భోపాల్: ఆరు నెలల క్రితం జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌సింగ్ ప్రభుత్వాన్ని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొవాల్సి వస్తోంది. కేంద్రంలో భారీ మెజార్టీ దక్కించుకున్న బీజేపీ మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మెజార్టీ లేకపోవడంతో బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో సీఎం పిఠాన్ని అధిష్టించిన కమల్‌నాథ్‌కు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం దినదిన గండంగా మారుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకత్వం భారీగా ఆఫర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంత్రులకు పలు ఆదేశాలు జారీచేశారు.
ఎమ్మెల్యే జారిపోకుండా ప్రతి మంత్రి బాధ్యత తీసుకోవాలని.. ఒక్కో మంత్రి కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలపై కన్నేసి ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తున్నందున వాటిని తిప్పికొట్టాలని, సభ్యులను కాపాడకునే బాధ్యత మీదేనని సూచించారు. ముఖ్యంగా బీఎస్పీ, స్వతంత్ర ఎమ్యెల్యేలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అసెంబ్లీలో కమల్‌నాథ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే భాజపా నాయకులు సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందోనన్న అభద్రతా భావంలో కాంగ్రెస్ ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా 230 మంది శాసన సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 114 మంది కాంగ్రెస్, 109 మంది బీజేపీ సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది కావడంతో ఇద్దరు బీఎస్పీ, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలావుండగా.. తమకు భారీ మొత్తంలో డబ్బుతో పాటు, మంత్రిపదవులు ఇస్తామని బీజేపీ నేతలు ఆఫర్ చేస్తున్నారంటూ బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కమల్‌నాథ్ మంత్రులను అలర్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment