Lok Sabha Election 2024: బీజేపీకి సవాలు | Lok Sabha Election 2024: Congress giving tough competition to BJP | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: బీజేపీకి సవాలు

Published Thu, May 9 2024 4:42 AM | Last Updated on Thu, May 9 2024 4:42 AM

Lok Sabha Election 2024: Congress giving tough competition to BJP

మధ్యప్రదేశ్‌లో 8 స్థానాలకు 13న పోలింగ్‌ 

అన్నీ బీజేపీ సిట్టింగ్‌ స్థానాలే 

ఇండోర్‌లో కాంగ్రెస్‌కు షాక్‌

నాలుగో విడతలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్‌ జరగనుంది. దీంతో రాష్ట్రంలో పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. 29 స్థానాల్లో మూడు విడతల్లో 21 సీట్లకు ఎన్నిక ముగిసింది. 2019లో బీజేపీ ఏకంగా 28 సీట్లు సొంతం చేసుకోగా కాంగ్రెస్‌ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది...             

ఇండోర్‌ 
పోలింగ్‌కు ముందే ఇక్కడ కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బామ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిపోయారు! దాంతో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లల్వానీ విజయం ఖాయమైపోయింది. కంగుతిన్న కాంగ్రెస్‌ ఇక్కడ నోటాకు ఓటేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తోంది! ఎందుకంటే ఇక్కడ బరిలో ఉన్న 14 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ మద్దతివ్వడానికి స్వతంత్రులెవరూ లేరు. 

మధ్యప్రదేశ్‌ వాణిజ్య రాజధాని అయిన ఇండోర్‌ బీజేపీ కంచుకోట. 35 ఏళ్ల నుంచి ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. 1989 నుంచి 2014 దాకా లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గెలుస్తూ వచ్చారు. ఎన్నికల వేళ ముగ్గురు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలతో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తులు కూడా బీజేపీలో చేరారు. ఇక్కడ ఫలితం యువత చేతుల్లోనే ఉంది. 30–39 ఏళ్ల ఓటర్లు 6.71 లక్షలు, 20–29 వయసు వారు 5.26 లక్షల మంది, తొలిసారి ఓటర్లు 62,000 మంది ఉన్నారు.

ఉజ్జయిని 
ఈ ఎస్సీ స్థానంలో గత రెండు ఎన్నికల నుంచి బీజేపీదే విజయం. 2014లో ప్రొఫెసర్‌ చింతామణి మాలవీయ, అనంతరం 2019లో అనిల్‌ ఫిరోజియా మూడున్నర లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు! ఫిరోజియాపై కాంగ్రెస్‌ నుంచి మహేశ్‌ పర్మార్‌ తలపడుతున్నారు. బీజేపీ ప్రధానంగా ఇంటింటి ప్రచారాన్నే నమ్ముకుంది. మరోవైపు పర్మార్‌ మాత్రం ప్రసిద్ధ క్షిప్రా నది కాలుష్యంపై వినూత్న తరహాలో నిరసన చేపట్టారు. నదిలో కలుస్తున్న మురుగునీటి ప్రవాహంలో కూర్చోవడమే గాక అందులో మునకలు వేశారు. కాలుష్యం నుంచి నదిని రక్షించేందుకు తుదికంటా పోరాడతానని ప్రకటించారు. ఇందుకు నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తుండటం విశేషం.

ధార్‌ 
ఈ ఎస్టీ స్థానం నుంచి బీజేపీ తరఫున సావిత్రి ఠాకూర్‌ బరిలో ఉన్నారు. ఆమె 2014లోనూ బీజేపీ అభ్యరి్థగా ఇక్కడ గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి రాధేశ్యామ్‌ మువెల్‌ పోటీ చేస్తున్నారు. మువెల్‌ను మార్చాలని ఓ దశలో పార్టీ భావించినా చివరికి ఆయన్నే కొనసాగించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాల్లో ఐదింట కాంగ్రెసే గెలిచింది. దాంతో ఈసారి బీజేపీ గెలుపు సునాయాసంగా కని్పంచడం లేదు. అందుకే సిట్టింగ్‌ ఎంపీని కాదని సావిత్రికి బీజేపీ టికెటిచి్చంది. రాహుల్‌గాంధీ, ప్రధాని మోదీ ఇప్పటికే ఇక్కడ ప్రచారం చేశారు.

ఖాండ్వ 
ఎన్నికల సంఘం రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించిన స్థానమిది. 11 మంది అభ్యర్థుల్లో నలుగురిపై క్రిమినల్‌ కేసులున్నాయి. వారిలో బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్‌ పాటిల్, కాంగ్రెస్‌ అభ్యర్థి నరేంద్ర పటేల్‌ కూడా ఉన్నారు! 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌ విజయం సాధించారు. 2021లో ఆయన కరోనాతో మరణించారు. ఉప ఎన్నికలో బీజేపీ నేత జ్ఙానేశ్వర్‌ పాటిల్‌ గెలిచారు.

దేవాస్‌ 
దేవాస్‌ లోక్‌సభ స్థానంలో ఈసారి భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మహేంద్రసింగ్‌ సోలంకి (40) మరోసారి బరిలో ఉన్నారు. ఆయన సివిల్‌ జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ జానపద గాయకుడు ప్రహ్లాద్‌ సింగ్‌ తిపానియా (65)పై ఘన విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి రాజేంద్ర మాలవీయ పోటీ చేస్తున్నారు. ఇక్కడ 2014లోనూ బీజేపీయే గెలిచింది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు.

చరిత్ర సృష్టించిన బామ్మ 
ధార్‌ నియోజకవర్గం పరిధిలోని 113 ఏళ్ల బామ్మ ఇంటి నుంచే తన ఓటు హక్కు వినియోగించుకుని చరిత్ర సృష్టించింది. ఏకల్‌దున గ్రామానికి చెందిన భవార్‌ బాయి ఇంటి నుంచే ఓటు వేసేందుకు ముందే దరఖాస్తు చేసుకోవడంతో.. అధికారులు ఆమె ఇంటికి వెళ్లి ఇందుకు అవకాశం కలి్పంచారు. ఈ నియోజకవర్గ పరిధిలో 85 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 900 మంది ఓటర్లు, 343 మంది దివ్యాంగులు సైతం ఇంటి నుంచి ఓటేశారు. అంజేరా గ్రామానికి చెందిన సాఫియాన్‌ జులి్ఫకర్‌ హుస్సేన్‌ అనే 109 ఏళ్ల వృద్ధుడు కూడా
ఈ జాబితాలో ఉన్నారు.  
        
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement