Kamalanathan Committee
-
రాహుల్.. మేం చెప్పింది శ్రద్ధగా విన్నారు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీని ఆ పార్టీ ముఖ్యమంత్రులు సోమవారం బుజ్జగించే ప్రయత్నం చేశారు. గుజరాత్ సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలో ముఖ్యమంత్రులు కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), వీ నారాయణస్వామి (పుదుచ్చేరి) తదితరులు రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిమతాన్ని ఆయనకు వివరించిన ముఖ్యమంత్రులు.. రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయనను మరోసారి కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అశోక్ గహ్లోత్.. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల మనోభావాలను రాహుల్‌గాంధీకి వివరించామని, తమ వాదనను శ్రద్ధగా ఆయన ఆలకించారని, రాజీనామా విషయంలో ఆయన ‘సరైన నిర్ణయం’ తీసుకుంటారని నమ్మకముందని వివరించారు. పార్టీని రాహుల్ గాంధీ ముందుండి నడిపించాలని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ముక్తకంఠంతో చెప్తున్నారని గహ్లోత్ వివరించారు. ఇక, మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఫలితాల నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు కమల్‌నాథ్ మరోసారి సిద్ధపడినట్టు వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. -
ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శస్త్రచికిత్స జరిగింది. భోపాల్‌లోని హమిదియా హాస్పటల్లో ఆయన వేలుకు (ట్రిగ్గర్ ఫింగర్) వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది,. కొన్ని గంటలపాటు ముఖ్యమంత్రిని అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘కమల్ నాథ్ శనివారం ఉదయం 9 గంటలకు హమీదియా ఆసుపత్రిలో చేరారు. అతని కుడి చేతి ట్రిగ్గర్ వేలికి ఆస్పత్రి వైద్య బృందం శస్త్రచికిత్స చేసింది’ అని గాంధీ మెడికల్ కాలేజీ డీన్ అరుణ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సీఎంకు కొన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు శనివారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. మరోవైపు హాస్పటల్లో ఇతర రోగులు, సిబ్బందికి అసౌకర్యం కలిగించవద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావద్దంటూ కమల్‌నాథ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్‌నాథ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. -
‘ఆ ముఖ్యమంత్రి జైలుకెళ్లడం ఖాయం’
చండీగఢ్: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్లా ఆయన కూడా జైలుకెళ్లడం ఖాయమని సిర్సా పేర్కొన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసును మళ్లీ తెరిచి తాజాగా విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ సిట్‌ను ఆదేశించిన నేపథ్యంలోనే సిర్సా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజా విచారణ పూర్తై, ఈ కేసులో కమల్‌నాథ్ నిందితుడని తేలితే ఆయన కటకటాలు లెక్కించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నియమించడంపై గతంలోనే సిర్సా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిక్కులను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిని సీఎంగా ఎలా నియమిస్తారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఇందిర మరణాంతరం జరిగిన ఘటనతో కమల్‌నాథ్ హస్తం కూడా ఉందని ఎంతోకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును మరోసారి విచారించాలంటూ కేంద్ర హోంశాఖ తాజాగా సిట్‌ను ఆదేశించడంతో మరోసారి తెరపైకి వచ్చింది. కాగా సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
‘ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోండి’
భోపాల్: ఆరు నెలల క్రితం జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌సింగ్ ప్రభుత్వాన్ని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొవాల్సి వస్తోంది. కేంద్రంలో భారీ మెజార్టీ దక్కించుకున్న బీజేపీ మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మెజార్టీ లేకపోవడంతో బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో సీఎం పిఠాన్ని అధిష్టించిన కమల్‌నాథ్‌కు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం దినదిన గండంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకత్వం భారీగా ఆఫర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంత్రులకు పలు ఆదేశాలు జారీచేశారు. ఎమ్మెల్యే జారిపోకుండా ప్రతి మంత్రి బాధ్యత తీసుకోవాలని.. ఒక్కో మంత్రి కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలపై కన్నేసి ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నందున వాటిని తిప్పికొట్టాలని, సభ్యులను కాపాడకునే బాధ్యత మీదేనని సూచించారు. ముఖ్యంగా బీఎస్పీ, స్వతంత్ర ఎమ్యెల్యేలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అసెంబ్లీలో కమల్‌నాథ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే భాజపా నాయకులు సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న అభద్రతా భావంలో కాంగ్రెస్ ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. కాగా 230 మంది శాసన సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 114 మంది కాంగ్రెస్, 109 మంది బీజేపీ సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది కావడంతో ఇద్దరు బీఎస్పీ, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలావుండగా.. తమకు భారీ మొత్తంలో డబ్బుతో పాటు, మంత్రిపదవులు ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్ చేస్తున్నారంటూ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కమల్‌నాథ్ మంత్రులను అలర్ట్ చేశారు. -
‘50 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేశారు’
భోపాల్: తమ పార్టీలో చేరితే రూ.50 కోట్లతో పాటు మంత్రి పదవినీ కట్టబెడుతామని బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నదని మధ్యప్రదేశ్ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరమని ఆ నేతలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు ఆఫర్లు ఇస్తున్నారని ఆమె వెల్లడించారు. డబ్బుకు ఆశపడ్డ వాళ్లు బీజేపీ ప్రలోభాలకు లొంగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. తాను మాత్రం కమల్‌నాథ్ ప్రభుత్వానికే మద్దతు ఇస్తానని, బీజేపీ గూటికి చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘మంత్రి పదవితో పాటు డబ్బు ఇస్తామని నాకు ఫోన్ కాల్ వచ్చింది. కానీ, నేను తిరస్కరించా. వారి నెంబర్స్ బ్లాక్ చేశాను’’ అని అన్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బులను ఎరగా చూపుతూ బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న తెలిసిందే. బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక్కసీటు మినహా మిగతా వాటన్నింటినీ బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా రాంబాయి సంచలన వ్యాఖ్యలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను అస్థిరపరిచి ప్రభుత్వాలను ఏర్పాటుచేయాలని బీజేపీ ఆపరేషన్ కమల్‌కు శ్రీకారం చుడుతోన్న విషయం తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రల్లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గోడ దూసుతారోనని పార్టీ నేతలకు భయం పట్టుకుంది. -
రాజకీయ సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్
-
కమల్‌నాథ్‌కు బీజేపీ చెక్?
భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం పూర్తిస్థాయి మెజారిటీ లేదనీ, అసెంబ్లీలో బలపరీక్ష కోసం తాము గవర్నర్‌ను కలుస్తామని ప్రకటించింది. ఈ విషయమై మధ్యప్రదేశ్ విపక్ష నేత గోపాల్ భార్గవ మాట్లాడుతూ..‘రుణమాఫీ, శాంతిభద్రతలు, తాగునీటి సమస్య వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడంతో పాటు ప్రభుత్వ మెజారిటీ విషయంలో బలపరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మేం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు ఇప్పటికే లేఖ రాశాం. ముఖ్యమైన అంశాలపై చర్చించకుండా ముఖం చాటేస్తున్న కమల్‌నాథ్ ప్రభుత్వం గుట్టలకొద్దీ కాగితాలను మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇంటికి పంపుతోంది. రాష్ట్రంలోని 21 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసేశామని చెబుతోంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ బలహీన కాంగ్రెస్ ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉందా? లేదా? అని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా, స్థిరంగా కొనసాగడంపై ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డ మరుసటి రోజే మధ్యప్రదేశ్‌లో కమలనాథులు బలపరీక్ష కోరడం గమనార్హం. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు అవసరమైన నేపథ్యంలో బీఎస్పీ(2), ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బీజేపీ కుట్ర పన్నుతోంది: కాంగ్రెస్ అవినీతి పద్ధతుల ద్వారా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీపక్ బబరియా ఆరోపించారు. మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. విశ్వాస పరీక్షకు సిద్ధం: కమల్‌నాథ్ విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమల్‌నాథ్ చెప్పారు. గడిచిన ఐదు నెలల్లో నాలుగు సార్లు తమ సంకీర్ణ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నామనీ, అవసరమైతే మరోసారి కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. -
చింద్వారాలో చిందేస్తున్న వారసుడు
మధ్యప్రదేశ్‌లో మొదట్నించీ కాంగ్రెస్ కంచుకోట చింద్వారా లోక్‌సభ స్థానం. 1957లో అవతరించిన చింద్వారాలో పోలింగ్ ఈ నెల 29న జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ 1980 నుంచి 2014 ఎన్నికవరకూ ఇక్కడ తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన కొడుకు నకుల్‌నాథ్ పోటీచేస్తున్నారు. 1996లో ఓ కోర్టు కేసు కారణంగా కమల్‌నాథ్ పోటీ చేయలేదు. భార్య అల్కానాథ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి విజయం సాధించారు. ఈ కేసులో క్లీన్చిట్ రావడంతో 1997లో తన భార్యతో రాజీనామా చేయించగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి బీజేపీ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఇదే మొదటిసారి. మళ్లీ 1998 నుంచీ కమల్‌నాథ్ గెలుస్తూ వచ్చారు. 44 ఏళ్ల నకుల్‌నాథ్ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. 1996లో తన తల్లి అల్కా గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారు. ఎన్నికల అనుభవం లేకున్నా చింద్వారాలో కమల్‌నాథ్ వేసిన పునాదులు నకుల్‌కు ఉపయోగపడతాయి. కిందటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి బదులు నాథన్ షా కర్వేటీకి బీజేపీ టికెట్ ఇచ్చారు. ఆరెసెస్ నేపథ్యం ఉన్న యువ ఆదివాసీ నేత నాథన్ షా. తొలి నుంచీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం, ఢిల్లీలో వారి కోసం 24 గంటలూ పనిచేసే ఆఫీసు ఏర్పాటు చేయడం ద్వారా చింద్వారా ప్రజల్లో కమల్‌నాథ్ తిరుగులేని ఆదరణ సంపాదించారు. కాంగ్రెస్ గెలుపు సునాయాసమే! చింద్వారా సీటుకు నకుల్ పేరు ఒక్కటే ప్రతిపాదించడం, తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండడం, బలహీనమైన బీజేపీ ప్రత్యర్థి బరిలో ఉండడం వంటి కారణాల వల్ల నకుల్ గెలుపు నల్లేరుపై నడకగా వర్ణిస్తున్నారు. చిన్న వయసు నుంచీ తండ్రితోపాటు చింద్వారాలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం, సెలవులు ఇక్కడే గడపడంతో నకుల్‌కు ఈ ప్రాంతం కొత్త కాదు. కిందటి డిసెంబర్లో తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచీ నకుల్ చింద్వారా వచ్చి కాంగ్రెస్ నాయకులతో సమావేశం కావడం ఎక్కువైంది. నకుల్కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చింది. తండ్రికి సీఎం పదవి దక్కినప్పుడు కొడుకుకు లోక్‌సభ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్‌లో కొత్తేమీ కాదు. -
మధ్యప్రదేశ్‌లో 281 కోట్ల అక్రమ నిల్వలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన సోదాల్లో రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని ఐటీ అధికారులు చెప్పారు. ఈ నిధుల్ని సేకరించేందుకు విస్తృతంగా వ్యవస్థీకృత రాకెట్ ఒకటి నడుస్తోందని తెలిపారు. ఆదివారం నాటి దాడుల్లో లెక్కల్లో చూపని రూ.14.6 కోట్ల నగదు, మధ్యప్రదేశ్–ఢిల్లీ మధ్య జరిగిన అనుమానిత లావాదేవీలకు సంబంధించిన కంప్యూటర్ ఫైల్స్‌ను జప్తు చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో నివాసముంటున్న ఓ నాయకుడి ఇంటి నుంచి నుంచి ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయానికి రూ.20 కోట్లు తరలించినట్లు గుర్తించామని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) తెలిపింది. నకిలీ బిల్లుల ద్వారా రూ.242 కోట్లను దోచుకున్నట్లు కనిపెట్టామని పేర్కొంది. -
కమల్‌నాథ్ సంబంధీకులపై ఐటీ దాడులు
భోపాల్/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, ఆఫీస్లపై ఆదాయ పన్ను శాఖ దాడుల చేసింది. ఐటీ ఎగవేత, నగదు అక్రమ చలామణి ఆరోపణలపై 200 మంది ఐటీ అధికారులు, పోలీసులు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో 50 చోట్ల సోదాలు చేశారు. దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 14 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులకు భద్రతగా సీఆర్పీఎఫ్ బలగాల్ని మోహరించారు. ఇండోర్, భోపాల్, ఢిల్లీలో సోదాల్లో కమల్‌నాథ్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) ప్రవీణ్ కక్కడ్, మాజీ సలహాదారు రాజేంద్ర మిగ్లానీ ఇళ్లలో సోదాలు చేశారు. సీఎం బావమరిది సంస్థ మోసర్ బేయర్, మేనల్లుడు రతుల్ పూరి సంస్థల ఎగ్జిక్యూటివ్‌ల ఇళ్లలో సోదాలు చేశారు. మాజీ కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియాకూ ఓఎస్డీగా ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భూరియా రాట్లాం–జాబువా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో గత వారం ఈడీ ఢిల్లీలో రతుల్ పూరిని విచారించింది. కోల్‌కతాకు చెందిన వ్యాపారి పరాస్ మల్ లోధా కార్యాలయంలో కూడా దాడులు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐటీ దాడులపై కమల్‌నాథ్ స్పందిస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. భోపాల్‌లో ‘కోల్‌కతా’ డ్రామా ఐటీ దాడుల సందర్భంగా భోపాల్‌లో కోల్‌కతా తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ప్రవీణ్ కక్కడ్ సన్నిహితుడు ప్రవీణ్ ఇంటికి పోలీసులొచ్చాక సీన్ సీరియస్‌గా మారింది. పోలీసులను చూడగానే ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ సాయంతో ఇంటి తలుపులు మూసేశారు. దీంతో కొద్ది సేపు ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. లోపల సోదాలు కొనసాగుతున్నందునే బయటి వారికి అనుమతించలేదని అన్నారు. తమ చర్యను భోపాల్ పోలీసులు సమర్థించుకున్నారు. ఐటీ దాడులతో తమకేం సంబంధం లేదని, ప్రవీణ్ కుమార్ నివాసంలో ఒకరికి అత్యవసరంగా వైద్యం అందించాలని సమాచారం అందిందని, అందుకే అక్కడికి తమ సిబ్బంది వెళ్లారని భోపాల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. -
కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు
ఇండోర్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇండోర్‌లోని సీఎం ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 15మంది ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అలాగే సీఎం అడ్వైజర్ రాజేంద్ర కుమార్ ఇంట్లో (ఢిల్లీ) కూడా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు రూ.9కోట్లు నగదు లభించినట్లు సమాచారం. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు మొత్తం ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ ఇద్దరు అధికారులు ...తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరు అధికారులు హవాలా రూపంలో నగదును తరలిస్తున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో ఐటీ దాడులు జరిపినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్’
భోపాల్ : కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి... సబల్‌ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నేత బాజీనాథ్ కుశ్వాహను కలిశారు. అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకువెళ్లారు. అక్కడే బీజేపీ మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్ బాజీనాథ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ జూపారు. అలాగే వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతామని ఆయనకు చెప్పారు. కానీ బాజీనాథ్ వీటిని తిరస్కరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇలా దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది’ అని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. కాగా దిగ్విజయ్ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడం దిగ్విజయ్‌కు అలవాటేనని, ఆయనో ‘గాసిప్ మాంగర్’ అని విమర్శించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని, అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీయే కాబట్టి మీటింగ్ జరిగిందని చెబుతున్న దాబాకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తెచ్చి వీటిని నిరూపించాలని సవాల్ విసిరారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో కమల్‌నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో 15 సంవత్సరాల సుదీర్ఘ బీజేపీ పాలనకు తెరపడింది. -
కాంగ్రెస్ సీఎంల వివాదాస్పద నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొలువుతీరిన కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రులు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరవు తీస్తున్నాయా? రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అవి దెబ్బతీయనున్నాయా? అసలు ఆ వివాదాస్పద నిర్ణయాలు ఏమిటీ? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్లో వెలువడగానే ముఖ్యమంత్రి పదవికి జ్యోతిరాదిత్య సింధియాకు బదులుగా కమల్‌నాథ్‌ను రాహుల్ గాంధీ ఎంపిక చేయడమే మొట్టమొదట వివాదాస్పదమైంది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్ పాత్రను తప్పుపట్టిన నానావతి కమిషన్, ఆయన నుంచి వివరణ కోరింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2015లో సిక్కుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అలాంటప్పుడు సీఎం పదవికి ఆయన్ని దూరంగా పెట్టి ఉంచాల్సింది. పార్టీకి అతి తక్కువ మెజారిటీ ఉన్నందున ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి కమల్‌నాథ్ వంటి అనుభవజ్ఞులు ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ సిక్కుల ఊచకోతతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని సీఎంను చేశారంటూ ఆరోపించడం ఇక్కగ గమనార్హం. ఇక కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. యూపీ, బీహార్ నుంచి వస్తున్న వలసదారులు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఇక రాష్ట్ర సచివాలయంలో గత 13 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ‘వందేమాతరం’ గీతాలాపనను నిలిపివేయడం. పైగా ఆ ఆనవాయితీని మరింత మెరుగ్గా అమలు చేద్దామనే ఉద్దేశంతోనే రద్దు చేశానంటూ సమర్థించకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసు బ్యాండ్తోని వందేమాతర గీతాలాపన పునరుద్ధరిస్తున్నట్లు కమల్‌నాథ్ ప్రకటించాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రం నుంచి జైలుకెళ్లిన వారికి బీజేపీ ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన నెలకు పాతిక వేల రూపాయల పింఛన్ పథకాన్ని నిలిపివేయడం కమల్ నాథ్ సర్కార్ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అంతే చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కూడా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుంచి 2017 వరకు బస్తర్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచే సిన ఎస్ఆర్పీ కల్లూరిని రాష్ట్ర అవినీతి వ్యతిరేక బ్యూరో, ఆర్థిక నేరాల విభాగంకు అధిపతిగా నియమించడం వివాదాస్పదమైంది. ఆ మూడేళ్ల కాలంలో ఆయన అనేక బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడ్డారని, ప్రజలపై దౌర్జన్యం చేయడంతోపాటు రేప్‌లు చేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. అప్పుడు కల్లూరిని జైల్లో పెట్టాలని చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో డిమాండ్ చేసిన భూపేష్ ఆయన సీఎం హోదాలో పదవిలోకి తీసుకోవడం వివాదాస్పదమైంది. ఇలాంటి నిర్ణయాలు మొత్తం కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం
భోపాల్: మధ్యప్రదేశ్ సచివాలయంలో ‘వందేమాతరం’ ఆలపించకపోవడం కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ సచివాలయంలో ప్రతినెల మొదటి పని దినం రోజున వందేమాతర గేయాన్ని ఆలపించాలని అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, జనవరి 1వ తేదీన మాత్రం సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్.. వందేమాతరం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని.. అది దేశభక్తిగా ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం, దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్ మరచిపోరాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా క్యాబినేట్ మీటింగ్ ప్రారంభానికి ముందు కూడా వందేమాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో జనవరి 6వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందేమాతర గేయాన్ని ఆలపిస్తానని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్.. వందేమాతర గేయం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా మాట్లాడుతూ.. ఎస్సార్ మొహంతి మంగళవారం రోజున సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారని.. అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉండటం వల్ల వందేమాతరాన్ని ఆలపించే కార్యక్రమం నిర్వహించలేకపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వందేమాతర గేయంపై బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందని నిలదీశారు. -
వలసల భారతం ఏం చెబుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్ నాథ్ మాట్లాడుతూ స్థానికుల ఉద్యోగావకాశాలను ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. ఇక నుంచి స్థానికులకు 70 శాతం ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు తన ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఆయన మాటల్లో నిజమెంత ? అబద్ధం ఎంత ? అసలు వాస్తవం ఎంత ? వాస్తవానికి మధ్యప్రదేశ్‌కు వలసవస్తున్న వారి కన్నా మధ్యప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. 1991–2001 దశాబ్దంతో పోలిస్తే 2001 నుంచి 2011 దశాబ్దానికి రాష్ట్రం నుంచి వలసపోతున్న వారి సంఖ్య 461 శాతం పెరిగింది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకన్నా వలసపోతున్న వారి సంఖ్య తక్కువే. మధ్యప్రదేశ్ నుంచి ఒక్కరు వలసపోతే బీహార్ నుంచి 3.5, ఉత్తరప్రదేశ్ నుంచి 7.6 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. బీహార్ నుంచి వలసపోతున్నవారి కన్నా వలసవస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ అంటే యూపీ నుంచి బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి వలస పోతున్నవారి సంఖ్య మరీ తక్కువనే విషయం అర్థం అవుతోంది. యూపీ, బీహార్ నుంచి గతంలో ఎక్కువ మంది మహారాష్ట్రకు వెళ్లగా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ పట్టణాలకు ఎక్కువగా వెళుతున్నారు. గతంతో పోలిస్తే యూపీ నుంచి వలసపోతున్న వారి సంఖ్య దశాబ్ద కాలంలో 197 శాతం పెరగ్గా, బీహార్ నుంచి 237 శాతం పెరిగింది. భారత దేశంలోని ప్రజలు ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం కొత్త విషయం కాదు. స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్నదే. అయితే స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఎక్కడికైనా వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకునే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగ పరంగా సంక్రమించింది. ఈ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాలు కూడా విడిపోవాల్సి వచ్చింది. 1960వ దశకంలో తమిళనాడులో హిందీ భాషకు, హిందీ మాట్లాడే వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆ తర్వాత అస్సాంలో బెంగాలీ, హిందీ, నేపాలీ భాషలు మాట్లాడే వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఇక మహారాష్ట్రలో 1960 దశకం నుంచి ఇప్పటికీ ఉత్తర భారతీయులతోపాటు దక్షిణ భారతీయులు కూడా స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మరాఠీ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. 2017లో కర్ణాటకలో కూడా హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మొన్న అక్టోబర్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరగ్గా వేలాది మంది గుజరాత్ నుంచి పారిపోయారు. హిందీ మాట్లాడే వారు తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ ఇతర రాష్ట్రాల వారు ఇంతవరకు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తుండగా, తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ ఓ హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ఆరోపించడం ఇదే తొలిసారి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 2017 నాటికి దేశంలో వలసపోయిన వారి సంఖ్య 45.36 కోట్లు. ఈ సంఖ్య మరింత పెరిగితే చైనాలోలాగా వలసల నియంత్రనకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. -
ముగ్గురు సీఎంల పట్టాభిషేకం
ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనంద డోలికల్లో ముంచితే, మరోవైపు ఆ పార్టీని వెంటాడుతున్న సిక్కుల ఊచకోత కేసులో తీర్పు ఇరకాటంలో పడేసింది. 1984 నాటి ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ను హైకోర్టు దోషిగా తేల్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన గహ్లోత్, కమల్‌నాథ్, బఘేల్ సీఎంలుగా ప్రమాణం చేయగా.. సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. సిక్కుల ఊచకోతలో పాపం మూటగట్టుకున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ నిలదీసింది. ఈ ఘటనలన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం. సోమవారం ఉదయం రాజస్తాన్ సీఎంగా అశోక్ గహ్లోత్ జైపూర్‌లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ భోపాల్‌లో, సాయంత్రం రాయ్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్ ప్రమాణం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆడంబరంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్‌నాథ్ రైతుల రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎం బఘేల్ రైతుల స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు. గహ్లోత్ ముచ్చటగా మూడోసారి.. జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ రాజస్తాన్‌కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్లో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్యాణ్‌సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా యువనేత సచిన్ పైలట్ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగో నేతగా గహ్లోత్ రికార్డు సృష్టించారు. గహ్లోత్ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్బర్ట్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, మాజీ సీఎం వసుంధరా రాజే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముక్తిమోర్చా నేత హేమంత్ సోరేన్, జార్ఖండ్ వికాస్ మోర్చా నేత బాబూలాల్ మరాండీ, కర్ణాటక, ఏపీ సీఎంలు కుమారస్వామి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 11వేల మంది కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో ఆల్బర్ట్ హాల్ కిటకిటలాడింది. చాలా మంది కుర్చీల పైకెక్కి తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. దీంతో కొందరు నేతలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు హైరానా పడాల్సి వచ్చింది. గహ్లోత్, పైలట్ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరు నేతల అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టింది. రాజధానికి వచ్చే రోడ్లన్నిటిలోనూ సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. సఫా ధరించిన పైలట్ సచిన్ పైలట్(41) ప్రమాణ స్వీకారం సందర్భంగా తెల్లటి కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్‌తోపాటు తలపై రాజస్తానీ స్టయిల్ ఎర్రటి తలపాగా ‘సఫా’ ధరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ‘సఫా’ ధరించబోనంటూ 2014లో ఆయన శపథం చేశారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పైలట్..ఈసారి అసెంబ్లీకిఎన్నికయ్యారు. గహ్లోత్‌కు అభినందనలు చెబుతున్న మాజీ సీఎం వసుంధరా రాజే తలపాగాతో పైలట్ రుణమాఫీపై తొలి సంతకం మధ్యప్రదేశ్ 18వ సీఎంగా కమల్‌నాథ్ భోపాల్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులెవరూ లేకుండా ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్‌కు ఎదురెళ్లిన కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన్ను వేదికపైకి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కుమారస్వామి, నారాయణస్వామి, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు.. కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాశ్ జోషి, బాబూలాల్‌గౌర్ హాజరయ్యారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన సీఎం కమల్‌నాథ్ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి. సీఎం సంతకం అయిన వెంటనే రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ అరోరా ‘మధ్యప్రదేశ్‌లోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు చెందిన రూ.2 లక్షల లోపు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. భోపాల్‌లో సింధియా, కమల్‌నాథ్‌లతో చేతులు కలిపిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ లబ్ధి కోసమే అల్లర్ల అంశం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనలకు సంబంధించి తనపై ఎటువంటి కేసులు లేవని, చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని మధ్యప్రదేశ్ కొత్త సీఎం కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ వెలువడుతున్న వార్తలు రాజకీయ లబ్ధి కోసం లేవనెత్తినవేనన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడా రు. ‘గతంలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు కూడా చేశా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా పనిచేశా. అప్పట్లో నాపైన ఎలాంటి కేసులు లేవు. చార్జిషీటు కూడా లేదు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసు’ అని కమల్‌నాథ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్ రాయ్‌పూర్: కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని బల్బీర్ జునేజా ఇండోర్‌స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, భారీ వర్షం రాకతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సైన్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మార్చాల్సి వచ్చింది. పెథాయ్ తుపాను ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముందుగా సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కురియడంతో కార్యక్రమ వేదికను హడావుడిగా బల్బీర్ జునేజా ఇండోర్ స్టేడియంలోకి మార్చారు. బఘేల్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు కూడా ఈ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మాజీ సీఎం రమణ్‌సింగ్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రమాణం అనంతరం సీఎం బఘేల్ చెప్పారు. రాష్ట్రంలో 2018, నవంబర్ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పారు. బఘేల్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐక్యతా రాగం...: సోమవారం జైపూర్‌లో అశోక్ గహ్లోత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐక్యత తెలుపుతున్న నేతలు..ఎంకే స్టాలిన్, చంద్రబాబు, కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, రాహుల్, శరద్‌యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ అందరూ కలిసి ఒకే బస్సులో...: గహ్లోత్ ప్రమాణస్వీకార వేదిక వద్దకు బస్సులో వెళ్తున్న రాహుల్, మన్మోహన్, శరద్ పవార్, శరద్ యాదవ్, స్టాలిన్ తదితరులు మేనల్లుడికి అభినందనలు..: జ్యోతిరాదిత్యను ఆప్యాయంగా హత్తుకున్న మేనత్త, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే -
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్.. 17న ప్రమాణస్వీకారం
-
17న కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిశారు. ఆయన వెంట సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచౌరీ, వివేక్ తన్ఖా, అరుణ్ యాదవ్ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్..‘రాజ్యాంగంలోని ఆర్టికల్–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్‌నాథ్‌కు ఆమె ఓ లేఖ అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది. అపార అనుభవం, ఆర్థిక బలం కమల్‌నాథ్‌ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి.. ► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత. ► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు. ► 9 సార్లు లోక్‌సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు. ► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు. ► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్ నాథ్‌పై ఉన్నది అభిమానమని అంటుంటారు. పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు. ► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్ స్కూల్లోనే సంజయ్ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్‌లకు విశ్వసనీయ సలహాదారు. ► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్ మార్క్ అయిన 116 సాధించింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్‌నాథ్ వల్లనే సాధ్యమన్న నమ్మకం. ► లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం, వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం. ► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది. -
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్
-
మధ్యప్రదేశ్‌కు కమలనాథుడే
సాక్షి, ప్రతినిధి, న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చల అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడింది. ఫలితాలు విడుదలైన దాదాపు 24 గంటల అనంతరం కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్ పీఠంపై కూర్చోనున్నది ఎవరో తేలింది. తీవ్ర ఉత్కంఠ అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఊహాగానాలకు తెరదించుతూ గురువారం అర్ధరాత్రి సమయంలో పార్టీ ట్వీటర్ హ్యాండిల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథేనంటూ స్పష్టత ఇచ్చింది. దాంతో భోపాల్, తదితర మధ్యప్రదేశ్ నగరాల్లో కమల్‌నాథ్ అభిమానాలు బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందే కమల్ నాథ్, యువ నేత జ్యోతిరాదిత్య సింధియాలు భోపాల్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమల్‌నాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలవనున్నారు. మరోవైపు, రాజస్తాన్ విషయంలోనూ పార్టీ అగ్ర నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న సీనియర్ నేత అశోక్ గహ్లోత్, యువ నాయకుడు సచిన్ పైలట్ తమ పట్టు వీడకపోవడంతో నిర్ణయం తీసుకోవడం పార్టీ చీఫ్ రాహుల్‌కి కత్తి మీద సాములా మారింది. ఈ రెండు రాష్ట్రాల సీఎం ఎంపికే ఒక కొలిక్కి రాకపోవడంతో.. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి ఎంపికను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, తమ అభిమాన నేతనే సీఎంగా ప్రకటించాలంటూ పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రాజస్తాన్‌లో స్వల్ప హింస చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడి దాదాపు 2 రోజులు గడుస్తున్నా సీఎం ఎంపిక పూర్తి కాకపోవడంపై బీజేపీ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. సీఎం పదవికి రేసు ఏదీ లేదు: సింధియా ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామనీ, సీఎం పదవి కోసం పరుగుపందెం ఏదీ జరగడం లేదని రాహుల్‌తో చర్చల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాహుల్‌తో సింధియా, కమల్‌నాథ్‌లు విడివిడిగా భేటీ అయిన అనంతరం ఇరువురితో కలిసి రాహుల్ ఫొటో తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కాలం, ఓరిమి.. ఇవే అత్యంత శక్తిమంతమైన యోధులు’ అనే ప్రఖ్యాత రచయిత లియొ టాల్‌స్టాయ్ వ్యాఖ్యను ట్వీట్‌తో జతపరిచారు. రాజస్తాన్ నిరసనల్లో హింస తమ అభిమాన నాయకుడినే సీఎంగా ప్రకటించాలంటూ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలు సహా పలుచోట్ల ఆందోళనలకు దిగారు. సచిన్ మద్దతుదారులు ఢిల్లీలో రాహుల్ నివాసం బయట నినాదాలు చేశారు. రాజస్తాన్‌లో పార్టీ కార్యకర్తల నిరసనల్లో స్వల్ప హింస చెలరేగింది. దౌసా, అజ్మీర్, కరౌలీ ప్రాంతాల్లో సచిన్ పైలట్ మద్దతుదారులు రోడ్లపై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. సంయమనంతో ఉండాలని సచిన్‌తోపాటు గెహ్లోత్ కార్యకర్తలను కోరారు. రాహుల్, సోనియాలపై నమ్మకం ఉందనీ, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని పైలట్ తన వర్గం వారిని కోరారు. ఛత్తీస్‌గఢ్‌పై నిర్ణయం నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక నేటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపికలో తలమునకలైన కాంగ్రెస్ అగ్రనేతలు.. చత్తీస్‌గఢ్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారని సమాచారం. అయితే, రాష్ట్రంలో పార్టీ పరిశీలకుడు మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను, రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితిని వివరిస్తే రూపొందించిన తన నివేదికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందించారు. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్, ఓబీసీ నేత తామ్రధ్వజ్ సాహు, సీనియర్ నేతలు టీఎస్ సింగ్ దేవ్, చరణ్‌సింగ్ మహంత్‌లు సీఎం రేసులో ఉన్నారు. 15 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన బఘేల్‌కే సీఎం పీఠం దక్కే చాన్సుంది. 1984 అల్లర్లలో పాత్రపై ఆరోపణలు మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్‌ను ఎంపిక చేయడం ద్వారా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ‘గాంధీ కుటుంబం అధికారంలో ఎప్పుడొచ్చినా 1984 అల్లర్ల నిందితులను కాపాడుతుంది. ఇప్పుడు కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌కు సీఎంను చేయడం ద్వారా ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కానుక ఇస్తున్నారు’ అని మంజీందర్ అన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్ పాత్ర కూడా ఉందని అకాలీదళ్ గతం నుంచీ ఆరోపిస్తోంది. ‘సిక్కు వ్యతిరేక అల్లర్లలో అమాయకుల ప్రాణాలు తీసినవారు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ సందేశమిస్తున్నారు. ఆ ఘాతకుల వెనుక తాము ఉన్నామనీ, సిక్కులను చంపినందుకు బహుమతులు ఇస్తామని ఆయన అంటున్నారు’ అని మంజీందర్ అన్నారు. గతంలో కమల్‌నాథ్‌ను పంజాబ్, హరియాణాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడూ పలువురు సిక్కులు వ్యతిరేకించడంతో ఆయనను అప్పట్లో పంజాబ్ బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ హస్తం ఉందనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు లాయర్ హెచ్ఎస్ ఫూల్కా కూడా తెలిపారు. ‘కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా అవసరమైనన్ని సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. అయితే, చట్టం ముందు ఆయన నిలబడాల్సిన సమయం ఇంకా ఆసన్నం కాలేదు. కానీ, ఇటువంటి వ్యక్తిని మధ్యప్రదేశ్ సీఎంగా నియమించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది రాహుల్ గాంధీనే’ అని అల్లర్ల బాధితుల పక్షాన వాదిస్తున్న ఫూల్కా అన్నారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో ఢిల్లీలో సిక్కులు ఊచకోతకు గురవడం తెలిసిందే. ఉదయం నుంచి ఉత్కంఠ మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపిక కోసం చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం ఉదయమే ప్రారంభించారు. ఇందుకు గాను ఆయా రాష్ట్రాల సీఎం ఆశావహులతో పాటు, పార్టీ పరిశీలకులు, సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించారు. రాహుల్‌కు సహాయంగా ఆయన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాహుల్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థులుగా ఉన్న కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలతో.. రాజస్తాన్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లతో ఉమ్మడిగా, వేర్వేరుగా చర్చలు జరిపారు. యువ నేతలైన సింధియా, పైలట్ల వైపు రాహుల్, ప్రియాంక మొగ్గుచూపగా..అనుభవాన్ని, 2019 లోక్‌సభ ఎన్నికల అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న సోనియా గాంధీ సీనియర్లైన కమల్ నాథ్, గహ్లోత్‌లకు మద్దతిచ్చినట్లు సమాచారం. మధ్యప్రదశ్ విషయంలో కమల్‌నాథ్‌ను సీఎంగా అంగీకరించేలా జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్, ప్రియాంకలు ఒప్పించారని, సచిన్ పైలట్ మాత్రం గహ్లోత్‌ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తీవ్రంగా నిరసించాడని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ఎంపికను ఖరారు చేసిన రాహుల్.. రాజస్తాన్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం నుంచి పలు దఫాలుగా జరిగిన చర్చల్లో రాజస్తాన్‌కు కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్, ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జ్ అవినాశ్ పాండే, మధ్యప్రదేశ్ కేంద్ర పరిశీలకుడు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
కమల్‌నాథ్ X సింధియా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టేదెవరో ఇంకా తేలనప్పటికీ ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గనుక ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంటే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌లో యువనాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న జ్యోతిరాదిత్య సింధియాతోపాటు మరో సీనియర్ నేత కమల్ నాథ్ కూడా కాంగ్రెస్ తరఫున మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్నారు. అనుభవజ్ఞుడికే బాధ్యతలు ఇస్తారా? చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ 9 సార్లు ఎంపీగా గెలిచారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఓ సారి ఇందిర చింద్వారాకు ఎన్నికల ప్రచారానికి వచ్చి, నా మూడో కొడుకు కమల్‌నాథ్‌ను గెలిపించండి అని ప్రజలను కోరారు. ఇవి చాలు రాజకీయాల్లో కమల్‌నాథ్‌కు ఉన్న అనుభవమేమిటో చెప్పడానికి. ఇప్పుడు అనుభవజ్ఞుడైనందున కమల్‌నాథ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపొచ్చనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాస్త ముందు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కమల్‌నాథ్ సీఎం రేసులో ముందున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కమల్‌నాథ్ అంతా తన భుజస్కం«ధాలపైనే నడిపించారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ కమలనాథ్కు ఏరికోరి ఎన్నికల వేళ పీసీసీ పగ్గాలు అప్పగించిందనే విశ్లేషణలైతే ఉన్నాయి. కానీ మాస్ ఫాలోయింగ్‌లో ఆయన వెనుకబడే ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ జ్యోతిరాదిత్యకే మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ రాచ కుటుంబానికి చెందిన సింధియా జనాకర్షణ కలిగిన నేత. గత కొన్నేళ్లుగా గ్రామ స్థాయి పర్యటనలు చేస్తూ తన పట్టు పెంచుకున్నారు. 32 శాతం మంది ప్రజలు జ్యోతిరాదిత్య సీఎం కావాలని కోరుకున్నారంటే ఆయనకు ఏ స్థాయిలో ప్రజల్లో ఆదరణ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆయన మధ్యప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతలతో ఎల్లప్పుడూ విభేదిస్తూనే వచ్చారు. కాంగ్రెస్ మాజీ నేత మాధవరావు సింధియా కుమారుడు కావడం, రాహుల్ గాంధీకి కుడి భుజంగా ఉండడం జ్యోతిరాదిత్యకు కలిసొచ్చే అంశాలు. మరో నాలుగు నెలల్లోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలున్నందున ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సింధియాకు కాంగ్రెస్ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. -
90% ముస్లిం ఓట్లు పడేలా చూడండి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో 90 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చేయాలని ఆ పార్టీ ముస్లిం నేతలను కమల్‌నాథ్ కోరుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో గత నెలలో రికార్డు చేసినట్లు భావిస్తున్న ఈ వీడియోలో ‘నరేంద్ర మోదీకి ఓటు వేయడమంటే హిందువులకు ఓటేయడమేనని బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రజలకు సందేశాన్ని పంపుతున్నాయి. నిజంగా ముస్లింలకు ఓటేయాలని మీకు ఉంటే కాంగ్రెస్‌కు ఓటేయండి. వాళ్లు మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. కానీ పోలింగ్ అయ్యేంతవరకూ ఓపిక పట్టండి. గత ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటింగ్ సరళిని ఓసారి గమనించాలని మిమ్మల్ని కోరుతున్నా. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కేవలం 50–60 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 90% పోలింగ్ ఎందుకు జరగలేదు? ఒకవేళ ముస్లింలు ఈ ఎన్నికల్లో 90 శాతం ఓటు హక్కును వినియోగించుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో మతం ఆధారంగా ఓట్లడిగిన కమల్‌నాథ్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ బృందం ఎన్నికల సంఘానికి వినతిపత్రాన్ని సమర్పించింది. -
కమల్ వర్సెస్ కమలం
సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలపై చెరగని ముద్ర వేసి మామా అంటూ ప్రజలతో ఆప్యాయంగా పిలిపించుకునే కమలనాథుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకవైపు, ఇందిరాగాంధీకి కుడి భుజంగా పేరుతెచ్చుకొని సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న కమల్‌నాథ్ మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ప్రజల మనసు దోచుకునే ‘నాథు’డెవరు? పేదల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ధనిక పార్లమెంటేరియన్ కమల్‌నాథ్ ఢీ కొనగలరా? త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అత్యంత కీలకం. 29 లోక్‌సభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌పై పట్టు సంపాదించడం కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ఆవశ్యకం. అంతకుముందు అంధకారంలో ఉన్న రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నేత చౌహానే. సంక్షేమ పథకాలతోనే ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే 13ఏళ్లు సీఎంగా ఉండటం, వ్యాపమ్ సహా వివిధ కుంభకోణాలు, రైతు సమస్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇతరులతో పోలిస్తే వెనకబడడం వంటికి చౌహాన్‌కు ఈ ఎన్నికల్లో సవాల్‌గా మారాయి. రాష్ట్రంలో ఇంకా 70% మంది ప్రజల ఆదాయ వనరు వ్యవసాయమే. నెలవారీ రూ.1300 తలసరి ఆదాయంతో వీరి పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ సగటుకంటే ఇది 7% తక్కువ. గతేడాది మందసౌర్‌లో రైతుల ఆందోళనలు, పోలీసుల కాల్పులు, ఆరుగురు రైతులు చనిపోవడం శివ్‌రాజ్ మెడకు చుట్టుకున్నాయి. ఇన్ని సమస్యల మధ్య చౌహాన్ సంక్షేమ కార్యక్రమాలు, హిందుత్వ కార్డు, మోదీ ఇమేజ్ను నమ్ముకొని ఎన్నికల బరిలో దిగారు. అయితే.. ఇప్పటికీ 46% మంది చౌహాన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. శివరాజ్ వ్యూహాలు రైతు సమస్యలు, నిరుద్యోగమే ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. వీటినుంచి బయటపడేందుకు చౌహాన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. జనాశీర్వాద్ యాత్ర, జనాదేశ్ యాత్రల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రైతులకోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొస్తున్నారు. గత ఏడాదిలో రూ.32,701 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. రాష్ట్రంలో 90% హిందువులే ఉండడంతో.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే గో సంరక్షణకు ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామంటున్నారు. మామ ఇమేజ్ శివరాజ్ సింగ్ చౌహాన్‌ది రైతు కుటుంబం. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్‌తో అనుంబధం ఏర్పడింది. ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో తొలిసారిగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంపీగా నాలుగు సార్లు వరసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2003లో రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టారు. అప్పట్లో ఆయనపై పప్పు అనే ముద్ర ఉండేది. కానీ తనకున్న నాయకత్వ పటిమ, పాలనా సామర్థ్యాలతో ఆ ఇమేజ్ను చెరిపేసుకుని అందరితో మామ అని పిలిపించుకునే స్థితికి ఎదిగారు. 2008 ఎన్నికల్లో చౌహాన్ 143 స్థానాల్లో, 2013లో 165 చోట్ల పార్టీని గెలిపించుకున్నారు. కమల్‌నాథ్ ప్లానింగ్.. మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్ష పగ్గాలను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కమల్‌నాథ్‌కు అప్పగించింది. కమల్‌నాథ్ రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్త. పారిశ్రామిక, ఆర్థిక రంగాలపై మంచి పట్టు ఉంది. తొమ్మిదిసార్లు మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కమల్‌నాథ్‌కు రాష్ట్రంలో ప్రతి నాయకుడి పాజిటివ్, నెగటివ్ అంశాలు బాగా తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలతోనూ మంచి అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌ను ఎంపిక చేయడంపై కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చౌహాన్ ‘మామ’ ఇమేజ్ మసకబారేలా, ప్రజల్లో ఆయన విశ్వసనీయత దెబ్బ తీసేలా కుంభకోణాలపైనే దృష్టి సారించారు. హిందూత్వ కార్డునీ ప్రయోగిస్తున్నారు. ‘మేము కూడా మతాన్ని గౌరవిస్తాం. మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోం. చింద్వారాలో 101 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. కానీ దానిని ప్రచారం చేసుకోలేదు’ అంటూ పదే పదే చెబుతున్నారు. రాజకీయ ప్రస్థానం కమల్‌నాథ్ సంజయ్‌గాంధీకి సమకాలికుడు. ఇందిర నుంచి రాహుల్ వరకు మూడు తరాల గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1980 నుంచి చింద్వారా లోక్ సభ స్థానానికి తొమ్మిది సార్లు గెలిచారు. 16వ లోక్‌సభలో కమలనాథే సీనియర్ సభ్యుడు. కమల్‌నాథ్‌కు ఏవియేషన్ రంగంలో వ్యాపారాలతో పాటు ఎన్నో రెస్టారెంట్లకు అధినేత. 187 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్లో ప్రకటించుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మాయావతి నిర్ణయం రాహుల్‌కు దెబ్బే!
సాక్షి, న్యూఢిల్లీ : 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు వివిధ ప్రాంతీయ పార్టీలతో కలసి మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగి నాయకత్వంలోని చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీతోని ఎన్నికల పొత్తు పెట్టుకున్నామంటూప బీఎస్పీ నాయకురాలు మాయావతి ప్రకటించడమే కాకుండా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 22 మంది పార్టీ సభ్యుల జాబితాను కూడా విడుదల చేయడం అనూహ్య పరిణామం. ఓ పక్క మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం శోచనీయమే. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతుడై చత్తీస్‌గఢ్ జనతాపార్టీని ఏర్పాటు చేసిన అజిత్ జోగితో తన పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మాయావతి ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకని అది అంత ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌తో ఓ పక్క చర్చలు కొనసాగుతుండగానే 22 మంది పార్టీ సభ్యుల పేర్లను ప్రకటించడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి తన పార్టీ కోసం 50 సీట్లను డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకు మించి ఇవ్వనని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మాయావతి జాబితాను విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చత్తీస్‌గఢ్‌లో మాయావతిని జట్టులో నుంచి పోనీయకుండా చూడాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉండి ఉంటే అలా జరగనిచ్చే వారు కాదని, ఆమె కుమారుడైన రాహుల్ గాంధీకి అంత రాజకీయ పరిణతి లేకపోవడం వల్ల అలా జరిగిందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. దీని ప్రభావం మధ్యప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, కచ్చితంగా ఆ రాష్ట్రంలో పొత్తు కుదురుతుందని కమల్‌నాథ్ లాంటి సీనియర్ నాయకులే విశ్వసిస్తున్నారు. అది నిజమే కావచ్చుకానీ వివిధ సామాజిక వర్గాల మద్దతును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పలు ప్రాంతీయ పార్టీల బలాలపై ఆధారపడాల్సిన అవసరం ఉంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోని కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదరకుండా ఆయా పార్టీలపై పాలకపక్ష బీజేపీ అన్ని రకాలుగా ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో చత్తీస్‌గఢ్ పరిణామం కాంగ్రెస్‌కు ప్రతికూలమే. పాలకపక్ష బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు తేడా ఉన్న చత్తీస్‌గఢ్‌లో తృతీయ ఫ్రంట్ రావడం అంటే పాలకపక్షం బీజేపీకీ మేలు చేయడమే. మూడవ పర్యాయం ముఖ్యమంత్రి రామన్ సింగ్‌కు మళ్లీ పట్టం కట్టడమే! -
విభజన తంటాలు.. ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీలు రెండు రాష్ట్రాల మధ్య నాలుగేళ్లుగా నలిగిపోతున్నారు. డీఎస్పీ విభజన ఎప్పుడో జరగాల్సి ఉన్నా ఇప్పటివరకు సీనియారిటీ పంచాయితీ తేలలేదు. దీనిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెండింగ్ పెట్టాయి. అధికారులను విభజించాల్సిన కమల్‌నాథన్ కమిటీ తాత్కాలిక కేటాయింపులకు ఓకే చెప్పినా తుది కేటాయింపులపై హైకోర్టు స్టే ఉండటంతో ఏం చేయాలో తెలియక పోలీస్ శాఖకే వదిలేసింది. దీనితో రెంటికి చెడ్డ రేవడిలాగా పోలీస్ అధికారుల పరిస్థితి తయారైందన్న వాదన ఉంది. ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పెండింగ్‌లో ఉన్న విభజన పనులను పూర్తి చేసుకోవాలని, మధ్యేమార్గంగా వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా డీఎస్పీల విభజనపై ఓ నిర్ణయానికి వచ్చినా ఇప్పటివరకు అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్రానికి లేఖ రాసి తెలంగాణలో పనిచేస్తున్న డీఎస్పీలను ఇక్కడే కొనసాగించాలని, ఏపీలో పనిచేస్తున్న అధికారులను అక్కడే కొనసా గేలా చర్యలు చేపట్టాలని కోరాలని నిర్ణయించారు. ఇప్పటివరకు లేఖ రాయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీనియారిటీ వ్యవహారంపై రెండు రాష్ట్రాల పోలీస్ పెద్దలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్ డీఎస్పీ సీనియారిటీ రూపొందించడంపై దృష్టి పెట్టలేదు. సీనియారిటీ జాబితా సమీక్ష పేరుతో మూడున్నరేళ్ల ఏపీ పోలీస్‌శాఖ కాలం గడిపింది. ఇంతవరకు జాబితా రివ్యూ చేసి హైకోర్టులో దాఖలు చేయకపోవడంతో విభజన, పదోన్నతులు, పదవీ విరమణ సెటిల్మెంట్లు అన్నీ పెండింగ్‌లో పడిపోయాయని తెలంగాణ పోలీస్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో రూపొందించిన జీవో 108, 54 సీనియారిటీ జీవోలను రివ్యూ చేసే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉండటంతో ఆ అంశం ఏపీలోకి వెళ్లింది. దీనితో తమ చేతిలో ఎలాంటి అధికారం లేదని తెలంగాణ అధికారులు తేలికగా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా అధికారులు వినతిపత్రాలిచ్చి ఏళ్లు గడుస్తున్నాయే తప్పా విభజన పని ముందుకు సాగడం లేదు. కేంద్ర హోంశాఖ హెచ్చరించినా.. రెండు రాష్ట్రాల్లో కలిపి 36 మందికి కన్ఫర్డ్ కోటా కింద ఐపీఎస్‌లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉండగా రెండు రాష్ట్రాల హోంశాఖలు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా హెచ్చరిస్తూ వస్తూనే ఉంది. కన్ఫర్డ్ జాబితా కింద వేకెన్సీ ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదిత జాబితా పంపాలని కోరినా బుట్టదాఖలు చేస్తూ వస్తున్నాయని లేఖలో స్పష్టం చేసింది. నాలుగేళ్లుగా ప్యానల్ జాబితా పంపకపోవడంతో కన్ఫర్డ్ ఆశావహ అధికారులు నిరాశలో మునిగిపోయారు. గ్రూప్ వన్ డీఎస్పీగా సెలక్ట్ అయిన నాటి నుంచి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ఐపీఎస్ పదోన్నతి రావాల్సి ఉంది. 11 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ప్యానల్ జాబితా ఫైలు కదలకపోవడం తమ సర్వీసుపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితా పేరుతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల అధికారులు మధ్యేమార్గ నిర్ణయం తీసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుతున్నారు.