భోపాల్ : కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి... సబల్‌ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నేత బాజీనాథ్ కుశ్వాహను కలిశారు. అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకువెళ్లారు. అక్కడే బీజేపీ మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్ బాజీనాథ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ జూపారు. అలాగే వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతామని ఆయనకు చెప్పారు. కానీ బాజీనాథ్ వీటిని తిరస్కరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇలా దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది’ అని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు.
కాగా దిగ్విజయ్ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడం దిగ్విజయ్‌కు అలవాటేనని, ఆయనో ‘గాసిప్ మాంగర్’ అని విమర్శించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని, అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీయే కాబట్టి మీటింగ్ జరిగిందని చెబుతున్న దాబాకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తెచ్చి వీటిని నిరూపించాలని సవాల్ విసిరారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో కమల్‌నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో 15 సంవత్సరాల సుదీర్ఘ బీజేపీ పాలనకు తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment