కోదండరాం తీవ్ర ఆరోపణలు! | professor kodandaram fired on trs government | Sakshi
Sakshi News home page

కోదండరాం తీవ్ర ఆరోపణలు!

Published Tue, Jun 7 2016 7:12 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

కోదండరాం తీవ్ర ఆరోపణలు!

కోదండరాం తీవ్ర ఆరోపణలు!

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న
తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామసభలు నిర్వహించకుండా భూ సేకరణ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గొర్రెల మందపై తోడేళ్లు పడినట్టు అధికారులు గ్రామాలపై పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం దారుణమన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను ముంచేందుకా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను ఒప్పించి, మెప్పించి భూ సేకరణ చేపట్టాలే గానీ దౌర్జన్యంగా చేయడం తగదన్నారు.

సోమవారం మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో జరిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కేంద్రం 2013లో తెచ్చిన భూ సేకరణ కోసం చట్టం కాకుండా జీవోలతో భూ సేకరణ చేయటమేమిటని ప్రశ్నించారు. తరతరాలుగా నేల తల్లిని నమ్ముకున్న రైతులను ఇబ్బందులపాలు చేయడం తగదన్నారు. ‘‘మేం ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదు. ఆ పేరుతో జరుగుతున్న జనజీవన విధ్వంసాన్నే వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణకు గోదావరి, కృష్ణమ్మ నీళ్లు రావాల్సిందే. కానీ అందుకోసం ప్రజలను నిర్వాసితులను చేయడం భావ్యం కాదు’’ అన్నారు.

ఒకేచోట ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదని మల్లన్నసాగర్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజా ఉద్యమంలో జేఏసీ పాల్గొంటుందని, మేధావులు, విద్యావంతులు బాధితుల వెంట ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే పర్యావరణవేత్త మేధాపాట్కర్‌ను కూడా ఇక్కడికి తీసుకొస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ఎకరా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5 లక్షలు ఇస్తామనడం అన్యాయమన్నారు. రిజర్వాయర్ల పేరుతో గ్రామాలను ధ్వంసం చేస్తున్నారని విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురుజాల రవీందర్ ఆరోపించారు.

సారూ.. మీరే ఆదుకోవాలి ‘మల్లన్న సాగర్’ బాధితుల వేడుకోలు
‘‘సారూ.. మీరే మమ్మల్ని ఆదుకోవాలి.. రిజర్వాయర్ పేరుతో బలవంతంగా భూము లు లాక్కుంటుండ్రు.. మా బతుకులు ఆగమవుతున్నయి. నాటి తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా ఉన్న మీరే మమ్ముల ఈ ముంపు నుంచి కాపాడాలె’’ అంటూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితులు కోదండరాంకు తమ గోడు వెల్లబోసుకున్నారు. ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్, వేములగాట్‌లలో సోమవారం ఆయన పర్యటించారు. గ్రామాల్లోకి వెళ్తూనే మహిళలంతా ఆయన దగ్గరకు చేరి, తమ భూములను అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారంటూ బోరున విలపిం చారు. ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోవాలన్నారు. అధైర్యపడొద్దని, తామంతా వెంట ఉన్నామని కోదండరాం వారిలో ధైర్యం నింపారు. వారికి న్యాయం జరిగేదా కా అండగా ఉండి పోరాడుతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement