Rajeev Sharma
-
దేశ రక్షణ సమాచారం చైనాకు?
న్యూఢిల్లీ: దేశ సరిహద్దు వ్యూహం, సైన్యం మోహరింపులు, ఆయుధ సేకరణ వంటి కీలక సమాచారాన్ని చైనా గూఢచార విభాగాలకు అందజేశారన్న ఆరోపణలపై రాజీవ్‌శర్మ అనే జర్నలిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జర్నలిస్టుకు భారీగా లంచం ముట్టజెప్పారన్న ఆరోపణలపై చైనా మహిళ, నేపాల్‌కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు. ‘చైనా నిఘా సంస్థలకు దేశ సమాచారాన్ని చేరవేసినందుకు ఢిల్లీలోని పిటంపురకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్‌ను 14న స్పెషల్ సెల్ అరెస్ట్‌చేసింది. బోగస్ సంస్థల ద్వారా అందిన సొమ్మును రాజీవ్‌కు అందజేసినందుకు చైనా జాతీయురాలితోపాటు నేపాల్ వాసిని అరెస్ట్ చేశాం’ అని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్(స్పెషల్ సెల్) సంజీవ్æ తెలిపారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సున్నిత సమాచారమున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.‘రాజీవ్ 2016 నుంచి మైకేల్ అనే చైనా నిఘా విభాగం అధికారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. 2018 వరకు కీలక సమాచారాన్ని అతడికి చేరవేశాడు. 2019 నుంచి చైనాకే చెందిన జార్జి అనే మరో నిఘా అధికారికి శర్మ కీలక రక్షణ సమాచారాన్ని అందజేస్తూ వచ్చాడు. ఇందుకుగాను గత ఏడాదిన్నరలోనే రూ.45 లక్షల వరకు అందుకున్నాడు. సమాచారం అందజేసిన ప్రతిసారీ వెయ్యి డాలర్లు(సుమారు రూ.73 వేలు) ఇతడికి ముడుతుంటాయి’ అని ఆయన తెలిపారు. గతంలో వివిధ పత్రికల్లో పనిచేసి, భారత పత్రికలతోపాటు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాస్తున్నాడన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) గుర్తింపు కూడా ఉన్న ఇతడికి అనేక మంత్రిత్వ శాఖల్లోకి సులువుగా వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. ఈ–మెయిల్ ఐడీ, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా ఇతడు ఎలాంటి సమాచారాన్ని చైనాకు అందజేశాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. -
దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాల్సిన అవసరముందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని, ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతున్నా యని, ఈ పరిస్థితి పోవాల్సిన అవసరముందన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవర్ ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) సీఎండీ రాజీవ్‌శర్మ ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితిపై చర్చ జరిగింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర ప్రగతికి ఆనాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధంగా నిలి చింది. విద్యుత్ సమస్యను పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించాం. ఆరు నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తేశాం. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. తెలంగాణలో పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి పెరిగింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది. లో వోల్టేజీ లేకుండా ఉండేందుకు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండేందుకు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచాం. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుకోవడానికి అనుగుణమైన వ్యవస్థ సిద్ధమైంది’’అని ముఖ్యమంత్రి వివరించారు. పీఎఫ్సీ సహకారం ఎంతో ఉపయోగపడింది.. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర విద్యుత్ సంబంధ వ్యవస్థలను తీర్చిదిద్దడానికి పీఎఫ్సీ అందించిన ఆర్థిక సహకారం ఎంతో దోహదపడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్‌శర్మకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకొని మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేయడానికి పీఎఫ్సీ అందించిన సహకారం ఎంతో దోహదపడిందన్నారు. రాజీవ్ శర్మ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి మొమెంటోలు అందించారు. పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ సత్కరిస్తున్న సీఎం కేసీర్, చిత్రంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పీఎఫ్సీకి గౌరవం, గర్వం: రాజీవ్ శర్మ తెలంగాణలో దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రికార్డు సమయంలో అటు పవర్ ప్లాంట్లు, ఇటు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ ప్రశంసించారు. పవర్ ప్లాంట్లయినా, నీటిపారుదల ప్రాజెక్టులయినా ఇంత తొందరగా పూర్తి కావడం తానెక్కడా చూడలేదన్నారు. అనుమతులు పొందడం, నిధులను సమీకరించడం, భూసేకరణ, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాల వంటి ప్రక్రియల వల్ల ప్రాజెక్టుల నిర్మాణం సాధారణంగా ఆలస్యం అవుతుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరు పాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ భాగస్వామి కావడం తమకెంతో గౌరవంగా, గర్వంగా ఉందని రాజీవ్‌శర్మ అన్నారు. ‘‘మూడున్నరేళ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ మాకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో స్క్రీన్‌పై చూపించారు. అది విన్న నేను ఆశ్చర్యపోయా. ఇది సాధ్యమేనా అనుకున్నా. కానీ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను కళ్లారా చూశా. గోదావరి నీటిని పంపింగ్ చేసే విధానం నిజంగా అద్భుతం. మూడున్నరేళ్ల కింద కేసీఆర్ నాకు ఏం చెప్పారో, అది కళ్ల ముందు కనిపించింది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలిక కాదు. కేసీఆర్ కృషి ఫలించింది. కల నెరవేరింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి యావత్ దేశం చెప్పుకుంటోంది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శిస్తున్నారు’’అని రాజీవ్‌శర్మ అభినందించారు. ట్రాన్స్‌కో సీఎండీపై ప్రశంసల వర్షం... రాష్ట్రంలో విద్యుత్ రంగం సాధించిన విజయాల వెనుక జెన్కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్, పీఎఫ్సీ సీఎండీ రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రభాకర్‌రావు తమకు ఆదర్శమని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో విద్యుత్ రంగం ఎంతో ప్రగతి సాధించిందని రాజీవ్‌శర్మ కొనియాడారు. పవర్ ప్లాంట్లు శరవేగంగా నిర్మితమవుతున్నాయని, ప్లాంట్లలో విద్యుదుత్పత్తి (పీఎల్ఎఫ్) పెరిగిందని, ఆయనపై పెట్టిన బాధ్యతను ప్రభాకర్‌రావు పూర్తిగా నెరవేర్చారని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో 50 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రభాకర్‌రావు విద్యుత్ రంగంలో భీష్మాచార్యుడు అని ఎస్.కె. జోషి కొనియాడారు. విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నారు. -
పవర్ పక్కా లోకల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టుబట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వచించాం. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. సహాయ మంత్రి హోదాగల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండటం సమంజసం కాదు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలదీ ఇదే కథ. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో పూర్తిగా భాగస్వాములు కావాలి. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తాం. గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? మండల పరిషత్‌లు ఏం చేయాలి? జిల్లా పరిషత్‌లు ఏం చేయాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాం. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తాం. ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తాం. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేశాకే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. విస్తృత చర్చలు, అధ్యయనం తర్వాత తుది రూపం.. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏయే అంశాల్లో వారి బాధ్యతలు ఎంతవరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగంలో పని చేసిన అనుభవంగల నాయకులు, అధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలని సూచించారు. ముసా యిదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ ఆమోదం అనంతరం అసెంబ్లీలోనూ విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసు కొని ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి... పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈవోపీఆర్డీ పోస్టులను ఇకపై మండల పంచాయతీ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీఓలు, సీఈవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. -
60 రోజుల ప్రణాళికతో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా త్వరలోనే అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పల్లెల సమగ్రాభివృద్ధితోపాటు పూర్తిస్థాయిలో పచ్చదనం, పరిశుభ్రతను సాధించేందుకు వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పడేందుకు వీలుగా నూతన పంచాయతీరాజ్ చట్టంలో నిర్దేశించిన వివిధ విషయాలపై మరింత స్పష్టతనిస్తూ మార్గదర్శకాలు జారీచేశారు. 60రోజుల కార్యాచరణ అమలులో భాగంగా పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం అమలుచేస్తున్న ఈ కార్యాచరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. గ్రామ వికాసం, పూర్తిస్థాయిలో అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమగ్రవిధానం తీసుకువస్తోందని ఆయన తెలిపారు. 60 రోజుల గ్రామ వికాసంలో పంచాయతీరాజ్ శాఖది చాలా క్రియాశీలకమైన పాత్రన్న ముఖ్యమంత్రి ఈ శాఖను సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్టు స్పష్టంచేశారు. దీని కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్న దానిపై రెండు మూడ్రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 60రోజుల తర్వాత ముఖ్య అధికారుల నేతృత్వంలోని 100 ఫ్లయింగ్ స్క్వాడ్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఆకస్మిక తనిఖీలు చేపడతాయన్నారు. ఏ గ్రామంలో అయితే 60రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు చేపట్టలేదో అక్కడ సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పీఆర్, పరిషత్ పోస్టులు భర్తీ పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల్లోని పోస్టులను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏమేమి పనులు చేయాలో స్పష్టంగా నిర్వచించుకుని ఎవరి విధులు వారే నిర్వహించాలన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీపీవోలు, ఈవోపీఆర్డీలు, సర్పంచ్ల సంఘం ప్రతినిధులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, పాలమూరు, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల డీపీవోలు, రిటైర్ట్ డీపీవో లింబగిరి స్వామి, ఈవోపీఆర్డీలు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన యాదవ్, ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు ప్రణీత్ చందర్, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి బాచిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిక్కచ్చిగా వ్యవహరిస్తాం ‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదు. వివిధ రూపాల్లో వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పడి ఉన్నాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను బాగుచేసుకునే పద్ధతి రావడం లేదు. ఈ పరిస్థితిలో గుణాత్మక మార్పు రావాలి. అందుకోసమే కొత్త పీఆర్ చట్టం తెచ్చాం. అధికారులు, ప్రజా ప్రతినిధులపై కచ్చితమైన బాధ్యతలు పెట్టాం. ఎవరేం పని చేయాలో నిర్దేశించాం. అవసరమైన అధికారాలిచ్చాం. కావాల్సిన నిధులను బడ్జెట్లోనే కేటాయించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చట్టం ప్రభుత్వానికి కల్పించింది. కొత్త చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. ఎవరినీ ఉపేక్షించదు. గుణాత్మక మార్పుకోసం ఏంచేయాలో అది చేస్తాం’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈవోపీఆర్డీ పేరు ఎంపీవోగా మార్పు ‘అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో)లను నియమించాలి. రెవెన్యూ డివిజన్ ఓ డీఎల్పీవోను, మండలానికో ఎంపీవోను నియమించాలి. ఖాళీగా ఉన్న ఎంపీడీవో, సీఈవో పోస్టులను భర్తీ చేయాలి. వీటిని భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులివ్వాలి. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలి. ప్రక్రియ అంతా చాలా వేగంగా జరగాలి’అని సీఎం ఆదేశించారు. ఈ కార్యాచరణలో చేపట్టాల్సిన పనులు.. గ్రామంలో పారిశుధ్య పనులను పక్కాగా నిర్వహించాలి. మురికి కాల్వలన్నీ శుభ్రం చేయాలి. గ్రామ పరిధిలోని పాఠశాల, పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్యం గ్రామ పంచాయతీల బాధ్యత. కూలిపోయిన ఇండ్లు, పాడైపోయిన పశువుల కొట్టాల శిథిలాలను పూర్తిగా తొలగించాలి. ఉపయోగించని, పాడుపడిన బావులను, నీటి బొందలను పూర్తిగా పూడ్చేయాలి. ఇందుకోసం ఉపాధిహామీ నిధులతో మొరం నింపాలి. గ్రామంలో ఎప్పటికప్పుడు దోమల మందు పిచికారి చేయాలి. వైకుంఠధామం (శ్మశాన వాటిక) నిర్మాణం కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. గ్రామ డంపింగ్ యార్డు కోసం స్థలం సేకరించాలి. విలేజ్ కమ్యూనిటీ హాల్, గోదాము నిర్మాణానికి స్థలాలు సేకరించాలి. గ్రామానికి కావాల్సిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. పంచాయతీలు నిర్వహించాల్సిన బాధ్యతలు గ్రామంలో 100% పన్నులు వసూలు చేయాలి. వారపు సంత (అంగడి)లో సౌకర్యాలు కల్పిం చాలి. వివాహ రిజిస్ట్రేషన్ నిర్వహించాలి. ఎవరు పెళ్లి చేసుకున్నా వెంటనే రికార్డు చేయాలి. జనన, మరణ రికార్డులు రాయాలి. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు, కులం వివరాలతో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి. విద్యుత్ సంస్థలకు తప్పకుండా బిల్లులు చెల్లించాలి. పంచాయతీ నిధు లతో ఉపాధి హామీ నిధులు అనుసంధానం అయ్యే విధానం రూపొందించాలి. ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలతో సంప్రదించి, సీఎస్ఆర్ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించే విధానం అవలంబించాలి. గ్రామస్తులను శ్రమదానానికి ప్రోత్సహించి, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి. ‘పవర్’వీక్ లో చేయాల్సిన పనులు 60 రోజుల కార్యాచరణలో భాగంగా 7రోజుల పాటు పూర్తిగా విద్యుత్ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలి. ఆ గ్రామంలో వీధిలైట్ల కోసం ఎంత కరెంటు వాడుతున్నారో కచ్చితమైన నిర్ధారణకు రావాలి. మీటర్లు పెట్టాలి. వీధిలైట్ల కోసం థర్డ్ లైను వేయాలి. విధిగా ఎల్ఈడీ బల్బులు అమర్చాలి. గ్రామంలో వంగిపోయిన స్తంభాలు, వేలాడే వైర్లు సరిచేయాలి. హరితహారంలో చేయాల్సిన పనులు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే విలేజ్ నర్సరీ ఏర్పాటు చేయాలి. మండల అటవీశాఖాధికారి సాంకేతిక సహకారం తీసుకోవాలి. ఉపాధిహామీ నిధులు వినియోగించాలి. గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలి. వాటికి నీళ్లు పోసి, రక్షించాలి. పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలి. గ్రామస్తులకు కావాల్సిన రకం మొక్కలను సరఫరా చేయాలి. చింతచెట్లను పెద్ద సంఖ్యలో పెంచాలి. -
తెలుగు రాష్ట్రాల సలహాదారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి రోడ్డు మ్యాప్ ఖరారవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. నిన్నటి ముఖ్యమంత్రుల భేటీ ఆధారంగా ఇరు రాష్ట్రాల అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా జూలై రెండో వారం తరువాత ఏపీలో మరోసారి రెండు రాష్ట్రాల సీఎంల భేటీ జరగనుంది. నెల రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఇరురాష్ట్రాల సీఎంల కార్యాచరణ ఉండే అవకాశం ఉంది. -
కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా రాజీవ్‌శర్మ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్‌శర్మకు రాష్ట్ర ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు చైర్మన్‌గా నియమించింది. ఇప్పటికే ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా వ్యవహారిస్తున్నారు. కాగా, సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం
-
సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమబాట పట్టిన హోంగార్డులు గురువారం సచివాలయ ముట్టడికి యత్నించారు. సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వచ్చిన హోంగార్డులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోంగార్డులను అడ్డుకున్నారు. -
నూతన కలెక్టరేట్ల పనులు పూర్తిచేయాలి
వీడియో కాన్పరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సంగారెడ్డి జోన్: కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు ఈ నెల 11న ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ప్రకటించిన 27 జిల్లాలకు తోడుగా ఇటీవల నిర్ణయించిన నాలుగు కొత్త జిల్లాలను కలుపుకోని మొత్తం 31 జిల్లాల తుది నోటిఫికేషన్ ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు జారీ చేస్తామన్నారు. 119 కొత్తమండలాలు, 20 కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా నోటిఫికే షన్ జారీ చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది నియామకానికి సంబంధించిన వర్క్ టూ ఆర్డర్ ఆదేశాలను ఆయా శాఖల అధిపతులు ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 గంటలకే విడుదల చేస్తారన్నారు. అ«ధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లేందుకు వీలుగా డ్రాఫ్ట్ ఆర్డర్ టూ సర్వ్ పత్రాలను ఈ నెల 10న తెలియజేస్తామన్నారు. ఒక్కో శాఖకు సంబంధించి అధికారులు సిబ్బందితో కూడిన వర్క్ టూ ఆర్డర్ తెలియజేసే 31 జీవోలను జారీ చేస్తామన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి కలెక్టరేట్లలో పని చేసే అధికారులు, సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారులు, డివిజన్ కార్యాలయ సిబ్బంది, మండల అధికారులు, మండల కార్యాలయాల సిబ్బంది నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపించాలన్నారు. 11వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం నిర్దేశించిన మంత్రులు, జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించాలన్నారు. కలెక్టర్లు తమకు కేటాయించిన కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించాలని, ప్రభుత్వం నిర్ధేశించిన రీతిలో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి, వైద్య ఆరోగ్య, జిల్లా కోశా«ధికారి వంటికార్యాలయాలను ప్రారంభించాలన్నారు. ప్రారంభ కార్యక్రమాలనీ కేవలం కొత్త జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రముఖులను , మీడియాను భాగస్వామ్యం చేసి పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ జిల్లాలో సిద్దిపేట, మెదక్‌లో కలెక్టరేట్లు, కార్యాలయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో కొత్తజిల్లాలో పాలనకు ఏర్పాట్లు చేసి ప్రజలకు సేవలందిస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ వెంకట్రాంరెడ్డి, ఏజేసీ వాసం వెంకటేశ్వర్లు, డీఆర్వో దయానంద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది దసరాకల్లా యాదాద్రి సిద్ధం
-
వచ్చే ఏడాది దసరాకల్లా యాదాద్రి సిద్ధం
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి దేవాలయాన్ని భక్తుల సందర్శనకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. మంత్రులు కె.తారక రామారావు, లకా్ష్మరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించే కాటేజీలకు సంబంధించి త్రీడీ వీడియో, ఫొటోలను సీఎం వీక్షించారు. ఆలయ కట్టడాల నమూనాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాజగోపురాలతోపాటు ప్రాకార మండపాలు పూర్తిస్థాయి శిలతో నిర్మించనున్నారని, పూర్తిస్థాయి కృష్ణశిలతో నిర్మితం కావడం ఆలయ విశేషమని ఆయన అన్నారు. 500 మంది నిష్ణాతులైన శిల్పులు పనుల్లో నిమగ్నమయ్యారని అధికారులు తెలపడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కాటేజీల నిర్మాణానికి ఓకే యాదాద్రిలో భక్తుల బస కోసం 250 ఎకరాల్లో నిర్మించ తలబెట్టిన కాటేజీల నమూనాలకు చిన్నచిన్న మార్పులతో సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని తదితర వీవీఐపీల బస కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కాటేజీలు, దైవ సన్నిధి నిర్మాణాల తీరును అభినందించారు. ఆగమ శాస్త్ర సూత్రాలతో తంజావూరు వంటి వేల ఏళ్ల కిందటి సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి దేవాలయం ప్రాణప్రతిష్ట పోయనుందని అన్నారు. నిర్మాణాల అనంతరం గుట్టపైన వెల్లివిరిసే పచ్చదనంవల్ల ఆలయాల పరిసరాల ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. 108 అడుగుల ఆంజనేయ విగ్రహానికి ఆమోదం యాదాద్రి దేవస్థానం క్షేత్ర పాలకుడిగా 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి పాలరాతి విగ్రహ నమూనాకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన రూపశిల్పులు ముందుకు వచ్చారు. ఈ మేరకు భారీ ఆంజనేయ విగ్రహ నిర్మాణానికి ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతితో తయారు చేసిన నమూనా ప్రతిమను వారికి అప్పగించి భారీ విగ్రహ రూపకల్పనకు నాంది పలుకనున్నారు. -
నిమజ్జనం సందర్భంగా నేడు సెలవు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గురువారంను సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా నవంబర్ 12వ తేదీన రెండో శనివారం పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వు జారీ చేశారు. -
రాజీవ్ శర్మ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి. కాగా ఈ నెల 31న రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీ వ్‌శర్మ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అసిస్టెంట్ కలెక్టర్‌గా సర్వీస్ ప్రారంభించారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి స్పెషల్ కమిషనర్‌గానూ రాజీవ్ శర్మ సేవలందించారు. -
మొక్కలు కాపాడే ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు సూక్ష్మ స్థాయి (మైక్రో లెవల్) ప్రణాళికలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వారం రోజుల్లోగా ఈ నివేదికలు అందించాలన్నారు. మొక్కల సంరక్షణ, నీటి వనరుల లభ్యత, బాధ్యులకు విధుల కేటాయింపు, అవసరమైన నిధులు తదితర అంశాలతో నివేదికలు తయారు చేయాలన్నారు. మంగళవారం సచివాలయం నుంచి హరితహారంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా హరితహారం లక్ష్యాలను సమీక్షించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి సదుపాయం: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొ న్న అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. అన్ని చోట్లా నాటిన మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి సదుపాయం కల్పించేం దుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఫారెస్ట్ డే సందర్భంగా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో డీగ్రేడ్ అయిన అటవీ ప్రాంతాలను గుర్తించి అధిక సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలో వర్షం తక్కువగా ఉన్నందున మొక్కలు నాటడం ఎక్కువగా జరగలేదని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, సోమేష్ కుమార్, రాజీవ్‌త్రివేది, అజయ్ మిశ్రా, అశోక్‌కుమార్, సునీల్‌శర్మ పాల్గొన్నారు. -
సూక్ష్మ ప్రణాళిక వెంటనే అందజేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ రాజీవ్ శర్మ సంగారెడ్డి జోన్: హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కల సంరక్షణకు సంబంధించిన సూక్ష్మ ప్రణాళికను త్వరగా అందజేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, వివిధ శాఖల ద్వారా నిర్దేశించుకున్న మేరకు లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలను సంరక్షించే విషయంలో సూక్ష్మ ప్రణాళిక అంటే మొక్కలను ఎవరు సంరక్షిస్తారు.. నీళ్లు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు.. తదితర వివరాలతో నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ జిల్లాలో మూడు కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 1.02 కోట్ల మొక్కలను నాటామన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ డోగ్రియల్, డ్వామా పీడీ సురేంద్రకరణ్, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి, నీటి పారుదల శాఖ ఎస్ఈ పద్మారావు, డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, శ్రీధర్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఖురేషి, వ్యవసాయ శాఖ జేడీ మాధవి శ్రీలత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సీఎస్ పదవీ కాలం పొడిగించండి
మరో 3 నెలల గడువు ఇవ్వండి.. డీవోపీటీకి రాష్ట్రం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు, కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ) బుధవారం ఈ ప్రతిపాదనలు పంపించారు. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌శర్మ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీఎస్‌గా కొనసాగుతున్నారు. సర్వీసు నిబంధనల ప్రకారం గత మే 31న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఇప్పటికే డీవోపీటీ ఆయన పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 31 వరకు సర్వీసులో కొనసాగే వెసులుబాటు ఇచ్చింది. కొత్త రాష్ట్రం కావటంతోపాటు ఐఏఎస్‌ల కొరత ఉన్నందున పరిపాలనా ఇబ్బందుల దృష్ట్యా అనుభవమున్న రాజీవ్‌శర్మను మరికొంత కాలం సీఎస్‌గా కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే ఆరు నెలల పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని గత ఫిబ్రవరిలోనే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎస్ పదవీ కాలాన్ని డీవోపీటీ మూడు నెలల పాటు పొడిగించినా.. మరోసారి ఈ గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. ఇప్పటికే సీఎం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు సీఎస్ పదవీకాలాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 30వరకు రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగే అవకాశాలున్నాయి. -
'గణేష్ విగ్రహాల ఎత్తు 15 అడుగులే ఉండాలి'
హైదరాబాద్: నగరంలో మెట్రో నిర్మాణం కారణంగా వినాయకుని విగ్రహలు ఈసారి 15 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. బుధవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్లపై చర్చించారు. అదేవిధంగా హైకోర్టు ఆదేశాలను గణేశ్ ఉత్సవ సమితికి ఈ సందర్భంగా వివరించారు. విగ్రహాల తయారీలో మట్టి, సాధారణ రంగులు వాడాలని వారికి రాజీవ్ శర్మ విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు?
- నెలాఖరుతో ముగియనున్న రాజీవ్‌శర్మ పదవీకాలం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎవరనేది అధికారులందరిలో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి డాక్టర్ రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తుందా.? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. సీఎస్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రత్యేక కారణాలున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐఏఎస్ అధికారుల సర్వీసు కాలాన్ని 3 నెలల పాటు పొడిగించే వెసులుబాటుంది. దీంతో సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు ఖాయమనే అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో పదోన్నతికి ఎదురుచూస్తున్న అర్హులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎస్ పోస్టుపై ఓ కన్నేసి ఉంచారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్ సీఎస్ రేసులో ఉన్నారు. రేమండ్ పీటర్ ఆగస్టులో, ప్రదీప్ చంద్ర డిసెంబర్లో, ఎంజీ గోపాల్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో సీఎస్‌గా రాజీవ్‌శర్మ పదవీ కాలం పొడిగిస్తే ప్రదీప్ చంద్ర, ఎంజీ గోపాల్‌కు ఈ పోస్టు దక్కే అవకాశాలు సన్నగిల్లుతాయి. సీఎస్ పోస్టును ఆశిస్తున్న అధికారులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సీఎంను కలసినట్లు తెలుస్తోంది. కొందరు ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ ఇదే వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో ఎత్తైన జాతీయ పతాకం: కేసీఆర్
హైదరాబాద్: దేశంలోకెల్లా అతి పెద్ద, ఎత్తైన జాతీయ పతాకాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఘాట్ వద్ద ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆయన ఆదేశించారు. 301 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఉండాలని, అందుకనుగుణంగా పోల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచిలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, అంతకంటే పెద్ద జెండా తెలంగాణలో ఎగుర వేయాలని అన్నారు. పౌరుల్లో జాతీయ భావనను పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ సీఎస్‌ను కలిసిన కోదండరాం బృందం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ప్రొ.కోదండరాం బృందం కలిసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కరవు పరిస్థితులపై బుధవారం సీఎస్‌కు ఓ నివేదికను అందజేసింది. కోదండ రాంతో పాటు పొలిటికల్ జేఏసీ నేతలు రఘు, డీపీ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. అయితే సీఎస్‌ను కలిసిన అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలన్నారు. ఎకరానికి రూ. 10 వేల పంటనష్టం ఇవ్వాలంటూ కోదండరాం డిమాండ్ చేశారు. -
'తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు'
ఢిల్లీ: తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో డీవోపీటీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై డీవోపీటీ అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 45 మంది ఐఏఎస్‌లు, 30 మంది ఐపీఎస్‌లు కావాలని రాజీవ్ శర్మ పేర్కొన్నారు. -
బోర్డియక్స్ మెట్రోతో సర్కార్ ఒప్పందం
- పట్టణాభివృద్ధి, శాస్త్రసాంకేతిక, మద్యం ఉత్పత్తిలో పరస్పర సహకారం సాక్షి, హైదరాబాద్: పట్టణాభివృద్ధి, శాస్త్రసాంకేతిక రంగాలు, మద్యం తయారీ పరిశ్రమలో పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవడానికి ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ నగర పాలక సంస్థ(మెట్రో పొలిస్), తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, బోర్డియక్స్ ఉపాధ్యక్షుడు మిచెల్ వెర్నేజోల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని సీఎం కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలి పింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎస్ రాజీవ్ శర్మ గత వారం రోజులుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలసి ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి బోర్డియక్స్ పట్టణం మద్యం ఉత్పత్తికి కేంద్రంగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రం- బోర్డియక్స్ మధ్య పలు రంగాల్లో ఆర్థిక బంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ ఎంఓయూ జరిగిందని సీఎంఓ కార్యాలయం తెలిపింది. గత నెలలో బోర్డియక్స్ను సందర్శించిన ప్రభుత్వ సలహాదారుడు బీవీ పాపారావు అంశాల వారీగా సహాయ, సహకారాలు అందించుకునే విధంగా ముసాయిదా ఒప్పంద పత్రం రూపకల్పన విషయంలో అక్కడి ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. పట్టణాభివృద్ధి, పట్టణ రవాణా, నీటి నిర్వహణ- మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి అంశాల్లో సహకారంతో పాటు ఏరో నాటికల్ ఇంజనీరింగ్, ఐటీ, బయో టెక్నాలజీ, మద్యం పరిశ్రమ రంగాల్లో ఆర్థిక సహకారం అందిపుచ్చుకోడానికి ఈ ఒప్పందం జరిగింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా సీఎస్ రాజీవ్ శర్మ బోర్డియక్స్లోని ‘ఏరో క్యాంపస్ క్విటైన్ అండ్ సబీన టెక్నాలజీస్’ సంస్థను సందర్శించి పెట్టుబడుల సాధ్యాసాధ్యాలపై చర్చలు జరి పారు. అనంతరం స్టాక్‌హోంలోని ఎలక్ట్రోలక్స్, ఎరిక్సన్ కంపెనీలతో సమావేశాలు జరిపారు. స్వీడన్లో ఐకియా పరిశ్రమను సందర్శించారు. -
సీఎస్ వరం.. సీసీఎల్ఏ నిర్లక్ష్యం
- అమలుకు నోచుకోని సీఎస్ హామీలు - రెవెన్యూ ఉద్యోగులకు తప్పని పాట్లు - నాన్చుడు ధోరణిలో సీసీఎల్ఏ అధికారులు సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు గత జూలైలో ఆందోళన (వర్క్ టు రూల్) చేశారు. దీంతో సర్కారు సైతం ఒక మెట్టు దిగింది. వారి డిమాండ్లు న్యాయ సమ్మతమైనవేనని, వెంటనే పరిష్కరిస్తామని సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హామీ ఇచ్చి రెండు నెలలు గడిచాయి. అయినా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు. దీనికి భూపరిపాలన విభాగం (సీసీఎల్ఏ) అధికారుల నాన్చుడి ధోరణే కారణమని తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థలో అత్యధికంగా 23 వేలమంది ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగులందరి మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలు చెల్లించేందుకు, ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల వేతనాన్ని పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పెంచేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈమేరకు ఫైలు పంపాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అయితే, సీసీఎల్ఏలో ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉలుకుపలుకు లేదు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతి నిధులు ప్రతిరోజూ సచివాలయం, భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతిపాదనలు పంపేదెన్నడో.. వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతుల కోటాను పెంచడం, పదవీ విరమణ పొందిన వీఆర్ఏలకు కనీస పింఛను, అర్హులైన డిప్యూటి తహ శీల్దార్లకు తహశీల్దార్లుగా, తహశీల్దార్లకు డిప్యూటి కలెక్టర్లుగా పదోన్నతులు, ఆర్డీవో, తహశీల్దార్లకు వాహన సదుపాయం, మండల, గ్రామ రెవెన్యూ కార్యాలయాల ఆధునీకరణ, రెవెన్యూ కార్యాలయాల గ్రేడింగ్, వీఆర్వోల నుంచి కలెక్టర్ వరకు సీయూజీ మొబైల్ కనెక్టివిటీ, కలెక్టరేట్లలో ఉన్న ఏజేసీ పోస్టును జేసీ-2గా చే యడం, పరిపాలనాధికారి (ఏవో) పోస్టులను డిప్యూటి కలెక్టర్ స్థాయికి పెంచడం, డిప్యూటి కలెక్టర్ కేడర్‌లో తహశీల్దార్ల పోస్టుల స్థాయిని తగ్గించడం తదితర డిమాండ్లకు నాడు సీఎస్ అంగీకారం తెలిపారు. వీటిపై సీసీఎల్ఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. మళ్లీ ఆందోళన చేస్తాం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. ప్రమోషన్ల గురించి అడిగితే కోర్టు కేసులంటూ అధికారులు తప్పుకుంటున్నారు. పోనీ మిగిలిన సమస్యలన్నా పరిష్కరించారా అంటే అదీ లేదు. పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొద్దిరోజుల సమయం కోరారు. పరిష్కారం కాకుంటే మళ్లీ ఉద్యమిస్తాం. -శివశంకర్, రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడి సమస్యలు అక్కడే చిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పలుమార్లు ధర్నాలు, ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. పీఆర్సీ సిఫార్సుల మేరకు వేతనం పెంపు, ప్రమోషన్ చానల్ మార్పు, మూడేళ్లకు పదోన్నతి లభించేలా నిబంధనలు మార్చాలని అడుగుతున్నాం. -శివరాం, వీఆర్ఏ (డెరైక్ట్ రిక్రూట్మెంట్)ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
12 నుంచి 20 వరకూ బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్ : తెలంగాణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ పండుగ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించనుంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో బతుకమ్మ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో చివరిరోజు బతుకమ్మలను పేర్చుకుని మహిళలతో ట్యాంక్‌బండ్ వరకు ఊరేగింపు ఉంటుంది. అలాగే ఊరేగింపుతోపాటు మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కళాకారులు తెలంగాణ కళలను ప్రదర్శించనున్నారు. -
కరువు గండం గట్టెక్కినట్లే
- రబీకి ఢోకా లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ - మండలాల వారీగా సర్వే చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం తీవ్ర కరువు నుంచి బయటపడినట్లేనని, రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో చాలా జిల్లాల్లో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. రబీ సీజన్‌కు, మంచినీటికి ఢోకా లేదని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, వర్షాలపై సీఎం అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, శాంతి కుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, రెవెన్యూ శాఖ కార్యదర్శి బీఆర్ మీనా, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. జూన్‌లో వేసిన పంటలకు నష్టం కలిగిందని, జూలైలో వేసిన పంటలు ఈ వర్షాలతో బతికే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. అధికారులు మండలాల వారీగా సర్వేలు జరిపి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని ఆదేశించారు. నష్టం జరిగిన రైతులకు సాయం చేసే విషయంలో ప్రతిపాదనలు తయారు చేయాల న్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మినహా అన్ని జిల్లాలలో మంచి వర్షాలు పడుతుండటం శుభ సూచకమని కేసీఆర్ పేర్కొన్నారు. -
ఏపీ సచివాలయంలో ఇద్దరు సీఎస్ల భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్.కృష్ణారావు, రాజీవ్ శర్మ గురువారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కమలనాథన్ కమిటీ కూడా హాజరైంది. ఉద్యోగుల విభజనపై చర్చ జరుగుతోంది. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ఇంకా ఓ కొలిక్కి రాని విషయం తెలిసిందే. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నాయి. ఇదే విషయంపై రెండు రాష్ట్రాల సీఎస్‌లు మంగళవారం భేటీ కాగా, సమస్య మాత్రం షరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మరోసారి భేటీ అయ్యారు. -
‘మెట్రో’కు ఆస్తుల సేకరణ భేష్
హైదరాబాద్ సిటీ: నగరంలో వడివడిగా మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వీలుగా ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్, రెవెన్యూ అధికారులను అభినందించారు. నిర్మాణ పరంగా క్లిష్టమైన ప్రధాన రహదారుల్లో 132 ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో మెట్రో పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఆస్తుల సేకరణ ప్రక్రియపై న్యాయస్థానాల్లో నమోదైన వ్యాజ్యాల పరిష్కారానికి అడ్వకేట్ జనరల్ సహకారం తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మెట్రో పనుల కోసం కేటాయించిన స్థలాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఆయా ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన నిర్మాణం పనులను తక్షణం ప్రారంభించాలన్నారు. మెట్రో వయాడక్ట్ సెగ్మెంట్ల కింద చెత్త చెదారం, మట్టి కుప్పలు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి నుంచి జరిమానా వసూలు చేయాలన్నారు. -
క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దండి
పుష్కర పనులపై అధికారులకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు కేవలం మరో నెలరోజులే గడువున్నప్పటికీ పనులు మాత్రం ఆశించిన రీతిలో సాగకపోవడంపై ప్రభుత్వం అధికారులపై గుర్రుగా ఉంది. ఈనెల 15 నాటికే పనులన్నీ పూర్తిచేయాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 70 శాతం మేర మాత్రమే పనులు పూర్తవడం, చాలా పనులు ఇంకా మొదలే కాకపోవడంపై సర్కారు ఆందోళన చెందుతోంది. దీనిపై ఇటీవలే సమీక్షించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సీఎస్ రాజీవ్‌శర్మలు పనుల్లో జాప్యానికి గల కారణాలు, పనుల నాణ్యతలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల జాప్యం, నాణ్యతపై నివేదికలు అందిస్తే తదునుగుణంగా సత్వర చర్యలు తీసుకోవచ్చని సూచిం చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఐదు జిల్లాల పరిధిలో పనులను పర్యవేక్షించేందుకు ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ప్రజారోగ్యం, దేవాదాయ శాఖలకు చెందిన కార్యదర్శులు, ఈఎన్సీలతో కూడిన ఉన్నతస్ధాయి బృందం కదలి వెళ్లనుంది. -
నేడు రాష్ట్రానికి పార్లమెంటరీ బృందం
సాక్షి, హైదరాబాద్: ఎగుమతులకు అవసరమైన మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. 20 మంది ఎంపీల ఈ బృందం ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది. ఈ బృందానికి సమర్పించాల్సిన వివరాలపై పరిశ్రమల శాఖ అధికారులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు వివరించారు. సనత్‌నగర్‌లోని ఇన్లాండ్ కంటెయినర్ డిపో, నాగులపల్లిలోని సీడబ్ల్యూసీ గోదాములు, కూకట్‌పల్లిలోని కంటెయినర్ రవాణా వ్యవస్థను ఈ బృందం పరిశీలిస్తుంది. ఈ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధ వారం భేటీ అవుతుంది. రాష్ట్రానికి సముద్రమార్గం లేకపోవడంతో డ్రైపోర్టు ఏర్పాటుపై పరిశీలించాలన్న విజ్ఞప్తిని బృందం ముందు ఉంచే అవకాశముందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. -
11న ఏపీ, తెలంగాణ సీఎస్ల భేటీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మ త్వరలో సమావేశం కానున్నారు. ఈ నెల 11న వీరిద్దరూ భేటీకానున్నారు. శాఖల విభజన, కార్పొరేషన్ల విభజన, ఉమ్మడి సంస్థల విభజన తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చర్చిస్తారు. -
వికార్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై సిట్
ప్రత్యేక బృందంతో దర్యాప్తునకు కేసీఆర్ నిర్ణయం వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ విషయంలో కీలక మలుపు. ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉత్తర్వులను సోమవారం జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఎన్కౌంటర్ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని సీఎం నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌం టర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. వికారుద్దీన్ సహా 5 గురు విచారణ ఖైదీల మరణానికి కారణమైన ఈ ఘటనపై కొందరు నేతలు, సంస్థలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని సీఎం నిర్ణయించారు. ఉగ్రవాదులను ఈ నెల 7న వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌లోని కోర్టుకు తరలిస్తుండగా నల్లగొండ జిల్లా ఆలేర్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మూత్ర విసర్జన పేరుతో వాహనాన్ని నిలిపేలా చేసిన వికారుద్దీన్ గ్యాంగ్ పథకం ప్రకారం ఎస్కార్టు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులకు యత్నించగా..ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో వికార్ ముఠా హతమైందని పోలీసులు చెప్తున్నారు. అయితే, దీనిపై పౌరహక్కుల సంఘాలతోపాటు ఎంఐఎం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పెద్దలు ఇటీవల సీఎంను కలిసి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటుకు సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. డీఐజీ, ఐజీ అధికారి స్థాయిలో ఈ దర్యాప్తు జరిగే అవకాశముంది. -
ఏపీ ఉద్యోగులపై బదిలీ అస్త్రం
తొలి విడతగా 12 మంది పీఎస్‌ల బదిలీ జాబితాలో మరో 115 మంది వీరిలో 70 మంది సెక్షన్ ఆఫీసర్లు దశల వారీగా బదిలీకి కసరత్తు సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులపై తెలంగాణ సర్కారు బదిలీల అస్త్రం ప్రయోగించింది. పలువురు ఉన్నతాధికారుల వద్ద పని చేస్తున్న 12 మంది వ్యక్తిగత కార్యదర్శులను తొలి విడతగా ఇటీవలే బదిలీ చేసింది. వీరందరూ ఏపీకి చెందిన వారని... దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మార్పులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో దశలవారీగా మరో 115 మంది ఏపీ ఉద్యోగులను బదిలీ చేసేందుకు కసరత్తు మొదలైంది. వీరిలో వివిధ శాఖల్లో 70 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న పీఎస్‌ల్లో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ వారున్నారు. కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. కానీ కీలక పోస్టుల్లో ఉన్నందున వీరంతా తెలంగాణలో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారని, ఉన్నతాధికారుల పేషీల్లో ఉండటంతో రకరకాల విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనేది తెలంగాణ ఉద్యోగుల ఆందోళన. వరుసగా వెల్లువెత్తిన ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం కొన్ని కీలక స్థానాల్లో ఉన్న ఏపీ ఉద్యోగుల బదిలీలకు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో జరిగిన బదిలీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతోపాటు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్, జీఏడీ కార్యదర్శి బూసాని వెంకటేశ్వరరావు, హోంశాఖ అదనపు కార్యదర్శి అనితా రాజేంద్ర దగ్గర పని చేస్తున్న వ్యక్తిగత కార్యదర్శులున్నారు. మరోవైపు కొందరు ఉన్నతాధికారులు ఉద్యోగుల విభజన నిబంధనలన్నీ లెక్క చేయకుండా తమ ఇష్టపూర్వకంగా ఏపీకి చెందిన పీఎస్‌లను నియమించుకున్నారు. మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ వద్ద పని చేస్తున్న పీఎస్‌ను ఇటీవలే ఆంధ్రా నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. తాము ఇష్టపూర్వకంగా నియమించుకున్న పీఎస్‌ను బదిలీ చేయటం సరికాదని ఒక ముఖ్య కార్యదర్శి సీఎస్‌ను కలసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తన దగ్గరున్న పీఎస్ కూడా ఇదే బదిలీ జాబితాలో ఉన్నారని, ఈ వ్యవహారంలో తాను చేసేదేమీ లేదని సీఎస్ తన అశక్తతను వెలిబుచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీ అయిన వారంతా ఏపీకి చెందిన వారవటం, వీరెవరికీ పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెంటనే రిలీవ్ కావాలని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. బదిలీ అయిన వారి స్థానంలో తెలంగాణ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, ఆ స్థాయి ఉద్యోగులు లేకుంటే వారికి పదోన్నతులిచ్చి నియమించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మంత్రుల పేషీల్లోనూ మాజీ పీఎస్‌లు తెలంగాణ మంత్రుల పేషీల్లో గతంలో మంత్రుల వద్ద పని చేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా సెటిలయ్యారు. కాంగ్రెస్ హయాంలో మంత్రుల వద్ద పని చేసిన పీఎస్‌లు, ఓఎస్డీలు, పీఏలను నియమించుకోవద్దని సీఎం కేసీఆర్ గతంలోనే మంత్రులను హెచ్చరించారు. దీంతో కొందరు మంత్రులు వారిని మార్చుకున్నా క్రమంగా పాత కథ పునరావృతమవుతోంది. మంత్రులు తుమ్మల, హరీశ్, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేషీల్లో కాంగ్రెస్ హయాంలో మంత్రుల వద్ద పని చేసిన ఉద్యోగులే హల్చల్ చేస్తున్నారు. -
సర్వీసు రూల్స్.. ఇక సరళతరం!
ఉద్యోగుల నిబంధనలసడలింపుపై ఉన్నతస్థాయి కమిటీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో తొలిదశలో భాగంగా ఆరు అంశాలను ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది. ఉద్యోగుల ప్రమోషన్లకు ఉండాల్సిన కనీస సర్వీసు, అర్హతలు, కారుణ్య నియామకాలకు అర్హత విధానం, వైద్య బిల్లులు, అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలు, సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులకు ఉన్న నిబంధనల్లో సడలింపులు, మినహాయిం పులను తొలుత పరిశీలించనున్నారు. వీటితో పాటు రిటైర్డ్ అధికారుల నియామకాలు, వారి సేవల వినియోగించుకునే ప్రతిపాదనలను కూడా రూపొందిస్తారు. తెలంగాణ ముద్ర కనిపించేలా ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను సరళతరం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పలుమార్లు ప్రకటించిన విషయం తెలి సిందే. ఉమ్మడి రాష్ట్రంలోని సేవా నిబంధనలను సమూలంగా మార్చి కొత్తవి రూపొం దించాల్సి ఉందని అధికారులతోనూ ఆయన ప్రస్తావించారు. అందులో భాగంగానే తాజా కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సర్వీస్ రూల్స్‌ను సరళతరం చేసే ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి(రాజకీయ), కార్యదర్శి (సర్వీసెస్), వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. జీఏడీ డిప్యూటీ కార్యదర్శి(ఎస్ఆర్) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రతి 15 రోజులకోసారి ఈ కమిటీ సమావేశమవుతుంది. ఎజెండాలో ప్రస్తావిం చిన అంశాలకు సంబంధించిన నిబంధనల సడలింపులు, మినహాయింపుల ప్రతిపాదనలు, వాటిని సమర్థించే నివేదికలను అన్ని విభాగాలు కమిటీ సమావేశాలకు వారం రోజుల ముందే అందించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని విభాగాల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా ఈ కమిటీ కొత్త సర్వీసు నిబంధనలకు రూపకల్పన చేస్తుంది. దీంతోపాటు ఉద్యోగ సంఘాలు, నిపుణులతో నూ ఈ కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ మరో నెల రోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త సర్వీసు నిబంధనలపై దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వైద్య బిల్లుల’పై దృష్టి.. హెల్త్ కార్డుల పథకాన్ని తెచ్చినప్పటికీ అది పూర్తిగా అమల్లోకి రాని నేపథ్యంలో... తాజాగా సర్వీసు నిబంధనలపై ఏర్పాటు చేసిన కమిటీకి మెడికల్ క్లెయిమ్‌ల అంశాన్ని అప్పగించడం ఉద్యోగులను ఆకర్షిస్తోంది. హెల్త్‌కార్డుల పథకం అమల్లోకి వస్తే తమకు నచ్చిన ఆసుపత్రిలో ఉద్యోగులు వైద్యం చేయించుకునే వీలుంది. కానీ రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ ఆసుపత్రులు వాటిని ఆమోదించడం లేదు. దీంతో ప్రభుత్వం 1972 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ విధానాన్నే కొనసాగిస్తోంది. ఈ విధానం ప్రకారం రూ. 50 వేలకు లోబడిన మెడికల్ బిల్లులను జిల్లా బోర్డుకు, అంతకు మించిన బిల్లులను రాష్ట్ర మెడికల్ బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. అయితే అన్నిచోట్లా బిల్లుల రీయింబర్స్మెంట్ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటోంది. దీంతోపాటు వైద్య చికిత్స బిల్లులను తగ్గిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉద్యోగుల అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలకు కొన్ని విభాగాలు పరిమితంగా అవకాశం కల్పిస్తున్నాయి. అయితే సాధారణ బదిలీలతో పాటు వీటికి అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులు ఇవ్వాలా, వద్దా? ఏయే శాఖలకు మినహాయింపులు ఇవ్వాలనే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. వివిధ విభాగాల్లో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకునే ప్రతిపాదనలు, అందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయనుంది. ఇబ్బందులన్నీ తప్పేనా? ఉద్యోగులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 57 ఏళ్ల కిందటి నిబంధనలు, దశాబ్దం కిందటి రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. కాలానుగుణంగా పలు ప్రత్యేక నిబంధనలను చేర్చినప్పటికీ... ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు వంటి పలు అంశాల్లో ఏకరూపత కరువైంది. ప్రత్యక్ష, పరోక్ష నియామకాలతో పాటు సీనియారిటీ ఆధారిత పదోన్నతులు, ప్రతిభ ఆధారిత పదోన్నతులకు ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. 1996 రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం... ఉద్యోగి పైకేడర్కు పదోన్నతి పొందాలంటే ప్రస్తుత కేడర్‌లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధన ఉంది. ఇక కారుణ్య నియామకాల అంశంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గతంలో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు కారుణ్య నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించని ఉద్యోగం ఇచ్చే నిబంధన ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఇందుకు కనీస విద్యార్హతను డిగ్రీకి పెంచారు. కానీ అప్పటికే నాలుగేళ్లుగా అన్ని జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న వందలాది దరఖాస్తుల మాటేమిటనేదానిపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. -
అమ్మకానికి రంగారెడ్డి కలెక్టరేట్?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విలువైన ప్రభుత్వ కార్యాలయాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. మొన్నటి వరకు ఖాళీ స్థలాల వివరాలు సేకరించిన జిల్లా యంత్రాంగం తాజాగా సర్కారీ స్థిరాస్తుల సమాచారాన్ని రాబడుతోంది. హైదరాబాద్ నడిబొడ్డునున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, జిల్లా పరిషత్ తదితర కాంప్లెక్స్‌ల వేలానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భవనాల సమగ్ర సమాచారాన్ని రెండు రోజుల్లోగా నివేదించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఆదేశించిన వెంటనే జిల్లా యంత్రాంగం వివరాల సేకరణలో తలమునకలు కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. భూముల అమ్మకంతో రూ. 6,500 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రస్తావించిన కేసీఆర్ సర్కారు.. ఖరీదైన స్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 300 ఎకరాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. 700 భవనాలు.. 900 ఎకరాలు: ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను నిర్మించడంలో భాగంగానే ఈ కసరత్తు చేస్తున్నామని ప్రకటించిన సర్కారు.. జిల్లాలో 900 ఎకరాల మేర ఖాళీ జాగా అందుబాటులో ఉందని తేల్చింది. జిల్లావ్యాప్తంగా 700 ప్రభుత్వ భవనాలున్నాయని, ఇంకా చాలా వాటికి పక్కా నిర్మాణాలు లేవని నివేదించింది. ఈ క్రమంలోనే జంట నగరాల్లో కొలువైన రంగారెడ్డి జిల్లా ఆఫీసుల సమాచారాన్ని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు సేకరించారు. లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్, ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ తదితర కార్యాలయాల విలువను అంచనా వేశారు. పక్కాగా సమాచారం: ప్రభుత్వ భవంతుల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని సర్కారు తాజాగా ఆదేశించింది. భవన విస్తీర్ణం, సర్వే నంబరు, ప్రధాన మార్గానికి ఎంత దూరం.. కోర్టు కేసులున్నాయా? తదితర అంశాలపై స్పష్టమైన వివరాలతో బుధవారం లోపు నివేదిక ఇవ్వాలనిపేర్కొంది. ఇదిలావుండగా, ప్రభుత్వ కార్యాలయాలను వేలం వేయనున్నారనే వార్తలను కలెక్టర్ రఘునందన్‌రావు ఖండించారు. శేరిలింగంపల్లికి కొత్త కలెక్టరేట్? జంటనగరాల్లో విసిరేసినట్లుగా ఉన్న కలెక్టరేట్, తదితర కార్యాలయాలన్నింటినీ ఒకేచోట నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సమీపంలో సర్వే నంబర్ 25లోని స్థలాన్ని పరిశీలించింది. సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించడం ద్వారా ప్రజలకు ఊరట కలుగుతుందని అంచనా వేసింది. -
ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!
విస్మయం వ్యక్తం చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ పరస్పర సంప్రదింపులతో కొలిక్కి తేవాలని సీఎస్‌లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఏడు నెలలు దాటిపోయినా ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగా ఉండడం పట్ల కేంద్ర ఉపరితల రవాణా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. ఆర్టీసీని రెండు కార్పొరేషన్లుగా విభజించే అవకాశమున్నా.. ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం చర్చించుకొని ప్రత్యేక రవాణా సంస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది. తెలంగాణ, ఏపీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో పరిణామాలు, ఆస్తులు, అప్పుల విభజన కసరత్తు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎస్‌లు తమ నివేదికలను సమర్పించారు. చట్టం ప్రకారమే.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని స్పష్టంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆ విధంగానే విభజన జరగాలని తాము కోరుతున్నట్టు నివేదికలో వివరించారు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీతో సంబంధం లేకుండా పూర్తి చేయాలన్నారు. ఏపీ మాత్రం తమ నివేదికలో హైదరాబాద్‌లోని ఆస్తులను కూడా జనాభా ప్రాతిపదికన పంచాలని కోరింది. అయితే ఆర్టీసీ విభజన వ్యవహారంలో కేంద్ర రవాణా కార్యదర్శి ఘాటుగానే స్పందించారు. ఆస్తులు, అప్పుల పంపకాలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని... కానీ అప్పటివరకు ఆర్టీసీని విభజించకుండా ఉంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆస్తులు, అప్పుల పంపిణీ, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలన్నీ మార్గదర్శకాల ప్రకారం వాటంతట అవే జరుగుతాయని... పాలనాపరంగా గందరగోళం లేకుండా ఆర్టీసీని విభజించుకోవచ్చని పేర్కొన్నారు. వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకొని మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మరోదఫా సమావేశమై ఇతర అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. కాగా.. మరో మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ విభజన పూర్తికావచ్చని సీఎస్ రాజీవ్‌శర్మ భేటీ అనంతరం విలేకరులతో చెప్పారు. ఎప్పుడో జరగాల్సింది.. ఆర్టీసీ ఎండీగా ఏపీకి చెందిన అధికారి ఉన్నందున కేంద్రం సూచించిన ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీ పోస్టును గత మే నెలలో ఏర్పాటు చేశారు. ఆర్టీసీని రెండుగా విభజించి ఎండీ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ... జేఎండీ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ విధులు నిర్వహించాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు తెలంగాణకు చెందిన రమణారావును జేఎండీగా నియమించినా... టీఎస్ఆర్టీసీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ తరుణంలో తాజాగా కేంద్రం వేసిన మొట్టికాయతో ఆ తంతును పూర్తి చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
మెట్రో రెండో దశకు దిశానిర్దేశం
ప్రాజెక్టు విస్తరణపై అధ్యయనానికి సీఎం కేసీఆర్ ఆదేశం మరో ఐదు మార్గాల్లో విస్తరణకు ప్రతిపాదనలు! ‘ఆకాశ హర్మ్యాల’పై ఎల్అండ్టీ నివేదిక కోరిన సీఎం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండోదశకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పచ్చజెండా ఊపారు. రెండో దశ కింద ఉప్పల్-ఘట్కేసర్, నాగోల్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్చెరు, జేబీఎస్-తిరుమలగిరి మార్గాల్లో ప్రాజెక్టు విస్తరణపై సమగ్ర అధ్యయనం జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులు పూర్తై.. హైదరాబాద్ నగర రవాణా అవసరాలు పూర్తిగా తీరవని ఆయన అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి అవతల నగరం బాగా విస్తరించిన నేపథ్యంలో పైన పేర్కొన్న మార్గాల్లో మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎల్అండ్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలసుబ్రమణ్యం, ఎండీ గాడ్గిల్ తదితరులతో సోమవారం సీఎం సచివాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. నగర జనాభా కోటికి దాటిందని, ఏటా పది లక్షల జనాభా పెరుగుతోందన్నారు. శరవేగంగా వృద్ధి చెందుతున్న నగర జనాభా అవసరాలకు తగ్గట్లు నగర రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. నగరంలో తీవ్రరూపం దాల్చిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు, ప్రజలకు సరైన రవాణా వ్యవస్థను అందించేందుకు మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎల్అండ్టీ నుంచి ప్రతిపాదనలు హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఆకాశ హర్మ్యాలు, ఆకాశ మార్గాలు తదితర ప్రతిష్టాత్మక నిర్మాణాలపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు. ఈ ప్రాజెక్టులపై అధ్యయన నివేదికలు సమర్పించాలని ఎల్అండ్టీ ప్రతినిధులను కోరారు. అదే విధంగా.. ఎల్అండ్టీ ఆధ్వర్యంలో ముంబై నగరంలో నిర్వహిస్తున్న సీసీ కెమెరాల పనితీరుపై అధ్యయనం చేయాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డిని కోరారు. నగరంలో సీసీ కెమెరాలను పెంచాలని, నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని ఆదేశించారు. నగరంలో నిర్మించతలపెట్టిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ భవనాన్ని సత్వరంగా నిర్మించాలన్నారు. -
పరిశ్రమలన్నింటినీ పరిరక్షిస్తాం: నాయిని
సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తెరిపిస్తాం: నాయిని సికింద్రాబాద్: తెలంగాణలోని పరిశ్రమలన్నింటినీ పరిరక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపైనే ఉందని, ఇటీవల మూతపడ్డ సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్‌మిల్లు మూసివేయడంతో సుమారు వెయ్యి మంది కార్మికులు శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిరసన ప్రదర్శన చేస్తూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కార్మికులతో మాట్లాడేందుకు వచ్చిన నాయిని కాన్వాయ్‌ని అడ్డుకుని ఆందోళకు దిగారు. వారిని శాంతింపజేసిన మంత్రి అరగంట పాటు వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. మిల్లు నష్టాలబాటలో ఉన్నందునే ప్రభుత్వం రూ. 6 కోట్లు కేటాయించిందని, ఇప్పటికే రూ. 3 కోట్లు విడుదల కాగా.. మరో రూ. 3 కోట్లు ఐడీబీఐ బ్యాంకుకు చేరాయన్నారు. కంపెనీ ఎండీ గుండెపోటుతో ఆస్పత్రిలో ఉన్నందున కార్మికుల సమస్యలకు ఇప్పటికిప్పుడు పరిష్కారం చూపలేమన్నారు. సోమవారం పరిశ్రమల మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సమావేశమై కనీసం రెండు నెలల వేతనాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వానివి కంటితుడుపు హామీలని, సమస్యను పరి ష్కరించేలా లేవని కార్మికులు మళ్లీ నిరసనకు దిగారు. అసహనానికి గురైన నాయిని కార్మికులు శాంతియుత చర్చలకు వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆందోళనల ద్వారా కావని చెప్పారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన పోలీసులు.. మంత్రిని అక్కడి నుంచి పంపేశారు. -
నిర్మాణాలు ఉన్న భూములే క్రమబద్ధీకరణ
మార్గదర్శకాలను జారీ చేసిన సీసీఎల్ఏ తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు భూమి విలువలో 25% చెల్లించాలి అందుబాటులో హెల్ప్‌డెస్క్‌లు సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు తెర లేచింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. నిర్మాణాలుంటే సరి.. అవి ప్రభుత్వ భూములైనా, యూఎల్సీ మిగులు భూములైనా క్రమబద్ధీకరిస్తారు. ఈ మేరకు బుధవారం భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) డాక్టర్ రాజీవ్‌శర్మ మార్గదర్శకాలు జారీ చేశారు. భూముల క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం గత డిసెంబర్ 31న జారీ చేసిన జీవో 59కి అనుగుణంగా వీటిని రూపొందించారు. జీవో జారీ అయిన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం పేర్కొ నడం తెలిసిందే. దరఖాస్తులకు సంబంధించిన ఫార్మాట్‌ను కూడా విడుదల చేశారు. మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు.. 2014 జూన్ 2 కంటే ముందే పొజిషన్లో ఉండాలి. ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించరు. దరఖాస్తు ఫారాలను తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి. నిర్ణీత ఫార్మాట్లలో, అవసరమైన డాక్యుమెంట్లతో తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించాలి. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్‌లలో ఒకటి ఉండాలి. ఆ భూమి తన స్వాధీనంలో ఉన్నట్లు (పొజిషన్లో) ఆధారం అందజేయాలి. అందుకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్తు బిల్లు రసీదు, నీటి పన్ను రసీదు, స్థానిక సంస్థ నుంచి భవన నిర్మాణ అనుమతి పత్రాల్లో ఏదైనా ఒకటి ఉండాలి. దరఖాస్తు చేసే భూమికి సంబంధించి నిర్మాణ ప్రదేశం ఫొటోను జత చేయాలి. పత్రాలు దరఖాస్తుదారుని పేరిటే ఉండాలి. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. అవసరమైన వివరణలు, వివరాలు అందించాలి. ఆస్తి విలువ లెక్కగట్టేలా చర్యలు చేపట్టాలి. దరఖాస్తు ఫారం అందజేసే సమయంలో భూమి విలువలో 25 శాతం డబ్బును సంబంధిత తహసీల్దార్ పేరుతో డీడీ అందజేయాలి. తహసీల్దార్లు జీవో జారీ అయిన తేదీ నుంచి 20 రోజుల్లో ఈ దరఖాస్తులను స్వీకరించాలి. తహసీల్దార్ స్థాయిలో... వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఆ క్రమంలో దరఖాస్తు వచ్చిన వెంటనే నిర్ణీత పత్రాలు అన్ని ఉన్నాయా సరి చూసుకోవాలి. రిజిస్టర్లో ఆ వివరాలను, పేరు, చిరునామా నమోదు చేయాలి. దరఖాస్తుదారునికి అకనాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. తహసీల్దార్/డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలి. ఆ బృందాలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ సహకారం అందించాలి. ఈ బృందాలు క్షేత్రస్థాయిలోని నివాస, నివాసేతర నిర్మాణాలను స్వయంగా పరిశీలించాలి. ఆ భూమి విలువపై 25 శాతం మొత్తాన్ని దరఖాస్తుదారుడు చెల్లిస్తున్నందున, ఆ భూమికి సంబంధించిన విలువను ఈ బృందాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్ధరించాలి. ఇవన్నీ పూర్తయ్యాక తహసీల్దార్/డిప్యూటీ తహసీల్దార్ నుంచి వాటికి సంబంధించిన వివరాలు, సిఫారసులను క్రమబద్ధీకరణ కమిటీకి నివేదికను అందజేయాలి. తహసీల్దార్ పేరుతో వచ్చిన డీడీల మొత్తాన్ని బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. డీడీల వివరాలను నంబరుతో సహా ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేయాలి. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన మరిన్ని మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. -
నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు
నాలుగేళ్ల ‘శిక్షణ’లో జపాన్‌తో దీటుగా భారత్ కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసి ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 90వ జన్మదినం సందర్భంగా కేంద్ర కార్మికుల బీమా సంస్థ(ఈఎస్ఐసీ) గురువారం నగరంలోని ఒక హోటల్లో ‘సుపరిపాలన’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడారు. నైపుణ్యం పెంపుదల శిక్షణ విషయంలో ఇతర దేశాలతో పోల్చుకోలేని స్థితిలో భారతదేశం ఉందని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలిందన్నారు. దేశంలో 11 వేల పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా 2.8లక్షల మందికి శిక్షణ లభిస్తుండగా, జర్మనీలో 30 లక్షల మందికి, జపాన్‌లో కోటి మందికి, చైనాలో రెండు కోట్ల మందికి శిక్షణ ఇస్తున్నారన్నారు. శిక్షణా సామర్థ్యం విషయంలో రానున్న నాలుగేళ్లలో జపాన్‌కు దీటుగా దేశాన్ని తీర్చిదిద్దుతామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసమే ఇటీవల పార్లమెంటులో అప్రెంటీస్ చట్టాన్ని సవరించామని తెలిపారు. 2042 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి మొత్తం 5.45 కోట్ల మానవ వనరుల కొరత ఏర్పడనుందని చెప్పారు. అప్పటి లోగా దేశంలో 4.90 కోట్ల మందికి శిక్షణ ఇచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తీర్చిదిద్దుతామన్నారు. నైపుణ్యాల పెంపుదల కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశామని ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అవినీతి లేని పారదర్శక పాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని హైదరాబాద్ నగరాన్ని స్మార్టు, సేఫ్ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పోలీసు శాఖ డీజీ అనురాగ్ శర్మ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులతో వచ్చే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోలీసు శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్, ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఎస్ఐ మెడికల్ కమిషనర్ ఎస్ఆర్ చౌహాన్, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
11 లక్షల మందికి ‘నో రెన్యువల్’!
34 లక్షల మంది రైతుల్లో... 23 లక్షల మంది రుణాలే రె న్యువల్ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 14 వేల కోట్లు... ఇచ్చింది రూ. 11 వేల కోట్లు రబీ సీజన్‌కు సంబంధించి కూడా లక్ష్యానికి దూరంగా రుణాల మంజూరు నెలాఖరులోగా ‘రెన్యువల్’ పూర్తి చేసి రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వఆదేశం రైతులే ముందుకు రావడం లేదంటున్న బ్యాంకర్లు లక్ష్యాల మేరకు ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు రుణాలిచ్చామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంకా దాదాపు 11 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రెన్యువల్ కాలేదు. ఖరీఫ్ సీజన్లో మొత్తంగా రూ. 14 వేల కోట్ల మేరకు కొత్త రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా... రూ.11 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక రబీలో పెట్టుకున్న రుణ మంజూరు లక్ష్యం రూ. 6,300 కోట్లు కాగా... ఇప్పటికీ ఈ రుణ పంపిణీ క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 4,250 కోట్లను విడుదల చేయడంతో... మొత్తం 34 లక్షల రైతుల రుణాలను రెన్యువల్ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు 23 లక్షల ఖాతాలు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. ఖరీఫ్‌లో రైతులకు మొత్తం రూ. 11 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మిగతా 11 లక్షల మంది రైతుల రుణాలు రెన్యువల్ చేసి, వెంటనే వారికి కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ బ్యాంకర్లను కోరారు. అయితే వర్షాల్లేక, క్షేత్రస్థాయిలో వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు లేక రైతులు రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని బ్యాంకర్లు ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్య, అప్రాధాన్య రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రాధాన్యతా రంగానికి 40 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంటే.. ఇప్పటికే 33 శాతం మేరకు ఇచ్చినట్లు వివరించారు. కాగా.. రబీ సీజన్లో రూ. 6,300 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినా... క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్ల దృష్టికి తీసుకువచ్చారు. రుణాల రెన్యువల్‌కు సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉందో బ్యాంకులు వివరిస్తే దానిని సరిచేయడానికి వీలవుతుందని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందుకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వయం ఉపాధి పథకాల కింద ఇచ్చే రుణాలు ఆ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని, అందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని బ్యాంకులను కోరారు. ఇదివరకే మంజూరైన వారికి ఈ మూడు నెలల కాలంలో రుణాలన్నీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ.. పంట రుణాల రెన్యువల్లో కొద్దిరోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ఈ నెలాఖరులోగా దానిని పూర్తి చేయాలని కోరారు. సంతృప్తస్థాయిలో బ్యాంకు ఖాతాలు.. తెలంగాణ రాష్ట్రంలో 97 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఇచ్చామని, ఈ నెల 20వ తేదీ నాటికి అందరికీ ఖాతాలు కల్పించినట్లు ప్రకటించనున్నామని బ్యాంకర్లు సమావేశంలో వెల్లడించారు. జన్ ధన్ యోజన కింద 36 లక్షల ఖాతాలు తెరిపించినట్లు చెప్పారు. వారందరికీ ‘రూపే’ కార్డులను పంపిణీ చేశామని... వారికి రూ. 30 వేల జీవిత బీమా, రూ. లక్ష ప్రమాద బీమా పాలసీ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో దాదాపు కోటి బ్యాంకు ఖాతాలున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఎస్బీహెచ్ ఎండీ శంతన్ ముఖర్జీ మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను అభినందించారు. రాష్ట్రంలో బ్యాంకు శాఖల సంఖ్య 4,682కు చేరిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో రూ. 10,531 కోట్ల డిపాజిట్లు వచ్చాయని, దీనితో మొత్తం డిపాజిట్లు రూ. 2,97,422 కోట్లకు చేరాయని తెలిపారు. దేశంలో రుణ నిష్పత్తి అత్యధికంగా 113 శాతం ఉన్నట్లు తెలిపారు. -
పీఆర్సీపై కమిటీ
సీఎస్ అధ్యక్షతన ఏర్పాటు సభ్యులుగా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేతన సవరణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీని నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షత వహించే ఈ కమిటీలో ఆర్థిక శాఖ ము ఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రతి నిధి ప్రదీప్‌చంద్ర, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కా ర్యదర్శి రేమండ్ పీటర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషిలు సభ్యులుగా ఉంటారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించే బాధ్యతను కూడా ఈ కమిటీయే చూస్తుం ది. పదో వేతన సవరణ సంఘం చైర్మన్ పీకే అగర్వాల్ సమర్పించిన నివేదికను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా వేతన సవరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలన్న అం శంపై సీఎం ఎలాంటి కాలపరిమితి విధించలేదు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతనాలు చెల్లించే అంశాన్ని పరిశీలించేందుకు సీఎస్ అధ్యక్షతన ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని నియమించిన సంగతి విదితమే. తెలంగాణ డిస్కమ్‌లు కొనుగోలు చేయనున్న 500 మెగావాట్ల సౌర విద్యుత్ టెండర్లను ఖరారు చేసే అంశంలో తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని తాజా కమిటీకే ప్రభుత్వం కట్టబెట్టింది. గజ్వేల్‌లో ఆడిటోరియం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ పట్టణంలో 2 వేల మంది కూర్చోవడానికి వీలుండేలా ఆడిటోరియం నిర్మించనున్నారు. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని సీఎం ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఆదేశించారు. -
‘పూనం’కు అదనంగా మహిళా, శిశు సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనంగా మహిళా, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం జీవో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. మహిళ, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న సునీల్ శర్మను బదిలీ చేసి, ఆర్ అండ్ బీ కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం రవాణా, రోడ్లు భవనాల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న అజయ్‌మిశ్రాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఓఎస్డీగా బదిలీపై పంపారు. -
జిల్లా అధికారులతో రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ సోమవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదాయ పరిమితి పెంచుతూ మార్గదర్శకాల నేపథ్యంలో రేషన్ కార్డులు, పెన్షన్ల దరఖాస్తుల పున పరిశీలపై ఆయన అధికారులతో సమీక్షించారు. సమీక్ష సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళీ తదితరులు హాజరయ్యారు. మరోవైపు 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల నిధుల వివాదంపై కూడా రాజీవ్ శర్మ సమీక్షించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ధనుంజయ్ రెడ్డి, వివిధ శాఖల పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నిధుల బదలాయింపు చేయవద్దు: రాజీవ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి నిధులను బదలాయింపు చేయవద్దని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో విభజన, నిధుల బదలాయింపు, తదితర అంశాలపై రాజీవ్ శర్మ చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా పదవ షెడ్యూల్ లోని సంస్థల బ్యాంక్ ల లావాదేవీలను నిర్వహించవద్దని ఆయన తెలిపారు. విభజనకు సంబంధించిన సంస్థలపై మూడు రోజుల్లో ఓ నివేదిక ఇస్తామని రాజీవ్ శర్మ తెలిపారు. -
రైతు ఆత్మహత్యలపై నివేదికివ్వండి
అధికారులకు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశం త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా నష్టపరిహారంపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై నెలరోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీనియర్ అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి విచారణ పూర్తి చేయాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన మాదిరిగా పరిహారం రూ.1.5 లక్షలు ఇవ్వాలా.. లేదా పెంచి ఇవ్వాలా అన్న అంశంపై అధికారుల నుంచి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రైతుల ఆత్మహత్యలపై ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌తో గతంలో నియమించిన త్రిసభ్య కమిటీ దృష్టి సారించనుంది. ఆయా డివిజన్లలో రైతుల ఆత్మహత్యలకు కారణాలపై నివేదిక ఇవ్వనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యం కావడంతో.. పంటలు వేయడంలో జాప్యమైంది. ఆ తర్వాత కూడా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు నష్టపోయారు. ఇక పంట పొట్టకొచ్చే సమయంలో తీవ్ర కరెంటు సమస్యతో పంటలు ఎండిపోయాయి. రైతు రుణమాఫీ కూడా సకాలంలో జరగకపోవడం, బ్యాంకులు పూర్తిస్థాయిలో రుణాలివ్వకపోవడంతో రైతులు మరింత ఇబ్బందుల పాలయ్యారు. అప్పులు తట్టుకోలేక ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించడంతోపాటు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. -
నేడు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
హాజరవుతున్న ఇరురాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరవుతున్నారు. ఈ నెల 10న కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు.దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ శనివారం సమావేశం నిర్వహిస్తోంది. తెలంగాణలో పనిచేస్తూ.. ఆంధ్రాకు కేటాయించిన ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్యలను తమ రాష్ట్రంలోనే కొనసాగించాలని తెలంగాణ కోరనుంది. తమ వద్ద పనిచేస్తూ.. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లైన అజయ్ సహాని, ఆదిత్యనాథ్‌దాస్, అజయ్‌జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తమ వద్దనే ఉంచాలని ఏపీ కోరనుంది. అభ్యంతరం లేని వారిని గత జాబితా ప్రకారం రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఆర్డర్ టు సర్వ్ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖను కోరడం తెలిసిందే. -
ఏపీకి 28 మంది ఐఏఎస్‌లు
తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మంది వీరిలో ఆరుగురు అధికారులు ఎక్కడివారు అక్కడే మిగతావారు రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఉత్తర్వులివ్వాలంటూ సీఎస్ల ఉమ్మడి లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రకటించిన ప్రొవిజనల్ జాబితా ప్రకారం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మందిలో 28 మంది ఐఏఎస్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆ 28 మందిని రాష్ట్రానికి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేసేందుకు 44 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. కమిటీ ప్రొవిజనల్ జాబితా ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కేటాయించబడిన ఆరుగురు అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారో ప్రస్తుతానికి అక్కడే కొనసాగించాలని, వారు మినహా మిగ తా అభ్యంతరం లేని ఐఏఎస్‌లు రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఒకే లేఖపై సంతకాలు చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖకు పంపించారు. సోమవారం ఇద్దరు సీఎస్‌లు వేర్వేరుగా సంతకాలు చేసి ఐఏఎస్‌ల జాబితాలను కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే సీఎస్లిద్దరూ ఒకే లేఖపై సంతకాలు చేసి పంపాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇద్దరు సీఎస్‌లు ఉమ్మడి లేఖపై సంతకాలు చేసి పంపిం చారు. తెలంగాణలో పనిచేస్తున్న బి.పి.ఆచార్య, సోమేశ్‌కుమార్‌లను ఏపీకి కేటారుుంచారు. అయితే వీరిని తెలంగాణలోనే కొనసాగించాలని సీఎస్‌లు లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పనిచేస్తున్న ఆదిత్యనాథ్ దాస్, అజయ్ సహాని, అజయ్ జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తెలంగాణకు కేటాయించగా.. వీరిని ఏపీలోనే కొనసాగించాలని సీఎస్‌లు కోరారు. వీరు మినహా రెండు రాష్ట్రాలకు ఐఏఎస్‌లను కేటాయిస్తూ విడుదల చేసిన జాబితా మేరకు వారు రెండు రాష్ట్రాల్లో పని చేసేందుకు వీలుగా వర్క్ టు ఆర్డర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఆమో దం లభించగానే ఉద్యోగుల పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
‘సుప్రీం’ సెక్రటరీ జనరల్‌తో తెలంగాణ సీఎస్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ రవీంద్ర మైథానిని తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఢిల్లీలో కలసి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి చర్చించారు. రెండు రాష్ట్రాలకు హైకోర్టులకు కావలసిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుందని, ఈమేరకు భవనాలను ఇప్పటికే గుర్తించిందని వివరించినట్టు తెలిసింది. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌లను ప్రత్యేక హైకోర్టు గురించి కలసిన విషయం తెలిసిందే. కాగా హైకోర్టు విభజనను వేగవంతం చేయాలని సీఎస్ కోరినట్టు సమాచారం. కేంద్ర హోంశాఖ కార్యదర్శితోనూ ఆయన భేటీ అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై ఆయన చర్చించినట్టు సమాచారం. -
ఆ టీచర్లను తెలంగాణలోనే ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కలి పేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల టీచర్లను తెలంగాణలోనే ఉంచాలని పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ చేశారు. సచివాలయంలో వారు గురువారం కమలనాథన్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. అనంతరం వారు ఏపీ సీఎస్ కృష్ణారావును కూడా కలిశారు. -
'మెట్రో' కథనాలపై కేసీఆర్ ఆగ్రహం
-
'మెట్రో' కథనాలపై కేసీఆర్ ఆగ్రహం
మెట్రో రైల్వేపై వచ్చిన కథనాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నమని మండిపాటు సీఎంను కలిసి వివరణ ఇచ్చిన ‘మెట్రో’ ఎండీ, ఎల్అండ్టీ సంస్థ ఎండీ రెండో దశపై చర్చ కోసం ఢిల్లీకి సీఎస్, ప్రభుత్వ సలహాదారు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంపై ఎల్అండ్టీ సంస్థ చేతులెత్తేసిందంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమని.. ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే యత్నమని ఆయన మండిపడ్డారు. బుధవారం సీఎం కేసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టు పురోగతిపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, ‘ఎల్అండ్టీ మెట్రో రైల్’ ఎండీ వీబీ గాడ్గిల్, మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు పాపారావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ‘మెట్రో’పై పత్రికల్లో వచ్చిన కథనాలు చర్చకు రాగా... అవి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్అండ్టీ సంస్థ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం సాధారణ ప్రక్రియని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఎల్అండ్టీ రాసిన లేఖలోని కొన్ని అంశాలను మాత్రమే పేర్కొంటూ ప్రాజెక్టుపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా పలు పత్రికల్లో కథనాలు రావడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టును కావాలనే తప్పుడు కోణంలో చూపించే యత్నం జరిగిందని అభిప్రాయపడ్డారు. మెట్రోరైలుకు సంబంధించిన సమస్యలు ఈ సమీక్షా సమావేశంలో పరిష్కారం అయ్యాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే మెట్రోరైలుకు సంబంధించి వచ్చిన కథనాలపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉదయమే సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీకి వివరణ ఇచ్చారు. సీఎం సచివాలయానికి వచ్చాక ఆయనను కూడా కలిసి విషయం వివరించారు. ఇదే సమయంలో ఎల్అండ్టీ మెట్రో ఎండీ వీబీ గాడ్గిల్ సైతం సచివాలయానికి చేరుకుని సీఎస్‌తో సమావేశమయ్యారు. అనంతరం సీఎంతో కొద్దిసేపు భేటీ అయ్యారు. రెండో దశ కోసం ఢిల్లీకి సీఎస్.. మెట్రో రైలు రెండో దశ పై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే మెట్రోరైలు నిపుణుడు శ్రీధరన్ సలహాలు కూడా తీసుకుంటారని చెప్పారు. -
జస్టిస్ కక్రూపై విచారణ జరపండి
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ మీద వచ్చిన ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. ఈ వ్యవహారంపై డీజీపీ లేదా నిఘా విభాగం అధిపతి వెంటనే విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేశారు. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ మీద వచ్చిన ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ.. ఈ వ్యవహారంపై డీజీపీ లేదా నిఘా విభాగం అధిపతి వెంటనే విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేశారు. వివరాలు.. జస్టిస్ కక్రూ అనధికారింగా విధులకు గైర్హాజరు అవుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. వీటిపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది కె.అజయ్‌కుమార్ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. జస్టిస్ కక్రూ నెలలో ఎక్కువ కాలం హైదరాబాద్‌లో ఉండడం లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకు అనుకూలంగా జస్టిస్ కక్రూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుకు న్యాయశాస్త్రం (ఎల్ఎల్బీ) డిగ్రీ ఉన్న వారే అర్హులని, ఎల్ఎల్బీతో అన్ని అర్హతలు ఉన్న నలుగురు ఉద్యోగులు ఉన్నా.. ఎల్ఎల్బీ అర్హత లేని ఓ ఉద్యోగికి అక్రమ పద్ధతుల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి ఇచ్చి ఇతరులకు అన్యాయం చేశారని తెలిపారు. మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిగా ఉన్న జిల్లా జడ్జి సుబ్రమణ్యం కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని, జస్టిస్ కక్రూ ఉన్నప్పుడు మినహా ఆయన విధులకు హాజరుకావడం లేదన్నారు. గతంలో కమిషన్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి హక్కుల కమిషన్‌ను ప్రజలకు మరింత చేరువ చేశారని వివరించారు. హక్కులపై అనేక సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారని, హక్కుల ఉల్లంఘనకు గురైన వారికి అండగా నిలబడి న్యాయం చేశారన్నారు. ప్రస్తుత చైర్మన్ జస్టిస్ కక్రూ మాత్రం అందుకు విరుద్దంగా పనిచేస్తున్నారని, కేవలం జీతం, ఇతర సౌకర్యాలను అనుభవించేందుకే ఈ పదవిలో కొనసాగుతున్నారని ఆ ఫిర్యాదులో వివరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న జస్టిస్ కక్రూ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు ఎంతమాత్రం అర్హుడు కాడని, ఆయనపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని న్యాయశాఖకు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయశాఖ డెరైక్టర్ వైఎం.పాండే.. ఈ ఫిర్యాదును కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన హోంశాఖ కార్యదర్శి ఎన్ఆర్.సింగ్.. దీనిపై విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా కాంట్రా క్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు రకాల పోస్టుల్లో అప్పటి అవసరాల కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను తీసుకున్నారు. వీరిని ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగాల్లో పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం లో గతనెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 40 వేల మంది కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ కమిటీని నియమించింది. వూర్గదర్శకాలపై రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక 63,047 కోట్లు
* తెలంగాణ తొలి పరపతి ప్రణాళిక ఆవిష్కరణ * బంగారు తెలంగాణలో భాగస్వాములమవుతామన్న ఎస్బీహెచ్ ఎండీ * సీఎం కేసీఆర్ గైర్హాజరు, మంత్రులూ దూరం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మొదటి పరపతి ప్రణాళిక విడుదలయింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 63,047 కోట్లకుపైగా రుణాలు మంజూరు చేయనున్నట్టు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) రూపొందించిన పరపతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం విడుదల చేశారు. హోటల్ మారియట్‌లో తెలంగాణ ఎస్ఎల్బీసీ రెండో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులూ గైర్హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయశాఖల ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, బీఆర్ మీనా, పూనం మాలకొండయ్యలు హాజరయ్యారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల కింద రూ. 18,717.95 కోట్లు, టర్మ్ రుణాల కింద రూ. 6238.48 కోట్లు మంజూరు చేస్తామని ఎస్ఎల్బీసీ ప్రకటించింది. మొత్తం ప్రాధాన్య రంగాలకు రూ. 40,546.51 కోట్లు, ఇతర రంగాలకు మరో రూ.22,501.11 కోట్లు కలిపి మొత్తం రూ. 63,047.62 కోట్ల మేర తెలంగాణ రాష్ట్రంలో రుణాలను ఈ ఏడాది మంజూరు చేయనున్నట్టు ఈ పరపతి ప్రణాళికలో వివరించారు. గత ఏడాది రూ. 55113.45 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 14.4 శాతం అధికం. పరపతి ప్రణాళికలోని ముఖ్యాంశాలు... * వ్యవసాయ రంగానికి గత ఏడాదిరూ. 23,719 కోట్లు మంజూరు చేయగా, ఈసారి రూ.27,233.59 కోట్లను బ్యాంకులు మంజూరు చేస్తాయి. * నాబార్డు సూచనల మేరకు వ్యవసాయ రుణాల మొత్తాన్ని గత ఏడాది(రూ. 5,767 కోట్లు) ఇస్తే, ఈసారి రూ. 8.515.64 కోట్లకు పెంచారు. ఏడాదిలో అందరికీ బ్యాంకు అకౌంట్లు... వచ్చే ఏడాది ఆగస్టు 15లోగా అన్ని కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లు తెరవనున్నట్టు ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర లీడ్ బ్యాంక్ ఎస్బీహెచ్ ఎండీ శంతన్ ముఖర్జీ తెలిపారు. ఈ నెల 15 న ప్రధానమంత్రి మిషన్మోడ్ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. కొత్త రాష్ట్రం కావడంతో పరపతి ప్రణాళిక ప్రకటించడం ఆలస్యమైందన్నా రు. ఎస్బీహెచ్ తొలిసారి లీడ్‌బ్యాంక్‌గా ఎస్ఎల్బీసీకి నేతృత్వం వహిస్తోందన్నారు. విభజన సమయంలో వివరాలు ఇవ్వలేదు: సీఎస్ రాజీవ్‌శర్మ ఈ సమావేశానికి సీఎం రావాల్సి ఉన్నప్పటికీ రాలేకపోయారు. ఆయన సందేశాన్ని మీకు తెలుపుతున్నాను. రాష్ర్ట విభజన సమయంలో అధికార యంత్రాంగం నిమగ్నమైపోవడంతో పంట నష్టం వివరాలను అప్పట్లో ఆర్బీఐకి పంపలేకపోయారు. అదేవిధంగా రీ-షెడ్యూల్ చేయాలనీ కోరలేదు. దీంతో రీ-షెడ్యూల్ కాస్తా ఆలస్యమవుతోంది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే చేయబోతున్నాం. సబ్సిడీ తదితర పథకాలను ఆధార్‌కు లింకు చేస్తాం. నిజమైన లబ్ధిదారులకే రుణాలు అందేవిధంగా చూడాలి. సర్వే సందర్భంగా బ్యాంకు అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నామని, ఈ వివరాలను బ్యాంకర్లు కోరితే అందజేస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి చెప్పారు. పత్రికా ప్రకటన ఇవ్వండి.. కేవలం పంట రుణాలు, వ్యవసాయ బంగారు రుణాలను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తానని ప్రకటించినప్పటికీ స్వయం సహాయక సంఘాలు కూడా రుణాలు చెల్లిం చడం లేదని బ్యాంకర్లు వాపోయారు. అదేవిధంగా వ్యవసాయేతర అవసరాలకు తీసుకున్న బంగారు రుణాలను కూడా చెల్లించడం లేదని... పైగా వేలం పాటలను వచ్చి అడ్డుకుం టున్నారని సమావేశంలో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఎస్‌హెచ్‌జీలకు మొత్తం రూ. 2,600 కోట్ల రుణాలు ఇవ్వగా, ఇందులో 10 శాతం ఎన్పీఏలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పత్రికాప్రకటన ఇవ్వడంతో పాటు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, పీడీలు, ఐకేపీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణకు ఎస్ఎల్బీసీ స్టీరింగ్ కమిటీ తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. కమిటీ ఏర్పాటుకు ఎస్ఎల్బీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీలో ఎస్బీహెచ్, ఆంధ్రా బ్యాంకు, ఎస్బీఐ, డీజీబీ, ఆప్కాబ్లతో పాటు వివిధ ప్రభుత్వశాఖల అధికారులు ఉంటారు. రుణమాఫీతో పాటు ఎప్పటికప్పుడు తలెత్తే అంశాలపై చర్చించుకునేందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అవసరమని ఎస్ఎల్బీసీ అభిప్రాయపడింది. తెలంగాణలో బ్యాంకుల వివరాలు! సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొత్తం 4,526 బ్యాంకు శాఖలు ఉన్నాయి. 31 మార్చి 2014 నాటికి గ్రామాల్లో అత్యధికంగా 1,661 శాఖలు ఉండగా మెట్రో ప్రాంతాల్లో వివిధ బ్యాంకులకు చెందిన 1,317 శాఖలు పనిచేస్తున్నాయి. 31 మార్చి 2014 నాటికి వివిధ రంగాలకు బ్యాంకులు ఇచ్చిన అడ్వాన్సులు * తెలంగాణ రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో మొత్తం 2,85,879 కోట్ల డిపాజిట్లు ఉండగా... 3,24,964 కోట్ల అడ్వాన్సులున్నాయి. * మొత్తం ప్రాధాన్యరంగ అడ్వాన్సులు- 1,02,617 కోట్లు * ఇందులో వ్యవసాయరంగ అడ్వాన్సులు- 49,564 కోట్లు * వ్యవసాయేతర రంగ అడ్వాన్సులు- 29,301 కోట్లు -
రాజీవ్ శర్మతో రమాకాంత్ రెడ్డి భేటి!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి అనుసరించిన విధానాలపై చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమాకాంత్‌రెడ్డి భేటి అయ్యారు. రాజీవ్ శర్మతో భేటి తర్వాత రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లు, సెగ్మెంట్ల వారిగా ఓటర్ల వివరాల గురించి చర్చించామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, రిజర్వేషన్లు, డీ లిమిటేషన్ ఖరారు కోసం ప్రభుత్వానికి లేఖ రాశామని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. -
పదమూడు మంది ఐఏఎస్‌ల బదిలీ
మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియామకం సాక్షి, హైదరాబాద్: రెండు జిల్లాల కలెక్టర్లతో సహా, మొత్తం పదమూడు మంది ఐఏఎస్‌లను బదిలీచేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్‌లకు కొత్త కలెక్టర్లను నియమించారు. బదిలీ అయిన అధికారుల్లో నలుగురికి పోస్టింగ్ ఇవ్వలేదు. ‘సెర్ప్’అదనపు సీఈవో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్‌గా పనిచేసిన రోనాల్డ్‌రాస్‌ను నిజామాబాద్ కలెక్టర్‌గా, వాణిజ్య పన్నుల శాఖలో హైదరాబాద్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఇలంబర్తిని ఖమ్మం కలెక్టర్‌గా, ‘ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్’(అపార్డ్)లో కమిషనర్‌గా ఉన్న జి.డి.ప్రియదర్శినిని మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. కాగా, నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్నను బదిలీచేసి జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్‌గా నియమించిన సంగతి విదితమే. బదిలీ అయిన అధికారుల వివరాలివీ.. -
'గవర్నర్ అధికారాలపై ఇప్పుడు మాట్లాడవద్దు'
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. పీపీఏ, కృష్ణా జలాల అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తమ వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఆమోదించిన పీపీఏలను మాత్రమే కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కార్, కృష్ణా ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు. ఇక హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో రాజుకుంటున్న వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. -
'తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు'
హైదరాబాద్ : స్థానికత విషయంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత నరేందరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం నరేందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఆగస్టులోపు ఏ ప్రాంత ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరామన్నారు. స్థానికత సర్టిఫికెట్లను పరిశీలించేందుకు కమిటీ వేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు నరేందరరావు తెలిపారు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించినవారిపై కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన నేపధ్యంలో.. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఉద్యోగుల పంపిణీ సులభతరం కానుంది. లేదంటే ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ చిక్కుముడిగా మారి మరింత కాలం గందరగోళం తప్పకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కమలనాథన్ కమిటీకి ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. -
ఇరాక్ పరిణామాలపై కేసీఆర్ ఆరా
హైదరాబాద్ : ఇరాక్ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. అక్కడ పరిణామాలపై వివరాలు తెలుసుకోవాలని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఇరాక్ పరిణామాలపై విదేశాంగ శాఖతో సీఎస్ రాజీవ్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఇరాక్‌లో ఉన్న తెలుగువారి పరిస్థితిపై ఆయన ఆరా తీస్తున్నారు. కాగా ఇరాక్‌లో మిలిటెంట్లకు, ప్రభుత్వ బలగాలకు మధ్య హోరాహోరీ ఘర్షణలు సాగుతున్నాయి. సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక షియా పట్టణం తల్ అఫర్‌పై పట్టుకోసం ఇరు పక్షాలు భీకరంగా తలపడ్డాయి. మిలిటెంట్లు కొన్ని గంటలపాటు పట్టణంపై దాడి చేసి తల్‌అఫర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. కాల్పులు, పేలుళ్లకు బెదిరిన స్థానికులు పెద్ద సంఖ్యలో వలస పోతున్నారు. -
తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవు: టి.టీడీపీ
హైదరాబాద్: హిమాచల్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సరైన సహకారం అందించాలని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మను టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రమణ, తీగల కృష్ణారెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని.. పకడ్బందీగా చర్యలు తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజీవ్ శర్మకు సూచించారు. ఇప్పటికీ విద్యార్థుల ఆచూకీ తెలవక పోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొని ఉందని టీడీపీ నేతలు అన్నారు. -
సీనియర్ ఐఏఎస్‌లకు మరిన్ని అదనపు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరతతో ఇప్పటికే పలు శాఖల అదనపు బాధ్యతలతో ఇబ్బంది పడుతున్న సీనియర్ అధికారులకు ప్రభుత్వం మరికొన్ని అదనపు శాఖల బాధ్యతలు అప్పగించింది. ఐదుగురు అధికారులకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఇప్పటికే అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుంటే.. తాజాగా మారుమూల ప్రాంత అభివృద్ధి శాఖతోపాటు వర్షాభావ ప్రాంతాల అభివృద్ది శాఖను కూడా పర్యవేక్షిస్తారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రాకు హోంశాఖ అదనపు బాధ్యతలు ఇదివరకు ఉంటే.. తాజాగా సాధారణ పరిపాలన శాఖ (అకామిడేషన్స్)ను, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనంగా పశు సంవర్దకశాఖ ముఖ్యకార్యదర్శిగా, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా ఉన్న బి.జనార్దన్‌రెడ్డి ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖల కమిషనర్‌గా వ్యవహరిస్తుంటే.. తాజాగా సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ బాధ్యతను కూడా అప్పగించారు. -
రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
* 7న రాష్ర్టపతి, ప్రధానమంత్రితో భేటీ * పోలవరంపై ప్రధానికి వినతి పత్రం * డిమాండ్ల చిట్టా సిద్ధం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ శుక్రవారం తొలిసారిగా ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయున కేంద్రం వుుందు పలు డివూండ్ల చిట్టా ఉంచనున్నారు. ఇందుకోసం నివేదికలు తయూరుచేయూలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం సచివాలయుంలోని ‘సీ’ బ్లాక్‌లో అన్ని శాఖల కార్యదర్శులతో సవూవేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్‌వుుఖర్జీ, ప్రధాని మోడీని కలవనున్నారు. పోల వరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం అందజేయునున్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ వూర్చాలని టీఆర్ఎస్ డివూండ్ చేస్తున్న విషయుం విదితమే. రాష్ట్ర పునర్వ్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను ఏకరువు పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి నిలిచిపోరుున వుున్సిపల్, పంచాయుతీరాజ్ శాఖల నిధులు, జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం ట్రాన్సిషన్ పీరియడ్‌లో రావాల్సిన నిధుల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ఎస్సీ, ఎస్టీ పథకాల కింద నిధులు, రహదారులు, ఇతర ప్రభుత్వ గ్రాంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు లేదా గ్యాస్ సరఫరాకు సంబంధించి కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నట్లు తెలిసింది. -
‘విభజన’ పర్యవేక్షణకు కేంద్ర ప్రతినిధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేక ప్రతినిధిగా హోంశాఖలో అదనపు కార్యదర్శి (అంతర్గత భద్రత)గా పనిచేస్తున్న రాజీవ్‌శర్మను నియమించింది. ఆయన విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు నెలలో 20 రోజుల పాటు ఇక్కడ, మిగిలిన పది రోజులు కేంద్ర హోంశాఖలో పని చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన రాజీవ్‌శర్మ ప్రస్తుతం కేంద్రంలో డెప్యుటేషన్‌లో పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలోనూ, శ్రీకృష్ణ కమిటీ నోడల్ అధికారిగా రాజీవ్ శర్మ పని చేశారు. అఖిల భారత అధికారుల బదిలీలకూ... అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్రం సలహా కమిటీని నియమించింది. బీహార్ కేడర్‌కు చెంది, పదవీ విరమణ చేసిన 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో రాష్ట్ర సీఎస్ మహంతి, కేంద్ర హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత భద్రత), కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఐజీ(అడవులు)లను సభ్యులుగా, సభ్య కార్యదర్శిగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(సర్వీసెస్ అండ్ విజిలెన్స్)ను నియమించింది. ఈ కమిటీ విధి విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఠ పారదర్శక విధానాలపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కేడర్ సంఖ్యను నిర్ణయిస్తూ వారంలో నివేదికివ్వాలి. ఠ ఈ పంపిణీకి సంబంధించి ఈ మూడు కేడర్ల అధికారుల నుంచి సూచనలు, సలహాలు, వ్యాఖ్యానాలను పరిగణలోకి తీసుకుని, వాటిని సంబంధిత వెబ్సైట్లో పెట్టాలి. దానిపై వారం రోజులపాటు వారికి అవకాశమివ్వాలని, ఆ సూచనలు, సలహాలు వచ్చిన వారంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధికారుల కేటాయింపు మార్గదర్శకాలు ఇవ్వాలి. ఠ ఈ కమిటీ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ అయిన మూడు వారాల్లో ఆలిండియా సర్వీసు అధికారులను పారదర్శక విధానంలో కేటాయింపునకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు విభజించి నివేదిక ఇవ్వాలి. ఠ అనుమతించిన మొత్తం ఆలిండియా సర్వీసు అధికారులను నేరుగా భర్తీ, ప్రమోషన్లో వచ్చిన వారిని, వారిలోనూ అన్ రిజర్వుడ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరిల వారీగా, స్థానిక, స్థానికేతరులు వివరాలివ్వాలి. ఠ ఈ కేటగిరిలుగా విభజించిన తర్వాత వారంలో ఏ అధికారిని ఏ రాష్ట్రానికి పంపిం చాలన్న నివేదిక ఇవ్వాలి. ఠ అధికారుల విభజన తరువాత ఎవరైనా బాధిత అధికారి తన అభిప్రాయా న్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేసే పక్షంలో.. అందుకు సంబంధించిన వివరాలను ఆయా కేడర్లకు సంబంధించి నియంత్రిత విభాగం వెబ్సైట్లో ఉంచాలి. బదిలీల కమిటీకీ కమలనాథనే.. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల బదిలీ కమిటీ చైర్మన్‌గా సీఆర్ కమలనాథన్ అధ్యక్షతన కమిటీని కేంద్రం నియమించింది. బదిలీల కమిటీకి కూడా ఆయనను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, వి.నాగిరెడ్డి, డాక్టర్ పీవీ రమేష్, కేంద్ర ప్రభుత్వ డీవోపీటీ అదనపు కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా రాష్ట్ర కేడర్‌లో కార్యదర్శి హోదాలోని అధికారి వ్యవహరిస్తారు. -
‘విభజన’ వేగం పెంచండి
అపెక్స్ కమిటీతో సీఎస్ భేటీ అధికారుల కమిటీలన్నీ సమావేశమయ్యేలా నిర్దేశాలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగంలోకి మరో ఉప కార్యదర్శి ఎల్లుండి రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రంగాల వారీగా నియమించిన అధికారుల కమిటీల్లో ఇంకా సగం కమిటీలు ఒక్క సారి కూడా సమావేశాలు కాలేదు. ప్రధానంగా రహదారులు - భవనాలు, రవాణా, వైద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, న్యాయ తదితర రంగాలకు చెందిన కమిటీలు ఇంకా ఒక్క సారి కూడా సమావేశాలను నిర్వహించలేదు. ఉద్యోగులు, ఆర్థిక, ప్రభుత్వ రంగ సంస్థలు తదితర రంగాలపై ఏర్పాటైన కమిటీలు మాత్రమే సమావేశమయ్యాయి. అన్ని రంగాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోను మే 31వ తేదీ కల్లా విభజన పనులు పూర్తి చేయించాలని పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం విభజనపై ఉన్నతస్థాయి కమిటీ కన్వీనర్ సత్యప్రకాశ్ టక్కర్‌తో సమావేశమై చర్చించారు. ఇప్పటివరకు సమావేశం కాని కమిటీలతో వెంటనే సమావేశాలను ఏర్పాటు చేయించాలని, అన్ని రంగాల్లో విభజన పనిపై వేగం పెంచాలని సీఎస్ ఆదేశించారు. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆదేశాలన్నీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ద్వారానే చేయాల్సి ఉన్నందున ఆ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎస్ సూచించారు. ఇప్పటికే ఆ విభాగంలో అదనంగా ఉప కార్యదర్శిని నియిమించగా మరో ఉప కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. వచ్చే వారంలో గవర్నర్ సమీక్ష... విభజన పని పురోగతిపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి మంగళవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా వస్తున్నారు. విభజన పనుల పురోగతిపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వచ్చే వారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విభజన అపెక్స్ కమిటీకి గవర్నర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శక సూత్రాల రూపకల్పనకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ కమలనాథన్ శనివారం సీఎస్ మహంతితోను, ఆర్థికశాఖ అధికారులు పి.వి.రమేశ్, రామకృష్ణారావులతోను సమావేశమై మార్గదర్శక సూత్రాల తీరుతెన్నులపై చర్చించారు.