భార్య, భర్త ఒకే రాష్ట్రానికి... | Wife, husband working in the state-level cadre posts | Sakshi
Sakshi News home page

భార్య, భర్త ఒకే రాష్ట్రానికి...

Published Thu, Aug 7 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

భార్య, భర్త ఒకే రాష్ట్రానికి...

భార్య, భర్త ఒకే రాష్ట్రానికి...

తుది మార్గదర్శకాల రూపకల్పనలో కమల్‌నాథన్ కమిటీ
ఇద్దరిలో ఒకరు స్థానిక కేడర్‌లో ఉన్నాఇదే నిబంధన వర్తింపు
ఇద్దరూ కలిపి ఏ రాష్ట్రం కోరితే అక్కడకు 13న కమిటీ తుది మార్గదర్శకాలు..
అనంతరం కేంద్రానికి నివేదిక

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీపై తుది మార్గదర్శకాల రూపకల్పనలో కమలనాథన్ కమిటీ నిమగ్నమైంది. భార్య, భర్త రాష్ర్టస్థాయి కేడర్ పోస్టుల్లో పనిచేస్తుంటే ప్రాంతాలతో సంబంధం లేకుండా వారిద్దరూ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. భార్య, భర్తలో ఒకరు స్థానిక కేడర్‌లో ఉన్నా ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి కేటాయించాలని కూడా కమిటీ భావిస్తోంది. ఇద్దరిలో ఒకరు తెలంగాణ, ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారైనా వారిద్దరూ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించేలా మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. భర్త రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులో పనిచేస్తూ భార్య స్థానిక కేడర్ పోస్టులో పనిచేస్తున్నప్పటికీ, ఇద్దరినీ ఏదో ఒక రాష్ట్రానికి కేటాయించాలని భావి స్తోంది. ముసాయిదా మార్గదర్శకాల్లో ఈ అంశం లేదు. దీనిపై తుది మార్గదర్శకాల్లో స్పష్టత ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.

తెలంగాణకు చెందిన భర్త రాష్ట్ర స్థాయి కేడర్‌లో పనిచేస్తూ భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక కేడర్ పోస్టులో పనిచేస్తుంటే వారిద్దరూ కోరుకున్న రాష్ట్రానికి కేటాయించనున్నారు. భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్రస్థాయి కేడర్‌లో, మరొకరు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తుంటే, వారిద్దరినీ ఒకే రాష్ట్రంలో పనిచేసేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని కూడా కమిటీ భావిస్తోంది. ఉదాహరణకు భర్త రాష్ట్రస్థాయి కేడర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పని చేస్తూ, భార్య హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో పనిచేస్తుంటే భార్యను ఆంధ్రప్రదేశ్‌లో పీఎఫ్ కార్యాలయానికి బదిలీ చేయాలని సూచించనుంది. రెండు రాష్ట్రాల్లో స్థానిక కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత రాష్ట్రాలకు వెళ్తామని దరఖాస్తు చేసుకుంటే అక్కడ ఖాళీలుండి, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే అందుకు కూడా వెసులుబాటు కల్పించాలని కమిటీ అభిప్రాయపడుతోంది. ఉదాహరణకు ఓపెన్ కేటగిరీలో మెరిట్‌పై కృష్ణా జిల్లాకు చెందిన ఉద్యోగి ఖమ్మం జిల్లాలో పనిచేస్తూ, ఇప్పుడు సొంత జిల్లాకు వెళ్లాలని కోరుకుంటే పోస్టుల ఖాళీ ఆధారంగా ఇరు రాష్ట్రాల అంగీకారం మేరకు అతన్ని కృష్ణా జిల్లాకు పంపేందుకు కమిటీ అనుమతించనుంది. తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్న 18 ఎఫ్‌కు ఎటువంటి మినహాయింపులూ ఇవ్వరాదని కమిటీ భావిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్‌న్యూమరీ పోస్టులు లేదా కొత్త పోస్టులు ఏర్పాటు చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని స్పష్టం చేయనుంది.

అలాగే లాస్ట్ గ్రేడ్ పోస్టులకు బదులు అటెండర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు అని తుది మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించింది. కమిటీ ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం సమావేశమై తుది మార్గదర్శకాలను ఖరారు చేయనుంది.  వాటిని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆమోదానికి పంపనుంది. కాగా, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పనిచేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్‌న్యూమరీ పోస్టులు లేదా కొత్త పోస్టులు సృష్టించుకోవాల్సి ఉంది. పోస్టులు, కేడర్ సంఖ్య ఆధారంగా తెలంగాణ సచివాలయంలో 104 మంది ఏపీకి చెందిన సెక్షన్ ఆఫీసర్లు, వ్యక్తిగత కార్యదర్శులు పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 104 మందికి సూపర్‌న్యూమరీ పోస్టులను గానీ, కొత్త పోస్టులను గానీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇప్పటికే ఈ సూపర్‌న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబును, సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావును కోరిం ది. ఇలా చేయడంవల్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఆ రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం కలుగుతుంది. మరోపక్క కేడర్ పోస్టుల ఆధారంగా తెలంగాణకు  చెందిన 518 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో సగం మంది నాలుగో తరగతి ఉద్యోగులే ఉన్నారు. తెలంగాణ సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఈ సగం మందిని భర్తీ చేయవచ్చు. మిగిలిన ఏఎస్‌వోలు, సహాక కార్యదర్శులు, డిప్యుటీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్‌న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేస్తే తెలంగాణకు చెందిన వారు సొంత రాష్ట్రంలోనే పనిచేయవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement