలు పెంపు, సర్వీస్ రెగ్యులరైజేషన్‌తోపాటు, పలు డిమాండ్‌లతో గత నెల 16 నుంచి సీహెచ్‌వోలు ఆందోళన బాట పట్టారు.
ఇదే నెల 24 నుంచి విధులనూ బహిష్కరించి సమ్మె తీవ్రం చేశారు. దీంతో తిరిగి విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో కొందరు తిరిగి విధులకు హాజరయ్యారు. 9 వేల మంది సమ్మె విరమణకు ససేమిరా అన్నారు. వీరందరికీ ఏప్రిల్ నెల వేతనాలు నిలిపేశారని సీహెచ్‌వోల యూనియన్ ప్రతినిధులు తెలిపారు. విధుల్లో కొనసాగుతున్న వారికీ రూ.4వేల చొప్పున వేతనాల్లో కోత విధించారని పేర్కొన్నారు. మరోవైపు సీహెచ్‌వోలు విధులు బహిష్కరించడంతో గ్రామాల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలో వైద్య సేవలు అందించడం కోసం గత ప్రభుత్వం బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని సీహెచ్‌వోలుగా నియమించింది. వీరంతా సమ్మెలోకి వెళ్లడంతో విలేజ్ క్లినిక్‌లకు తాళాలు పడ్డాయి. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేయడానికి వీల్లేదని సీహెచ్‌వోల బాధ్యతలను ఏఎన్‌ఎంలు, ఆశాలకు అప్పగించాలని ప్రభుత్వం డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే పని భారంతో సతమతమవుతున్న ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలపై ప్రభుత్వం అదనపు భారం మోపింది. అయినా రాష్ట్రంలోని విలేజ్ క్లినిక్‌లు తెరుచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సమ్మెకు వెళతామని కొద్ది వారాల ముందే సీహెచ్‌వోలు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తీరా వారు సమ్మెలోకి వెళ్లాక పిలిచి చర్చలు జరిపే యత్నం కూడా చేయలేదు. పైగా నేరుగా వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై వైద్య శాఖ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు సమ్మెకు నేతృత్వం వహిస్తున్న సీహెచ్‌వోల సంఘం ప్రతినిధులపైనా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఒకరిద్దరిని విధుల నుంచి తొలగించడం ద్వారా మిగిలిన వారిని భయపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.