
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మూడో దశలో పోలింగ్ మే 7న జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన ఇవి తన జీవితంలో చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.
దిగ్విజయ్ సింగ్ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’ హ్యాండిల్‌లో రాజ్‌గఢ్ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని రాజ్‌గఢ్ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్ చంద్ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు.
కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని, అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.
మే 7వ తేదీన రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ సింగ్ 10 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980- 90వ దశకంలో రాజ్‌గఢ్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన సొంత ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు దిగ్విజయ్ సింగ్ ప్రతిష్టకే కాదు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment