సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కొలిక్కితెచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరనేది గురువారం రాహుల్ నిర్ణయించనున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్‌ను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు రాహుల్ పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కట్టబెడుతూ పార్టీ కేంద్ర పరిశీలకులు ఏకే ఆంటోనీ, జితేంద్ర సింగ్ సమక్షంలో తీర్మానం ఆమోదించారు. ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయం తెలుసుకుని సీఎం అభ్యర్ధులను నిర్ణయించాలని రాహుల్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ సీఎం రేసులో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు పోటీ పడగా కమల్ నాథ్‌వైపు హైకమాండ్ మొగ్గుచూపినట్టు సమాచారం. కాంగ్రెస్ సాధారణ మెజారిటీకి రెండు స్ధానాలు తగ్గిన క్రమంలో ఏడుగురు బీజేపీయేతర ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు మళ్లించడంలో కమల్ నాథ్ చూపిన చొరవ సైతం ఆయనకు కలిసివచ్చిందని చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్దాన్‌లో బీఎస్పీ, ఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో పలువురు సీనియర్లు తలపడుతుండగా రాహుల్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలను ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment