రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం
రైతు సమస్యలపై పోరాడేందుకు కమిటీ: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, వారిని ఆదుకోవడానికి బడ్జెట్ ద్వారా చర్యలేమీ తీసుకోలేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫె సర్ ఎం.కోదండరాం విమర్శించారు. తెలంగాణ రైతు జేఏసీ హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ... ‘కొత్త రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏడాది మొత్తం కష్టపడినా ఆదాయం సరిపోక, అప్పులు పెరిగిపోయి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నారు.
వ్యవసాయం, అనుంబంధ రంగాలకు ఈ బడ్జెట్‌లోనూ ఎలాంటి ప్రగతీ లేదు. పంట ధరల విషయంలో చర్యలూ లేవు. వృత్తిదారులకు బడ్జెట్‌లో కేటాయింపులన్నీ ఆచరణలో కనపించాలి. గొర్రెలను ఇస్తున్నారు. వాటికి వైద్య శాలలను ఏర్పాటుచేయాలి. మత్స్యకా రులకు బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు. రైతులకు లాభసాటి ధర లభించడానికి కర్ణాటక తరహాలో ప్రత్యేక నిధి ఏర్పాటుచేయాలి. రుణమాఫీ విషయంలో రైతులపై పడిన భారాన్ని ప్రభు త్వమే భరించాలి. రైతు సమస్యలపై పోరాటాల కోసం 24 మందితో కమిటీని వేస్తున్నాం’ అన్నారు. రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు మాట్లాడుతూ... రైతులకు నీళ్లు లేకుండా కరెంటు ఇస్తే ఉపయోగం ఏమిటన్నారు. తెలంగాణ రైతుసంఘం అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, వివిధ సంఘాల నేతలు గురజాల రవీందర్‌రావు, జి.వి.రామాంజనేయుల పాల్గొన్నారు.