ఏపీ ఉద్యోగులపై బదిలీ అస్త్రం
- తొలి విడతగా 12 మంది పీఎస్‌ల బదిలీ
- జాబితాలో మరో 115 మంది
- వీరిలో 70 మంది సెక్షన్ ఆఫీసర్లు
- దశల వారీగా బదిలీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులపై తెలంగాణ సర్కారు బదిలీల అస్త్రం ప్రయోగించింది. పలువురు ఉన్నతాధికారుల వద్ద పని చేస్తున్న 12 మంది వ్యక్తిగత కార్యదర్శులను తొలి విడతగా ఇటీవలే బదిలీ చేసింది. వీరందరూ ఏపీకి చెందిన వారని... దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మార్పులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో దశలవారీగా మరో 115 మంది ఏపీ ఉద్యోగులను బదిలీ చేసేందుకు కసరత్తు మొదలైంది. వీరిలో వివిధ శాఖల్లో 70 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు.
తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న పీఎస్‌ల్లో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ వారున్నారు. కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. కానీ కీలక పోస్టుల్లో ఉన్నందున వీరంతా తెలంగాణలో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారని, ఉన్నతాధికారుల పేషీల్లో ఉండటంతో రకరకాల విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనేది తెలంగాణ ఉద్యోగుల ఆందోళన. వరుసగా వెల్లువెత్తిన ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం కొన్ని కీలక స్థానాల్లో ఉన్న ఏపీ ఉద్యోగుల బదిలీలకు మొగ్గు చూపింది.
ఈ నేపథ్యంలో జరిగిన బదిలీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతోపాటు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్, జీఏడీ కార్యదర్శి బూసాని వెంకటేశ్వరరావు, హోంశాఖ అదనపు కార్యదర్శి అనితా రాజేంద్ర దగ్గర పని చేస్తున్న వ్యక్తిగత కార్యదర్శులున్నారు. మరోవైపు కొందరు ఉన్నతాధికారులు ఉద్యోగుల విభజన నిబంధనలన్నీ లెక్క చేయకుండా తమ ఇష్టపూర్వకంగా ఏపీకి చెందిన పీఎస్‌లను నియమించుకున్నారు.
మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ వద్ద పని చేస్తున్న పీఎస్‌ను ఇటీవలే ఆంధ్రా నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చినట్లు ఫిర్యాదులున్నాయి. తాము ఇష్టపూర్వకంగా నియమించుకున్న పీఎస్‌ను బదిలీ చేయటం సరికాదని ఒక ముఖ్య కార్యదర్శి సీఎస్‌ను కలసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే తన దగ్గరున్న పీఎస్ కూడా ఇదే బదిలీ జాబితాలో ఉన్నారని, ఈ వ్యవహారంలో తాను చేసేదేమీ లేదని సీఎస్ తన అశక్తతను వెలిబుచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీ అయిన వారంతా ఏపీకి చెందిన వారవటం, వీరెవరికీ పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెంటనే రిలీవ్ కావాలని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. బదిలీ అయిన వారి స్థానంలో తెలంగాణ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, ఆ స్థాయి ఉద్యోగులు లేకుంటే వారికి పదోన్నతులిచ్చి నియమించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
మంత్రుల పేషీల్లోనూ మాజీ పీఎస్‌లు
తెలంగాణ మంత్రుల పేషీల్లో గతంలో మంత్రుల వద్ద పని చేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా సెటిలయ్యారు. కాంగ్రెస్ హయాంలో మంత్రుల వద్ద పని చేసిన పీఎస్‌లు, ఓఎస్డీలు, పీఏలను నియమించుకోవద్దని సీఎం కేసీఆర్ గతంలోనే మంత్రులను హెచ్చరించారు. దీంతో కొందరు మంత్రులు వారిని మార్చుకున్నా క్రమంగా పాత కథ పునరావృతమవుతోంది. మంత్రులు తుమ్మల, హరీశ్, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేషీల్లో కాంగ్రెస్ హయాంలో మంత్రుల వద్ద పని చేసిన ఉద్యోగులే హల్‌చల్ చేస్తున్నారు.