Madhya Pradesh Election Result 2018
-
బీజేపీ మాజీ సీఎంకు టికెట్ ఆఫర్ చేసిన కాంగ్రెస్
భోపాల్ : రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బాబులాల్ గౌర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. తనను భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమని కోరినట్లు బాబులాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ నన్ను కలిశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున భోపాల్ నుంచి పోటి చేయమని కోరిన’ట్లు బాబులాల్ తెలిపారు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడే ఏమి చెప్పలేనని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని దిగ్విజయ్‌తో చెప్పినట్లు తెలిపారు బాబులాల్. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భంగపడిన బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్లను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిస్తోంది. -
‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్’
భోపాల్ : కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి... సబల్‌ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నేత బాజీనాథ్ కుశ్వాహను కలిశారు. అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకువెళ్లారు. అక్కడే బీజేపీ మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్ బాజీనాథ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ జూపారు. అలాగే వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెడతామని ఆయనకు చెప్పారు. కానీ బాజీనాథ్ వీటిని తిరస్కరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇలా దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది’ అని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. కాగా దిగ్విజయ్ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. అబద్ధాలు ప్రచారం చేయడం దిగ్విజయ్‌కు అలవాటేనని, ఆయనో ‘గాసిప్ మాంగర్’ అని విమర్శించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని, అధికారంలో ఉన్నది వాళ్ల పార్టీయే కాబట్టి మీటింగ్ జరిగిందని చెబుతున్న దాబాకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తెచ్చి వీటిని నిరూపించాలని సవాల్ విసిరారు. తమకు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో కమల్‌నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో 15 సంవత్సరాల సుదీర్ఘ బీజేపీ పాలనకు తెరపడింది. -
మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. 28 ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించిన ఆయన.. తన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ రాజ్‌భవన్‌లో వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. సజ్జన్ సింగ్ వర్మ, విజయలక్ష్మీ సాధూ, హుకుమ్ సింగ్ కరడ, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, బాలా బచ్చన్, అరిఫ్ అకిల్, ప్రదీప్ జైస్వాల్, ఇమ్రతీ దేవి తదితర ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కాగా పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 17న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. -
ముగ్గురు సీఎంల పట్టాభిషేకం
ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనంద డోలికల్లో ముంచితే, మరోవైపు ఆ పార్టీని వెంటాడుతున్న సిక్కుల ఊచకోత కేసులో తీర్పు ఇరకాటంలో పడేసింది. 1984 నాటి ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ను హైకోర్టు దోషిగా తేల్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన గహ్లోత్, కమల్‌నాథ్, బఘేల్ సీఎంలుగా ప్రమాణం చేయగా.. సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. సిక్కుల ఊచకోతలో పాపం మూటగట్టుకున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ నిలదీసింది. ఈ ఘటనలన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం. సోమవారం ఉదయం రాజస్తాన్ సీఎంగా అశోక్ గహ్లోత్ జైపూర్‌లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ భోపాల్‌లో, సాయంత్రం రాయ్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్ ప్రమాణం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆడంబరంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్‌నాథ్ రైతుల రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎం బఘేల్ రైతుల స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు. గహ్లోత్ ముచ్చటగా మూడోసారి.. జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ రాజస్తాన్‌కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్లో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్యాణ్‌సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా యువనేత సచిన్ పైలట్ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగో నేతగా గహ్లోత్ రికార్డు సృష్టించారు. గహ్లోత్ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్బర్ట్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, మాజీ సీఎం వసుంధరా రాజే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముక్తిమోర్చా నేత హేమంత్ సోరేన్, జార్ఖండ్ వికాస్ మోర్చా నేత బాబూలాల్ మరాండీ, కర్ణాటక, ఏపీ సీఎంలు కుమారస్వామి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 11వేల మంది కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో ఆల్బర్ట్ హాల్ కిటకిటలాడింది. చాలా మంది కుర్చీల పైకెక్కి తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. దీంతో కొందరు నేతలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు హైరానా పడాల్సి వచ్చింది. గహ్లోత్, పైలట్ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరు నేతల అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టింది. రాజధానికి వచ్చే రోడ్లన్నిటిలోనూ సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. సఫా ధరించిన పైలట్ సచిన్ పైలట్(41) ప్రమాణ స్వీకారం సందర్భంగా తెల్లటి కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్‌తోపాటు తలపై రాజస్తానీ స్టయిల్ ఎర్రటి తలపాగా ‘సఫా’ ధరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ‘సఫా’ ధరించబోనంటూ 2014లో ఆయన శపథం చేశారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పైలట్..ఈసారి అసెంబ్లీకిఎన్నికయ్యారు. గహ్లోత్‌కు అభినందనలు చెబుతున్న మాజీ సీఎం వసుంధరా రాజే తలపాగాతో పైలట్ రుణమాఫీపై తొలి సంతకం మధ్యప్రదేశ్ 18వ సీఎంగా కమల్‌నాథ్ భోపాల్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులెవరూ లేకుండా ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్‌కు ఎదురెళ్లిన కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన్ను వేదికపైకి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కుమారస్వామి, నారాయణస్వామి, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు.. కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాశ్ జోషి, బాబూలాల్‌గౌర్ హాజరయ్యారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన సీఎం కమల్‌నాథ్ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి. సీఎం సంతకం అయిన వెంటనే రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ అరోరా ‘మధ్యప్రదేశ్‌లోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు చెందిన రూ.2 లక్షల లోపు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. భోపాల్‌లో సింధియా, కమల్‌నాథ్‌లతో చేతులు కలిపిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ లబ్ధి కోసమే అల్లర్ల అంశం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనలకు సంబంధించి తనపై ఎటువంటి కేసులు లేవని, చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని మధ్యప్రదేశ్ కొత్త సీఎం కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ వెలువడుతున్న వార్తలు రాజకీయ లబ్ధి కోసం లేవనెత్తినవేనన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడా రు. ‘గతంలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు కూడా చేశా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా పనిచేశా. అప్పట్లో నాపైన ఎలాంటి కేసులు లేవు. చార్జిషీటు కూడా లేదు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసు’ అని కమల్‌నాథ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్ రాయ్‌పూర్: కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని బల్బీర్ జునేజా ఇండోర్‌స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, భారీ వర్షం రాకతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సైన్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మార్చాల్సి వచ్చింది. పెథాయ్ తుపాను ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముందుగా సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కురియడంతో కార్యక్రమ వేదికను హడావుడిగా బల్బీర్ జునేజా ఇండోర్ స్టేడియంలోకి మార్చారు. బఘేల్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు కూడా ఈ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మాజీ సీఎం రమణ్‌సింగ్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రమాణం అనంతరం సీఎం బఘేల్ చెప్పారు. రాష్ట్రంలో 2018, నవంబర్ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పారు. బఘేల్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐక్యతా రాగం...: సోమవారం జైపూర్‌లో అశోక్ గహ్లోత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐక్యత తెలుపుతున్న నేతలు..ఎంకే స్టాలిన్, చంద్రబాబు, కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, రాహుల్, శరద్‌యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ అందరూ కలిసి ఒకే బస్సులో...: గహ్లోత్ ప్రమాణస్వీకార వేదిక వద్దకు బస్సులో వెళ్తున్న రాహుల్, మన్మోహన్, శరద్ పవార్, శరద్ యాదవ్, స్టాలిన్ తదితరులు మేనల్లుడికి అభినందనలు..: జ్యోతిరాదిత్యను ఆప్యాయంగా హత్తుకున్న మేనత్త, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే -
నేడే కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జంబోరీ మైదానంలో ఈ వేడుక ఉంటుందనీ, ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనలు ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓజా ఆదివారం చెప్పారు. కమల్‌నాథ్ ప్రమాణం చేశాక గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోతారనీ, అనంతరం కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని శోభా చెప్పారు. ఇతర మంత్రులెవరూ లేకుండా కమల్‌నాథ్ మాత్రమే సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవె గౌడ, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తదితరులు ప్రమాణ స్వీకార వేడుకకు రానున్నారని ఓజా చెప్పారు. ఇటీవలి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. 15 వరుస సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటు కాబోతోంది. వింధ్య ప్రాంతంలో ఓటింగ్ సరళిపై విచారణ మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో కాంగ్రెస్‌కు అతి తక్కువ సీట్లు రావడంతో ఈ ప్రాంతంలోని ఓటింగ్ సరళిపై విచారణ జరిపించనున్నట్లు కమల్‌నా«ద్ తెలిపారు. ఇక్కడి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లే దక్కాయి. -
చింద్వాడా నుంచే కమల్‌నాథ్ పోటీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని తన సొంత జిల్లా చింద్వాడాలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యంతో గెలుపొందిన నియోజకవర్గం నుంచి తాను త్వరలో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ కాబోయే సీఎం కమల్‌నాథ్ చెప్పారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో కమల్‌నాథ్ పోటీ చేయకపోయినప్పటికీ ఆయనను మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం సీఎం పదవిలో ఆయన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఇక చింద్వాడా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో నాలుగు ఎస్సీ/ఎస్టీ రిజర్వ్డు స్థానాలు. దీంతో మిగిలిన మూడు స్థానాలైన చింద్వాడా, చౌరాయ్, సౌన్సర్లలో ఏదో ఓ చోటు నుంచి కమల్ చేయొచ్చు. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా, ఈ మూడింటిలో అత్యధిక ఆధిక్యం కాంగ్రెస్‌కు చింద్వాడాలోనే లభించింది. కమల్ ఇల్లు, ఓటరు జాబితాలో పేరు చింద్వాడాలో ఉన్నాయి. దీంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి శాసనసభకు ఎన్నికవుతారని సమాచారం. చింద్వాడాలో కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎన్నికైన దీపక్ సక్సేనా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయక తప్పని పరిస్థితి. ప్రమాణానికి రాహుల్, మమత కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులకు కూడా కమల్‌నాథ్ ఆహ్వానాలు పంపారని సమాచారం. -
నేను ఇప్పటికీ మధ్యప్రదేశ్ సీఎంనే : చౌహాన్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఓటమిని హుందాగా అంగీకరిస్తూ సీఎం పదవికి శివరాజ్ సింగ్ రాజీనామా కూడా చేశారు. అయినప్పటికీ తాను మధ్య ప్రదేశ్ సీఎంనేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే తాను ప్రస్తుతం మధ్య ప్రదేశ్ చీఫ్ మినిస్టర్( సీఎం) కాదని, కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని పేర్కొన్నారు. తన ట్విటర్లోని బయోడేటాలో చీప్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్‌ను తొలగించి కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చేర్చారు. ‘ మధ్యప్రదేశ్ రాష్ట్రం నా గుడి, రాష్ట్ర ప్రజలు నా దేవుళ్లు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ ప్రజల కోసం తెరచే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ఎలాంటి సంశయం లేకుండా నా దగ్గరకు రావోచ్చు. ఎప్పటిలాగే మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తా’ అని ట్విటర్లో చౌహాన్ పేర్కొన్నారు. मध्यप्रदेश मेरा मंदिर हैं, और यहाँ की जनता मेरी भगवान। मेरे घर के दरवाज़े आज भी प्रदेश के हर नागरिक के लिए हमेशा खुले हैं, वो बिना कोई हिचकिचाहट मेरे पास आ सकते हैं, और मैं हमेशा की तरह उनकी यथासंभव मदद करता रहूँगा। — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) December 14, 2018 తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, అధికార బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు 116 స్థానాలు అవసరం కావడంతో ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) లతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
17న కమల్‌నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిశారు. ఆయన వెంట సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచౌరీ, వివేక్ తన్ఖా, అరుణ్ యాదవ్ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్..‘రాజ్యాంగంలోని ఆర్టికల్–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్‌నాథ్‌కు ఆమె ఓ లేఖ అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది. అపార అనుభవం, ఆర్థిక బలం కమల్‌నాథ్‌ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి.. ► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత. ► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు. ► 9 సార్లు లోక్‌సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు. ► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు. ► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్ నాథ్‌పై ఉన్నది అభిమానమని అంటుంటారు. పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్‌గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు. ► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్ స్కూల్లోనే సంజయ్ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్‌లకు విశ్వసనీయ సలహాదారు. ► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్ మార్క్ అయిన 116 సాధించింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్‌నాథ్ వల్లనే సాధ్యమన్న నమ్మకం. ► లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం, వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం. ► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది. -
సింధియాలకు అందని సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్‌రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్‌సింగ్ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్‌నాథ్‌తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు. గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్‌నాథ్ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్‌నాథ్(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్‌రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్ చుర్హాత్ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మాధవ్‌రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్‌సింగ్ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్‌రావు సింధియా కూడా భోపాల్‌లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు. అయితే, అధిష్టానం మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్‌రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
సీఎం అభ్యర్థుల ప్రకటన ఆలస్యం!
-
యువనేతల ట్విస్ట్.. రసకందాయంలో సీఎం రేసు!
న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కొచ్చిపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంల ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సీఎం పదవి ఆశావహులు గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రాహుల్ నివాసానికి వచ్చారు. ఇదివరకు ఏ సమావేశం జరిగినా 10 జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసంలో జరిగేది. కానీ ఈసారి మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక కసరత్తంతా రాహుల్ నివాసంలోనే జరుగుతోంది. రాజస్థాన్ సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్.. మధ్యప్రదేశ్ సీఎం పదవి కోసం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్యల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నలుగురితో విడివిడిగా రాహుల్ గాంధీ మాట్లాడారు. యువనేతలు సచిన్ పైలట్, జ్యోతిరాదిత్యలకు డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్ చేసినా వారు ఆ పదవులను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల్లో తాము కష్టపడితే సీనియర్లకు పదవులిస్తారా అంటూ సచిన్, జ్యోతిరాదిత్య కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సీఎం రేసులో నుంచి తప్పుకోవడానికి యువనేతలు నిరాకరిస్తుండటంతో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ వారికి సర్దిచెప్పినట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కొలిక్కితెచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరనేది గురువారం రాహుల్ నిర్ణయించనున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్‌ను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు రాహుల్ పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కట్టబెడుతూ పార్టీ కేంద్ర పరిశీలకులు ఏకే ఆంటోనీ, జితేంద్ర సింగ్ సమక్షంలో తీర్మానం ఆమోదించారు. ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయం తెలుసుకుని సీఎం అభ్యర్ధులను నిర్ణయించాలని రాహుల్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు పోటీ పడగా కమల్ నాథ్‌వైపు హైకమాండ్ మొగ్గుచూపినట్టు సమాచారం. కాంగ్రెస్ సాధారణ మెజారిటీకి రెండు స్ధానాలు తగ్గిన క్రమంలో ఏడుగురు బీజేపీయేతర ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు మళ్లించడంలో కమల్ నాథ్ చూపిన చొరవ సైతం ఆయనకు కలిసివచ్చిందని చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్దాన్‌లో బీఎస్పీ, ఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో పలువురు సీనియర్లు తలపడుతుండగా రాహుల్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలను ఖరారు చేయనున్నారు. -
కమల్‌నాథ్.. కాంగ్రెస్ తురుపుముక్క
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 72 ఏళ్ల కమల్‌నాథ్ పటిష్టమైన వ్యూహరచనతో ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు వేశారు. రాష్ట్ర ప్రజల్లో మంచి పట్టున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎదుర్కోవడానికి, ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఆయన పలు ప్రణాళికలు, పథకాలు రూపొందించారు. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటాల్ని, అంతర్గత కుమ్ములాటలను నివారించి నేతలందరికీ ఏకతాటిపై నడిపించారు. ఫలితాల అనంతరం సీఎం పీఠంపై పోరులో ముందున్నారు. అప్పుడు ఇందిరకు.. ఇప్పుడు రాహుల్‌కు! 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఇందిరా గాంధీకి ఎంతగానో సహకరించిన కమల్‌నాథ్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మధ్య ప్రదేశ్‌లో బీజేపీ సర్కారును ఎదుర్కోవడానికి ఆ ఇందిరా గాంధీ మనుమడు రాహుల్ గాంధీకి అండగా నిలవడం విశేషం. లోక్‌సభలో సీనియర్ మోస్ట్ సభ్యుడయిన కమల్ నాథ్ ఇందిర కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సంజయ్‌గాంధీ, కమల్‌నాథ్‌లు ఇందిరా గాంధీకి రెండు చేతులని అప్పట్లో పార్టీ నేతలు అభివర్ణించేవారు. కమల్‌నాథ్‌ను ఇందిరాగాంధీ తన మూడో కుమారుడని చెప్పేవాడని చెప్పుకుంటుంటారు. 1980లో మొదటి సారి చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన కమల్‌నాథ్ ఇంతవరకు 9 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు వెళ్లారు. యూపీఏ హయాంలో మంత్రిగా పని చేశారు. కేంద్రంలో యూపీఏ సర్కారు నిలదొక్కుకోవడానికి ప్రధాన శక్తిగా వ్యవహరించారు. డూన్ స్కూల్ స్నేహం... ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహేంద్రనాథ్, లీనా నాథ్ దంపతులకు జన్మించిన కమల్‌నాథ్ డూన్ స్కూల్లో చదివారు. కోల్‌కతా యూనివర్సిటీ కాలేజీలో బీకాం చేశారు. కమల్ సతీమణి అల్కానాథ్. వీరికి ఇద్దరు కొడుకులు. 1968లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కమల్‌నాథ్ అనతికాలంలోనే పార్టీ పెద్దలకు సన్నిహితుడయ్యారు. కమల్‌కు డూన్ స్కూల్లో ఇందిర కొడుకు సంజయ్ ఆప్తమిత్రుడు. తద్వారా గాంధీ కుటుంబానికి సన్నిహితుడయ్యారు. సంజయ్ గాంధీ కోటరీలో ముఖ్యుడిగా పేరు పొందారు. 2009–11 మధ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. వికీలీక్స్ దుమారం.. కేంద్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన కమల్‌నాథ్‌కు అమెరికా తొత్తు అని, దేశానికి సంబంధించిన పలు రహస్యాలను అమెరికాకు చేరవేసేవాడని ‘వికీలీక్స్’ వెల్లడించడం అప్పట్లో(1976) తీవ్ర సంచలనం కలిగించింది.గతంలో యూపీఏ సర్కారుపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ప్రభుత్వానికి మద్దతివ్వడం కోసం కమల్‌నాథ్ కొందరు ఎంపీలకు లంచాలిచ్చారని కూడా వార్తలు వచ్చాయి. రాడియా టేపుల వ్యవహారంలో నాథ్ పేరు వినపడింది. పర్యావరణ మంత్రిగా ఉండగా పర్యావరణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం, పర్యావరణ మదింపును ప్రవేశపెట్టడం, పర్యావరణ బ్రిగేడ్లు ఏర్పాటు చేయడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జౌళిశాఖ సహాయ మంత్రి హోదాలో నూతన జౌళి విధానం తెచ్చారు. ఆయన హయాంలో పత్తి ఎగుమతులు పతాక స్థాయికి చేరాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఎఫ్‌డీఐలు 7 ఏడు రెట్లు పెరిగేలా చూశారు. విదేశీ వాణిజ్య విధానాన్ని తెచ్చి ఎగుమతుల పెంపు, భారీగా ఉపాధి కల్పనకు దోహదపడ్డారు. రచయిత కూడా.. వందల కోట్లకు అధిపతి అయిన కమల్‌నాథ్ రాజకీయ నాయకుడిగానే కాక పారిశ్రామిక వేత్తగా, వ్యవసాయదారుడిగా, సామాజిక సేవకుడిగా కూడా రాణించారు. ‘ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్’, ‘ఇండియాస్ సెంచరీ’, ‘భారత్ కీ శతాబ్ది’ పేరుతో పుస్తకాలు కూడా రాశారు. -
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌దే
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఎంతో ఉత్కంఠతో సాగిన ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం వరకు కొనసాగింది. ఊహించినట్లుగానే ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం దక్కకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. మొత్తం 230 సీట్లున్న శాసనసభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్ 114 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మెజారిటీ మార్కుకు కేవలం రెండే సీట్ల దూరంలో ఆగిపోయింది. బీజేపీ 109 స్థానాల్లో గెలిచింది. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు మాత్రం బీజేపీకే పడ్డాయి. కాషాయ పార్టీ 41 శాతం ఓట్లు దక్కించుకోగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు వచ్చినప్పటికీ బీజేపీ కన్నా 7 సీట్లు అధికంగా గెలుపొందింది. బీఎస్పీకి 2, ఎస్పీకి 1 సీటు దక్కగా, నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం లభించకపోవడంతో బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమేర్పడింది. అయితే తాము కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ, ఎస్పీలు ప్రకటించాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకే ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. బీజేపీని గద్దె దింపేందుకే: మాయావతి మధ్యప్రదేశ్‌లోనే కాక అవసరమైతే రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్‌కు తాము మద్దతివ్వాలని నిర్ణయించినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు కూడా తమకు నచ్చవనీ, కేవలం బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న పట్టుదలతోనే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించామని మాయావతి తెలిపారు. కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేందుకు నిదర్శనమే తాజా ఎన్నికల ఫలితాలని ఆమె పేర్కొన్నారు. శివరాజ్ సింగ్ రాజీనామా ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికి వరుసగా 13 ఏళ్లపాటు మధ్యప్రదేశ్‌కు సీఎంగా ఉన్నారు. ‘నా రాజీనామాను గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు సమర్పించాను. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ప్రజలు కూడా మాపై ప్రేమ చూపారు. కానీ మేం కనీసం అత్యధిక సీట్లు కూడా గెలవలేదు. కమల్‌నాథ్‌కు అభినందనలు. ప్రచారంలో హామీ ఇచ్చినట్లు రైతు రుణమాఫీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోపు అమలు చేయాలి’ అని చౌహాన్ విలేకరులతో అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలోని 10 మందికి పైగా ప్రముఖులు ఈ ఎన్నికల్లో ఓటమిపాలవడం గమనార్హం. రాహుల్‌కు సీఎం ఎంపిక బాధ్యత 15 ఏళ్ల అనంతరం మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుండటంతో ఆ రాష్ట్రానికి సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకులు ఏకే ఆంటోనీ, భన్వర్ జితేంద్ర సింగ్‌ల పర్యవేక్షణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం భోపాల్‌లో జరిగింది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను రాహుల్ గాంధీకే అప్పగిస్తున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీకి సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియాలు మధ్యప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి రేసులో ఉండటం తెలిసిందే. రుణమాఫీ హామీతోనే గెలుపు! మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రుణమాఫీ హామీనే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిరోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ ఎన్నికల ప్రచారంలో హమీనిచ్చారు. దీంతో రైతులంతా గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ అధ్యక్షుడు శివ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ అవుతుంద న్న ఉద్దేశంతో రైతులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న వరి పంట దిగుబడులను కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారు. ఈ వడ్లను అమ్మితే ఆ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది. బ్యాంకులు రుణం కంతును వారి ఖాతాల్లోంచి తీసుకుంటాయి. ఈ కారణంతో రైతులు తమ దిగుబడిని కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారని శర్మ చెప్పారు. రుణమాఫీ సాధ్యం కాని హామీ అని శివరాజ్ సింగ్ గతంలో అన్నారు. -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఖరారు!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారైనట్టుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీ పక్షనేతగా కమల్‌నాథ్ పేరును ప్రతిపాదించారు. పార్టీ గెలుపుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే కారణమని సింధియా తెలిపారు. సీఎం ఎవరనే నిర్ణయాన్ని రాహుల్‌కే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న సింధియానే శాసనసభ పక్ష నేతగా కమల్‌నాథ్ పేరును ప్రకటించడంతో ఆయన ఎంపిక లాంఛనం కానుంది. ఈ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రకటను చేయలేదు. ఈ రోజు రాత్రికి కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో మెజారిటీ మార్కుకు రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్.. అధికారం చేజిక్కించుకోవడానికి వేగంగా పావులు కదిపింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, స్వతంత్రులతో కాంగ్రెస్ నాయకుల చర్చలు ఫలించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అయితే సీఎం పదవి విషయంలో కొద్దిగా సందిగ్ధత నెలకొంది. సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
‘ఓటమికి పూర్తి బాధ్యత నాదే’
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన తాజా ఎన్నికల్లో అధికార బీజేపీ మెజారిటీకి 7 స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ ఓటమితో మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన చౌహాన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. హోరాహోరిగా సాగిన పోరులో చాలా కొద్ది తేడాతో తాము అధికారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తానెవరినైనా నిరాశ పరిచి ఉంటే క్షమించాలని కోరారు. గెలవడం, ఓడిపోవడం ఎన్నికల్లో భాగమేనని చౌహాన్ అన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎప్పుడూ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తానని వెల్లడించారు. ప్రజలకు అన్యాయం జరిగితే తాను చూస్తు ఊరుకోనని తెలిపారు. -
సింధియా, సచిన్‌లకు షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి తమకు దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్ యువ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లకు నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పేరును పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించి ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను ప్రతిపాదించడంతో అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కావాల్సిన మెజారిటీకి ఒక్క సీటు తక్కువ రావడం, ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌కు కేవలం ఐదు సీట్ల దూరంలో ఉండడం వల్ల అనుభవజ్ఞులు కావాలన్నది సీనియర్ల వాదన. ఇక రాజస్థాన్ విషయంలో అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేసి, సచిన్ పైలట్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అయితే డిప్యూటీ సీఎం పదవికి సచిన్ పైలట్ పేరును స్వయంగా అశోక్ గెహ్లాట్ తిరస్కరించారని తెల్సింది. పార్టీకి పూర్తి మెజారిటీ రాని ప్రస్తుత సమయంలో సంకీర్ణ రాజకీయాలు నడపాలంటే రెండు అధికారిక కేంద్రాలు ఉండరాదన్నది గెహ్లాట్ వాదన. యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లకు వయస్సు ఉన్నందున వారికి మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంటుందన్నది పార్టీలో సీనియర్ల వాదన. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ముందుగా ఖరారు చేయలేదు. అలా చేస్తే ముఠాలు ఏర్పడుతాయని, ఫలితంగా పరాజయం ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్లు పార్టీలో ఆధిపత్య పోరును పక్కనపెట్టి పార్టీ విజయం కోసం చిత్తశుద్ధితో కషి చేశారు. రాహుల్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇస్తారని వారి నమ్మి ఉండవచ్చు. అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు రాహుల్ గాంధీ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత జూనియర్లతోపాటు సీనియర్లను కలుపుకుపోవాలని నిర్ణయించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ ఆఫీసు బేరర్లు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండేలు సచిన్‌కు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రయిన అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. ఇక కమల్‌నాథ్ వరుసగా తొమ్మదోసారి పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అధిష్టానం ఆయనకే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్ రేస్‌లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి పార్టీ రాష్ట్ర చీఫ్ భూపేశ్ భాగెల్, అవుట్ గోయింగ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీఎస్ సింగ్ దేవ్, మాజీ కేంద్ర మంత్రి చరణ్‌దాస్ మహంత్; పార్టీ ఏకైక ఎంపీ తామ్రధ్వాజ్ సాహు పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడే అయినప్పటికీ భాగెల్‌కు పదవి దక్కక పోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను రాసిన టీఎస్ సింగ్ దేవ్‌కు దక్కవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి శాసన సభ్యులు తమ నాయకుడిని అధికారికంగా ఎన్నుకుంటారు. -
గవర్నర్‌ను కలిసిన కమల్ నాధ్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో మేజిక్ ఫిగర్‌ను సాధించిన కాంగ్రెస్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ సీఎం రేస్‌లో నిలిచిన కమల్ నాథ్ బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను కలిశారు. కమల్ నాథ్‌తో పాటు సీఎం పదవి ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల బృందంలో ఉన్నారు.తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను వారు గవర్నర్‌కు అందచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకుందని కమల్ నాథ్ గవర్నర్‌కు వివరించారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది. మరోవైపు గెలుపొందిన స్వతంత్రులతో కూడా కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. -
మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ రాజీనామా
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మేజిక్ ఫిగర్‌కు రెండు స్దానాల దూరంలో నిలిచిన కాంగ్రెస్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంగా వైదొలిగిన అనంతరం తానిప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. బీఎస్పీ మద్దతుతో పాటు స్వతంత్రుల సహకారం కూడగట్టేందుకు ఆ పార్టీ నేతలు మంతనాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. కాగా, మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది -
కాంగ్రెస్‌కు మద్దతుపై మాయావతి గ్రీన్‌సిగ్నల్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు స్ధానాలు తగ్గిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి అంగీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ సహా ఆ పార్టీ అగ్ర నాయకత్వం మాయావతితో జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది. రాజస్ధాన్‌లోనూ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని మాయావతి వెల్లడించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిన ప్రజలు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని పేర్కొన్నారు. మరోవైపు గెలుపొందిన స్వతంత్రులతో కూడా కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. మాయావతి మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ బుధవారం మధ్నాహ్నం గవర్నర్‌తో భేటీ అయింది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ సైతం 109 స్ధానాలు దక్కించుకోవడంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది -
ఒక్క అడుగు దూరంలో..
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు సానుకూలంగానే ఉన్నా ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ కొద్ది దూరంలో నిలిచింది. సొంతంగా ప్రభుత్వాల ఏర్పాటుకు అరకొర సీట్లు తగ్గడంతో ఆ పార్టీ బీఎస్పీ సహా స్వతంత్రుల సహకారం ఆశిస్తోంది. రాజస్దాన్‌లో సాధారణ మెజారిటీకి ఒక స్ధానం కాంగ్రెస్‌కు తగ్గగా, మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లు తక్కువగా వచ్చాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలతో పాటు స్వతంత్రులతో జట్టు కట్టక తప్పని పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్ రెండు స్ధానాలు దూరంలో నిలవడంతో రెండు సీట్లు నెగ్గిన బీఎస్పీ, ఒక స్ధానంలో గెలుపొందిన ఎస్పీలతో కాంగ్రెస్ సంప్రదింపులు ప్రారంభించింది. ఇక్కడ బీజేపీ సైతం 109 స్ధానాలు దక్కించుకోవడంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. ఇక రాజస్ధాన్‌లో బీజేపీ కంటే కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు గెలుపొందడం, మెజారిటీ మార్క్‌కు కేవలం ఒక స్ధానం మాత్రమే తగ్గడంతో కాంగ్రెస్ సేఫ్జోన్లో ఉంది. ఇక్కడ ఆరు సీట్లు నెగ్గిన బీఎస్పీ, రెండు సీట్లు కైవసం చేసుకున్న సీపీఐ(ఎం), ఇతర చిన్న పార్టీల మద్దతు కోరేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు స్వతంత్రుల్లో కాంగ్రెస్ రెబెల్స్ ఎక్కువ మంది నెగ్గడంతో వారి సహకారం లభిస్తుందనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. -
ఓట్లు పెరిగినా తగ్గిన సీట్లు
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ కాంగ్రెస్‌తో ఉత్కంఠ పోరులో హోరాహోరీగా తలపడినా చివరికి కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 114 స్ధానాల్లో విజయం సాధించి మేజిక్ మార్క్‌కు కొద్ది అడుగుల దూరంలో నిలిచింది. బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. సీట్ల సంఖ్య పరంగా బీజేపీ వెనుకబడినా కాంగ్రెస్ కంటే అధిక శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 41 శాతం ఓట్లు సాధించగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 1,56,42,960, కాంగ్రెస్‌కు 1,55,95,153, స్వతంత్రులు 22,18,230, బీఎస్పీ, 1,91,1642 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి అధికంగా ఓట్లు దక్కినా అత్యధిక సీట్లు కాంగ్రెస్ వశమయ్యాయి. అయితే 2013 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ నాలుగు శాతం మేర ఓట్లు పెంచుకోగా, బీజేపీ నాలుగు శాతం ఓట్లను కోల్పోయింది. మరోవైపు రైతు ఆందోళనలతో అట్టుడికిన మందసోర్ ప్రాంతంలో బీజేపీ తన పట్టునిలుపుకోవడం గమనార్హం. -
అయిదు రాష్ట్రాల్లో తుది ఫలితాలు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో నూతనోత్సహం నింపగా, బీజేపీని నిరాశపరిచాయి. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో పాలక బీజేపీని కాంగ్రెస్ మట్టికరిపించింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ విస్పష్ట మెజారిటీ సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చెప్పుకోదగిన ఫలితాలు సాధించింది. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కీలకంగా మారారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలు సాధించిన స్ధానాల వివరాలు.. తెలంగాణ.. తెలంగాణలో 119 స్ధానాల్లో టీఆర్ఎస్ 88 స్ధానాల్లో గెలుపొంది తిరుగులేని మెజారిటీ సాధించింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమిని మట్టికరిపించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. కారు జోరుకు కుదేలైన కాంగ్రెస్ కూటమి 21 స్ధానాలకు పరిమితమైంది. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఒక స్ధానంలో, ఇతరులు 2 స్ధానాల్లో విజయం సాధించారు. టీఆర్ఎస్కు 97,00,749 ఓట్లు (46.9 శాతం), కాంగ్రెస్‌కు 58,83,111 ఓట్లు (28.4 శాతం), బీజేపీ 14,50,456 ఓట్లు (7.0 శాతం), టీడీపీ 7,25,845(3.5 శాతం), స్వతంత్రులు 6,73,694 ఓట్లు (3.3 శాతం), ఎంఐఎం 5,61,089 ఓట్లు (2.7 శాతం), బీఎస్పీ 4,28,430 ఓట్లు (2.7 శాతం), ఎస్ఎంఎఫ్బీ 1,72,304 ఓట్లు (0.8 శాతం), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1,72,304 ఓట్లు (0.8 శాతం), బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 1,14,432 ఓట్లు(0.7 శాతం) వచ్చాయి. మధ్యప్రదేశ్.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరుసాగినా చివరకు కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 114 స్ధానాల్లో విజయం సాధించగా, బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు గెలుచుకోగా, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లో స్వతంత్రులు, బీఎస్పీ ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. బీజేపీకి 1,56,42,980 ఓట్లు(41శాతం), కాంగ్రెస్‌కు 1,55,95,153 ఓట్లు (40.9 శాతం), ఇండిపెండెంట్లకు 22,18,230 ఓట్లు (5.8 శాతం), బీఎస్పీకి 19,11,642 ఓట్లు (5 శాతం), సీజీపీకి 6,75,648 ఓట్లు (1.8 శాతం), ఎస్పీకి 4,96,025 ఓట్లు (1.3 శాతం), ఏఏఏపీకి 2,53,101 ఓట్లు (0.4 శాతం), ఎస్పీఏకేపీకి 1,56,486 ఓట్లు (0.4 శాతం), బీఏఎస్డీకి 78,692 ఓట్లు (0.2 శాతం), బీఎస్సీపీకి 71,278 ఓట్లు (0.2 శాతం) ఓట్లు లభించాయి. రాజస్ధాన్ ఎడారి రాష్ట్రం రాజస్ధాన్‌లో మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ 99 స్ధానాలను హస్తగతం చేసుకోగా, బీజేపీ 73 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఆరు స్ధానాల్లో, ఇతరులు అత్యధికంగా 21 స్ధానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 1,39,35,201 ఓట్లు (39.3 శాతం), బీజేపీకి 1,37,57,502 ఓట్లు (38.3 శాతం), ఇండిపెండెంట్లకు 33,72,206 ఓట్లు (9.5 శాతం), బీఎస్పీకి 14,10,995 ఓట్లు (4 శాతం), ఆర్‌ఎల్‌టీపీకి 8,56,038 ఓట్లు (2.4 శాతం), సీపీఎంకు 4,34,210 ఓట్లు (1.2 శాతం), బీజేపీకి 2,55,100 ఓట్లు (0.7 శాతం), ఏఏఏపీకి 1,35,826 ఓట్లు (0.4 శాతం), ఆర్సీడీకి 1,16,320 ఓట్లు (0.3 శాతం), బీవీహెచ్పీ 1,11,357 (0.3 శాతం) ఓట్లు లభించాయి. చత్తీస్‌గఢ్.. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్ధానాల్లో కాంగ్రెస్ మూడింట రెండొంతులు పైగా 68 స్ధానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ప్రభంజనంతో బీజేపీ బేజారైంది. పదిహేనేళ్ల పాటు చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో కేవలం 15 స్ధానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అజిత్ జోగి నేతృత్వంలోని జేసీసీ 7 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 61,44,192 ఓట్లు (43 శాతం), బీజేపీకి 47,07,141 ఓట్లు (33 శాతం), జేసీసీజేకు 10,86,531 ఓట్లు (7.6 శాతం), ఇండిపెండెంట్లకు 8,39,053 ఓట్లు (5.9 శాతం), బీఎస్పీకి 5,52,313 ఓట్లు (3.9 శాతం), జీజీపీకి 2,47,459 ఓట్లు (1.7 శాతం), ఏఏఏపీకి 1,23,526 ఓట్లు (0.9 శాతం), సీపీఐకి 48,255 ఓట్లు (0.3 శాతం), ఎస్హెచ్ఎస్కు 34,678 ఓట్లు(0.2 శాతం) దక్కాయి మిజోరం.. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. మొత్తం 40 స్ధానాలకు గాను మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 5 స్ధానాలు, బీజేపీ ఒక స్ధానం దక్కించుకోగా, ఇతరులు 8 స్ధానాల్లో గెలుపొందారు. మిజో నేషనల్ ఫ్రంట్‌కు 2,37,305 ఓట్లు (37.6 శాతం), కాంగ్రెస్‌కు 1,90,412 ఓట్లు (30.2 శాతం),ఇండిపెండెంట్లకు 1,44,925 ఓట్లు (22.9 శాతం), బీజేపీకి 50,749 ఓట్లు (8 శాతం), ఎన్పీఈపీకి 3626 ఓట్లు (0.6 శాతం), పీఆర్ఐఎస్ఎంపీకి 1262 ఓట్లు (0.2 శాతం), నోటాకు 2917 ఓట్లు (0.5 శాతం) లభించాయి. -
అంతా రాహుల్ వల్లే..
న్యూఢిల్లీ: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ పాలిట ముప్పుగా మారారా? 2019 లోక్‌సభ ఎన్నికలనాటికి రాహుల్ ప్రాభవం దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబిస్తున్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీతో నువ్వా?నేనా? అన్న రీతిలో తలపడుతోంది. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగడం నాయకుడి లక్షణమనీ, దీన్ని రాహుల్ పాటిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో పరిణతి సాధించారని చెబుతున్నారు. తప్పుల్ని సరిదిద్దుకున్నారు.. ఈ విషయమై ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ.సుశీలా రామస్వామి మాట్లాడుతూ..‘మంచి నాయకుడు అనేవాడు గతంలో తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాడు. ప్రజల సమస్యలను సావధానంగా వింటాడు. ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అదే చేస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రాహుల్‌కు, ఇప్పటి రాహుల్‌కు చాలాతేడా ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మెరుగైన ఫలితాలు సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని 65 స్థానాల్లో బీజేపీ 62 సీట్లను గెలుచుకోగలిగింది. మిజోరంతో పాటు తెలంగాణలో ఓటమి పాలైనప్పటికీ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఈ 3 రాష్ట్రా ల్లో పురోగతి సాధించడం కీలక పరిణామం’ అని వ్యాఖ్యానించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడే మహాకూటమిలో కాంగ్రెస్ కీలకంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. విపక్షాల ఏకీకరణతోనే విజయం.. రాహుల్‌గాంధీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదనీ, బలవంతంపై, అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని సెంటర్ ఫర్ అడ్వొకసీ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ మనీషా తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో రాహుల్ బాగానే పనిచేసినప్పటికీ అంచనాలను అందుకోలేదు. ఏదేమైనా ఈ ఫలితాలు విపక్షాల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఓ జాతీయస్థాయి నేతగా గ్రామీణ భారతంలోని ప్రజలకు చేరువకావడంలో రాహుల్ సఫలీకృతులయ్యారు. మోదీని దీటుగా ఎదుర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు వీలుగా విపక్షాలను రాహుల్ ఎలా కలుపుకుని పోతారన్న దానిపైనే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంటుంది’ అని వెల్లడించారు. మోదీ–షా ద్వయం వ్యూహాలకు తిరుగుండదన్న భావన తాజా ఫలితాలతో పటాపంచలు అయ్యాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి రాహుల్ తో పాటు ఆయా రాష్ట్రాల నేతలు, కేడర్ కూడా కారణమని ఆమె గుర్తుచేశారు. అంతా రాహుల్ వల్లే: కాంగ్రెస్ రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవడానికి రాహుల్ గాంధీ జరిపిన సుడిగాలి పర్యటనలు, రోడ్‌షో లే కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ ఏకంగా 82 బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఏడు రోడ్ షోల్లో పాల్గొన్నారని గుర్తుచేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రైతులు, యువత, సామాన్యుల సమస్యలను, రఫేల్ ఒప్పందాన్ని రాహుల్ ప్రస్తావించారని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న హామీ గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపిందన్నారు. రాహుల్ నిబద్ధత, అంకితభావం కారణంగానే పార్టీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా ఇలాంటి అద్భుత విజ యాన్ని కాంగ్రెస్ అందుకుందని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ఫలితాలతో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ శ్రేణుల నైతిక బలం రెట్టింపు అయిందనీ, మిత్రపక్షాలను ఏకం చేసి బీజేపీని 2019లో ఇంటికి సాగనంపేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. -
అధికారంపై ధిక్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించాలన్న బీజేపీ విశ్వప్రయత్నాలకు ఈ ఎన్నికలు భారీగా గండికొట్టాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, 2019లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్‌గాంధీల సత్తాకు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. మరోవైపు కాంగ్రెస్ ముచ్చటగా మూడు రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగురవేసి సెమీఫైనల్స్‌లో సత్తా చాటింది. 2019 లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీని ప్రధాని రేసులోకి తీసుకొచ్చింది. మరోసారి అదే పంథా.. గత 2 దశాబ్దాలుగా ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్తాన్ ఓటర్లు ఈసారి అదే పంథాను కొనసాగించారు. 2013లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీకి 161 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగానే అక్కడి ప్రజలు కట్టబెట్టారు. ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్‌లో మార్పు.. గత మూడు ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీని ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి ఇంటికి సాగనంపారు. 15 ఏళ్ల రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడింది. దీని ఫలితంగా చాలా స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు మిజోరంలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగినా కాంగ్రెస్ పరాభవం తప్పలేదు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. రైతులే నిర్ణయించారా..! సెమీఫైనల్స్‌లో అధికార మార్పిడికి రైతుల్లో ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులు తమ కోపాన్ని అక్కడి పాలక పక్షంపై ఓట్ల రూపంలో చూపించారు.2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రైతుల అంశమే పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిచిన 3రాష్ట్రాల్లో రుణమాఫీ అంశం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ విస్త్రతంగా చేసిన ప్రచారం రైతుల ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చేసింది. రైతులే ప్రధాన ఎజెండా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్పై రైతులు పూర్తి విశ్వాసాన్ని కనబరిచారు. ఆ పార్టీ రైతులు కోసం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత వ్యవసాయ కరెంటు వంటివి తిరిగి అధికారాన్ని పొందేందుకు సహకరించాయి. రాఫేల్ ఒప్పందాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందగా.. బీజేపీ హిందుత్వ విధానం అంతగా పనిచేసినట్లు కనిపించలేదు. మోదీ ఆలోచనలు సరిగా పనిచేయకపోవడం, యోగి ఆదిత్యనాథ్ చేసిన హనుమాన్ దళిత్ వ్యాఖ్యలు, మైనార్టీలను దేశం వదిలి వెళ్లి పోవాలనడం, నగరాలకు పేర్లు మార్చడం వంటివి కూడా ఓటమికి కారణాలని బీజేపీ సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. తాజా ప్రతికూల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.