second place
-
మన ఫిల్టర్ కాఫీకి ప్రపంచం ఫిదా
ఫిల్టర్ కాఫీ ఆ పేరు వింటేనే.. ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా.. ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ తాగితే.. కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఉదయించే సూర్యుడితో పాటే.. ఒక కప్పు ఫిల్టర్ కాఫీ గొంతులో పడితే మనకు మరో కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడలేని హుషారు కలిగిస్తుంది. కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఎంతో పేరొందిన ఈ ఫిల్టర్ కాఫీ ప్రపంచంలోనే ‘ది బెస్ట్’గా నిలిచింది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫాం ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ప్రపంచ టాప్ కాఫీల జాబితాలో మన ‘ఫిల్టర్ కాఫీ’ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్్క భారత్‌లోకి ఎలా వచ్చిందంటే..? దీని మూలం ఆఫ్రికా. అక్కడి నుంచి ‘యెమెన్‌కు’ తీసుకువచ్చి పెంచడం మొదలుపెట్టారు. విత్తనాలు అమ్మడం, వేరే దేశాలకు ఇవ్వడం అక్కడ నిషిద్ధం. మక్కా వెళ్లిన సూఫీ సెయింట్ బాబా అక్కడి నుంచి రహస్యంగా ఏడు కాఫీ గింజలను తీసుకొచ్చి కర్ణాటకలోని చిక్మగలూర్ కొండల్లో నాటినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే ‘టీ’కి ప్రత్యామ్నాయంగా బ్రిటీష్ వాళ్లు కాఫీ అమ్మకాలను, పంటను ప్రోత్సహించారని.. దీంతో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొంటున్నారు. టాప్–10 జాబితాలో ఉన్న వివిధ దేశాల కాఫీలు1. క్యూబన్ ఎ్రస్పెస్సో (క్యూబా) 2. ఫిల్టర్ కాఫీ (భారత్) 3. ఎ్రస్పెస్సో ఫ్రెడ్డో (గ్రీస్) 4. ఫ్రెడ్డో క్యాపుచినో (గ్రీస్) 5. క్యాపుచినో (ఇటలీ) 6. ఫ్రాప్పే కాఫీ (గ్రీస్) 7. రిస్ట్రోట్టో (ఇటలీ) 8. వియత్నమీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం) 9. ఎస్ప్రెస్సో (ఇటలీ) 10. టర్కిష్ కాఫీ ( టర్కీ) ప్రయోజనాలు ఫిల్టర్ కాఫీని మితంగా తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక వెల్లడించింది. అలాగే మూడ్ బూస్టర్‌గా మారి.. ఏకాగ్రత, చురుకుదనం, మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. టైప్–2 డయాబెటిస్ రిస్‌్కను తగ్గిస్తుందని, కాలేయానికి రక్షణ కల్పిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కెఫిన్ వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నాయి.అధికమైతే అనర్థమే!ఏదైనా అతిగా చేస్తే అనర్థమే. కొందరు రోజుకు ఆరేడుసార్లు ఫిల్టర్ కాఫీ తాగేస్తుంటారు. ఇలా ఫిల్టర్ కాఫీ కూడా అతిగా తాగితే పలు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులోని కెఫిన్ రక్తపోటును, హార్ట్‌రేట్, యాంగ్జైటీని పెంచుతుందని.. నిద్ర సమస్యలను కలుగజేస్తుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు దీనికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. రోజుకు మూడు కప్పులకు మించి తాగొద్దని సూచిస్తున్నారు. -
సెల్ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్‌కు చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్ ఫోన్ల జాడను కనుగొన్నారు.ఈ మేరకు సీఐడీ ఇన్చార్జి అదనపు డీజీ మహేశ్‌భగవత్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిరు. గతేడాది ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో సీఈఐఆర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, మే 17న పూర్తిస్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,869 మొబైల్ ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 మొబైల్ ఫోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,919 మొబైల్ ఫోన్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉందని తెలిపారు. -
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్‌లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. -
వ్యాపారానికి అద్వితీయం.. జాబితాలో ద్వితీయం..
సాక్షి, హైదరాబాద్: ఫుడ్‌కోర్టులు, షాపింగ్‌మాల్స్, గేమింగ్ జోన్స్, రిటైల్ షాపులు, మల్టీప్లెక్స్‌లు ఇలా అన్నీ గుదిగుచ్చి ఓ వ్యాపారకూడలిగా మారే ప్రాంతాలను హైస్ట్రీట్స్గా పిలుస్తున్నారు. కాస్మోపాలిటన్ సిటీలకు ఈ హైస్ట్రీట్సే ఆకర్షణ. పగలు అందమైన ఆకాశహర్మ్యాలు, రాత్రిళ్లు నియాన్‌లైట్ల వెలుగుజిలుగులతో మెరిసిపోయే ఈ హైస్ట్రీట్స్‌కు వెళ్తే ‘‘ఎంతహాయి ఈ నగరమోయి..ఎంత అందమోయి ఈ నగరమోయి’’అని పాడుకోవాల్సిందే మరి. నగరంలో ఎక్కడ్నుంచైనా ఈ హైస్ట్రీట్స్‌కు రవాణా సౌకర్యం, ఆధునిక వసతులు, పార్కింగ్, వినోద, విహార సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ హైస్ట్రీట్లలో ప్రతి చదరపు అడుగుల ఆదాయం షాపింగ్ మాల్స్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది. హైస్ట్రీట్‌లో చదరపు అడుగుల ఆదాయం ఏడాదికి సుమారు రూ.36.42 లక్షలు కాగా..షాపింగ్ మాల్స్‌లో రూ.11.31 లక్షలుగా ఉంటుంది. ఖరీదైన ప్రాంతంగా జూబ్లీహిల్స్ నగరంలోని ఐదు ప్రాంతాలలో రిటైల్ అద్దెల పరంగా అతి ఖరీదైనప్రాంతం మాత్రం జూబ్లీహిల్సే. ఇక్కడ చదరపు అడుగు రిటైల్ స్పేస్ సగటు అద్దె నెలకు రూ.200–225 కాగా, దాని తర్వాత బంజారాహిల్స్ (రూ.190–230), సోమాజిగూడ (రూ.150–175), అమీర్‌పేట (రూ.110–130), గచ్చిబౌలి ప్రాంతాలు రూ.140గా ఉన్నాయి. హైస్ట్రీట్స్ జాబితాలో రెండోస్థానంగా సోమాజిగూడ... కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లపై ‘ఇండియా రియల్ ఎస్టేట్ విజన్–2047’పేరుతో నరెడ్కో–నైట్‌ఫ్రాంక్ ఇండియా నిర్వహించిన ఓ అధ్యయన నివేదికలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ హైస్ట్రీట్ రెండో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇక ఈ నివేదికలో బెంగళూరులోని ఎంజీ రోడ్ తొలిస్థానంలో నిలిచింది. దేశంలోని టాప్ 20 హైస్ట్రీట్స్ జాబితాలో హైదరాబాద్ నుంచి సోమాజిగూడతోపాటు ఐదు ప్రాంతాలున్నాయి. ఇందులో గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్‌పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి. ఆధునిక రిటైల్ హైస్ట్రీట్స్ లో ఎన్సీఆర్దే అగ్రస్థానం దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 30 హైస్ట్రీట్స్ ఉండగా...ఈ హైస్ట్రీట్స్ 1.32 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 52 లక్షల చదరపు అడుగుల స్థలంతో ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతంలోని ఎన్సీఆర్ తొలిస్థానంలో ఉండగా..18 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ మలిస్థానంలో నిలిచింది. ఇక అహ్మదాబాద్, బెంగళూరు ఒక్కో నగరంలో 15 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. ఆధునిక రిటైల్ స్పేస్ పరంగా చూస్తే...ఎనిమిది ప్రధాన నగరాలలో 57 లక్షల చదరపు అడుగుల వాటా ఉండగా..14 లక్షల చదరపు అడుగులతో ఎన్సీఆర్ అగ్రస్థానంలో, 11 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. -
స్మార్ట్‌వాచ్ విభాగంలో ఫైర్-బోల్ట్ హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ ఫైర్-బోల్ట్ కొత్త రికార్డు సృష్టించింది. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం స్మార్ట్‌వాచ్ విభాగంలో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచినట్టు కంపెనీ వెల్లడించింది. మూడేళ్లలోనే 9 శాతం వాటాతో ఈ ఘనత సాధించినట్టు వివరించింది. మార్చి త్రైమాసికంలో 57 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపింది. -
టాప్ 10 మార్కెట్లలో నాలుగు బెంగళూరులోనే.. ఎక్కడెక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సోమాజిగూడ దేశంలోని ప్రముఖ 30 ప్రాంతాల్లో (ప్రముఖ మార్కెట్ ప్రాంతాలు) రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డు మొదటి స్థానంలో నిలవగా, ముంబై లింకింగ్ రోడ్డు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ (పార్ట్ 1, 2) ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు లభించే మెరుగైన అనుభవం ఆధారంగా ఈ స్థానాలను కేటాయించారు. కస్టమర్లకు మెరుగైన ప్రాంతాలు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి. టాప్–10లో నాలుగు ఈ నగరం నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లోని ప్రాంతాలను టాప్–30 కోసం నైట్ ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 – హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. కొల్కతా పార్క్ స్ట్రీట్ అండ్ కామెక్ స్ట్రీట్ ఐదో స్థానంలో ఉంటే.. చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, చర్చి రోడ్ టాప్ 10లో ఉన్నాయి. వీటిని ప్రముఖ ప్రాంతాలుగా చెప్పడానికి అక్కడ పార్కింగ్ సౌకర్యాలు, అక్కడకు వెళ్లి రావడంలో ఉండే సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 8 పట్టణాల్లోని ప్రముఖ మార్కెట్ ప్రాంతాల్లో 13.2 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఇందులో 5.7 మిలియన్ చదరపు అడుగులు ఆధునిక రిటైల్ వసతులకు సంబంధించినది. ఈ టాప్–30 మార్కెట్లలో 2023–24లో 2 బిలియన్ డాలర్ల వినియోగం నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. -
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్
దుబాయ్: బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్‌తో భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో పడింది. ఈ జాబితాలో 99 పాయింట్లున్న టీమిండియా 58.93 శాతంతో రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా (120 పాయింట్లు) 76.92 శాతంతో అగ్రస్థానంలో ఉంది. కానీ భారత జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో ముప్పుంది. 72 పాయింట్లున్న దక్షిణాఫ్రికా 54.55 శాతంతో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. దీంతో పాటు సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టులు కూడా దక్షిణాఫ్రికాను ఫైనల్ రేసులోకి తేవొచ్చు. భారత్‌కు స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ మిగిలుంది. మొత్తానికి ఈ ఎనిమిది టెస్టులే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేస్తాయి. టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు ఏ ఢోకా లేకపోయినా... రెండో స్థానం కోసం భారత్‌కు దక్షిణాఫ్రికాతో పోటీ తప్పదు. -
FIFA rankings: రెండో ర్యాంక్‌లో అర్జెంటీనా
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా ఒక స్థానం పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బ్రెజిల్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. రన్నరప్ ఫ్రాన్స్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన బెల్జియం రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. మూడో స్థానం పొందిన క్రొయేషియా ఐదు స్థానాలు పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా గుర్తింపు పొందిన మొరాకో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. జపాన్ 20వ ర్యాంక్‌తో ఆసియా నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. భారత్ 106వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. -
భారత్‌కు చమురు సరఫరాలో రెండో స్థానానికి రష్యా..
న్యూఢిల్లీ: భారత్‌కు ముడిచమురు అత్యధికంగా సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియాను దాటి రష్యా రెండో స్థానానికి చేరింది. మే నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి 25 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేసినట్లు గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం చమురు దిగుమతుల్లో ఇది 16 శాతం పైగా ఉంటుంది. సముద్రమార్గంలో భారత్ చేసుకునే మొత్తం దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చే ఉత్పత్తుల వాటా ఏప్రిల్‌లో తొలిసారిగా 5 శాతానికి చేరింది. 2021 సంవత్సరం ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలోనూ ఇది 1 శాతం కన్నా తక్కువే నమోదైంది. ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాక్ అగ్రస్థానంలో ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు రష్యా భారీ డిస్కౌంటుపై చమురు సరఫరా చేస్తోంది. గతంలో రవాణా చార్జీల భారం కారణంగా రష్యా చమురును భారత్ అంతగా కొనుగోలు చేయలేదు. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుని రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకుంటోంది. -
నయా నంబర్‌వన్..డానిల్ మెద్వెదెవ్
లండన్: టెన్నిస్ రాకెట్ పట్టిన ఎవరికైనా కెరీర్లో రెండు లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ఏదైనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడం... రెండోది ఏనాటికైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకోవడం... రష్యా టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ రెండు లక్ష్యాలను అందుకున్నాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న 26 ఏళ్ల మెద్వెదెవ్ సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను రెండో స్థానానికి నెట్టేసి మెద్వెదెవ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్ 8,615 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జొకోవిచ్ 8,465 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ‘వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. రాకెట్ పట్టినప్పటి నుంచి నా లక్ష్యాల్లో ఇదొకటి. టాప్ ర్యాంక్ చేరుకున్నాక నాకు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది సందేశాలు పంపించారు. వారందరికీ ధన్యవాదాలు’ అని మెద్వెదెవ్ వ్యాఖ్యానించాడు. ► పురుషుల టెన్నిస్‌లో ‘బిగ్ ఫోర్’గా పేరొందిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా), ఆండీ ముర్రే (బ్రిటన్)లలో ఎవరో ఒకరు 2004 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటి వరకు ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతూ వస్తున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నలుగురు కాకుండా మెద్వెదెవ్ రూపంలో మరో ప్లేయర్ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలువడం విశేషం. ► ఆండీ ముర్రే (2016 నవంబర్ 7) తర్వాత కొత్త నంబర్‌వన్ ర్యాంకర్‌గా మెద్వెదెవ్ నిలిచాడు. ► యెవ్గెనీ కఫెల్నికోవ్ (1999; మే 3), మరాత్ సఫిన్ (2000, నవంబర్ 20) తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ పొందిన మూడో రష్యా ఆటగాడిగా మెద్వెదెవ్ గుర్తింపు పొందాడు. నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాక కఫెల్నికోవ్ వరుసగా ఆరు వారాలు, సఫిన్ వరుసగా తొమ్మిది వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. ► 1996 ఫిబ్రవరి 11న మాస్కోలో జన్మించిన మెద్వెదెవ్ 2014లో ప్రొఫెషనల్‌గా మారాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదెవ్ 2016 నవంబర్‌లో తొలిసారి టాప్–100లోకి వచ్చాడు. అనంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆరేళ్ల వ్యవధిలో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. ► ఇప్పటివరకు మెద్వెదెవ్ మొత్తం 13 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇందులో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ (యూఎస్ ఓపెన్–2021), నాలుగు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ (2020) ఉన్నాయి. ► 1973 ఆగస్టులో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న 27వ ప్లేయర్ మెద్వెదెవ్ కావడం విశేషం. -
వారి పోరాటం రెండో స్థానం కోసమే
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీతో సహా విపక్షాలన్నీ రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ తిరిగి బంపర్‌మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. తృణమూల్ వంటి పార్టీల మద్దతు, లఖీంపూర్‌ఖేరీ ఉదంతం వంటివి సమాజ్‌వాదీ పార్టీకి ఏ మాత్రమూ లాభించే పరిస్థితి లేదన్నారు. ప్రచార పర్వంలో బిజీగా ఉన్న ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు... ► ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఈసారి ఎన్నికల్లో మాకెవరూ పోటీ లేరు. సమాజ్‌వాదీ పార్టీతో సహా విపక్షాలన్నీ కేవలం రెండో స్థానం కోసం మాత్రమే పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 80 శాతం ఓటర్ల మద్దతు బీజేపీకే ఉంది. విపక్షాలన్నీ కలిపి మిగతా 20 శాతం ఓట్ల కోసమే పోరాడుతున్నాయి. ► తమదిప్పుడు సరికొత్త (నయా) సమాజ్‌వాదీ అని ఆ పార్టీ అంటోంది? వాళ్లు అణుమాత్రమైనా మారలేదు. మాఫియాలకు, నేర చరితులకు, ఉగ్రవాదులకు సాయపడే వారికి టికెట్లివ్వడం నుంచి మొదలుకుని ఏ ఒక్క విషయంలోనూ సమాజ్‌వాదీ అస్సలు మారలేదు. యూపీలో తాజా గాలి వీస్తోంది తప్పితే ఆ పార్టీ మాత్రం ఎప్పట్లాగే ఉంది. ► చట్ట వ్యతిరేక శక్తులు తనకు ఓటేయాల్సిన అవసరం లేదని అఖిలేశ్ అంటున్నారు? నిజానికి ఆయన ఉద్దేశం అందుకు పూర్తిగా వ్యతిరేకం. చట్ట వ్యతిరేక శక్తులు, విద్రోహులు ఒక్కతాటిపైకి వచ్చి సమాజ్‌వాదీ హయాంలో నడిచిన గూండారాజ్‌ను మళ్లీ తేవాలన్నది అఖిలేశ్ అసలు మాటల అంతరార్థం. ► లఖీంపూర్‌ఖేరీలో రైతుల మరణాన్ని జలియన్‌వాలాబాగ్ దురంతంతో అఖిలేశ్ పోలుస్తుండటం బీజేపీకి చేటు చేస్తుందా? ఈ విషయంలో చట్టం చురుగ్గా పని చేస్తోంది. కేసుపై సిట్ నిష్పాక్షికంగా విచారణ జరుపుతోంది. దాన్ని సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న అఖిలేశ్ ఆశలు నెరవేరవు. రాష్ట్ర రైతులంతా వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న బీజేపీకే మద్దతుగా నిలుస్తారు. ► తృణమూల్ తదితర పార్టీలు సమాజ్‌వాదీకి మద్దతు ప్రకటించడం మీకేమీ నష్టం చేయదా? తృణమూల్, ఎన్సీపీ, ఆర్జేడీ వంటి పార్టీలకు యూపీలో ప్రజల మద్దతే లేదు. వాటి మద్దతుతో సమాజ్‌వాదీకి ఒరిగేదేమీ ఉండదు. ► యోగి ప్రధాని అభ్యర్థి అవుతారేమోనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి? నేనో సామాన్య బీజేపీ కార్యకర్తను. పార్టీ నాకిచ్చిన ఏ పనినైనా నెరవేర్చడమే నా బాధ్యత. అంతే తప్ప పదవుల కోసం, కుర్చీల కోసం నేనెన్నడూ పాకులాడలేదు. ► మీరు పోటీ చేస్తున్న గోరఖ్‌పూర్ అర్బన్ స్థానంలో పరిస్థితి ఎలా ఉంది? అది సంప్రదాయ బీజేపీ స్థానం. పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో అక్కడి ప్రజలే మరోసారి గెలిపించుకుంటారు. -
దేశంలో కాస్ట్లీ ప్రాపర్టీలలో హైదరాబాద్ ర్యాంక్ ఎంతంటే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలు ప్రియమయ్యాయి. దేశంలో అత్యంత ఖరీదైన ఇళ్లలో భాగ్యనగరం రెండవ స్థానానికి చేరింది. ఇక్కడ చ.అ. ధర రూ.5,800 నుంచి 6,000లుగా ఉన్నాయి. కాస్ట్లీ గృహాలలో తొలి స్థానంలో నిలిచిన ముంబైలో చ.అ. ధర రూ.9,600–9,800గా ఉన్నాయి. ప్రాపర్టీల వార్షిక ధరల వృద్ధిలోనూ హైదరాబాద్ ముందుంది. అహ్మదాబాద్‌లో 8 శాతం పెరుగుదల ఉండగా.. నగరంలో 6 శాతంగా ఉంది. ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్.కామ్ ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశంలోని ప్రధాన నివాస విభాగ మార్కెట్లలో ధరల వృద్ధిని విశ్లేíÙంచింది. గతేడాది క్యూ3తో పోలిస్తే 2021 మూడో త్రైమాసికంలో హైదరాబాద్‌లో చ.అ. ధర 3 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతమిక్కడ చ.అ.కు సగటు ధర రూ.5,751గా ఉంది. అత్యంత ఖరీదైన ప్రాపర్టీ మార్కెట్‌గా ముంబైలో నిలిచింది. ఇక్కడ చ.అ. సగటు ధర రూ.9,670గా ఉంది. విక్రయాలు ఎక్కువగా ఎక్కడంటే.. గత పదేళ్ల నుంచి గృహ రుణ వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉండటం, డెవలపర్లు ప్రత్యేక రాయితీలు అందిస్తుండటంతో నగరంలో గృహ కొనుగోళ్లు పెరిగాయి. ఐటీ, ఫార్మా హబ్‌లతో ఇతర నగరాల నుంచి కూడా విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. హైదరాబాద్‌లో ధర ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌లో 7,812 గృహాలు విక్రయమయ్యాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 222 శాతం, గతేడాది క్యూ3తో పోలిస్తే 140 శాతం వృద్ధి రేటు. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ వంటి ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగాయి. నగరంలో ఇన్వెంటరీ 50,103 యూనిట్లు.. గృహాలకు డిమాండ్ పెరగడంతో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం నగరంలో 50,103 గృహాల ఇన్వెంటరీ ఉంది. వీటి నిర్వహణకు 25 నెలల కాలం పడుతుంది. కోల్‌కతాలో అతి తక్కువ ఇన్వెంటరీ (26,382 యూనిట్లు) ఉన్నప్పటికీ.. వీటి నిర్వహణకు మాత్రం 32 నెలల సమయం పడుతుంది. ముంబైలో 2,61,385 ఇన్వెంటరీ ఉంది. అహ్మదాబాద్‌లో 51,208, బెంగళూరులో 67,644, చెన్నైలో 35,145, ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,00,559, పుణేలో 1,28,093 ఇన్వెంటరీ గృహాలున్నాయి. లాంచింగ్స్‌లోనూ జోరే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్త గృహాల ప్రారంభాలు కూడా జోరుగానే సాగాయి. హైదరాబాద్‌లో క్యూ3లో 12,342 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గతేడాది క్యూ3తో పోలిస్తే 189 శాతం వృద్ధి. 2021 క్యూ3లోని లాంచింగ్ యూనిట్లలో 36 శాతం రూ. కోటి ధర ఉన్న గృహాలున్నాయి. దుండిగల్, తెల్లాపూర్, గోపన్‌పల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్లలో ఎక్కువగా లాంచింగ్స్ జరిగాయి. వృద్ధి ఎందుకంటే.. డిమాండ్, సరఫరాల మధ్య తేడాలు గమనిస్తే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ రికవరీ దశకు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. పండుగ సీజన్లలో కొనుగోలుదారులపై ధరల పెంపు ప్రభావాన్ని లేకుండా ఉండేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీంతో రానున్న త్రైమాసికాలలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాలలో గృహ విభాగంలో స్థిరమైన వృద్ధి నమోదవుతుంది. – రాజన్ సూద్, బిజినెస్ హెడ్, ప్రాప్‌టైగర్ -
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా రెడ్మీ
-
సంచలనం:యాపిల్‌ను వెనక్కి నెట్టిన షియోమీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ సంచలనం సృష్టించిది. యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా నిలిచింది. ఇక ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇప్పుడు శాంసంగ్ టాప్ పొజిషన్‌కు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ canalys నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 19 శాతం షేర్లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ టాప్ పొజిషన్లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటిదాకా శాంసంగ్, యాపిల్ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ వచ్చేవి. ఫస్ట్ టైం షియోమీ రెండో ప్లేస్‌కు చేరి ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ పెట్టింది. హువాయ్ పతనం తర్వాత మిగతా ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ గ్యాప్‌ను పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్ దేశాలకు 300 శాతం కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్ ఎగుమతులు వెళ్లాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్ పెరిగిందని.. అదే టైంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే షియోమీ నెంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం యాపిల్‌కు 14 శాతం షేర్ ఉండగా, ఒప్పో.. వివోలు చెరో పదిశాతం మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. -
క్వాలిఫయింగ్‌లో హామిల్టన్‌కు నిరాశ
పోర్టిమావో (పోర్చుగల్): కెరీర్లో 100వ పోల్ పొజిషన్ సాధించేందుకు డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో వారం రోజులు వేచి చూడాలి. తాజా ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. గత రెండు రేసుల్లో నిరాశ పరిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ మాత్రం ఈ క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 18.348 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇది 17వ పోల్. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో ఇప్పటి వరకు మూడు క్వాలిఫయింగ్ సెషన్లు జరగ్గా... ఈ మూడు సార్లు వేర్వేరు డ్రైవర్లు పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నారు. బహ్రెయిన్‌లో వెర్స్టాపెన్, ఇమోలా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌లు పోల్ పొజిషన్‌తో మెరిశారు. గ్రిడ్ పొజిషన్స్ 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. పెరెజ్ (రెడ్‌బుల్), 5. సెయింజ్ (ఫెరారీ), 6. ఒకాన్ (ఆల్పైన్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. లెక్లెర్క్ (ఫెరారీ), 9, గ్యాస్లీ (ఆల్ఫా టారీ), 10. వెటెల్ (ఆస్టన్ మార్టిన్), 11. రసెల్ (విలియమ్స్), 12. జియోవినాజి (ఆల్ఫా రోమియో), 13. అలోన్సో (ఆల్పైన్), 14, సునోడా (ఆల్ఫా టారీ), 15. రైకొనెన్ (ఆల్ఫా రోమియో), 16. రికియార్డో (మెక్లారెన్) 17. స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్), 18. లతీఫ్ (విలియమ్స్), 19. మిక్ షుమాకర్ (హాస్), 20. మేజ్‌పిన్ (హాస్) -
మన దేశ మరణాలలో క్యాన్సర్‌ది రెండో స్థానం
వైద్యరంగంలో క్యాన్సర్‌ను కనుగొనడానికి, చికిత్స అందించడానికి ఎన్నో ఆధునికతలు, విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ... క్యాన్సర్ ఇంకా మానవాళికి ఒక పెనుసవాల్గానే ఉంది. ఇందుకు నిదర్శనం పెరుగుతున్న క్యాన్సర్ మరణాల సంఖ్య. మనదేశంలో మరణాల సంఖ్యలో క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. గర్భాశయు ముఖద్వార క్యాన్సర్: మనదేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అగ్రభాగాన ఉండే క్యాన్సర్ ఇది. పెళ్లికాకముందే అమ్మాయిలు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మూడు డోసులు తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చు. మన దేశంలో స్త్రీలు చాలా ఆలస్యంగా దీన్ని గుర్తించడం వల్లనో లేక లక్షణాలు కనిపించి నిర్లక్ష్యం చేయడం వల్లనో నయం చేయలేని దశకు చేరుకుంటారు. కానీ ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం తేలిక అని చెప్పుకోవచ్చు. దీని లక్షణాలు.. ►యోని నుంచి అసాధారణంగా ఊరే స్రావాలు ►నెలసరి మధ్యలో లేక కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం ►నెలసరి రక్తస్రావం ముందుకంటే ఎక్కువ అవ్వడం ►ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అలసట... ఇంకా దశను బట్టి నడుమునొప్పి, ఎముకల నొప్పులు, కాళ్లవాపు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. పాప్‌స్మియర్, కాల్పోస్కోపీ, బయాప్సీ వంటి పద్ధతులతో ఈ క్యాన్సర్‌ను గుర్తించి హిసెరోస్కోపీ, ఊపరెక్టమీవంటి సర్జరీలు చేస్తారు. రొమ్ముక్యాన్సర్: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వయసు పైబడే కొద్దీ చాలా ఎక్కువ అవుతుంది. అవివాహిత స్త్రీలు, పిల్లలు కలగని మహిళలు, తల్లిపాలు పట్టించని మహిళల్లో, పదేళ్లలోపే రజస్వల అయి, 55 ఏళ్లు దాటాక కూడా మెనోపాజ్‌కు చేరుకోకపోవడం, దీర్ఘకాలం పాటు హార్మోన్ల మీద ప్రభావం చూపే మందులు వాడటం వల్ల, రక్తసంబంధీకుల్లో ఎవరికైనా ఈ క్యాన్సర్ ఉండటం వంటి అంశాలు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. ►రొమ్మున కదలని, గట్టి గడ్డ తగలడం ►రొమ్ముల్లో లేక చంకల్లో గడ్డ లేక వాపు కనిపించడం ►చనుమొన సైజులో మార్పు, లోపలివైపునకు తిరిగి ఉండటం ►రొమ్మ మీద చర్మం మందం కావడం, సొట్టపడటం, ►రొమ్ముపైభాగాన ఎంతకూ నయం కాని పుండు ►బ్రెస్ట్ సైజ్‌లో మార్పులతోపాటు చనుమొన నుంచి రక్తస్రావం అవ్వడం... వంటి లక్షణాలు కనిపించేసరికి ఈ క్యాన్సర్ తొలిదశను దాటిపోయే ప్రమాదం ఉంది. లివర్ క్యాన్సర్: పురుషుల్లో సాధారణంగా ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన లివర్ క్యాన్సర్, వయసు పైబడినవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువ. ∙కడుపులో నొప్పి ►ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ►కామెర్లు, వాంతులు ►పొట్టలో నీరు చేరడం వంటి లక్షణాలు ఈ క్యాన్సర్ తీవ్రతను తెలుపుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్: ప్రపంచవ్యాప్తం గా చూస్తే క్యాన్సర్ సంబంధిత మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలే అధికం. పొగాకు ఉత్పాదనలు, బీడీ, చుట్ట, గుట్కా, పొగాకు నమలడం, సిగరెట్ వంటి అలవాట్లు కేవలం వారికే కాకుండా పక్కనున్నవారికీ ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. ఈ క్యాన్సర్ బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ. ►ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం ►బాగా దగ్గు, దగ్గుతో పాటు రక్తం ►ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ►ఛాతీలో, పొట్టలో నొప్పి ►మింగడం కష్టంగా ఉండటం... మొదలైన లక్షణాలతో బయటపడే ఈ క్యాన్సర్‌కు ఇతర అవయవాలకు త్వరగా వ్యాప్తిచెందే గుణం ఎక్కువ. చెస్ట్ ఎక్స్‌రే, బయాప్సీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేసి, స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షలతో కణితి ఎక్కడ, ఏ దశలో ఉంది అనే విషయాలను తెలుసుకుని, అవసరమైతే లంగ్‌లో కొంతభాగాన్ని తొలగించే లోబెక్టమీ... అదీ కుదరకపోతే కీమోథెరపీ ఇస్తారు. స్టమక్ (కడుపు) క్యాన్సర్: మసాలాలు, బియ్యం, కారం ఎక్కువగా తినడమే కాకుండా ఖచ్చితంగా తెలియని కారణాలతో దక్షిణ భారతదేశంలోని పురుషుల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అల్సర్ లక్షణాలలాగానే కనిపించే ఈ క్యాన్సర్‌ను అల్సర్లా పొరబడే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి జీర్ణాశయం అల్సర్ కూడ ఈ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ►కడుపులో నొప్పి, అసిడిటీ, ►ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ►వికారం, ఎక్కిళ్లు, తేన్పులు ►రక్తపు వాంతులు, మలంలో నల్లగా రక్తం పడటం వంటి లక్షణాలు ఈ క్యాన్సర్‌లో కనిపిస్తాయి. ఎండోస్కోపీ, బయాప్సీ, అవసరమైతే సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలతో ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయడం జరగుతుంది. కణితి చిన్నగా ఉంటే వాటి చుట్టూ కొంతభాగాన్ని తీసివేసే గ్యాస్ట్రెక్టమీ నిర్వహిస్తారు. ఒకవేళ కణితి పెద్దగా ఉండి చుట్టూ ఉన్న కణజాలానికీ, లింఫ్‌నోడ్స్‌కూ పాకితే పొట్ట మొత్తాన్ని, అన్నవాహికలో కొంతభాగాన్ని, చిన్నపేగుల్లో కొంత భాగాన్ని తీసివేసి, మిగిలిన అన్నవాహికను చిన్నపేగులతో కలిపి కుట్టివేస్తారు. కానీ ఆ తర్వాత ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన టీమిండియా
దుబాయ్: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌తో టెస్టు(3-1), టీ20(3-2) సిరీస్‌లను సైతం కైవసం టీమిండియా టెస్టుల్లో అగ్రస్థానంలో, టీ20ల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్ 121 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లి సేన.. న్యూజిలాండ్(118)ను మూడో స్థానానికి నెట్టి 119 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్ 118 పాయింట్లకు మాత్రమే పరిమితమై మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక్కడ చదవండి: ఆ క్యాచ్ హైలెట్.. ఒకవేళ అవి జారవిడవకుండా ఉంటే..! ఈ జాబితాలో 111 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో, 108 పాయింట్లతో ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు నిలిచాయి. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని సాధించి ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో చివరిదాకా పోరాడి భారత శిబిరంలో గుబులు పుట్టించిన ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం చేసుకోగా, వరుస అర్ధసెంచరీలతో అలరించిన ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టోకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఇక్కడ చదవండి: టీమిండియా టాపార్డర్ తీరుపై వీవీఎస్ అసంతృప్తి! -
కోవిడ్ సేవల్లో కడప 2వ స్థానం
సాక్షి, కడప: కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర స్దాయిలో మన జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. గత గురువారం జిల్లా 4వ స్థానంలో నిలిచింది. ఈ మూడు రోజుల్లో పనితీరును మెరుగుపరుచుకొని రెండవ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వం ప్రతి సోమవారం, గురువారం కరోనా సేవలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షించి, ర్యాంకులు ప్రకటిస్తుంది. సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిగింది. జిల్లా రెండవ స్థానంలో నిలిచినట్లుగా ఉన్నతాధికారులు ఇందులో ప్రకటించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ నేతృత్వంలో కోవిడ్‌పై ఒక అధికారిని నియమించారు. అన్ని శాఖల అధికారులకు భాగస్వామ్యం కల్పించారు. కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వసతులు కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా సేవలందిస్తోంది. కరోనా నిర్ణారణ పరీక్షలు నిర్వహంచడం, పాజిటివ్‌గా నిర్ణారణ అయిన వ్యక్తులకు మెరుగైన వైద్య చికిత్సలను అందించడం. సకాలంలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం, కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వసతులు కల్పించడం, శుభ్రత చర్యలు చేపట్టడం, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని పరిశీలించడం లాంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటి ఆధారంగా సోమ, గురువారం ర్యాంకులను ప్రకటిస్తుంది. -
రెండో స్థానంలోకి భారత్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలోకి చేరింది. కేసుల సంఖ్య దృష్ట్యా బ్రెజిల్‌ను దాటిపోయింది. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు కూడా భారత్‌లో 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల్లో 90,802 కేసులు బయ టపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,04,613కు చేరుకుంది. గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు, రెండు రోజులుగా 90 వేలకు పైన కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 69,564 మంది కోలుకోగా 1,016 మంది మరణిం చారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 71,642కు చేరుకుందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32,50,429 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,82,542గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.99% ఉన్నాయి. రికవరీ రేటు 77.30% పెరగ్గా, మరణాల రేటు 1.70%కి పడిపోయింది. యాంటీబాడీలు ఉన్నా కరోనా.. శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కోవిడ్ సోకే ముప్పు తగ్గుతుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని మీద ఉన్నవన్నీ ఊహాగానాలేనని, ఆధారసహిత ప్రయోగాలు లేవని అంటున్నారు. కరోనా సోకి కోలుకున్న వారు తిరిగి కరోనా బారిన పడటం పట్ల ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోలజీ నిపుణులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. యాంటీబాడీలు కరోనాను పూర్తిస్థాయిలో నిరోధించడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు, ప్రస్తుతమున్న కేసుల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయని అన్నారు. శరీరంలో ఉన్న యాంటీబాడీల స్థాయిని తెలుసుకోకుండా కేవలం పాజిటివ్ లేదా నెగెటివ్ అని చెప్పడం వల్ల పూర్తి వివరాలు తెలియడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తాం.. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు తాము సాయం అందిస్తామని యూనిసెఫ్ ప్రకటించింది. ఇప్పటికే మీజిల్స్, పోలియో వంటి వ్యాధులకు ఏటా 2 బిలియన్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పింది. కరోనా టీకా వచ్చాక దాదాపు 100 దేశాలకు సాయం అందిస్తామని చెప్పింది. దీని కోసం అమెరికావ్యాప్త ఆరోగ్య సంస్థ (పహో)తో కలసి కోవాక్స్ టీకా కోసం ఎందురు చూస్తున్నట్లు చెప్పింది. మలైకా అరోరాకు కోవిడ్ పాజిటివ్ బాలీవుడ్ నటి, వీడియో జాకీ, మోడల్ కూడా అయిన మలైకా అరోరా(46)కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో, కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి, వైద్యుల సలహా మేరకు తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు ఆమె సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. -
హరికృష్ణకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: బీల్ చెస్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ర్యాపిడ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ రెండో స్థానాన్ని సంపాదించాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ ఐదు పాయింట్లు స్కోరు చేశాడు. ఆరు పాయింట్లతో వొజ్తాసెక్ (పోలాండ్) విజేతగా నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో హరికృష్ణ మూడు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. నేటి నుంచి క్లాసికల్ విభాగంలో మరో టోర్నీ మొదలుకానుంది. -
ఆసియా అపర కుబేరుడు జాక్ మా!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మార్కెట్ పతనంలో ఆయన సంపద విలువ 5.8 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోవడం ఇందుకు కారణం. దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు మళ్లీ నంబర్‌వన్ స్థానంలో నిల్చారు. అంబానీ కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 2018 మధ్యలో జాక్ మా ఆసియాలో నంబర్ 1 హోదాను కోల్పోయారు. అపర కుబేరుల సంపద లెక్కించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది. ‘చమురు’ వదులుతోంది... ముడి చమురు రేట్లు భారీగా పతనమైన నేపథ్యంలో రిలయన్స్ నిర్దేశించుకున్నట్లుగా 2021 నాటికి రుణరహిత సంస్థగా మారే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీకి రిలయన్స్ చమురు, పెట్రోకెమికల్స్ విభాగంలో వాటాల విక్రయ డీల్ సజావుగా జరగడంపైనే ఇదంతా ఆధారపడనుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మరోవైపు, కరోనా వైరస్ దెబ్బతో జాక్ మా ఆలీబాబా వ్యాపారం కాస్త దెబ్బతిన్నా.. ఆ గ్రూప్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ యాప్స్‌కి డిమాండ్ పెరగడంతో పెద్దగా ప్రతికూల ప్రభావం పడలేదు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. సోమవారం స్టాక్ మార్కెట్ పతనంలో రిలయన్స్ షేర్లు ఏకంగా 12 శాతం పడిపోయాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. -
మళ్లీ డెంగీ కాటు!
సాక్షి, హైదరాబాద్: గతేడాది వర్షాకాలంలో రాష్ట్రాన్ని గడగడలాడించిన డెంగీ... సీజన్ దాటినా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం డెంగీతో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు అంటే 20 రోజుల్లో రాష్ట్రంలో 180 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వర్షాకాలంలో డెంగీ జ్వరాలు, వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. సీజన్ దాటాక కూడా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయంటే డెంగీకి కారణమయ్యే దోమ ఇంకా అక్కడక్కడా ఉండటం వల్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం డెంగీ నివారణ చర్యలను దాదాపు నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ కేసులు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లోనే 30 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులు, మాస్కులు సిద్ధంగా ఉంచారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటి నొప్పులు, ఊపిరి తీసుకోలేకపోవడం, ఛాతీలో మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతేడాది 13,417 కేసులు ఎన్నడూ లేనంతగా గతేడాది డెంగీతో జనం విలవిలలాడిపోయారు. డెంగీతో అనేక మంది చనిపోయినా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం మరణాల సంఖ్యను తక్కువగా చూపించినట్లు విమర్శలు వచ్చాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు తెలంగాణలో 13,417 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అందులో కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 10 వేల కేసుల వరకు నమోదైనట్లు అంచనా వేశారు. డెంగీ కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40 నుంచి 50 శాతం వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. గతేడాది వర్షాకాల సీజన్లో అధిక వర్షాలు కురవడం వల్లే అధికంగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 20 నుంచి 25 రోజులు, అక్టోబర్‌లో 25 రోజులకుపైగా వర్షాలు కురవడం వల్లే డెంగీ దోమల వ్యాప్తి పెరిగింది. -
సౌరవిద్యుత్ ఉత్పాదనలో భేష్
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం అభినందనీయమని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా మరిన్ని పరిశ్రమలను ఆకర్షిస్తోందన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) ఏర్పాటు చేసిన రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాల కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా ఆదా చేయడంలోనూ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావడం హర్షణీయమన్నారు. విద్యుత్ పొదుపుతో పాటు నీటి పొదుపును కూడా ప్రజలు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా కార్యాలయ సముదాయాల్లో ఎయిర్ కండిషనర్ వినియోగాన్ని తగ్గించేందుకు విరివిగా మొక్కలను పెంచాలని సూచించారు. ఇంధన ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు భాగస్వామ్యులవ్వాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చెట్లను తొలగించినా అంతే స్థాయిలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రజలకు అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణే అని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యుత్ ఆదాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని చెప్పారు. రైతులకు త్రీ ఫేజ్ విద్యుత్‌ను 24/7 రైతులకు అందిస్తున్నట్టు టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యుత్ ఆదా, ఉత్పాదనకు సమానమన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ఇంధన విని యోగాన్ని తగ్గించిన వారికి పురస్కారాలను గవర్నర్ అందజేశారు. మొత్తం 130 దరఖాస్తులు రాగా 8 కేటగిరీల్లో వారిని గుర్తించి ఈ అవార్డులను ప్రదానం చేశారు. -
మెట్రో వాటర్.. సూపర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌కు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు అత్యంత స్వచ్ఛమైనదని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) పరీక్షల్లో తేలింది. దేశంలోని 15 నగరాల నుంచి పది చొప్పున నీటి నమూనాలు తీసుకొని పరీక్షించింది. పదికి పది బాగుండడంతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఒక్క నమూనా మాత్రమే ఫెయిలైన హైదరాబాద్, భువనేశ్వర్ రెండో స్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం పదో స్థానానికి పరిమితమైంది. 2012లో బీఐఎస్ నోటిఫై చేసిన తాగునీటి ప్రమాణాల ప్రకారం 28 పారామీటర్లుగా తీసుకొని నమూనా పరీక్షలు చేశారు. చాలా వరకు ఫెయిలైన శాంపిల్స్‌లో ఎక్కువగా నీటిలో కరిగిన ఘన పదార్థాలు, మలినాలు, నీటి కాఠిన్యత, లవణీయత, లోహలు, నీటి నాణ్యతకు సంబంధించిన పారామీటర్లు ఉన్నాయి. నిలువ చేసి.. శుద్ధి చేసి కోటికిపైగా జనాభా ఉన్న నగరానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు జలమండలి ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. 9,80,000 నల్లా కలెక్షన్ల ద్వారా ప్రతిరోజూ 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. కృష్ణా, గోదావరితో పాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నీటిని శుద్ధి చేసి నగరవాసులకు కుళాయిల ద్వారా అందిస్తోంది. ఏ కాలంలోనైనా నగరవాసులకు తాగునీటి తిప్పలు ఉండకూడదన్న ఉద్దేశంతో 500కు పైగా రిజర్వాయర్లలో మంచి నీటిని నిలువ చేస్తోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చిన నీటిని ఈ రిజర్వాయర్లలో నిలువ చేసి బ్లాస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు. దీనిద్వారా నీటిలో ఉన్న హానికారక బ్యాక్టీరియ నశించి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు చేరుతోంది. ఇప్పటికే కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న జలమండలికి ఐఎస్వో ధ్రువీకరణ పత్రం అందింది. తాజాగా బీఎస్ఐ నమూనా పరీక్షల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం దక్కడంతో జలమండలి ఎండీ దానకిశోర్ హర్షం వ్యక్తం చేశారు. -
న్యుమోనియానూ ఎదుర్కోలేకపోతున్నాం
ఐక్యరాజ్యసమితి: అదేమి అరికట్టలేని భయంకరమైన వ్యాధి కాదు. చికిత్స లేని ప్రాణాంతకమైన జబ్బు కూడా కాదు. కానీ భారత్ మాత్రం ఆ వ్యాధిని నియంత్రించడంలో చతికిలపడిపోతోంది. అదే న్యుమోనియా. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో వచ్చే ఈ వ్యాధి సోకి ఐదేళ్లలోపు వయసు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా ప్రతీ 39 సెకండ్లకు ఒక చిన్నారి ఉసురు తీస్తున్నట్టు యూఎన్ అధ్యయనంలో వెల్లడైంది. 2018లో న్యుమోనియా వ్యాధి సోకి ఎందరు చిన్నారులు బలయ్యారో యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను సేకరించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు చిన్నారులు అత్యధికంగా న్యుమోనియో సోకి మరణిస్తున్నారు. ఆ దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన పుట్టిస్తోంది. 2018లో ప్రపంచ దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 8 లక్షల మందికి పైగా న్యూమోనియా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. మొదటి నెలలోనే ప్రాణాలు కోల్పోయిన పసివారు లక్షా 53 వేలుగా ఉంది. పేదరికమే కారణం అసలు న్యుమోనియా అన్న వ్యాధి ఉందన్న సంగతి కూడా ఎన్నో దేశాలు మర్చిపోయిన వేళ హఠాత్తుగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరగడంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయిదేళ్ల కంటే తక్కువ వయసున్న వారి మృతుల్లో 15 శాతం న్యుమోనియా కారణంగా నమోదవుతున్నాయని చెప్పింది. పేదరికానికి, ఈ వ్యాధికి గల సంబంధాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలుగా యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. న్యుమోనియా మరణాల్లో ఆ దేశాలే టాప్ న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే నమోదవుతున్నాయి. నైజీరి యా, భారత్, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా దేశాలే దీనికి బాధ్యత వహించాలని యూఎన్ వెల్లడించింది గత ఏడాది మృతుల సంఖ్య నైజీరియా 1,62,000 భారత్ 1,27,000 పాకిస్తాన్ 58,000 డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 40,000 ఇథియోపియా 32,000