హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం  | AP stands second in health and wellness centers | Sakshi
Sakshi News home page

హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం 

Published Mon, Nov 20 2023 6:33 AM | Last Updated on Mon, Nov 20 2023 6:14 PM

AP stands second in health and wellness centers - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధుల స్క్రీనింగ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.  

ఏపీలో ఇలా...  
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌తోపాటు ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్‌లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement