జస్టిస్ కక్రూపై విచారణ జరపండి
జస్టిస్ కక్రూపై విచారణ జరపండి
Published Wed, Sep 17 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ మీద వచ్చిన ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. ఈ వ్యవహారంపై డీజీపీ లేదా నిఘా విభాగం అధిపతి వెంటనే విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేశారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ మీద వచ్చిన ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. ఈ వ్యవహారంపై డీజీపీ లేదా నిఘా విభాగం అధిపతి వెంటనే విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేశారు. వివరాలు.. జస్టిస్ కక్రూ అనధికారింగా విధులకు గైర్హాజరు అవుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. వీటిపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది కె.అజయ్‌కుమార్ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. జస్టిస్ కక్రూ నెలలో ఎక్కువ కాలం హైదరాబాద్‌లో ఉండడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకు అనుకూలంగా జస్టిస్ కక్రూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుకు న్యాయశాస్త్రం (ఎల్‌ఎల్‌బీ) డిగ్రీ ఉన్న వారే అర్హులని, ఎల్‌ఎల్‌బీతో అన్ని అర్హతలు ఉన్న నలుగురు ఉద్యోగులు ఉన్నా.. ఎల్‌ఎల్‌బీ అర్హత లేని ఓ ఉద్యోగికి అక్రమ పద్ధతుల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి ఇచ్చి ఇతరులకు అన్యాయం చేశారని తెలిపారు. మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిగా ఉన్న జిల్లా జడ్జి సుబ్రమణ్యం కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని, జస్టిస్ కక్రూ ఉన్నప్పుడు మినహా ఆయన విధులకు హాజరుకావడం లేదన్నారు. గతంలో కమిషన్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి హక్కుల కమిషన్‌ను ప్రజలకు మరింత చేరువ చేశారని వివరించారు.
హక్కులపై అనేక సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారని, హక్కుల ఉల్లంఘనకు గురైన వారికి అండగా నిలబడి న్యాయం చేశారన్నారు. ప్రస్తుత చైర్మన్ జస్టిస్ కక్రూ మాత్రం అందుకు విరుద్దంగా పనిచేస్తున్నారని, కేవలం జీతం, ఇతర సౌకర్యాలను అనుభవించేందుకే ఈ పదవిలో కొనసాగుతున్నారని ఆ ఫిర్యాదులో వివరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న జస్టిస్ కక్రూ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు ఎంతమాత్రం అర్హుడు కాడని, ఆయనపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని న్యాయశాఖకు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయశాఖ డెరైక్టర్ వైఎం.పాండే.. ఈ ఫిర్యాదును కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన హోంశాఖ కార్యదర్శి ఎన్‌ఆర్.సింగ్.. దీనిపై విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
Advertisement