ఉద్యోగుల విభజన వేగవంతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. శాఖల వారీగా తాత్కాలిక కేటాయింపుల జాబితాలను కమలనాథన్ కమిటీ ఎప్పటికప్పుడు ప్రచురిస్తోంది. మొత్తం 117 శాఖల్లో ఇప్పటివరకు 99 శాఖలకు చెందిన విభజన తొలి దశ పూర్తయింది. త్వరలోనే ఈ తాత్కాలిక పంపిణీ వివరాల నివేదికను కేంద్రానికి పంపించనుంది. తాత్కాలిక కేటాయింపులపై ఉద్యోగులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు రెండు వారాల గడువు ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాతే తుది కేటాయింపుల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది.
ఈ కసరత్తు ఇదే వేగంతో సాగితే జూలై నెలాఖరుకు తుది జాబితాలు వెలువడుతాయని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని విభాగాలన్నింటా రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజిస్తున్నారు. సచివాలయంతో పాటు విభాగాల ఉన్నతాధికారుల వారీగా (హెచ్‌వోడీలు) ఉద్యోగుల పంపిణీ జరుగుతోంది. వైద్యారోగ్యం, పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆక్టోపస్, టీబీ హాస్పిటల్‌కు సంబంధించిన విభజన ఆలస్యమవుతోంది. ఒక్కో విభాగం వారీగా ఆన్‌లైన్‌లో ఉద్యోగుల ఆప్షన్లు స్వీకరించిన కమలనాథన్ కమిటీ ప్రతి వారం సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమవుతోంది.
ఆ శాఖలో ఉన్న పోస్టులు, అందులో ఉన్న ఉద్యోగుల స్థానికత... వారు కోరుకున్న ఆప్షన్లు ఏ రాష్ట్రానికి కేటాయించాలనే అంశంపై దాదాపు వారానికోసారి సమావేశమవుతోంది. తాత్కాలిక జాబితాలను ఎప్పటికప్పుడు కమిటీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తోంది. ఇప్పటివరకు ఆప్షన్లు నమోదు చేసుకున్న 10,156 మంది ఉద్యోగుల్లో 5,379 మందిని ఏపీకి, 4,786 మందిని తెలంగాణకు కేటాయించింది. ఈ జాబితాల ప్రకారం తెలంగాణకు చెందిన 689 ఉద్యోగులు ఏపీకీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 300 మంది తెలంగాణకు అలాట్ అయ్యారు. రెండు రాష్ట్రాలకు చెందని స్థానికేతరులు 119 ఉన్నారు. వీరిలో 66 మందిని ఏపీకి, 53 మందిని తెలంగాణకు కేటాయించారు.
ఎక్కడైనా ఫర్వాలేదు..
వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల్లో 47 మంది ‘ఏ రాష్ట్రమైనా పర్వాలేదు’ అని ఆప్షన్ నమోదు చేసుకోవటం గమనార్హం. తాత్కాలిక పంపిణీలో వీరిలో 29 మందిని ఏపీకి, 18 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపీకి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగుల్లో 170 మందిని కమిటీ తమ పరిశీలన అనంతరం తెలంగాణకు, తెలంగాణ కోరుకున్న 632 మందిని ఏపీకి కేటాయించింది.
కొత్త పోస్టులు లేకుంటే సర్దుబాటే..
స్థానికతను ఆధారంగా విభజన ప్రక్రియను చేపడుతున్నప్పటికీ ఆయా శాఖల్లో కేడర్‌ల వారీగా పోస్టులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. లేని కారణంగానే కొందరిని అటు ఇటు సర్దుబాటు చేయక తప్పని పరిస్థితి నెలకొందని ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కమలనాథన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రెండు ప్రభుత్వాలు ఎక్కడికక్కడ సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాల్సి ఉంటుంది.