‘సీఎం’ కోసం స్వాముల చుట్టూ ప్రదక్షణలు | Congress Leaders Kamal Nath, Jyotiraditya Scindia Seek Divine Help | Sakshi
Sakshi News home page

‘సీఎం’ కోసం స్వాముల చుట్టూ ప్రదక్షణలు

Published Thu, Apr 26 2018 2:36 PM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

Congress Leaders Kamal Nath, Jyotiraditya Scindia Seek Divine Help - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులు పోటీ పడి గుళ్లూ గోపురాలతోపాటు స్వాముల చుట్టూ తిరుగుతున్నారు. ఛింద్వారా కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు  కమల్‌నాథ్‌ ఏప్రిల్‌ 13వ తేదీన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వద్దకు హెలికాప్టర్‌లో వెళ్లి ఆయన్ని సందర్శించుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే సింధియా వెళ్లి స్వరూపానంద దీవెనలు తీసుకున్నారు. ప్రస్తుతం కమల్‌నాథ్‌ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీనే తన ఆరు నెలల నర్మదా యాత్రను ముగించుకొని వచ్చారు.

ఇక మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌవాన్‌ ఇటీవలనే ఐదుగురు మహంతులకు సహాయ మంత్రి హోదా కల్పించారు. నర్మదా నది పక్కన ప్రభుత్వం మొక్కలు నాటే పథకంలో అవినీతి ఉందని, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని మహంతులు హెచ్చరించడంతో చౌహాన్‌ వారికి ఈ హోదా కల్పించారు. దాంతో వారు ఆందోళన ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇలా రాజకీయాలను, మతాలను కలిపేయడం దేశంలో రాజకీయ నాయకులకు కొత్తేమి కాదుకానీ, ఈ మధ్య ప్రజలకు తెలిసేలా బహిరంగ ప్రదర్శనకు దిగారు. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా వివిధ మతాలకు చెందిన గుళ్లూ గోపురాలు తిరిగిన రాహుల్‌ గాంధీ ఇప్పుడు 12వ తేదీన ఎన్నికలు జరుగనున్న కర్ణాటక రాష్ట్రంలో గుళ్లూ గోపురాలతోపాటు వివిధ కులాల దైవాలను సందర్శించుకుంటున్నారు. బీజేపీ నాయకులు అదే చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో తనకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం తనకు అవసరం లేదని, అది రెండు దిక్కుల పదునున్న కత్తి లాంటిదని దిగ్విజయ్‌ సింగ్‌ ఇటీవలనే ప్రకటించన నేపథ్యంలో  సీఎం అభ్యర్థిత్వం కోసం కమల్‌నాథ్, సింధియా శిబిరాలు పోటీ పడుతున్నాయి. ఈ విషయాన్ని త్వరగా తేల్చుకోవాల్సిందిగా శిబిరాల నుంచి నాయకులపై ఒత్తిడి కూడా పెరగడంతో కమల్‌ నాథ్‌ ఇటీవల రాహుల్‌ గాంధీని కలుసుకున్నారు. సమయం వచ్చినప్పుడు తానే అభ్యర్థి పేరును ప్రకటిస్తానని చెప్పి పంపించినట్లు తెల్సింది.

ఈ దశలో ఎవరి పేరును ప్రకటించిన పార్టీలో కుమ్ములాటలు మొదలవుతాయని, ఫలితంగా రానున్న ఎన్నికలో నష్టపోతామని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారు. పార్టీలో ఐకమత్యం లేకపోతే మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వంలోని పార్టీని ఎదుర్కోవడం కష్టం. ఈలోగా రాహుల్‌ మెదడును ప్రభావితం చేయడం కోసం కమల్‌నాథ్, సింధియాలు స్వాముల చుట్టూ తిరుగున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement