
సాక్షి, హైదరాబాద్: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో దేశవ్యాప్తంగా తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు 10,018 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సాంకేతికతతో గుర్తించి, వాటిని తిరిగి యజమానులకు అందజేసినట్టు పేర్కొన్నారు.
ఈ సీఈఐఆర్ టెక్నాలజీ వాడటంతో 39 శాతం మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని, మరో 86,395 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్న సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ డాక్టర్ లావణ్య, ఇతర అధికారులను డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు.