ప్రపంచ టాప్ కాఫీల జాబితాలో రెండో స్థానం
టేస్ట్ అట్లాస్ నివేదికలో వెల్లడి
ఫిల్టర్ కాఫీ ఆ పేరు వింటేనే.. ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే వేడివేడిగా.. ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ తాగితే.. కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఉదయించే సూర్యుడితో పాటే.. ఒక కప్పు ఫిల్టర్ కాఫీ గొంతులో పడితే మనకు మరో కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడలేని హుషారు కలిగిస్తుంది.
కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్ కాఫీనే. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఎంతో పేరొందిన ఈ ఫిల్టర్ కాఫీ ప్రపంచంలోనే ‘ది బెస్ట్’గా నిలిచింది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫాం ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ప్రపంచ టాప్ కాఫీల జాబితాలో మన ‘ఫిల్టర్ కాఫీ’ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్‌్క
భారత్‌లోకి ఎలా వచ్చిందంటే..?
దీని మూలం ఆఫ్రికా. అక్కడి నుంచి ‘యెమెన్‌కు’ తీసుకువచ్చి పెంచడం మొదలుపెట్టారు. విత్తనాలు అమ్మడం, వేరే దేశాలకు ఇవ్వడం అక్కడ నిషిద్ధం. మక్కా వెళ్లిన సూఫీ సెయింట్ బాబా అక్కడి నుంచి రహస్యంగా ఏడు కాఫీ గింజలను తీసుకొచ్చి కర్ణాటకలోని చిక్‌మగలూర్ కొండల్లో నాటినట్లు చరిత్ర చెబుతోంది.
అలాగే ‘టీ’కి ప్రత్యామ్నాయంగా బ్రిటీష్ వాళ్లు కాఫీ అమ్మకాలను, పంటను ప్రోత్సహించారని.. దీంతో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొంటున్నారు.
టాప్–10 జాబితాలో ఉన్న వివిధ దేశాల కాఫీలు
1. క్యూబన్ ఎ్రస్పెస్సో (క్యూబా)
2. ఫిల్టర్ కాఫీ (భారత్)
3. ఎ్రస్పెస్సో ఫ్రెడ్డో (గ్రీస్)
4. ఫ్రెడ్డో క్యాపుచినో (గ్రీస్)
5. క్యాపుచినో (ఇటలీ)
6. ఫ్రాప్పే కాఫీ (గ్రీస్)
7. రిస్ట్రోట్టో (ఇటలీ)
8. వియత్నమీస్ ఐస్డ్ కాఫీ (వియత్నాం)
9. ఎస్ప్రెస్సో (ఇటలీ)
10. టర్కిష్ కాఫీ ( టర్కీ)
ప్రయోజనాలు
ఫిల్టర్ కాఫీని మితంగా తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక వెల్లడించింది. అలాగే మూడ్ బూస్టర్‌గా మారి.. ఏకాగ్రత, చురుకుదనం, మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.
టైప్–2 డయాబెటిస్ రిస్‌్కను తగ్గిస్తుందని, కాలేయానికి రక్షణ కల్పిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. కెఫిన్ వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
అధికమైతే అనర్థమే!
ఏదైనా అతిగా చేస్తే అనర్థమే. కొందరు రోజుకు ఆరేడుసార్లు ఫిల్టర్ కాఫీ తాగేస్తుంటారు. ఇలా ఫిల్టర్ కాఫీ కూడా అతిగా తాగితే పలు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులోని కెఫిన్ రక్తపోటును, హార్ట్‌రేట్, యాంగ్జైటీని పెంచుతుందని.. నిద్ర సమస్యలను కలుగజేస్తుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు దీనికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. రోజుకు మూడు కప్పులకు మించి తాగొద్దని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment