రికవరీ ఆదేశాలపై సర్కారు తీరును నిరసిస్తూ కేటీఆర్ పోస్ట్.. రంగంలోకి అధికారులు
మల్లమ్మ నుంచి పెన్షన్ వివరాలు సేకరించిన సెర్ప్ సిబ్బంది
చుంచుపల్లి/సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు వచ్చే పెన్షన్ తీసుకుంటూ.. ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా డబుల్ పెన్షన్లు పొందుతున్న సుమారు 200 మందిని సెర్ప్ సిబ్బంది గుర్తించి నోటీసులు అందజేశారు. చుంచుపల్లి మండలం బాబూ క్యాంపునకు చెందిన దాసరి మల్లమ్మ.. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో వచ్చే ప్రభుత్వ పెన్షన్‌తో పాటు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది.. అనే సామెతను ఉదహరిస్తూ.. ‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ప్రస్తుత సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి లాక్కునే వింత చేష్టలు మొదలుపెట్టింది’అని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి పంపాలని ప్రభుత్వం నోటీసులు జారీచేస్తోందని, దాసరి మల్లమ్మకు ఆసరా కింద వచి్చన రూ.1.72 లక్షలు కూడా తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి నోటీసులు జారీ చేసి, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెన్షన్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ పోస్ట్ నేపథ్యంలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీఆర్‌డీఓ ఎం.విద్యాచందన సూచనల మేరకు సెర్ప్ సిబ్బంది మల్లమ్మ ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె పొందుతున్న పెన్షన్ వివరాలు సేకరించారు. ఈ విషయమై డీఆర్‌డీఓ విద్యాచందనను సంప్రదించగా.. ఆమె రెండు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించామని, రికవరీపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు.
‘డబుల్’వల్లనే మల్లమ్మ పింఛన్ నిలిపివేత
కేటీఆర్ పోస్ట్‌ను తప్పుపట్టిన సర్కార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పెన్షన్ కింద ఇచి్చన డబ్బులపై ప్రభుత్వం రికవరీ నోటీసు ఇచి్చందని.. ఇది అమానవీయమైన చర్య అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేయడాన్ని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తప్పు పట్టింది. ఈ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని ప్రకటించింది.
దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్‌ఎంగా పని చేసేవారని, 2010లో రాజేశ్వరి మరణించగా ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా మల్లమ్మకు రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ కింద ప్రతి నెలా చెల్లిస్తున్నామని, మరోవైపు ఆపన్నులకు ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ప్రతినెలా ఆమెకు అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment