
సీఈఐఆర్ పోర్టల్‌తో ఇప్పటివరకు 70,058 మొబైల్ ఫోన్ల స్వాధీనం
వెల్లడించిన సీఐడీ డీజీ శిఖాగోయల్
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు రెండో స్థానంలో నిలిచినట్టు సీఐడీ డీజీ శిఖాగోయల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజుకు సరాసరిన 98.67 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను వినియోగించి మొబైల్‌ఫోన్ల జాడ కనిపెడుతున్నట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. మొబైల్ ఫోన్ల రికవరీలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (10,861 మొబైల్ ఫోన్లు), సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (9,259), రాచకొండ పోలీస్ కమిషనరేట్ (7,488) తొలిమూడు స్థానాల్లో నిలిచినట్టు పేర్కొన్నారు.
మొబైల్‌ఫోన్ చోరీకి గురైతే www.tspolice.gov.in లో లేదా www.ceir.gov. in లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ బి.గంగారాం ఇతర అధికారులను శిఖాగోయల్ అభినందించారు.