సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీని ఆ పార్టీ ముఖ్యమంత్రులు సోమవారం బుజ్జగించే ప్రయత్నం చేశారు. గుజరాత్ సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలో ముఖ్యమంత్రులు కమల్‌నాథ్ (మధ్యప్రదేశ్), కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్), వీ నారాయణస్వామి (పుదుచ్చేరి) తదితరులు రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిమతాన్ని ఆయనకు వివరించిన ముఖ్యమంత్రులు.. రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆయనను మరోసారి కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన అశోక్ గహ్లోత్.. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల మనోభావాలను రాహుల్‌గాంధీకి వివరించామని, తమ వాదనను శ్రద్ధగా ఆయన ఆలకించారని, రాజీనామా విషయంలో ఆయన ‘సరైన నిర్ణయం’ తీసుకుంటారని నమ్మకముందని వివరించారు. పార్టీని రాహుల్ గాంధీ ముందుండి నడిపించాలని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారని, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ముక్తకంఠంతో చెప్తున్నారని గహ్లోత్ వివరించారు. ఇక, మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఫలితాల నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు కమల్‌నాథ్ మరోసారి సిద్ధపడినట్టు వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment