Professor M. kodandaram
-
రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం
రైతు సమస్యలపై పోరాడేందుకు కమిటీ: కోదండరాం సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని, వారిని ఆదుకోవడానికి బడ్జెట్ ద్వారా చర్యలేమీ తీసుకోలేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫె సర్ ఎం.కోదండరాం విమర్శించారు. తెలంగాణ రైతు జేఏసీ హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ... ‘కొత్త రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏడాది మొత్తం కష్టపడినా ఆదాయం సరిపోక, అప్పులు పెరిగిపోయి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నారు. వ్యవసాయం, అనుంబంధ రంగాలకు ఈ బడ్జెట్లోనూ ఎలాంటి ప్రగతీ లేదు. పంట ధరల విషయంలో చర్యలూ లేవు. వృత్తిదారులకు బడ్జెట్లో కేటాయింపులన్నీ ఆచరణలో కనపించాలి. గొర్రెలను ఇస్తున్నారు. వాటికి వైద్య శాలలను ఏర్పాటుచేయాలి. మత్స్యకా రులకు బడ్జెట్లో కేటాయింపుల్లేవు. రైతులకు లాభసాటి ధర లభించడానికి కర్ణాటక తరహాలో ప్రత్యేక నిధి ఏర్పాటుచేయాలి. రుణమాఫీ విషయంలో రైతులపై పడిన భారాన్ని ప్రభు త్వమే భరించాలి. రైతు సమస్యలపై పోరాటాల కోసం 24 మందితో కమిటీని వేస్తున్నాం’ అన్నారు. రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు మాట్లాడుతూ... రైతులకు నీళ్లు లేకుండా కరెంటు ఇస్తే ఉపయోగం ఏమిటన్నారు. తెలంగాణ రైతుసంఘం అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, వివిధ సంఘాల నేతలు గురజాల రవీందర్రావు, జి.వి.రామాంజనేయుల పాల్గొన్నారు. -
కోదండరాం తీవ్ర ఆరోపణలు!
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామసభలు నిర్వహించకుండా భూ సేకరణ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గొర్రెల మందపై తోడేళ్లు పడినట్టు అధికారులు గ్రామాలపై పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను ముంచేందుకా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను ఒప్పించి, మెప్పించి భూ సేకరణ చేపట్టాలే గానీ దౌర్జన్యంగా చేయడం తగదన్నారు. సోమవారం మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో జరిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కేంద్రం 2013లో తెచ్చిన భూ సేకరణ కోసం చట్టం కాకుండా జీవోలతో భూ సేకరణ చేయటమేమిటని ప్రశ్నించారు. తరతరాలుగా నేల తల్లిని నమ్ముకున్న రైతులను ఇబ్బందులపాలు చేయడం తగదన్నారు. ‘‘మేం ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదు. ఆ పేరుతో జరుగుతున్న జనజీవన విధ్వంసాన్నే వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణకు గోదావరి, కృష్ణమ్మ నీళ్లు రావాల్సిందే. కానీ అందుకోసం ప్రజలను నిర్వాసితులను చేయడం భావ్యం కాదు’’ అన్నారు. ఒకేచోట ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదని మల్లన్నసాగర్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజా ఉద్యమంలో జేఏసీ పాల్గొంటుందని, మేధావులు, విద్యావంతులు బాధితుల వెంట ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే పర్యావరణవేత్త మేధాపాట్కర్ను కూడా ఇక్కడికి తీసుకొస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ఎకరా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5 లక్షలు ఇస్తామనడం అన్యాయమన్నారు. రిజర్వాయర్ల పేరుతో గ్రామాలను ధ్వంసం చేస్తున్నారని విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురుజాల రవీందర్ ఆరోపించారు. సారూ.. మీరే ఆదుకోవాలి ‘మల్లన్న సాగర్’ బాధితుల వేడుకోలు ‘‘సారూ.. మీరే మమ్మల్ని ఆదుకోవాలి.. రిజర్వాయర్ పేరుతో బలవంతంగా భూము లు లాక్కుంటుండ్రు.. మా బతుకులు ఆగమవుతున్నయి. నాటి తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా ఉన్న మీరే మమ్ముల ఈ ముంపు నుంచి కాపాడాలె’’ అంటూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితులు కోదండరాంకు తమ గోడు వెల్లబోసుకున్నారు. ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్, వేములగాట్లలో సోమవారం ఆయన పర్యటించారు. గ్రామాల్లోకి వెళ్తూనే మహిళలంతా ఆయన దగ్గరకు చేరి, తమ భూములను అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారంటూ బోరున విలపిం చారు. ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోవాలన్నారు. అధైర్యపడొద్దని, తామంతా వెంట ఉన్నామని కోదండరాం వారిలో ధైర్యం నింపారు. వారికి న్యాయం జరిగేదా కా అండగా ఉండి పోరాడుతానని చెప్పారు. -
రైతులపై ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమ
♦ వ్యయానికీ, ఎంఎస్పీకీ పొంతన ఉండటం లేదు ♦ అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ♦ హైకోర్టుకు నివేదించిన కోదండరాం, జలపతిరావు ♦ తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలని పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో తమనూ ప్రతివాదులుగా చేర్చుకుని తమ వాదనలూ వినాలంటూ తెలంగాణ విద్యార్థి వేదిక గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, తెలంగాణ రైతు జేఏసీ ప్రతినిధి ఎల్.జలపతిరావు సంయుక్తంగా మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపుతున్నాయని, రైతుల పట్ల ఒక రకంగా, పారిశ్రామిక వేత్తల పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నాయని వారు అందులో పేర్కొన్నారు. సాగు వ్యయానికీ, ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కూ ఏ మాత్రం పొంతన ఉండటం లేదని, పెట్టిన ఖర్చులు కూడా దక్కక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మద్దతు ధర లభించక రైతులు విధి లేక తమ పంటను దళారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. అసలు ఎంఎస్పీ ఖరారు ప్రక్రియనే అశాస్త్రీయంగా ఉంటోందని, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రపంచీకరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ రైతుల కమిషన్ 2006లో చేసిన సిఫారసులను ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. ఎంఎస్పీ ఖరారు సమయంలో ఎంఎస్పీకి సాగువ్యయాన్ని 50 శాతం అదనంగా చేర్చాలన్న సిఫారసును పట్టించుకునే నాథుడు లేరని వివరించారు. రైతులకు నిర్ధిష్టంగా వార్షిక ఆదాయం అంటూ ఉండదని, వార్షికాదాయం పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని కోదండరాం, జలపతిరావు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఒకవైపు పెరిగిన ఖర్చులు, మరోవైపు అధిక వడ్డీలకు తెచ్చిన రుణాల మధ్య రైతులు నలిగిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారన్నారు. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించే ప్రభుత్వాలు, రైతులకు మాత్రం కోతలను అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాల నుంచి మద్దతు లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు, అధిక వడ్డీలు ఇలా అనేక అంశాలు అన్నదాతను ఊపిరి సలపకుండా చేస్తున్నాయన్నారు. ఆర్థిక సంస్థలు సైతం హైటెక్ వ్యవసాయ వ్యాపారులకు, బయోటెక్నాలజీ కంపెనీలకు ఇస్తున్న స్థాయిలో రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. 1986-1990ల్లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 14.5 శాతం ఉంటే ఇప్పుడది 6 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలుతో సాగు భూముల వృద్ధి రేటు 2.62 శాతం నుంచి 0.5 శాతానికి పడిపోయిందని వారు వివరించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించనున్నారు.