
పోస్టుల స్థాయిపై తేల్చుకోండి: కమలనాథన్ కమిటీ
* రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉండాలన్న కమలనాథన్ కమిటీ భిన్నాభిప్రాయం
* వ్యక్తమైతే రాష్ట్ర స్థాయి సంస్థగా పరిగణన
* సింగిల్ పోస్టులు.. ఖాళీలపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సంస్థలా? లేదా ప్రాంత స్థాయి సంస్ధలా? అనేది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాల్సి ఉందని కమలనాధన్ కమిటీ స్పష్టం చేసింది. సంస్థను నిర్ధారించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాకుంటే దాన్ని రాష్ట్ర స్థాయి సంస్థగా కమలనాధన్ కమిటీ పరిగణించనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల కింద నోటిఫై చేసిన సంస్థలను ఏదైనా ప్రాంతం గురించి ఏర్పాటు చేశారా? లేదా రాష్ట్రం మొత్తం గురించి ఏర్పాటు చేశారా? అనే విషయాన్ని ఇరు ప్రభుత్వాలు తేల్చాలని కమిటీ స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాలు రాష్ట్ర స్థాయి సంస్థగా పేర్కొంటే సంస్థలోని పోస్టులను, ఉద్యోగులను రెండిటికీ పంపిణీ చేస్తారు.
ఒకే ఒక్క పోస్టు, ఖాళీ
చాలా ప్రభుత్వ శాఖల్లో కొన్ని రంగాల్లో ఒకే ఒక్క పోస్టులున్నాయని, అలాగే ఒకే ఖాళీలున్నాయని కమలనాధన్ కమిటీ గుర్తించింది. వీటిని పంపిణీ చేయటం సమస్యగా మారింది. ఇప్పటివరకు నోటిఫై చేసిన శాఖల్లో పెద్ద సంఖ్యలో సింగిల్ పోస్టు లు, సింగిల్ ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక పంపిణీ ఉద్యోగులు తుది పంపిణీ వరకు వేచి చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగిల్ పోస్టులో ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతానికి పోస్టు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరో ప్రాంతానికి చెందిన రాష్ర్టం కొత్త పోస్టును ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి.