369 రోజుల్లో30,049మొబైల్ ఫోన్లు..
సీఈఐఆర్ పోర్టల్ టెక్నాలజీ ద్వారా చోరీ, పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల జాడ
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్‌కు చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్ ఫోన్ల జాడను కనుగొన్నారు.
ఈ మేరకు సీఐడీ ఇన్‌చార్జి అదనపు డీజీ మహేశ్‌భగవత్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిరు. గతేడాది ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో సీఈఐఆర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, మే 17న పూర్తిస్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు.
ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,869 మొబైల్ ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 మొబైల్ ఫోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,919 మొబైల్ ఫోన్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment