Assembly Elections 2018
-
తాళాల పంచాయతీ.. ‘ఇది కుట్ర ప్రకారమే జరిగింది..’
జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
ముగ్గురు సీఎంల పట్టాభిషేకం
ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనంద డోలికల్లో ముంచితే, మరోవైపు ఆ పార్టీని వెంటాడుతున్న సిక్కుల ఊచకోత కేసులో తీర్పు ఇరకాటంలో పడేసింది. 1984 నాటి ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ను హైకోర్టు దోషిగా తేల్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన గహ్లోత్, కమల్‌నాథ్, బఘేల్ సీఎంలుగా ప్రమాణం చేయగా.. సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. సిక్కుల ఊచకోతలో పాపం మూటగట్టుకున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ నిలదీసింది. ఈ ఘటనలన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం. సోమవారం ఉదయం రాజస్తాన్ సీఎంగా అశోక్ గహ్లోత్ జైపూర్‌లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ భోపాల్‌లో, సాయంత్రం రాయ్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్ ప్రమాణం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆడంబరంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్‌నాథ్ రైతుల రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎం బఘేల్ రైతుల స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు. గహ్లోత్ ముచ్చటగా మూడోసారి.. జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ రాజస్తాన్‌కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్లో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్యాణ్‌సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా యువనేత సచిన్ పైలట్ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగో నేతగా గహ్లోత్ రికార్డు సృష్టించారు. గహ్లోత్ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్బర్ట్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, మాజీ సీఎం వసుంధరా రాజే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముక్తిమోర్చా నేత హేమంత్ సోరేన్, జార్ఖండ్ వికాస్ మోర్చా నేత బాబూలాల్ మరాండీ, కర్ణాటక, ఏపీ సీఎంలు కుమారస్వామి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 11వేల మంది కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో ఆల్బర్ట్ హాల్ కిటకిటలాడింది. చాలా మంది కుర్చీల పైకెక్కి తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. దీంతో కొందరు నేతలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు హైరానా పడాల్సి వచ్చింది. గహ్లోత్, పైలట్ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరు నేతల అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టింది. రాజధానికి వచ్చే రోడ్లన్నిటిలోనూ సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. సఫా ధరించిన పైలట్ సచిన్ పైలట్(41) ప్రమాణ స్వీకారం సందర్భంగా తెల్లటి కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్‌తోపాటు తలపై రాజస్తానీ స్టయిల్ ఎర్రటి తలపాగా ‘సఫా’ ధరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ‘సఫా’ ధరించబోనంటూ 2014లో ఆయన శపథం చేశారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పైలట్..ఈసారి అసెంబ్లీకిఎన్నికయ్యారు. గహ్లోత్‌కు అభినందనలు చెబుతున్న మాజీ సీఎం వసుంధరా రాజే తలపాగాతో పైలట్ రుణమాఫీపై తొలి సంతకం మధ్యప్రదేశ్ 18వ సీఎంగా కమల్‌నాథ్ భోపాల్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులెవరూ లేకుండా ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్‌కు ఎదురెళ్లిన కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన్ను వేదికపైకి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కుమారస్వామి, నారాయణస్వామి, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు.. కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాశ్ జోషి, బాబూలాల్‌గౌర్ హాజరయ్యారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన సీఎం కమల్‌నాథ్ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి. సీఎం సంతకం అయిన వెంటనే రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ అరోరా ‘మధ్యప్రదేశ్‌లోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు చెందిన రూ.2 లక్షల లోపు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. భోపాల్‌లో సింధియా, కమల్‌నాథ్‌లతో చేతులు కలిపిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ లబ్ధి కోసమే అల్లర్ల అంశం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనలకు సంబంధించి తనపై ఎటువంటి కేసులు లేవని, చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని మధ్యప్రదేశ్ కొత్త సీఎం కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ వెలువడుతున్న వార్తలు రాజకీయ లబ్ధి కోసం లేవనెత్తినవేనన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడా రు. ‘గతంలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు కూడా చేశా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా పనిచేశా. అప్పట్లో నాపైన ఎలాంటి కేసులు లేవు. చార్జిషీటు కూడా లేదు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసు’ అని కమల్‌నాథ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్ రాయ్‌పూర్: కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని బల్బీర్ జునేజా ఇండోర్‌స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, భారీ వర్షం రాకతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సైన్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మార్చాల్సి వచ్చింది. పెథాయ్ తుపాను ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముందుగా సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కురియడంతో కార్యక్రమ వేదికను హడావుడిగా బల్బీర్ జునేజా ఇండోర్ స్టేడియంలోకి మార్చారు. బఘేల్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు కూడా ఈ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మాజీ సీఎం రమణ్‌సింగ్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రమాణం అనంతరం సీఎం బఘేల్ చెప్పారు. రాష్ట్రంలో 2018, నవంబర్ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పారు. బఘేల్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐక్యతా రాగం...: సోమవారం జైపూర్‌లో అశోక్ గహ్లోత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐక్యత తెలుపుతున్న నేతలు..ఎంకే స్టాలిన్, చంద్రబాబు, కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, రాహుల్, శరద్‌యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ అందరూ కలిసి ఒకే బస్సులో...: గహ్లోత్ ప్రమాణస్వీకార వేదిక వద్దకు బస్సులో వెళ్తున్న రాహుల్, మన్మోహన్, శరద్ పవార్, శరద్ యాదవ్, స్టాలిన్ తదితరులు మేనల్లుడికి అభినందనలు..: జ్యోతిరాదిత్యను ఆప్యాయంగా హత్తుకున్న మేనత్త, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే -
నిజంగానే ‘పీపుల్స్ పల్స్’ పట్టేసింది..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇకపోతే ఎన్నికలు పూర్తికాగానే.. జాతీయ మీడియా నుంచి.. స్థానిక మీడియా దాకా ప్రతి ఒక్కరు ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం చేశారు. జాతీయ సర్వేలతో పాటు ఇక్కడి సర్వే సంస్థలు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. కేవలం లగడపాటి మాత్రం కూటమి గెలుపు ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన జోస్యం తప్పింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ నిజంగానే ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేసి 90 శాతం వరకూ కచ్చితమైన ఫలితాలను అందించినట్లు రీసర్చ్ అసోసియేట్ ఎస్ బాల నరసింహారెడ్డి తెలిపారు. పీపుల్స్ పల్స్ మాత్రమే దేశవ్యాప్తంగా గుణాత్మక, పరిమాణాత్మక సర్వే నిర్వహించిందన్నారు. గత తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచి స్టడీ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ పల్స్ జమ్ము-కశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర, దక్షిణ భారతదేశమంతటా మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వేను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాము అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందించినట్లు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పీపుల్స్ పల్స్ కేవలం గెలుపు, ఓటముల్నే కాకుండా వాటి వెనక ఉన్న కారణాల గురించి కూడా విశ్లేషిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వేని కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. అయితే రవాణా సౌకర్యాల కొరత దృష్ట్యా రాజస్తాన్‌లో మాత్రం ఎటువంటి సర్వే నిర్వహించలేకపోయామన్నారు. మూడ్ సర్వే నిర్వహించిన వారు వారాల తరబడి ఈ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంచరించారన్నారు. పీపుల్స్ సర్వే వెల్లడించిన వివరాలు.. మధ్యప్రదేశ్‌లో హస్తం హవా... మధ్యప్రదేశ్‌లో మూడ్ సర్వే నిర్వహిస్తోన్నప్పుడు ప్రజలు ఈ సారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలిసిందన్నారు. ఇక ప్రీ పోల్ సర్వే ఫలితాలు కూడా అందుకు తగ్గట్లుగానే వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపు 41. 6 శాతం ఓట్లతో దాదాపు 116 - 120 గెలుస్తుందని అంచాన పీపుల్స్ పల్స్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారమే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపు 40.9 శాతం ఓట్లతో 114 స్థానాల్లో గెలపొందింది. అయితే రైతుల్లో ఉన్న అసంతృప్తే బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా నరసింహా రెడ్డి పేర్కొన్నారు. అలానే బీఎస్పీ కేవలం 0 - 2 స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పగా నిజంగానే ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ లెక్క తప్పలేదు... ఛత్తీస్‌గఢ్‌లో 41శాతం ఓట్లు గెల్చుకుని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ నివేదించింది. అలానే జేసీసీ, బీఎస్పీ రెండు కలిసి 11 శాతం ఓట్లను సాధిస్తాయని.. ఈ రెండు కూడా బీజేపీకి కీడు చేస్తాయని ప్రకటించింది. వాస్తవంగా కూడా అదే జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 43 శాతం ఓట్లు గెల్చుకుని అధికారంలోకి రాగా.. జేసీసీ, బీఎస్పీ కూటమి 10. 9 శాతం ఓట్లు సాధించింది. అయితే పీపుల్స్ పల్స్ చెప్పినట్లు జేసీసీ, బీఎస్పీ కూటమి బీజేపీకి బాగానే హాని చేశాయి. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో కారుకు నో బ్రేక్... ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ 2018, అక్టోబర్ నాటికే మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వే కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. ఈ రెండు సర్వేల్లో కూడా టీఆర్ఎస్సే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయన్నారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేంత వ్యతిరేకత మాత్రం లేదని సర్వేలో తెలిసిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు, తాగు నీటి పథకాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏం చేయలేదని.. టీజేఎస్, వామపక్షాలు టీఆర్ఎస్ ముందు నిలవలేవని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఈ సర్వేకు అనుగుణంగానే ఫలితాలు కూడా అలానే వచ్చాయి. టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు ఖాతా తెరవకపోగా.. బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమయ్యింది. ఈ సర్వేలో తెలిసిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. రాష్ట్రంలో ఉన్న ముస్లింలు, బీసీలు కేసీఆర్‌కు పెద్ద ఓటు బ్యాంక్‌గా నిలవనున్నట్లు తెలిసింది. ముస్లింలకు నరేంద్ర మోదీ పట్ల ఆగ్రహం ఉన్నప్పటికి.. కేసీఆర్ మీద మాత్రం సానుకూల అభిప్రాయమున్నట్లు తెలిసిందన్నారు. మిజోరాంలో తప్పిన అంచనా... ఇక మిజోరాం విషయానికొస్తే కాంగ్రెస్, ఎమ్ఎన్ఎఫ్లు సమానంగా సీట్లు సాధించడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ మాత్రం పీపుల్స్ సర్వే అంచనాలు తప్పాయి. ఎమ్ఎన్ఎఫ్ మెజారిటీ స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిజోరాంలో కేవలం 100 ఓట్లు నాయకుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇక్కడ మాత్రం పీపుల్స్ సర్వే సరైన ఫలితాలు ఇవ్వలేకపోయిందని నరసింహా రెడ్డి అభిప్రాయ పడ్డారు. లోక్‌సభ ఎన్నికల సర్వే షూరూ.. చాలా కచ్చితమైన సమాచారాన్ని ఇస్తోన్న ‘పీపుల్స్ పల్స్’ ప్రస్తుతం రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పనిలో పడింది. ఇప్పటికే సంస్థ సభ్యులు ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తూ పని మొదలు పెట్టినట్లు నరసింహ రెడ్డి తెలిపారు. 2019, ఫిబ్రవరి రెండో వారం నుంచి మూడ్స్ సర్వేని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
గెహ్లాట్‌కే రాజస్తాన్ పగ్గాలు..!
న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపికపై గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మధ్యప్రదేశ్ మాదిరిగానే, రాజస్తాన్‌కు కూడా సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సచిన్ పైలట్‌ను డిప్యూటి సీఎంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనకు ముందే అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లను రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేయబోతున్నట్టు రాహుల్ గాంధీ హింట్ ఇచ్చారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లు తనకు రెండు వైపులా ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ.. ‘ది యూనైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్తాన్’ అనే క్యాప్షన్ ఇచ్చారు రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక సమయంలోనూ రాహుల్ ఇలాంటి ట్వీటే చేశారు. కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ చెప్పిన సూక్తిని ట్వీట్ చేశారు. అయితే రాజస్తాన్ సీఎం పదవికి సీనియర్ నేత గెహ్లట్‌తో పాటు యువ నేత సచిన్ పైలట్ కూడా పోటీపడ్డారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీలో గత మూడు రోజులుగా చర్చలు నడిచాయి. ఈ చర్చల్లో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలను, సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాలను సమర్ధవంతంగా నడపడం సీనియర్లకే సాధ్యమన్నారు. ఈ రెండు కీలక రాష్ట్రాల నుంచి అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలంటే సీనియర్లకే అవకాశం ఇవ్వడం సముచితమని ఆమె వాదించారు. అంతేకాక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అవసరమైన నిధుల సమీకరణ సీనియర్లకే సాధ్యమవుతుందని ఆమె రాహుల్‌ను ఒప్పించారు. దాంతో చివరకు అశోక్ గెహ్లట్ పేరును రాజస్తాన్ ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిని కూడా పైలట్‌కే కట్టబెట్టారు. -
సీఎం అభ్యర్థుల ప్రకటన ఆలస్యం!
-
యువనేతల ట్విస్ట్.. రసకందాయంలో సీఎం రేసు!
న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కొచ్చిపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంల ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సీఎం పదవి ఆశావహులు గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రాహుల్ నివాసానికి వచ్చారు. ఇదివరకు ఏ సమావేశం జరిగినా 10 జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసంలో జరిగేది. కానీ ఈసారి మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక కసరత్తంతా రాహుల్ నివాసంలోనే జరుగుతోంది. రాజస్థాన్ సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్.. మధ్యప్రదేశ్ సీఎం పదవి కోసం కమల్‌నాథ్, జ్యోతిరాదిత్యల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నలుగురితో విడివిడిగా రాహుల్ గాంధీ మాట్లాడారు. యువనేతలు సచిన్ పైలట్, జ్యోతిరాదిత్యలకు డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్ చేసినా వారు ఆ పదవులను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల్లో తాము కష్టపడితే సీనియర్లకు పదవులిస్తారా అంటూ సచిన్, జ్యోతిరాదిత్య కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సీఎం రేసులో నుంచి తప్పుకోవడానికి యువనేతలు నిరాకరిస్తుండటంతో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ వారికి సర్దిచెప్పినట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కొలిక్కితెచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరనేది గురువారం రాహుల్ నిర్ణయించనున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్‌ను ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతుండగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు రాహుల్ పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కట్టబెడుతూ పార్టీ కేంద్ర పరిశీలకులు ఏకే ఆంటోనీ, జితేంద్ర సింగ్ సమక్షంలో తీర్మానం ఆమోదించారు. ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే అభిప్రాయం తెలుసుకుని సీఎం అభ్యర్ధులను నిర్ణయించాలని రాహుల్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు పోటీ పడగా కమల్ నాథ్‌వైపు హైకమాండ్ మొగ్గుచూపినట్టు సమాచారం. కాంగ్రెస్ సాధారణ మెజారిటీకి రెండు స్ధానాలు తగ్గిన క్రమంలో ఏడుగురు బీజేపీయేతర ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు మళ్లించడంలో కమల్ నాథ్ చూపిన చొరవ సైతం ఆయనకు కలిసివచ్చిందని చెబుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్దాన్‌లో బీఎస్పీ, ఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో పలువురు సీనియర్లు తలపడుతుండగా రాహుల్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాధినేతలను ఖరారు చేయనున్నారు. -
ఎన్నికల ఫలితాలపై సోనియా స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : మూడు కీలక హిందీ రాష్ట్రాల్లో పార్టీ గెలుపు బీజేపీ ప్రతికూల రాజకీయాలపై కాంగ్రెస్ విజయంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ బుధవారం అభివర్ణించారు. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలక బీజేపీని మట్టికరిపించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను సోనియా అభినందించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ పార్టీ సీనియర్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను కలిశారు. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించిన కాంగ్రెస్ తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. ఇద్దరు బీఎస్పీ సభ్యులతో పాటు పార్టీ రెబెల్స్‌గా గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని ఆ పార్టీ భావిస్తోంది. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్ధులను పార్టీ హైకమాండ్ ఖరారు చేయనుంది. -
కాంగ్రెస్‌కు మద్దతుపై మాయావతి గ్రీన్‌సిగ్నల్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు స్ధానాలు తగ్గిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి అంగీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ సహా ఆ పార్టీ అగ్ర నాయకత్వం మాయావతితో జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది. రాజస్ధాన్‌లోనూ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని మాయావతి వెల్లడించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిన ప్రజలు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని పేర్కొన్నారు. మరోవైపు గెలుపొందిన స్వతంత్రులతో కూడా కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. మాయావతి మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ బుధవారం మధ్నాహ్నం గవర్నర్‌తో భేటీ అయింది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ సైతం 109 స్ధానాలు దక్కించుకోవడంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది -
అయిదు రాష్ట్రాల్లో తుది ఫలితాలు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో నూతనోత్సహం నింపగా, బీజేపీని నిరాశపరిచాయి. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో పాలక బీజేపీని కాంగ్రెస్ మట్టికరిపించింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ విస్పష్ట మెజారిటీ సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చెప్పుకోదగిన ఫలితాలు సాధించింది. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కీలకంగా మారారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలు సాధించిన స్ధానాల వివరాలు.. తెలంగాణ.. తెలంగాణలో 119 స్ధానాల్లో టీఆర్ఎస్ 88 స్ధానాల్లో గెలుపొంది తిరుగులేని మెజారిటీ సాధించింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమిని మట్టికరిపించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. కారు జోరుకు కుదేలైన కాంగ్రెస్ కూటమి 21 స్ధానాలకు పరిమితమైంది. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఒక స్ధానంలో, ఇతరులు 2 స్ధానాల్లో విజయం సాధించారు. టీఆర్ఎస్కు 97,00,749 ఓట్లు (46.9 శాతం), కాంగ్రెస్‌కు 58,83,111 ఓట్లు (28.4 శాతం), బీజేపీ 14,50,456 ఓట్లు (7.0 శాతం), టీడీపీ 7,25,845(3.5 శాతం), స్వతంత్రులు 6,73,694 ఓట్లు (3.3 శాతం), ఎంఐఎం 5,61,089 ఓట్లు (2.7 శాతం), బీఎస్పీ 4,28,430 ఓట్లు (2.7 శాతం), ఎస్ఎంఎఫ్బీ 1,72,304 ఓట్లు (0.8 శాతం), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1,72,304 ఓట్లు (0.8 శాతం), బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 1,14,432 ఓట్లు(0.7 శాతం) వచ్చాయి. మధ్యప్రదేశ్.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరుసాగినా చివరకు కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 114 స్ధానాల్లో విజయం సాధించగా, బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు గెలుచుకోగా, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లో స్వతంత్రులు, బీఎస్పీ ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. బీజేపీకి 1,56,42,980 ఓట్లు(41శాతం), కాంగ్రెస్‌కు 1,55,95,153 ఓట్లు (40.9 శాతం), ఇండిపెండెంట్లకు 22,18,230 ఓట్లు (5.8 శాతం), బీఎస్పీకి 19,11,642 ఓట్లు (5 శాతం), సీజీపీకి 6,75,648 ఓట్లు (1.8 శాతం), ఎస్పీకి 4,96,025 ఓట్లు (1.3 శాతం), ఏఏఏపీకి 2,53,101 ఓట్లు (0.4 శాతం), ఎస్పీఏకేపీకి 1,56,486 ఓట్లు (0.4 శాతం), బీఏఎస్డీకి 78,692 ఓట్లు (0.2 శాతం), బీఎస్సీపీకి 71,278 ఓట్లు (0.2 శాతం) ఓట్లు లభించాయి. రాజస్ధాన్ ఎడారి రాష్ట్రం రాజస్ధాన్‌లో మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ 99 స్ధానాలను హస్తగతం చేసుకోగా, బీజేపీ 73 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఆరు స్ధానాల్లో, ఇతరులు అత్యధికంగా 21 స్ధానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 1,39,35,201 ఓట్లు (39.3 శాతం), బీజేపీకి 1,37,57,502 ఓట్లు (38.3 శాతం), ఇండిపెండెంట్లకు 33,72,206 ఓట్లు (9.5 శాతం), బీఎస్పీకి 14,10,995 ఓట్లు (4 శాతం), ఆర్‌ఎల్‌టీపీకి 8,56,038 ఓట్లు (2.4 శాతం), సీపీఎంకు 4,34,210 ఓట్లు (1.2 శాతం), బీజేపీకి 2,55,100 ఓట్లు (0.7 శాతం), ఏఏఏపీకి 1,35,826 ఓట్లు (0.4 శాతం), ఆర్సీడీకి 1,16,320 ఓట్లు (0.3 శాతం), బీవీహెచ్పీ 1,11,357 (0.3 శాతం) ఓట్లు లభించాయి. చత్తీస్‌గఢ్.. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్ధానాల్లో కాంగ్రెస్ మూడింట రెండొంతులు పైగా 68 స్ధానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ప్రభంజనంతో బీజేపీ బేజారైంది. పదిహేనేళ్ల పాటు చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో కేవలం 15 స్ధానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అజిత్ జోగి నేతృత్వంలోని జేసీసీ 7 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 61,44,192 ఓట్లు (43 శాతం), బీజేపీకి 47,07,141 ఓట్లు (33 శాతం), జేసీసీజేకు 10,86,531 ఓట్లు (7.6 శాతం), ఇండిపెండెంట్లకు 8,39,053 ఓట్లు (5.9 శాతం), బీఎస్పీకి 5,52,313 ఓట్లు (3.9 శాతం), జీజీపీకి 2,47,459 ఓట్లు (1.7 శాతం), ఏఏఏపీకి 1,23,526 ఓట్లు (0.9 శాతం), సీపీఐకి 48,255 ఓట్లు (0.3 శాతం), ఎస్హెచ్ఎస్కు 34,678 ఓట్లు(0.2 శాతం) దక్కాయి మిజోరం.. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. మొత్తం 40 స్ధానాలకు గాను మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 5 స్ధానాలు, బీజేపీ ఒక స్ధానం దక్కించుకోగా, ఇతరులు 8 స్ధానాల్లో గెలుపొందారు. మిజో నేషనల్ ఫ్రంట్‌కు 2,37,305 ఓట్లు (37.6 శాతం), కాంగ్రెస్‌కు 1,90,412 ఓట్లు (30.2 శాతం),ఇండిపెండెంట్లకు 1,44,925 ఓట్లు (22.9 శాతం), బీజేపీకి 50,749 ఓట్లు (8 శాతం), ఎన్పీఈపీకి 3626 ఓట్లు (0.6 శాతం), పీఆర్ఐఎస్ఎంపీకి 1262 ఓట్లు (0.2 శాతం), నోటాకు 2917 ఓట్లు (0.5 శాతం) లభించాయి. -
ఇవి ఊహించని ఫలితాలు : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ ఫలితాలు తాము ఊహించని విధంగా వెల్లడయ్యాయని జైట్లీ వ్యాఖ్యానించారు. హిందీ రాష్ర్టాల్లో ఓటమిపై విశ్లేషించుకోవాల్సిన సందర్భమిదని అన్నారు. తాము 15 సంవత్సరాలుగా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నామని చెబుతూ అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత లేకున్నా ప్రజలు మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు. కాగా రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీని మట్టికరిపించిన సంగతి తెలిసిందే. -
మందసోర్లో బీజేపీకే మొగ్గు
భోపాల్ : హిందీ బెల్ట్‌లో కీలక రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీకి పరాజయం ఎదురైనా మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రైతుల ఆందోళనలతో అట్టుడికిన మందసోర్ ప్రాంతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ రైతుల సమస్యలు, అన్నదాతల ఆందోళన ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గత ఏడాది రైతుల ఆందోళన సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణలు కాల్పులకు దారితీసి ఆరుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. రైతుల మృతితో మందసోర్ జాతీయ పతాకశీర్షికలకు ఎక్కింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు గుప్పించింది. రైతుల ఆగ్రహానికి కేంద్ర బిందువుగా నిలిచి వివిధ రాష్ర్టాల్లో రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన మందసోర్లో ఊహించని ఫలితాలు రావడం విశేషం. మందసోర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మందసోర్, మల్హర్గర్, నీముచ్, మనస, జవాద్, జవోర స్ధానాలను బీజేపీ నిలబెట్టుకోగా, 2013లో కాంగ్రెస్ గెలుపొందిన సువర్సా స్ధానంలోనూ బీజేపీ విజయం సాధించడం గమనార్హం. -
మోదీ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి : రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించామని, మోదీ పాలనపై రైతులు, నిరుద్యోగులు, మహిళలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఈవీఎంలపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంలో అమర్చే చిప్‌తో ఫలితాలను తారుమారు చేయవచ్చన్నారు. మోదీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, యువతకు ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. బీజేపీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ పిలుపును రాహుల్ తప్పుపట్టారు. దేశం నుంచీ ఏ పార్టీనీ తరిమేయాలని తాము భావించడం లేదన్నారు. తెలంగాణ, మిజోరంలో తమ పార్టీ ఓటమి పాలైందని, మార్పు కోసం పనిచేస్తామని చెప్పారు. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్‌లో సాధారణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో మేజిక్ మార్క్‌కు చేరువైంది. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ తోడ్పాటుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతితో మధ్యప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఫోన్లో మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
రేపు చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ సీఎంల ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీకి చేరువైన కాంగ్రెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో సాధారణ మెజారిటీ సాధించేలా దూసుకుపోతున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లోనూ మేజిక్ మార్క్‌కు చేరుకుంది. ఇక చత్తీస్‌గఢ్, రాజస్ధాన్‌లో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. చత్తీస్‌గఢ్, రాజస్దాన్‌లో ఆ పార్టీ తరపున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాయ్‌పూర్, జైపూర్లలో బుదవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకోనున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్ధులను వీరు లాంఛనంగా ఎన్నుకునే అవకాశం ఉంది. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ చీఫ్ భూపేష్ భాగల్ సీఎం రేసులో ముందుండగా, రాజస్ధాన్‌లో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్లు సీఎం పదవికి పోటీ పడనున్నారు. ఇక ఎన్నికల ఫలితాల్లో రాజస్ధాన్‌లో 199 స్ధానాలకు గాను మేజిక్ మార్క్‌ను దాటిన కాంగ్రెస్ పార్టీ 102 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, పాలక బీజేపీ కేవలం 70 స్ధానాలకే పరిమితమైంది. చత్తీస్‌గఢ్‌లో 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ మూడింట రెండొంతుల పైగా 63 స్ధానాల్లో ఆధిక్యత సాధించింది. ఇక్కడ బీజేపీ కేవలం 18 స్ధానాల్లోనే ముందంజలో ఉంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్‌కు అవసరమైన 116 స్ధానాలకు గాను కాంగ్రెస్ 117 స్ధానాల్లో ఆధిక్యం కనబరిచింది. బీజేపీ 103 స్ధానాల్లో బీఎస్పీ మూడు స్ధానాలు, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. -
ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు : శివసేన
సాక్షి, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి స్పష్టమైన సంకేతం పంపాయని, పాలక సంకీర్ణం ఈ ఫలితాలను విశ్లేషించుకోవాలని శివసేన పేర్కొంది. బీజేపీ విజయపరంపరకు అడ్డుకట్ట పడిందని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని రాజ్యసభ ఎంపీ, శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఇదని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏలో శివసేన మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పాలక బీజేపీ ప్రతికూల ఫలితాలు ఎదురవగా, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దిశగా ఆధిక్యం కనబరుస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ మరోసారి పాలనాపగ్గాలు చేపట్టేలా అఖండ విజయం సాధించగా, మిజోరంలో పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపించి మిజో నేషనల్ ఫ్రంట్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. -
ఒకడే ఒక్కడు.. అతడే కేసీఆర్
న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమి ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. మిజోరాంలో మాత్రం ఎమ్ఎన్ఎఫ్ గెలుపొందింది. మిజోరాం ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక తెలంగాణలో మాత్రం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దాదాపు 76 స్థానాల్లో గెలుపొంది సిగిల్ మెజారిటీ పార్టీగా నిలిచింది. అయితే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీసగఢ్ రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి పాలు కాగా.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ పార్టీనే మరోసారి ప్రభంజనం సృష్టించింది. ఆ వివరాలు.. తెలంగాణ : కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ ప్రభంజనం సృష్టించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ముందస్తుకెళ్లి 2018 ఎన్నికల్లో కూడా ప్రభంజనం సృష్టించారు. కూటమిని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు. ప్రస్తుతానికి 65 స్థానాల్లో గెలుపొంది.. 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది టీఆర్ఎస్. అయితే ఈ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మీద 51,546 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్ : శివరాజ్ సింగ్ చౌహన్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ - కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగుతుంది. రెండు పార్టీలు దాదాపు 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో 116 స్థానాల్లో గెలుపొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సీహోర్ జిల్లా బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2005 నుంచి శివరాజ్ సింగ్ ఈ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అరుణ్ యాదవ్, శివరాజ్ సింగ్‌పై పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అరుణ యాదవ్ చాలా దూకుడగా వ్యవహరించారు. ముఖ్యంగా విదిశలో జరిగిన ఇసుక మాఫీయా గురించి ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. అరుణ్ యాదవ్ ఎంత ధీటుగా ప్రచారం నిర్వహించినప్పటికి.. శివరాజ్ సింగ్ చౌహనే ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. రాజస్తాన్ : వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝలావర్ పట్టణంలోని ఝలపతాన్ నుంచి ఎన్నికల బరిలో ఈ పాల్గొన్నారు. 2003, 2008, 2013 ఎన్నికల్లో రాజే ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం నాలుగో సారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు రాజే. అయితే ఈ సారి రాజే గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్, రాజేకు గట్టి పోటీ ఇస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాన్వేంద్ర సింగ్ తండ్రి జస్వంత్ సింగ్ బీజేపీ తరఫున గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మాన్వేంద్ర సింగ్ కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ వసుంధర రాజేనే అధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ పార్టీ ఓడిపోయింది. చత్తీస్‌గఢ్ : రమణ్ సింగ్ రమణ్ సింగ్ 2003 నుంచి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో రమణ్ సింగ్ లోక్‌సభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. 2004 లో చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలో దొంగార్గావ్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు రమణ్ సింగ్. 2008 లో అసెంబ్లీ ఎన్నికలో ఆయన రాజ్నాంద్గావ్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో రమణ్ సింగ్ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రమణ్ సింగ్ ప్రత్యర్థిగా కరుణ శుక్లా పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మేనకోడలు. 2013 వరకూ బీజేపీలో ఉన్నారు కరుణ. జంజిగిర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2004, 2009లో గెలుపొందిన కరుణ.. 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మోదీ, బీజేపీ నాయకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అటల్ బిహారి వాజ్‌పేయి పేరును వాడుకుంటున్నారని ఆరోపించిన కరుణ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఇమె కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్‌నందగావ్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ రమణ్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ ఓటమి వైపు అడుగులేస్తోంది మిజోరాం : లాల్ తన్హావాలా మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా సెర్చిప్, చంపాయి స్థానాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం మిజోరాంలో ఎంఎన్ఎఫ్ 26, కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. -
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ సంబరాలు
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్ధానాలు దక్కించుకునేలా దూసుకుపోతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్ధానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం కాగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా 66 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. పాలక బీజేపీని మట్టికరిపించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమవుతోంది. బీజేపీ కేవలం 15 స్ధానాల్లో ఆధిక్యం కొనసాగిస్తుండగా, బీఎస్పీ 8 స్ధానాల్లో, ఇతరులు ఒక స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చత్తీస్‌గఢ్‌లో మూడింట రెండొంతులపైగా మెజారిటీ దిశగా హస్తం హవా సాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, స్వీట్లు పంచుతూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. -
‘సీఎం అభ్యర్ధిని హైకమాండ్ నిర్ణయిస్తుంది’
జైపూర్ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేసులో నిలిచిన అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్ధాన్‌లో తమ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం తర్వాత నిర్ణయిస్తుందన్నారు. యువ నేత సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్‌లు ఇరువురూ రాజస్ధాన్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. మరోవైపు రాజస్ధాన్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగిస్తూ విజయపతాకం ఎగురవేసింది. పాలక బీజేపీతో హోరాహోరీ పోరులో సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకుఅ అవసరమైన మేజిక్ ఫిగర్ 100 సీట్లు కాగా, కాంగ్రెస్ ఇప్పటికే 102 స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, బీజేపీ 73 స్ధానాల్లో, బీఎస్పీ ఐదు స్ధానాల్లో ఇతరులు 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. -
‘ఆయన సీఎం అవుతారని ఇంకా ప్రకటించలేదు’
న్యూఢిల్లీ : రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందబోతోందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్‌లో కీలక నేత సచిన్ పైలట్లు ఈ సారి తొలి నుంచీ ముఖ్యమంత్రి ఆశావహులుగా ఉన్నారు. అయితే శనివారం ఒక టీవీ చానల్‌కు గెహ్లాట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా.. ‘సచిన్ పైలట్ సీఎంగా బాగా పనిచేయగలరా లేక ఆయనకు మరింత అనుభవం అవసరమని మీరు అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించగా, ‘ఇది ఊహాజనిత ప్రశ్న. ఆయన సీఎం అవుతారని ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం పార్టీలో లేదు. ఆయన సామర్థ్యాలను నేను శంకించలేను. మీరు నన్ను ఈ ప్రశ్న అడగకూడదు’ అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. చాలా ప్రశ్నలకు సమాధానంగా ఆయన ‘అధిష్టానమే చూసుకుంటుంది. వారు నాకు ఏ పని చెబితే ఆ పని చేస్తాను. రెండుసార్లు సీఎంగా, మూడు సార్లు కేంద్రమంత్రిగా అడగకుండానే నాకు అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా అంతే’ అని గెహ్లాట్ చెప్పుకొచ్చారు. -
‘చాలా అవమానకరం.. చర్యలు తీసుకోవాల్సిందే’
పట్నా : రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే తన మాటల వల్ల బాధ పడి ఉంటే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని జేడీ(యూ) బహిష్కృత నేత శరద్ యాదవ్ అన్నారు. ఈ మేరకు క్షమాపణ కోరుతూ ఆమెకు లేఖ కూడా రాస్తానని పేర్కొన్నారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ యాదవ్ వసుంధర రాజేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అల్వార్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న యాదవ్... ‘వసుంధరకు కొంత విశ్రాంతి ఇవ్వండి.. ఈ మధ్య ఆమె చాలా అలసిపోయారు. అలాగే లావయ్యారు కూడా. ఆమె సన్నబడాల్సి ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే బాడీ షేమింగేనని బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అంతేకాకుండా శరద్ యాదవ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన విమర్శల పాలయ్యారు. కాగా శరద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన వసుంధర రాజే శుక్రవారం మాట్లాడుతూ.. ‘ షాక్‌కు గురయ్యాను. నిజంగా చాలా అవమానకరంగా అన్పించింది. ఇలా మహిళలను కించపరచడం ద్వారా యువతకు ఆయన ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల నేతలు వారి భాషను నియంత్రించుకోవాలి’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్..
జైపూర్ : సెమీఫైనల్స్‌గా భావిస్తున్న అయిదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అందరి దృష్టీ ఈనెల 11న వెలువడే ఎన్నికల ఫలితాలపైనే నెలకొంది. కీలక రాష్ట్రాలైన రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. ఇక అధికారం నిలుపుకుని సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పాలక బీజేపీ భావిస్తోంది. రాజస్ధాన్‌లో ముగిసిన పోలింగ్ రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాజస్ధాన్‌లో మొత్తంగా 72.62 శాతం పోలింగ్ నమోదైంది. 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. బీఎస్పీ అభ్యర్థి మృతితో అల్వార్ జిల్లా రామ్‌గర్ స్ధానంలో పోలింగ్ వాయిదా పడింది. పోలింగ్‌లో సందర్భంగా కొన్నిప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. సికార్‌లో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రం వద్దే బాహాబాహీకి దిగిన కార్యకర్తలు వాహనాలకు నిప్పంటించడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకూ మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. రాజస్ధాన్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఈ ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి. డిసెంబర్ 11న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
ఎగ్జిట్ పోల్స్ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్ జోరు
రాజస్ధాన్‌లో కాంగ్రెస్ హవా వీస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 41 శాతం, బీజేపీకి 40 శాతం మేర ఓట్లు పోల్ కావచ్చని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరగణించిన అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ వివరాలిలా ఉన్నాయి. రాజస్ధాన్ ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ ఇతరులు టైమ్స్ నౌ 105 85 02 07 ఇండియా టుడే 119-141 55-72 రిపబ్లిక్ టీవీ (సీ ఓటర్) 129-145 52-68 5-11 ఇండియా టీవీ 100-110 80-90 1-3 6-8 ఏబీపీ న్యూస్ మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ ఇతరులు టైమ్స్ నౌ 89 126 06 ఇండియా టుడే 104-122 102-120 రిపబ్లిక్ టీవీ 110-126 90-106 15 ఇండియా టీవీ 86-92 122-130 4-8 8-10 ఏబీపీ న్యూస్ 126 94 10 ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ ఇతరులు టైమ్స్ నౌ 35 46 07 02 ఇండియా టుడే 55-65 21-31 రిపబ్లిక్ టీవీ 43 42 5 ఇండియా టీవీ 32-38 42-50 1-3 ఏబీపీ న్యూస్ 35 52 03 మిజోరం ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించిన సంస్థ కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ ఇతరులు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే రిపబ్లిక్ టీవీ ఎన్డీటీవీ ఏబీపీ న్యూస్ -
సికార్‌లో రాళ్ల దాడి
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కొన్నిప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. సికార్‌లో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక రాజస్ధాన్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 41.39 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు. పలు పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాజస్ధాన్‌లో మొత్తం 199 అసెంబ్లీ స్ధానాలకు గాను 2274 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 51,667 పోలింగ్ కేంద్రాల్లో 4.47 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లు అధికారపగ్గాలు చేపట్టేందుకు హోరాహోరీ తలపడుతున్నాయి. -
‘ఆమె లావయ్యారు..విశ్రాంతి అవసరం’
జైపూర్ : బహిష్కృత జేడీ(యూ) నేత శరద్ యాదవ్ రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజెను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్ అంటూ ప్రత్యర్దులు విరుచుకుపడ్డారు. వసుంధర రాజె లావయ్యారని, ఆమెకు విశ్రాంతి అవసరమని శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ఆమెకు కొంత విశ్రాంతి ఇవ్వండి..మధ్యప్రదేశ్ బిడ్డ అయిన వసుంధర రాజె ఈ మధ్య లావయ్యారు..అలిసిపోతున్నా’రని బుధవారం ఆల్వార్‌లో జరిగిన ఓ ప్రచార సభలో పేర్కొన్నారు. శరద్ యాదవ్ వసుంధర రాజెపై చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. -
తుదిదశకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ
-
అగస్టా రహస్యాలు బట్టబయలు..
జైపూర్ : యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్ నోటివెంట ఇప్పుడు రహస్యాలు బయటికొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన బుధవారం ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగస్టాలో రాజకీయ నేతలకు ముడుపులు ముట్టచెప్పిన మధ్యవర్తి మైఖేల్‌ను దుబాయ్ నుంచి భారత్ రప్పించామని, ఈ కుంభకోణంలో ఇప్పుడు రహస్యాలు బట్టబయలు కానున్నాయని అన్నారు. మైఖేల్ వెల్లడించే అంశాలతో కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలన్నారు. కాగా, అగస్టా కేసుకు సంబంధించి మైఖేల్‌ను దుబాయ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిన క్రమంలో మంగళవారం రాత్రి మైఖేల్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మైఖేల్‌ను బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. కాగా, రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
మోదీజీ ఉపాధి ఊసేది..?
జైపూర్ : రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ నిజంగా ఉద్యోగాలు ఇచ్చిఉంటే ఆల్వార్‌లో నలుగురు యువకులు ఇటీవల ఎందుకు ఆత్మహత్యకు పాల్పడేవారని ఆయన నిలదీశారు.రాజస్ధాన్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ గత నెలలో ఆల్వార్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి దూకి ఈ యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావించారు. నిరుద్యోగ సమస్యతోనే వారు బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాధమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాధనంతో పారిశ్రామికవేత్తల ఖజానాలను నింపుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ తన ప్రసంగంలో భారత్ మాతాకీ జై అంటారని, వాస్తవగా ఆయన అనిల్ అంబానీకి, మెహుల్ చోక్సీ, నీరవ్, లలిత్ మోదీలకు జై కొట్టాలని ఎద్దేవా చేశారు. అనిల్ అంబానీ వంటి సంపన్నుల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కాగా, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల ఏడున జరగనుండగా, 11న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
నోట్లరద్దుతో సీన్‌రివర్స్..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో నోట్ల రద్దు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో పేర్కొన్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.గతంతో పోలిస్తే ఎన్నికల్లో బ్లాక్‌మనీ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికల్లో భారీఎత్తున నగదు వాడకం పెరిగిపోయిందని స్వయంగా ఈసీ అత్యున్నత వర్గాలే వెల్లడించాయి. ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపలేదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పెదవివిరిచారు. నోట్ల రద్దు అనంతరం ఎన్నికల్లో నల్లధనం వాడకం తగ్గుతుందనే అభిప్రాయం కలిగినా నగదు స్వాధీనాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నగదు పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడే అధికంగా ఉన్నాయని రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో వాడే నల్లధనంపై ఎలాంటి నియంత్రణ ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక వనరులు సమకూర్చే వారికి నగదు కొరత ఎంతమాత్రం లేదన్నారు. ఎన్నికల్లో నగదు వాడకం, సోషల్ మీడియాలను నియంత్రించేలా నూతన మార్గదర్శకాలను జారీ చేసేలా న్యాయమంత్రిత్వ శాఖకు ఈసీ సిఫార్సు చేయకపోవడం బాధాకరమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా గత వారం పదవీ విరమణ చేసిన రావత్ విచారం వ్యక్తం చేశారు. -
స్ర్టాంగ్ రూంలో పనిచేయని సీసీటీవీలు
భోపాల్ : ఉత్కంఠభరితంగా సాగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపూ డిసెంబర్ 11న జరిగే కౌంటింగ్ వైపు మళ్లింది. ఈవీఎంల భద్రతపై విపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీటిని భద్రపరిచిన స్ర్టాంగ్ రూంలో గంటపాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోవడంతో శుక్రవారం స్ర్టాంగ్‌రూంలో అమర్చిన సీసీటీవీలు పనిచేయలేదని ఈసీ వర్గాలు అంగీకరించాయి. ఓటింగ్ యంత్రాలు సురక్షితంగా ఉంచేందుకు జనరేటర్లు, ఇన్వర్టర్లను తెప్పించామని ఈసీ పేర్కొంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్ రూం వద్ద పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను నియోగించామని తెలిపింది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ సత్నాలోని స్ర్టాంగ్ రూంలోకి ఓ వ్యక్తి కార్టన్‌ను తీసుకువెళుతున్న వీడియో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు స్ర్టాంగ్ రూం వెలుపల ఆందోళన చేపట్టారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
వారు పేదలను పొట్టనబెట్టుకుంటున్నారు..
జైపూర్ : కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను గ్యాంగ్స్టర్లుగా అభివర్ణించారు. ఉదయ్‌పూర్‌లో బీజేపీ ప్రచార ర్యాలీలో రాజ్‌బబ్బర్ మాట్లాడుతూ పేద ప్రజలను హతమార్చే హంతక ముఠా గుజరాత్ నుంచి తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు. గ్యాంగ్‌స్టర్ ముఠాలో ఒకరు బీజేపీ చీఫ్ కాగా, మరొకరు దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నారంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రోజురోజుకూ రూపాయి విలువ దిగజారుతున్న క్రమంలో రూపాయి విలువను ప్రధాని మోదీ తల్లి 90 ఏళ్ల హీరాబెన్‌తో పోల్చడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వయసు స్ధాయిలో ఉంటే ప్రస్తుతం రూపాయి బలహీనపడుతూ ప్రధాని తల్లి వయసుకు క్షీణిస్తోందని రాజ్‌బబ్బర్ వ్యాఖ్యానించారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ ఏడున జరగనుండగా, డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
కాంగ్రెస్ నేతతో నేలకు ముక్కు రాయించిన యువకులు
జైపూర్ : రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాంగ్రెస్ నేతకు ఘోర అవమానం ఎదురైంది. నిర్లక్ష్యంగా కారు నడిపి తమపై బురద పడేసాడంటూ కొంత మంది యువకులు... ఆయనను అడ్డగించి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. అసలేం జరిగిందంటే.... కాంగ్రెస్ పార్టీకి చెందిన భగవతి లాల్.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ సాగ్వారా పట్టణంలో ర్యాలీకి హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. జోసావా గ్రామం చేరుకోగానే అక్కడ ఉన్న నీటి గుంటను గమనించకుండా కారును వేగంగా పోనిచ్చారు. ఈ సమయంలో రోడ్డు పక్కన ఉన్న నలుగురు యువకులపై బురద పడింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు ఆయన కారును చేజ్ చేసి మరీ ఆపారు. హడావుడిగా వెళ్తున్న కారణంగానే ఇలా జరిగిందని చెప్పినా వినకుండా.. ఆయనను మోకాళ్లపై నిలబెట్టి నడిరోడ్డుపై నేలకు ముక్కు రాయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై దుగన్‌పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ కుమార్ గురువారం స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘భగవతి లాల్‌తో దురుసుగా ప్రవర్తించిన ఆ యువకులను వారి సామాజిక వర్గానికి(పాటీదార్) చెందిన పెద్దలు పిలిచి మందలించారు. అంతేకాకుండా భగవతిని ఎలా అయితే అవమానించారో అదే రీతిలో(వాళ్లతో నేలకు ముక్కు రాయించి) వారికి క్షమాపణ కూడా చెప్పించారు’ అని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మధ్యప్రదేశ్‌లో 65.5 శాతం పోలింగ్ నమోదవగా, మిజోరంలో 73 శాతం పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్దానాలకు గాను మొత్తం 2899 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా 1094 మంది స్వతంత్ర అభ్యర్ధులుగా తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో 5.4 కోట్ల మంది ఓటర్లు ఆయా పార్టీల భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. వరుసగా నాలుగోసారి పాలనాపగ్గాలు అందుకునేందుకు పాలక బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో తలపడగా, ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్ష కాంగ్రెస్ సర్వశక్తలూ ఒడ్డింది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాలుగోసారి తిరిగి అధికారం చేపడుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు లక్ష్యంగా ఈసారి తమ పార్టీ పోరాడిందని, ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు తమ కార్యకర్తలు కృషిచేశారన్నారు. మొరాయించిన ఈవీఎంలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించాయి. మధ్యప్రదేశ్‌లో దాదాపు 100కుపైగా ఈవీఎంలను మార్చినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఈవీఎంల్లో సమస్యలు తలెత్తడంతో పలు ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని అధికారులు తెలిపారు. కాగా సెంధ్వా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జాప్డి పడ్లా గ్రామంలో ఇతరులు పోలింగ్ బూత్‌ల వద్దకు వచ్చారని ఆరోపిస్తూ స్దానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు రెండు బైక్‌లకు నిప్పంటించారు. పోలింగ్ విధుల్లో అధికారుల మృతి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధుల్లో భాగంగా గుణలో ఓ ఎన్నికల కమిషన్ అధికారి, ఇండోర్‌లో ఇద్దరు అధికారులు గుండె పోటుతో మరణించారు. మరణించిన అధికారులకు రూ 10 లక్షల పరిహారం ప్రకటించారు. మిజోరంలో.. మిజోరం అసంబ్లీ ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్ నమోదైంది. నాలుగు గంటలకే పోలింగ్ ముగిసినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి లాల్ తన్వాలా పోటీ చేస్తున్న సెర్చిప్ స్ధానంలో అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అశిష్ కుంద్రా తెలిపారు. త్రిపుర సరిహద్దులోని కన్హుమన్ గ్రామంలో త్రిపుర క్యాంప్స్లోని బ్రూ శరణార్ధులు 52 శాతం మేర ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. -
‘తండ్రి గోత్రం చెప్పి ఉంటే బాగుండేది’
జైపూర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయాన్ని సందర్శించినప్పుడు రాహుల్ గాంధీ తన గోత్రానికి బదులు తన నానమ్మ తండ్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గోత్రం చెప్పారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ర్యాలీలో రాజే మాట్లాడుతూ ‘రాహుల్ తన గోత్రం ఏంటో చెప్పలేదు. ఆయన పేర్కొన్నది నెహ్రూ గోత్రం. పూజ సందర్భంగా రాహుల్ తన తండ్రి రాజీవ్ గాంధీ, తాత ఫిరోజ్ గాంధీల గోత్రాన్ని చెప్పి ఉండాల్సింది. కానీ ఆయన ఎందుకనో అలా చేయలేదు’ అని రాజే వ్యాఖ్యానించారు. కాగా పుష్కర్ ఆలయంలో రాహుల్ తన గోత్రం ‘దత్తాత్రేయ’ అని, తాను కశ్మీరీ బ్రాహ్మణుడిని అని తెలిపినట్లు ఆ పూజ నిర్వహించిన పూజారి వెల్లడించిన విషయం తెలిసిందే. -
ఆ తప్పులను చక్కదిద్దండి..
న్యూఢిల్లీ : గత పదిహేను సంవత్సరాల్లో జరిగిన తప్పులను చక్కదిద్దాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఫేస్బుక్ ఖాతా ద్వారా ఆ రాష్ట్ర ఓటర్లను కోరారు. తప్పుడు వాగ్ధానాలతో ఒకటిన్నర దశాబ్ధాలుగా బీజేపీ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, పేదలను హింసిస్తూ మధ్యప్రదేశ్ ప్రతిష్టను బీజేపీ ప్రభుత్వం మసకబార్చిందని దుయ్యబట్టారు. మద్దతు ధర పెంచాలని అడిగిన రైతులను కాల్చివేశారని, యువతకు అవకాశాలు మృగ్యమయ్యాయని ఫేస్బుక్ పోస్ట్‌లో రాహుల్ పేర్కొన్నారు. వ్యాపం కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ యువత భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడిన తీరును గుర్తుచేశారు. ఇసుక మాఫియా, ఈ ట్రేడర్ స్కామ్, బుందేల్‌ఖండ్ ప్యాకేజ్ స్కామ్‌లను తన పోస్ట్‌లో రాహుల్ ప్రస్తావించారు. కాంగ్రెస్ వాగ్ధానాలను మధ్యప్రదేశ్ ప్రజలు విశ్వసించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, ఇళ్లకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులోకి తెస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపారాల వృద్ధి, పేదలకు భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి బాగుపడితే ఆర్థిక వ్యవస్థ సైతం మెరుగవుతుందని రాహుల్ పేర్కొన్నారు. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
‘ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు’
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర భవిష్యత్‌కు బీజేపీ ఎన్నికల ప్రణాళిక దిక్సూచీగా మారుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక రాజస్ధాన్‌లో రానున్న ఐదేళ్లలో ప్రైవేట్ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి వసుంధరా రాజె హామీ ఇచ్చారు. ఏటా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 2013లో ఇచ్చిన హామీలను 94 శాతం మేర రాజస్ధాన్ ప్రభుత్వం నెరవేర్చిందని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, సీఎం వసుంధర రాజె సమక్షంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికతో రాజస్ధాన్ అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని జైట్లీ పేర్కొన్నారు. రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా పాగా వేయాలని విపక్ష కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచగా, అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. డిసెంబర్ 7న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
కులగోత్రాలు వెల్లడించిన రాహుల్
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్‌లోని పుష్కర్ బ్రహ్మ ఆలయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుడిగా చెబుతున్న రాహుల్ గాంధీ తన గోత్రం ఏమిటో వెల్లడించాలని బీజేపీ కోరుతున్న క్రమంలో కాంగ్రెస్ చీఫ్ నుంచి ఆ వివరాలు వెల్లడయ్యాయి. బ్రహ్మ ఆలయంలో పూజల సందర్భంగా గోత్రం గురించి పూజారి అడిగిన మీదట తన గోత్రం దత్తాత్రేయ అని, తాను కౌల్ బ్రాహ్మణుడినని రాహుల్ బదులిచ్చారు. పూజలో భాగంగా గాంధీ కుటుంబానికి చెందిన తన పూర్వీకుల వివరాలనూ ఆయన వెల్లడించారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో రాహుల్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించిన సందర్భంలో రాహుల్ కులగోత్రాలపై బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా ప్రశ్నించారు. రాహుల్ జంధ్యం ధరిస్తే అది ఎలాంటిదో చెప్పాలని, ఆయన గోత్రం ఏంటో వెల్లడించాలని కోరారు. ఇక బ్రహ్మ ఆలయంను సందర్శించే ముందు రాహుల్ సోమవారం ఉదయం అజ్మేర్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో జియారత్ నిర్వహించారు. రాహుల్ వెంట రాజస్ధాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. -
రాహుల్ అనుమతితోనే చెలరేగుతున్నారు..
జైపూర్ : తన ప్రభుత్వంపై మాట్లాడేందుకు అంశాలు కరువైనందునే కాంగ్రెస్ నేతలు రాహుల్ అనుమతితో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మూడు దశాబ్ధాల కిందట మరణించిన తన తండ్రిని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. రాజస్ధాన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. వంద తరాలుగా తన కుటుంబానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని మారుమూల గ్రామంలోని ఓ పేద చిన్నకుటుంబం తమదని మోదీ చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని బయటకు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించిన మోదీ మోదీ కూడా తమ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని రాహుల్ చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కుటుంబ సభ్యుల గురించి తానేమీ మాట్లాడటం లేదని, దేశ మాజీ ప్రధానులు, కాంగ్రెస్ పార్టీ మాజీ నేతల గురించే తాను ప్రస్తావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కాగా ప్రధాని మోదీ తన తండ్రి ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్ నేత విలాస్‌రావు ముత్తెంవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రాజ్‌బబ్బర్ రూపాయి విలువ మోదీ తల్లి వయసు స్ధాయికి క్షీణిస్తోందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
సీఎం బామ్మర్ది అయితే!
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వారాసివని నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యోగేంద్ర నిర్మల్‌నే బీజేపీ మళ్లీ బరిలో దించింది. మాములుగా అయితే ఈ స్థానంపై పెద్ద ఆసక్తేమీ ఉండదు. కానీ.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బావ (మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్)కు హ్యాండిచ్చి.. కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకున్న సంజయ్ సింగ్ మసానీ బీజేపీపై పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. వృత్తిరీత్యా వైద్యుడైన మసాని వారాసివని నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో మసాని ఈ నెల 3వ తేదీన కమల్‌నాథ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమల్‌నాథ్ కృషి ఫలితంగా కాంగ్రెస్ నాలుగో జాబితాలో మసానీకి చోటు దక్కింది. బావ పార్టీపై బామ్మర్ది ఆగ్రహం బీజేపీలో బంధుప్రీతి హద్దులు దాటిందని, వారసులకే పెద్ద పీట వేస్తున్నారని 60 ఏళ్ల మసాని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, కూతుళ్లకే ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చౌహాన్ కంటే కమల్‌నాథ్ అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే, మసానీకి టికెట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మసానీ అక్రమాలను పలుమార్లు కాంగ్రెస్ పార్టీయే అసెంబ్లీలో ఎత్తిచూపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మద్దతుగా ఎలా ప్రచారం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ బలమెక్కువ మధ్యప్రదేశ్‌లో బాలఘాట్ జిల్లా పరిధిలోకి వచ్చే వారాసివనిలో.. 2013లో ఆరెస్సెస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి యోగేంద్ర నిర్మల్.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్‌పై 17,755 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2008లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జైస్వాల్ గెలిచారు. 10మంది పోటీలో ఉన్నా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నప్పటికీ బీఎస్పీ కూడా తీవ్రమైన పోటీనిస్తోంది. -
కౌన్ బనేగా..టోంక్‌పతి!
రాజస్తాన్‌తోపాటు యావద్భారతం దృష్టిని ఆకర్శిస్తున్న స్థానం రాజస్తాన్‌లోని టోంక్ నియోజకవర్గం. తొలిసారి అసెంబ్లీ బరిలో దిగిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థుల్లో ఒకడైన సచిన్ పైలట్‌కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఇన్నాళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న టోంక్‌లో గెలవడం సచిన్‌కు ఆవశ్యకం కూడా. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా చివరి నిమిషంలో సచిన్‌ను టోంక్నుంచి పోటీ చేయించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు, గుజ్జర్లు ఎక్కువగా ఉండే టోంక్‌లో గుజ్జర్ నేతగా సచిన్ గెలవడం పెద్ద కష్టం కాదని కాంగ్రెస్ భావించింది. అయితే.. బీజేపీ కూడా ఆఖరి నిమిషంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్‌ను బరిలోకి దింపింది. ఇప్పటికే ఇక్కడ బీజేపీకి గణనీయమైన ఓటుబ్యాంకు ఉంది. దీనికితోడు ముస్లింను బరిలో దించడం ద్వారా సచిన్‌కు సరైన సవాల్ విసరాలనేది బీజేపీ వ్యూహం. సచిన్ కరిజ్మాపై విశ్వాసం తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సచిన్‌కు పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాజేశ్ పైలెట్ కుమారుడిగా ఆయనకో ఇమేజ్ ఉంది. అందుకే ఎక్కడ నుంచి పోటీ చేసినా నెగ్గడం సచిన్‌కు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ.. బీజేపీ చివరి నిముషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్‌సింగ్‌ను పక్కన పెట్టి యూనస్ ఖాన్‌కు టిక్కెట్ ఇవ్వడంతో రసవత్తర పోటీకి తెరలేచింది. ఇద్దరూ కొత్తవారే టోంక్‌లో కాంగ్రెస్ పార్టీ 46 ఏళ్లుగా ముస్లిం అభ్యర్థినే నిలబెడుతూ వస్తోంది. ఈ సారి ఆ సంప్రదాయాన్ని కాదని సచిన్‌ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గానికి సచిన్ పైలెట్ పూర్తిగా కొత్త. కానీ పీసీసీ అధ్యక్షుడి హోదాలో టోంక్‌లో ‘మేరా బూత్, మేరా గౌరవ్’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొంత పట్టు సాధించారు. 2004లో దౌసా నుంచి 2009లో అజ్మీర్ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాతో ఓటమిపాలయ్యారు. లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహించిన దౌసా, అజ్మీర్‌లకు సరిగ్గా మధ్యలో టోంక్ నియోజకవర్గం ఉంది. సచిన్ తన చిన్నతనంలో టోంక్ జిల్లాలోని దేవ్‌నారాయణ్ ఆలయానికి (గుజ్జర్ల తమ కులదైవంగా భావిస్తారు) వస్తూ ఉండేవారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన ఇద్దరు కుమారులతో కలిసి సచిన్ ఈ దేవాలయాన్ని సందర్శించారు. బీజేపీ తరఫున బరిలో ఉన్న యూనస్ ఖాన్ కూడా నియోజకవర్గానికి కొత్తవారే. ముస్లిం ఓటర్లే అండగా ఉంటారన్న నమ్మకంతో బీజేపీ ఆయన్ను బరిలో దింపింది. రాష్ట్రంలో బీజేపీ టిక్కెట్ ఇచ్చిన ముస్లిం అభ్యర్థి యూనస్ మాత్రమే. దీద్వానా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన యూనస్ ఖాన్.. సీఎం రాజేకు సన్నిహితుడు. రాజస్థాన్ ప్రభుత్వంలో రాజే తర్వాతి స్థానంలో ఉన్నారు. అటు పైలెట్, ఇటు ఖాన్ ఇద్దరూ టోంక్‌కి కొత్తవారే. దీంతో వారి వ్యక్తిగత కరిజ్మా, కులసమీకరణలే కీలకం కానున్నాయి. మామ అండ కలిసొచ్చేనా? సచిన్ అభ్యర్థిత్వం స్థానిక ముస్లింలలో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. మెజార్టీ ఓట్లు ఉన్న తమని కాదని గుజ్జర్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు. మైనార్టీల హక్కుల్ని కాంగ్రెస్ కాలరాస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కూడా. అయితే సచిన్ పైలెట్‌కు పిల్లనిచ్చిన మామ, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫారుఖ్ అబ్దుల్లా అల్లుడికి అండగా నిలిచారు. ఫారుఖ్ అబ్దుల్లాకి టోంక్‌లోని సైదీల కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. ఈ ఇంటి పెద్ద డాక్టర్ అజ్మల్ సైదీ, ఫరూక్ అబ్దుల్లా ఒకే కాలేజీలో చదువుకున్నారు. దీంతో ఫరూక్ తరచూ టోంక్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ముస్లిం కుటుంబమంతా సచిన్‌ను తమ అల్లుడిగా భావిస్తోంది. ఒక పేరున్న నేత తమ నియోజకవర్గంలో విజయం సాధిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశపడుతోంది. సచిన్‌కు అండగా ఉంటామని ఆ కుటుంబం హామీ ఇచ్చింది. అజ్మల్ సైదీ కుమారుడు సాద్ సైదీ మొన్నటివరకు టోంక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో మంచి పట్టున్న మరో నవాబు అఫ్తాబ్ అలీఖాన్ కూడా సచిన్ పైలట్‌కే మద్దతు తెలిపారు. -
నేడు ఛత్తీస్ రెండో దశ
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. లక్షమందికి పైగా భద్రతాబలగాలను మోహరించారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్‌లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్పూర్, బల్రామ్పూర్ జిల్లాల్లో నేడు పోలింగ్ జరగనుంది. రమణ్‌సింగ్ ప్రభుత్వం లోని 9 మంది మంత్రులు, స్పీకర్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ 72 సీట్లలో 46 జనరల్, 9 ఎస్సీ, 17 ఎస్టీలకు కేటాయించారు. 2013లో ఈ 72లో 43 స్థానాలను బీజేపీ, 27 సీట్లకు కాంగ్రెస్ చెరో సీటును బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కనీసం 65 స్థానాలు గెలుచుకుని వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. -
మాల్యా, అంబానీల నుంచి వస్తాయి!
కొరియా(ఛత్తీస్‌గఢ్): అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. అందుకు అవసరమైన నిధులు నీరవ్ మోదీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా వంటి వారి నుంచి వస్తాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ మాల్యా రూ.10 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయారని, నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 35 వేల కోట్లతో పరారయ్యారని రాహుల్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో రూ. 36 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి రమణ్‌సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో చివరిదైన రెండో దశలో 72 స్థానాలకు పోలింగ్ 20న జరగనుంది. -
రాజ్‌పుత్ వర్సెస్ రాజ్‌పుత్
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేసేందుకు తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కొడుకు, శివ్ ఎమ్మెల్యే మాన్వేంద్ర సింగ్ పేర్కొన్నారు. రాజ్‌పుత్ నాయకుడిని అవమానించినందుకు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ టికెట్‌పై గెలుపొందిన మన్వేందర్ సింగ్ ఇటీవలే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలరాపటాన్ నుంచి మన్వేంద్ర పోటీ చేస్తారని పేర్కొంది. ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మన్వేందర్ సింగ్‌కు ఏ సీటు కేటాయించాలో అర్థం కాకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఆయనను నిలబెట్టారని వసుంధర రాజే అన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని ఆమె వ్యాఖ్యానించారు. 2003 నుంచి మూడు పర్యాయాలు అక్కడి నుంచి గెలిచిన విషయాన్ని మరోమారు గుర్తుచేశారు. కాగా వసుంధర రాజే నాయకత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్వేంద్ర సింగ్‌ను ఆమెపై పోటీకి దించడం ద్వారా సీఎంను చాలా తేలికగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ సంకేతాలు జారీ చేస్తోంది. అంతేకాకుండా ఈ టికెట్‌ను రాజ్‌పుత్‌కే కేటాయించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
46 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి!
జైపూర్ : రాజస్థాన్‌లోని చారిత్రక టోంక్ నియోజకవర్గంలో ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలికింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను ఆ స్థానంలో తమ అభ్యర్థిగా రంగంలోకి దించనుంది. తద్వారా గత 46 ఏళ్లుగా టాంక్ సీటును మైనార్టీలకు కేటాయించే సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఈ విషయమై సచిన్ పైలట్ మాట్లాడుతూ.. తనకు తానుగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పలేదని పేర్కొన్నారు. పార్టీ అధినాయత్వం ఆదేశాల మేరకే టోంక్ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా టోంక్ ప్రజలను కోరారు. కాగా ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్ మెహతా సచిన్‌పై పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సచిన్ పైలట్‌ను ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ఔట్‌సైడర్లకు టోంక్‌లో చోటు లేదని పేర్కొన్నారు. అయినా సచిన్ పైలట్ ఎన్ని నియోజక వర్గాలు మారుతారని ప్రశ్నించారు. ఇక శుక్రవారం 152 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్కడ సగానికి సగం ముస్లిం ఓటర్లే నవాబులు పాలించిన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన టోంక్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,22,000. వీరిలో సగానికి సగం అంటే 40 నుంచి 50 వేల వరకు ముస్లిం ఓటర్లే ఉన్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్ గత 46 ఏళ్లుగా అక్కడ మైనార్టీలనే నిలబెడుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రాబల్యం కలిగి ఉన్న సైదీ అనే ముస్లిం కుటుంబం కాంగ్రెస్‌కు ప్రధాన బలంగా ఉంది. అయితే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన సాద్ సైదీ 2008, 2013లో ఇక్కడి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మైనార్టీ నేత, కాంగ్రెస్ అభ్యర్థి జకియాపై రెబల్‌గా పోటీ చేసి ఓడిపోయారు. కాగా 1985 నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జకియా 1985, 98, 2008 ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రాంతంపై తనకున్న పట్టును నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం టాంక్ నుంచి సచిన్ పైలట్ పోటీ చేయనుండటంపై జకియా ఇంతవరకు స్పందించలేదు. సద్ సైదీ మాత్రం సచిన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గెలుపు కోసం కృషి చేస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ స్థానంలో ఆరెస్సెస్‌కు చెందిన బలమైన నాయకులను నిలబెడుతోంది. ‘టోంక్’ చారిత్రక నేపథ్యం రాజస్థాన్‌లోని టోంక్ సంస్థానాన్ని పరిపాలించిన నవాబులది ప్రత్యేక వ్యక్తిత్వం. మిగతా రాజవంశీకులందరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. వీరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా బ్రిటీషర్లకు, అఫ్గాన్లకు కుదిరిన ఒప్పందం కింద 1808లో టోంక్ సంస్థానం ఆవిర్భవించింది. 19వ శతాబ్దిలో ఈ రాజవంశం బలమైన మిలటరీ శక్తిగా పేరొందింది. అయితే ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చి రాజభరణాల రద్దు, లాండ్ సీలింగ్ చట్టం తెచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నవాబు వంశ మూల ఆర్థిక వనరులపై ఈ రెండు అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ మార్పు తర్వాత ప్రధాన పార్టీల తరఫు అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడానికే నవాబులు పరిమితం అయ్యారు. బైరాన్‌సింగ్ షెకావత్‌కు వీరి మద్దతు ఉండేది. ప్రస్తుత నవాబు ఢిల్లీలో నివసిస్తుండగా, కుటుంబంలోని వారంతా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన దాదాపు 615 మంది ప్రస్తుతం టోంక్ స్టేట్ ఖాందాన్ నిబంధనలు–1944 కింద నెలకు వెయ్యిరూపాయల పింఛను అందుకుంటున్నారు. జైపూర్, అల్వార్, భరత్పూర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మేర్, పాలి తదితర సంస్థానాధీశులంతా నేతలవుతున్నా టోంక్ నవాబులు మాత్రం రాజకీయాలపై ఆసక్తి కనబరచలేదు. -
మత మార్పిడికి వచ్చిన ‘ఇటలీ ఏజెంట్లు’
జాష్పూర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటలీ నుంచి వచ్చిన ఏజెంట్లు గిరిజనులను మత మార్పిడులకు ప్రోత్సహించారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్లో గురువారం ప్రచార సభలో ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇటలీ ఏజెంట్లు’ అని పరోక్షంగా సోనియా గాంధీ మూలాల్ని ప్రస్తావించారు. ‘ఇటలీ ఏజెంట్లు..గిరిజనులు మతమార్పిడులకు పాల్పడాలని ఒత్తిడి పెంచి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రోడ్లు, విద్య, విద్యుత్ వంటి సౌకర్యాలు లేకున్నా మతమార్పిడుల జాడ్యం మరింత ఎక్కువైంది. దివంగత బీజేపీ ఎంపీ దిలీప్‌సింగ్ జుదేవ్ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని జాష్పూర్ మరో బస్తర్ కాకుండా అడ్డుకున్నారు. కరుస్తుందని తెలిసినా హిందువులు పాముకు పాలు పోస్తారు. త్యాగాల్ని విశ్వసించే హిందూ మతం ప్రపంచంలోనే చాలా అత్యంత గొప్పది. ఇతరుల మాదిరిగా బలవంతపు మతమార్పిడులను హిందువులు నమ్మరు. ఛత్తీస్‌గఢ్‌లో రామరాజ్యం నెలకొల్పే ప్రభుత్వం రావాలి’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వలసదారులు వెనక్కే: షా లోక్‌సభ ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ప్రచార సభలో మాట్లా డుతూ 1971 నుంచి భారత్‌లోకి చొరబడిన వలసదారులు కాంగ్రెస్, తృణమూల్ లాంటి పార్టీలకు ఓటుబ్యాంకుగా మారారన్నారు. -
ఆ రాష్ట్రాలకు సుస్తీ చేసింది!
ఆరోగ్య రంగ పనితీరు ప్రాతిపదికపై నీతి ఆయోగ్ ఈ యేడాది ఇచ్చిన ర్యాంకుల ప్రకారం – మొత్తం 21 రాష్ట్రాల్లో రాజస్తాన్‌ది 20వ స్థానం. మధ్యప్రదేశ్ స్థానం 17. చత్తీస్‌గఢ్ (12) తెలంగాణ (11) కాస్త ముందున్నాయి. చిన్న రాష్ట్రాల్లో మిజోరం మెరుగైన పని తీరు కనబరచింది. హెల్త్ స్కోర్పరంగా రాజస్తాన్ ఒక్క ఉత్తరప్రదేశ్‌ను మాత్రమే అధిగమించగలిగిందని ‘హెల్తీ స్టేట్స్ – ప్రోగ్రెసివ్ ఇండియా’ శీర్షికన నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక చెబుతోంది. రాజస్తాన్‌లో ఐదేళ్ల లోపు పిల్లల లింగ నిష్పత్తిపరంగా తీవ్ర అంతరం చోటుచేసుకుంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 887 మంది బాలికలు మాత్రమే వున్నారు (జాతీయ సగటు 919). ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 28 మంది పుట్టిన నాలుగు వారాల్లోనే మరణిస్తున్నారు (జాతీయ సగటు 24). 2010 – 17 మధ్య అదనంగా ఒక్క జిల్లా ఆసుపత్రి మాత్రమే ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. వైద్యులు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఈ కాలంలో 70 నుంచి 167కి చేరింది. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో సర్జన్ల కొరత 218 నుంచి 452కి పెరిగింది. మధ్యప్రదేశ్‌లోనూ శిశు, ప్రసూతి మరణాలు జాతీయ సగటు కంటే ఎక్కువే. ఆరోగ్య కేంద్రాల్లో జ్యోతిష్కుల్ని నియమిస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చి ఆ తర్వాత ఉపసంహరించుకుంది. శాకాహార సెంటిమెంట్‌ను ముందుకు తెస్తూ.. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లను నిషేధించింది. చత్తీస్‌గఢ్‌లో ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో 32మంది పుట్టిన 4వారాల్లోనే చనిపోతున్నారు. ప్రసూతి మరణాలు రేటూ ఎక్కువే (ప్రతి లక్షకు 173). నిపుణుల కొరత తీవ్రంగా వున్నప్పటికీ, 2010–18 మధ్య ఇక్కడ తొమ్మిది జిల్లా ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. పీహెచ్‌సీల్లో విద్యుత్, నీటి సరఫరా కొరతను కూడా ఈ రాష్ట్రం కొద్దిమేరకు అధిగమించింది. ‘ఆయుష్మాన్ భారత్’లో భాగంగా తొలి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటైంది ఇక్కడే. -
బలమే బలహీనతై
మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. అత్యంత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. అన్నిరంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర పగ్గాలు తీసుకున్న సమయంలో ఉన్న పప్పు అని ఇమేజ్ నుంచి రాష్ట్రమంతా మామ అని ఆప్యాయంగా పిలిపించుకునే స్థాయికి ఎదిగిన చౌహాన్ గత రెండు ఎన్నికల్లో బీజేపీని సులభంగా గట్టెక్కించారు. అయితే ఏకంగా మూడుసార్లు అధికారంలో ఉండటంతో ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత కాస్తంత ఎక్కువగానే కనబడుతోంది. వరుసగా నాలుగోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అంత సులభం కాదనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌహన్‌కు బలం అనుకున్న అంశాలే ఇప్పుడు బలహీనతలుగా మారుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, రైతులు శివరాజ్‌పై తిరుగుబాటు బావుటీ ఎగరేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు.. మధ్యప్రదేశ్‌లో పార్టీకి నష్టం చేస్తాయనే భావన వినిపిస్తోంది. ఈ చట్ట సవరణలతో అటు దళితులు, ఇటు అగ్రవర్ణాలు కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. బీజేపీకి సంప్రదాయంగా మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలు సొంతం పార్టీలు పెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్ఏపీఏకేఎస్ ఏర్పాటు మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలే కాదు, ప్రభుత్వంలో పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం వారిలో అసంతృప్తిని పెంచింది. దీంతో వారు ఓబీసీలతో చేతులు కలిపి సామాన్య పిఛ్డా ఔర్ అల్పసంఖ్యాక వర్గ కర్మచారి సంస్థ (ఎస్ఏపీఏకేఎస్) ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. ఓటర్లలో అగ్రవర్ణాలు 15%, ఓబీసీ ఓటర్లు 37%. గత 30 ఏళ్లుగా బీజేపీకే మద్దతుగా ఉన్నాయి. దళితుల్లో అసంతృప్తి బీజేపీ ప్రభుత్వం దళితులకు పలు పథకాలు తీసుకొచ్చినా.. రోహిత్ వేముల ఉదంతం, గుజరాత్‌లోని ఉనాలో దళిత యువకులపై దాడుల వంటి ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్ ఓటర్లలో 16% దళితులే. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ సమయంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా నిరసన స్వరాలు వినిపించాయి. జై ఆదివాసీ యువ సంఘటన్ మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ ఓటర్లు 23%. గత రెండు సార్లు వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. గత ఎన్నికల్లో ఎస్టీల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఆదివాసీల సంక్షేమం కోసం డాక్టర్ హీరాలాల్ ఏర్పాటు చేసిన జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) బీజేపీకి పక్కలో బల్లెంలా మారుతోందనే అంచనాలున్నాయి. ఒక సామాజిక సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా మారిన జేఏవైఎస్తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అన్నదాతల ఆగ్రహం శివరాజ్‌సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. అయినా ఆ రైతులే ఆయనకు వ్యతిరేకంగా మారారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది మందసౌర్ నిరసనల్లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించడం బీజేపీకి తీవ్ర నష్టం చేయనుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటించడంతో రైతులు కాంగ్రెస్ వైపు మరలుతారని భావిస్తున్నారు. కేంద్రంపై వ్యతిరేకత గత ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోదీ మ్యాజిక్ ప్రధాన కారణం. యూపీఏపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి ఓటేశారు. కానీ ఈ సారి కేంద్రంపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అంచనా. ఈ వ్యతిరేకత ఈ సారి చౌహాన్‌కు నష్టం చేకూరుస్తుందంటున్నారు. బలాలు ♦ ప్రజలతో మమేకం కావడం ♦ పని రాక్షసుడని పేరు ♦ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బలహీనతలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ♦ రైతుల్లో అసంతృప్తి ♦ వ్యాపమ్ సహా పలు కుంభకోణాలు ♦ బంధుప్రీతి ఎక్కువన్న ఆరోపణలు చెక్ పెట్టగలరా? చౌహాన్ జోరును ఆపేందుకు విపక్షం విశ్వప్రయత్నం ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ భరోసా పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మధ్యప్రదేశ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి సొంత ఇమేజ్‌తో మళ్లీ గెలవాలని శివరాజ్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ప్రవేశపెట్టిన పథకాలు గట్టెక్కిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అటు, ఇంటిపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే.. అది ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప కాంగ్రెస్ నేతల గొప్పదనమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరుపార్టీల్లోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో అగ్రనేతలే తమ వర్గానికి టికెట్లు ఇవ్వాలంటూ బహిరంగంగా విమర్శలు చేసుకుంటుంటే.. టికెట్ల పంపిణీ బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ప్రజలతో ఆప్యాయంగా మామా అనిపించుకుంటున్న చౌహాన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. వివాదంలో కాషాయ నేతలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం ఏ మాత్రం కనిపించడం లేదు. సీనియర్ నాయకులెందరో వివాదాల్లో ఇరుక్కున్నారు. నరోత్తమ్ మిశ్రా పెయిడ్ న్యూస్ కేసులో ఇరుక్కుంటే, ఎమ్మెల్యే మఖాన్ సింగ్ జాటవ్ హత్య కేసులో.. లాల్ సింగ్ ఆర్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణాలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న సురేంద్ర పాత్వా, కోడలు ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌పాల్ సింగ్.. ఇలా కాస్త పేరున్న నాయకులందరూ వివాదాల్లో చిక్కుకొని పార్టీకున్న ఇమేజ్ను చెరిపేస్తున్నారు. ఇతర సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, సర్తాజ్ సింగ్, కుసుమ్ మహ్దెలేలు టిక్కెట్లు నిరాకరించడంతో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. బహిరంగంగానే పార్టీకి డ్యామేజ్ జరిగేలా వ్యాఖ్యలుచేశారు. తన కోడలు కృష్ణకు టిక్కెట్ ఇచ్చిన తర్వాత బాబూలాల్ గౌర్ శాంతించారు. సర్తాజ్ సింగ్ ఏకంగా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు, పార్టీకి గట్టిపట్టున్న ఇండోర్, విదిశ, మహూ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీలో అంతర్గత పోరు పెరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ, పార్లమెంటు స్పీకర్ సుమిత్ర మహాజన్‌లకు పడడం లేదు. కాంగ్రెస్ విశ్వప్రయత్నం ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేయడానికి ఈ రాష్ట్రంలో గెలుపు చాలా ముఖ్యం. అందుకే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను ప్రకటించింది. రైతులు, మహిళలు, యువత, పారిశ్రామిక రంగం ఇలా అత్యధిక జనాభా ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలు పన్నుతోంది. ఆ ముగ్గురిపై నమ్మకం కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. కానీ మధ్యప్రదేశ్‌లో పరిస్థితి వేరు. ఒక్కరిద్దరు కాకుండా ముగ్గురు బలమైన నేతలుండటం పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతర్గత పోరు ఉన్నప్పటికీ.. ఒక్కో నాయకుడికి ఒక్కో ప్రాంతంలో పట్టుండడం విశేషం. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో మంచి పట్టు ఉంది. పీసీసీ చీఫ్ కమల్‌నాథ్‌కు మహాకౌశల్ ప్రాంతంలో తిరుగేలేదు. ఇక ఎన్నికల ప్రచార సారథి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో మంచి ఇమేజ్ ఉంది. టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ప్రాంతీయ, కుల సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకొని నేతలందరూ ఇంచుమించుగా సంతృప్తి చెందేలా టిక్కెట్లు ఇచ్చింది. -
‘మోదీ, అంబానీ పేర్లు బయటకొస్తాయి’
కబీర్‌దాం/కోర్బా: రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అంబానీల పేర్లు త్వరలో బయటకు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. ‘రఫేల్ కుంభకోణంపై సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ దర్యాప్తు ప్రారంభించారు. అయితే అర్థరాత్రి 12 గంటలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధానమంత్రి ఆయనను తొలగించారు. ఒకరోజు తప్పకుండా ఆ రెండు పేర్లు బయటకు వస్తాయి. ఆ పేర్లు ప్రధాని నరేంద్రమోదీ, అనిల్ అంబానీ’’అని రాహుల్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
రాజస్ధాన్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ!
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమలనాధులకు గట్టిషాక్ తగిలింది. వసుంధర రాజె నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందనే ప్రచారంతో కలవరపడుతున్న బీజేపీకి తాజాగా ఆ పార్టీ ఎంపీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దౌసా ఎంపీ, మాజీ డీజీపీ హరీష్ మీనా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని వారాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీకి మీనా నిష్క్రమణ భంగపాటుగా మారింది. మీనా సోదరుడు నమో నారాయణ్ మీనా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజస్ధాన్‌లో ప్రాబల్యం కలిగిన మీనాలు తూర్పు రాజస్ధాన్‌లో గణనీయ సంఖ్యలో ఉన్నారు. మీనా వర్గీయులు రాజకీయాల్లో, ప్రభుత్వ సర్వీసుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2009-13 మధ్య హరీష్ మీనా రాజస్థాన్ పోలీస్ చీఫ్‌గా దీర్ఘకాలం సేవలు అందించారు. కాగా రాజస్ధాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అధికారం నిలుపుకునేందుకు బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. -
మహిళా అభ్యర్ధులపై కమల్‌నాథ్ వ్యాఖ్యల కలకలం
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ తలపడుతున్న కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. మహిళా అభ్యర్ధుల ఎంపికపై ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టికెట్ల పంపిణీపై విలేకరుల సమావేశంలో కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహిళా అభ్యర్ధులకు కాంగ్రెస్ పెద్దపీట వేయకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా గెలుపు ప్రాతిపదికనే తాము వారికి టికెట్లు కేటాయించామని, కేవలం కోటా కోసమో, డెకరేషన్ కోసమో ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించారు. దీంతో మహిళలను అలంకారప్రియులుగా కమల్‌నాథ్ చిత్రీకరించారంటూ బీజేపీ భగ్గుమంటోంది.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు కమల్‌నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు ఆరెస్సెస్ శాఖా సమావేశాలకు ప్రభుత్వ అధికారులు హాజరు కావడాన్ని నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడంపై కూడా బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. -
బెయిల్‌పై ఉండి.. నన్ను విమర్శిస్తారా?
బిలాస్పూర్: కాంగ్రెస్ పార్టీ, గాంధీల కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం బిలాస్పూర్లో పర్యటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలను ప్రస్తావిస్తూ ‘బెయిలుపై బయట ఉన్న తల్లీ కొడుకుల నుంచి నాకు నిజాయితీ ధ్రువపత్రమేమీ అవసరం లేదు’ అని మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నోట్లరద్దు నిర్ణయాన్ని సోనియా, రాహుల్‌లు వ్యతిరేకిస్తూ మోదీ అవినీతికి పాల్పడ్డారని వారు చేసిన ఆరోపణలకు సమాధానంగానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంస్థలో ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి 2015 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్‌లకు బెయిలు మంజూరు చేయడం గమనార్హం. ‘నోట్లరద్దు నిర్ణయానికి మీకు సమాధానం కావాలా? ఆ చర్య వల్లే నకిలీ కంపెనీలను గుర్తించాం. అందువల్లే మీరు బెయిలు కోరాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మీరెందుకు మర్చిపోతున్నారు’ అంటూ సోనియా, రాహుల్‌లపై మోదీ విరుచుకుపడ్డారు. మోదీ వ్యాఖ్యలు ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ అన్నారు. ఒకే కుటుంబంతో ఆరంభం, అంతం.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒకే కుటుంబంతో ఆరంభమై, అంతమవుతాయని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఓ అవినీతి పార్టీ అనీ, ఛత్తీస్‌గఢ్‌ను ఇప్పుడున్న స్థితికి తీసుకురావడానికి ఆ పార్టీకైతే 50 ఏళ్లు పట్టేదని పోల్చారు. మాజీ ప్రధాని, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ 1985లో అన్న మాటలను గుర్తుచేస్తూ.. ‘ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయిలో 15 పైసలే ప్రజలకు చేరుతోందని రాజీవ్ గాంధీయే అన్నారు. 85 పైసలను అదృశ్య హస్తం (కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం) లాగేసింది? ఆ డబ్బంతా నోట్ల రద్దు తర్వాత బయటకొచ్చింది’ అని మోదీ ఆరోపించారు. జల మార్గాలపై తొలి టర్మినల్ వారణాసి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో అభివృద్ధి వేగాన్ని ప్రధాని మోదీ పెంచారు. మొత్తం రూ. 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను ఇంతకు ముందే ఎందుకు చేపట్టలేదంటూ గత ప్రభుత్వాలను దుయ్యబట్టారు. దేశీయ జల మార్గాలపై దేశంలోనే తొలి మల్టీ–మోడల్ టర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గంగా నదిపై ఈ టర్మినల్‌ను నిర్మించారు. జాతీయ జల రహదారి–1 ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తం నాలుగు టర్మినళ్లను గంగా నదిపై నిర్మిస్తుండగా, సోమవారం ప్రారంభమైన టర్మినల్ వాటిలో మొదటిది. ప్రభుత్వాధీనంలోని భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ – ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ బ్యాంకు సాయంతో ‘జల్ మార్గ్ వికాస్’ ప్రాజెక్టును చేపడుతుండటం తెలిసిందే. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 5,369.18 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం, ప్రపచం బ్యాంకు చెరి సగం భరించనున్నాయి. జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తొలి నౌకకు స్వాగతం పలికిన మోదీ టర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం కోల్‌కతా నుంచి ఆహార, పానీయాలను మోసుకుంటూ జలమార్గంలో వచ్చిన తొలి సరకు రవాణా నౌకకు మోదీ స్వాగతం పలికారు. ఈ నౌక అక్టోబర్ చివరి వారంలో కోల్‌కతా నుంచి వారణాసికి బయలుదేరింది. కాగా, తన నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన, మొత్తంగా 34 కి.మీ. పొడవైన రెండు రహదారులను కూడా మోదీ ప్రారంభించారు. వీటిలో 16.55 కి.మీ. పొడవైన వారణాసి రింగ్‌రోడ్డు తొలి దశ రహదారి కూడా ఉంది. -
తొలిదశలో 60.5% పోలింగ్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేం దుకు మావోయిస్టులు చేసిన చర్యలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. మొత్తం 90 స్థానాలకుగాను సోమవారం 18 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. 60.5 శాతం పోలింగ్ నమోదైందని ఛత్తీస్‌గఢ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుబ్రత్ సాహూ రాయ్‌పూర్‌లో చెప్పారు. తుది నివేదికలు అందాక పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశముంది. ఢిల్లీలో ఎన్నికల అధికారులు మాట్లాడుతూ 60–70 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2013 ఎన్నికల్లో 75.06 శాతం పోలింగ్ నమోదైంది. 10 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు, మిగిలిన 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు ప్రజలకు అవకాశమిచ్చారు. నియోజకవర్గాల వారీగా చూస్తే దంతెవాడలో 49%, బస్తర్‌లో 58 శాతం, కొండగావ్‌లో 61.47 శాతం, ఖైరాగఢ్‌లో 70.14%, డోంగర్‌గఢ్‌లో 71 శాతం, డోంగర్‌గావ్‌లో 71 శాతం, ఖుజ్జీలో 72 శాతం పోలింగ్ నమోదైంది. మిగిలిన 72 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగి, వచ్చే నెల 11న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల రోజూ ఎన్కౌంటర్లు చర్ల: ఎన్నికల రోజున కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు హతమవ్వగా మరో ఇద్దరు పట్టుబడ్డారని అధికారులు చెప్పారు. బస్తర్ జిల్లాలో మారుమూలన ఉన్న ఓ పోలింగ్ బూత్‌ను ముట్టడించేందుకు పది మందికి పైగా నక్సల్స్ యత్నించారనీ, మూడు గంటలకు పైగా వారితో పోరాడి ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని భద్రతా దళాలు చెప్పారు. అటు బీజాపూర్ జిల్లాలో పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మొత్తంగా ఐదుగురు కోబ్రా సిబ్బంది గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని కాటేకళ్యాణ్లో నక్సలైట్లు మందుపాతర పేల్చినప్పటికీ ఎవ్వరికీ హాని జరగలేదని అధికారులు చెప్పారు. సుక్మా జిల్లాలో చెట్టు కిందే పోలింగ్ బూత్ -
ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్
-
ఎన్నికల వేళ ట్వీట్ల మోత
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్విట్టర్ ట్వీట్లతో మోగుతోంది. ఎన్నికలపై పలు సంభాషణలు, చర్చల ద్వారా గత వారంలో ఏకంగా 12 లక్షల ట్వీట్లు నమోదైనట్లు ట్విట్టర్ పేర్కొంది. ఎన్నికల కార్యక్రమాల్లో భాగంగా..ట్విట్టర్ రాష్ట్ర ఎన్నికల కోసం ఒక ప్రత్యేక ఎమోజి, హ్యాష్‌టాగ్‌తో ఎలక్షన్ ఆన్ ట్విట్టర్ ఈవెంట్స్‌ను రూపొందించింది. ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగే సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో డిసెంబర్ 23 వరకు ప్రజలకు ఈ ప్రత్యేక #AssemblyElections2018 అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. దీని ద్వారా రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల సమయం వరకు బహిరంగ సంభాషణలు జరపడానికి, వారు ప్రజలతో నేరుగా మాట్లాడి మద్దతు కూడగట్టడానికి అవకాశం ఉంటుంది. -
వారికే ఖజానా తాళాలు
చరమా(ఛత్తీస్‌గఢ్): ‘నాలుగేళ్లలో ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు ఏడాదికి అయ్యే వ్యయానికి ఈ మొత్తం సుమారు 10 రెట్లు. మోదీ ఆ 15 మందికే దేశ ఖజానా తాళాలు అప్పగించారు. కానీ కాంగ్రెస్.. రైతులు, యువత, పేదలు, మహిళలు, గిరిజనులకు ఆ తాళాలు ఇవ్వాలనుకుంటోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ శనివారం ప్రధాని మోదీ, ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. చిట్‌ఫండ్, పౌరసరఫరా కుంభకోణాల్లో రమణ్‌సింగ్‌కు పాత్ర ఉందని, పనామా పత్రాల్లో రమణ్‌సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ పేరు ఉన్నా, ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదని అన్నారు. చేష్టలుడిగిన రమణ్‌సింగ్.. చరామాలో జరిగిన ర్యాలీలోనూ రాహుల్ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ చిట్‌ఫండ్ కుంభకోణంలో రూ.5 వేల కోట్లు అదృశ్యమయ్యాయని, సుమారు 60 మంది మరణించగా, 310 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయినా ఎవరికీ శిక్షలు పడలేదని, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రమణ్‌సింగ్ వెనకడుగు వేశారని ధ్వజమెత్తారు. ఇక పౌర సరఫరా కుంభకోణంలో రూ.36 వేల కోట్లను దోచుకున్నారని, ఇందులో రమణ్‌సింగ్ పాత్రను తేటతెల్లంచేసే పత్రాలు లభ్యమయ్యాయని అన్నారు. రమణ్‌సింగ్ 15 ఏళ్ల పాలనలో 40 లక్షల మంది యువత నిరుద్యోగులుగానే మిగిలారని, 65 శాతం భూభాగానికి సాగునీరు లేదని, గిరిజనుల నుంచి 56 వేల ఎకరాల భూమిని లాక్కుని సీఎం స్నేహితులకు కట్టబెట్టారని ఆరోపించారు. స్థానికులు నిరు ద్యోగులుగా మిగలడానికి కారణమైన ఔట్సోర్సింగ్ విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. స్నేహమే అర్హతా?..: ప్రధాని మోదీకి స్నేహితుడు అయినందుకే అనిల్ అంబానీ రఫేల్ ఒప్పందాన్ని దక్కించుకున్నారని రాహుల్ ఆరోపించారు. దేశానికి కాపలాదారుడిగా చెప్పుకునే మోదీ..తన స్నేహితుడికి లబ్ధిచేకూర్చడానికే యూపీఏలో కుదిరిన ఒప్పందంలో మార్పులు చేశారన్నారు. ఒక్కో విమానానికి రూ.526 కోట్ల చొప్పున మొత్తం 126 విమానాల్ని కొనడానికి యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరితే, ఒక్కో విమానానికి రూ.1600 కోట్లు చెల్లించడానికి ఎన్డీయే అంగీకరించిందని ఆరోపించారు. ‘తొలి’ ప్రచారం సమాప్తం రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు శనివారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సహా మొత్తం 190 మంది అభ్యర్థులు మొదటి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండగా జనతా కాంగ్రెస్(జే), బీఎస్పీ, సీపీఐల కూటమి కూడా ఈసారి తలపడుతోంది. మొత్తం 31,79,520 మంది ఓటర్ల కోసం 4,336 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రజలకు మావోలు పిలుపివ్వడంతో భద్రత ఏర్పాట్లు పెంచారు.కొండ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లకు సిబ్బందిని, సామగ్రిని చేరవేసేందుకు హెలికాప్టర్లను వినియోగి స్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 72 నియోజకవర్గాలకు 20న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌తో ప్రజలకు వినోదం రాయ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంతో ప్రజలకు వినోదం పంచారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రం గురించి ఆయనకు ఏమీ తెలియదని దెప్పిపొడిచారు. ‘ఛత్తీస్‌గఢ్ గురించి రాహుల్‌కు ఏమీ తెలియదు. ఆయన విమర్శలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు రాహుల్ కేవలం వినోదం పంచారు’ అని రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాహుల్ ప్రచారం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయలేకపోగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే హాని కలిగించేలా ఉన్నాయి’ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ మిత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న రాహుల్ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటివి కాంగ్రెస్ హయాం లో జరిగాయని తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రభావాన్ని దాదాపు లేకుండా చేశారంటూ సీఎంపై బీజేపీ చీఫ్ బీజేపీ అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రచురించడం, ప్రసారం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 12–డిసెంబరు 7 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 12 ఉదయం 7 గంటల నుంచి డిసెంబరు 7 వ తేదీ సాయంత్రం 5.30 గంటల మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించరాదని ఈసీ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఒపీనియన్ పోల్స్ సైతం పోలింగ్(విడతల వారీగా) ముగియడానికి 48 గంటల ముందు నుంచి ప్రసారం చేయరాదని ఆదేశించింది. -
10 రోజుల్లో రైతు రుణమాఫీ
పఖన్‌జోర్/రాజ్‌నందన్‌గావ్: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకొస్తే 10 రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పఖన్‌జోర్, సీఎం సొంత నియోజకవర్గం రాజ్‌నందన్‌గావ్‌లలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ ఈ హామీలిచ్చారు. ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం రమణ్ సింగ్‌కు పారిశ్రామిక వేత్తలే దగ్గరి స్నేహితులంటూ రాహుల్∙విమర్శించారు. ‘ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లకు స్నేహితులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలే ఈ ప్రాంతంలోని అపార సహజ వనరులతో లాభపడుతున్నారు’ అని ఆరోపించారు. ‘జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) అమలుతో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. నల్లధనం వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు కష్టాలకు గురయ్యారు’ అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, రమణ్‌సింగ్ ఇద్దరూ బహిరంగంగానే అవినీతిలో కూరుకుపోయారన్నారు. నానమ్మ ఎన్నో నేర్పారు ఈ సందర్భంగా రాహుల్ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఇందిరాగాంధీజీ నాకు ఎన్నో విషయాలు నేర్పారు. సమాజంలోని పేదలు, బలహీన వర్గాల కోసం కృషి చేయాలనేది ఆమె కోరిక. ఆ మేరకు అణగారిన, బలహీన వర్గాల పక్షాన నిలబడతా. వారి హక్కుల కోసం పోరాడుతా. గిరిజనుల సంక్షేమం కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె కృషి వల్లనే బెంగాలీలు బస్తర్ ప్రాంతానికి వలస వచ్చారు’ అని తెలిపారు. ‘రాష్ట్రంలో జరిగిన రూ.5వేల కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణం ఫలితంగా ఎందరో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ, ఏ ఒక్కరిపైనా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఎందుకు? ఆ చిట్‌ఫండ్ కంపెనీలన్నీ రమణ్‌సింగ్ స్నేహితులవి’ అని రాహుల్ ఆరోపించారు. పనామా పత్రాల కుంభకోణంతో సంబంధమున్న పాక్ మాజీ ప్రధాని షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తుండగా, అదే కేసులో ఆరోపణలున్న సీఎం కొడుకు అభిషేక్‌పై ఎలాంటి చర్యలు లేవు’ అని అన్నారు. మరోవైపు, రాహుల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘జన్ ఘోషణా పత్ర’ విడుదల చేశారు. ఇందులో రైతు రుణమాఫీతోపాటు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
మేనిఫెస్టోలో ఉండాల్సిందే!
రాజస్తాన్‌లో రాజకీయ పార్టీలకు విద్యార్థులు (18 ఏళ్ల లోపు వారే) తమ డిమాండ్ల చిట్టాను ఇచ్చారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తమ డిమాండ్లను ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. ఓటు హక్కు లేదని తమ డిమాండ్లను చిన్న చూపు చూడొద్దని.. భవిష్యత్ ఓటర్లుగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ డిమాండ్లకు జైపూర్‌లో జరిగిన ‘దశమ్’ కార్యక్రమం వేదికైంది. రాష్ట్ర విద్యా హక్కు చట్టం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా 18 ఏళ్ల లోపువారే. వీరంతా కలిసి కూర్చుని పలు డిమాండ్లు రూపొందించారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల సరఫరా, స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం, గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడం వంటి అంశాలున్నాయి. పలు అంశాలతో ఓ బుక్‌లెట్‌ను రూపొం దించి.. దీన్ని కార్యక్రమానికి హాజరైన అన్ని పార్టీల ప్రతినిధులకు అందించారు. వీటిని పార్టీలన్నీ తమ మేనిఫెస్టోల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థి ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఈ అంశాలపై చర్చించాలని కూడా నిర్ణయించారు. రాజస్తాన్ జనాభాలో 41% మంది 18 ఏళ్ల లోపు వారే. వచ్చేసారి వీరి ఓట్లే పార్టీలకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్లపై ఆచితూచి స్పందించాల్సిందే. అక్కడ మహిళ గెలవలేదు! రాజస్తాన్‌లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి నేటి వరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా గెలవలేదు. హదోటీ ప్రాంతంలోని ఈ ఆరు చోట్ల 1952 నుంచి ప్రతిసారీ పురుష ఓటర్లే గెలుస్తూ వస్తున్నారు. ఇవి కోటా (ఉత్తర), కోటా (దక్షిణ), పిపాల్దా, బరన్, అంతా, అత్రు, మనోహర్ థానా, కేశోరాయ్ పటన్ నియోజకవర్గాలు. అయితే ఇక్కడ మహిళలు పోటీ చేయలేదా అంటే.. అదీ కాదు. ప్రతిసారీ కనీసం ఇద్దరు, ముగ్గురు మహిళలు పోటీలో ఉంటూనే ఉన్నా గెలవడం లేదు. ‘ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు కానీ.. వారికి సీట్లు మాత్రం ఇవ్వడం లేదు. అవన్నీ పురుషాధిక్య పార్టీలే’ అని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. హదోటీ ప్రాంతంలోని 18 నియోజకవర్గాల్లో మొత్తం మీద ఇప్పటివరకు కేవలం పదంటే పదిమంది మహిళలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో ప్రస్తుత సీఎం వసుంధరా రాజేనే నాలుగుసార్లు విజయం సాధించారు. -
నాణేలు.. ‘పది’వేలు
మధ్యప్రదేశ్‌లో నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్‌గా 10 వేల ‘రూపాయి’ బిల్లలు(నాణేలు) చెల్లించి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు దీపక్ పవార్ అనే అభ్యర్థి. ఇండోర్–3 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్వర్ణిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవార్ నామినేషన్ పత్రాలతోపాటు ఓ సంచీలో ఒక రూపాయి నాణేలు పదివేలు తీసుకువచ్చారు. వీటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక చివరకు...ఐదుగురు సిబ్బందితో దాదాపు 90 నిమిషాల పాటు నాణేలు లెక్కించారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశ్వత్ శర్మ మాట్లాడుతూ ‘నామినేషన్‌కు అఖరు తేదీ కావడంతో పవార్ చెల్లించిన 10 వేల రూపాయి బిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. వాటిని మా సిబ్బంది లెక్కించారు. నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించిన రశీదును ఆయన ఇచ్చాం’ అన్నారు. ఇంతవరకు ఎన్నికల నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎవరూ ఇలా రూపాయి నాణేలను ఇవ్వలేదన్నారు. పదివేల రూపాయి నాణేలు ఇవ్వడంపై అభ్యర్థి దీపక్ పవార్ మాట్లాడుతూ ..‘నేను విరాళాల ద్వారా స్వీకరించిన మొత్తం రూపాయి నాణేలే. అందుకే అవే సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాను’ అని చెప్పకొచ్చారు. ‘బుధ్నీ’కా రాజా! మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా బుధ్నీ నియోజవకర్గం.. ఆ రాష్ట్ర సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌కు పెట్టని కోట. 1990లో ఇక్కడినుంచే ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాజ్‌పేయి తప్పుకోవడంతో ఖాళీ అయిన విదిశ ఎంపీ స్థానం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1996, 1992, 1999, 2004ల్లో విదిశ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2006లో బుధ్నీ నుంచే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత రాజ్‌కుమార్ పటేల్‌పై 36వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008లో (41వేల మెజారిటీ), 2013లో (84వేలు)నూ బుధ్నీలో సాధించిన ఘన విజయంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. -
అర్బన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ వత్తాసు
జగ్దల్పూర్: ఆదివాసీ యువత జీవితాల్ని నాశనం చేసిన అర్బన్ నక్సలైట్లకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ గిరిజన తెగల సంస్కృతిని హేళనచేసిందని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్తర్‌లోని జగ్దల్పూర్లో ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. మావోల సమస్యను సాకుగా చూపి గత ప్రభుత్వాలు బస్తర్ అభివృద్ధికి చొరవ చూపలేదన్నారు. నక్సల్స్‌ను దుష్ట మనసు కలిగిన రాక్షసులుగా అభివర్ణించిన మోదీ...బస్తర్‌లో బీజేపీ కాకుండా ఎవరు గెలిచినా ఆ ప్రాంత అభివృద్ధి కలలకు విఘాతం కలుగుతుందన్నారు. ఇటీవల ఛత్తీసగఢ్లో మావోల దాడిలో మరణించిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూకు నివాళులర్పించారు. వాళ్ల దృష్టిలో ఓటుబ్యాంకే.. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనుల గురించి మాట్లాడే కాంగ్రెస్ వారిని మనుషులుగా కాకుండా ఓటుబ్యాంకుగానే చూస్తోందని మోదీ విమర్శించారు. ‘ఆదివాసీల సంప్రదాయాల్ని కాంగ్రెస్ ఎందుకు హేళన చేసిందో నాకు అర్థం కాలేదు. ఓసారి ఈశాన్య భారత్‌లో జరిగిన కార్యక్రమంలో ఆదివాసీల సంప్రదాయ తలపాగా ధరించినప్పుడు కాంగ్రెస్ నాయకులు నా వేషధారణను చూసి నవ్వుకున్నారు. ఇది ఆదివాసీల సంప్రదాయాలను అవమానించడమే. ఏసీ గదుల్లో ఉంటూ తమ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్న అర్బన్ నక్సలైట్లు స్థానిక యువతను రిమోట్ కంట్రోల్‌గా వాడుకుంటున్నారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంటే, కాంగ్రెస్ మద్దతిస్తోంది’ అని అన్నారు. మరోవైపు, సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక అయిన ‘భాయ్ దూజ్’ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మేమే నక్సల్స్ బాధితులం: కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్లకు కాంగ్రెస్ మద్దతిస్తోందన్న మోదీ వ్యాఖ్యలను ఆ పార్టీ తిప్పికొట్టింది. 2013లో నక్సల్స్ హింసలో కాంగ్రెస్ 25 మందికి పైగా నాయకుల్ని కోల్పోయిందని తెలిపింది. నక్సలిజం సమస్యను పరిష్కరించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోదీ తనకే సొంతమైన ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. మోదీ అసమ్మతిని సహించలేరని, ఆయన విధానాల్ని ప్రశ్నించినవారిని జాతి వ్యతిరేకులు, అర్బన్ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. -
ఔరా.. హీరా!
ఆయనో 35 ఏళ్ల యువకుడు. దీనికితోడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. ఆకర్శణీయమైన జీతం, ప్రశాంతమైన జీవితం. కానీ ఏదో వెలితి. తన వర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదన. వెరసి ఆరేళ్ల ప్రయత్నం తర్వాత రాజకీయ పార్టీ పుట్టింది. ఆదివాసీల్లో పట్టు సంపాదించి.. ఇప్పుడు ఏకంగా గిరిజనుడు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆ యువకుడు దూసుకెళ్తున్నాడు. ఇది ఏయిమ్స్ రుమటాలజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ అలావా గురించిన ఇంట్రడక్షన్. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన హీరాలాల్.. స్థానికంగా ఉండే ’భిల్’ అనే ఓ గిరిజన తెగకు చెందిన యువకుడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదిగినా.. తన ఊరికి, గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదనే కారణంతో కార్యాచరణ ప్రారంభించాడు. మొదటగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించిన హీరాలాల్.. ఇప్పుడు జై ఆదివాసీ యువ శక్తి (జేస్)అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసేందుకు రిజిస్ట్రేషన్ సంబంధింత సాంకేతిక అడ్డంకులు ఎదురవడంతో.. ప్రస్తుతానికి కాంగ్రెస్ సహకారంతో ఆయన ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే.. చట్టసభల్లో గిరిజన ప్రతినిధుల సంఖ్య పెరగటం, గిరిజనుడిని మధ్యప్రదేశ్‌కు సీంను చేయడమే జేస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరేళ్ల ‘ఫేస్బుక్’ పోరాటం కొడితే గట్టి దెబ్బే కొట్టాలనే సూత్రాన్ని డాక్టర్ హీరాలాల్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తన సత్తా చాటేందుకు ఆరేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘యువ శక్తి’పేరుతో ఫేస్బుక్ పేజీ రూపొందించి.. గిరిజనుల చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ లేకపోవడం, నిర్వాసితులవుతున్న గిరిజనులు, ఆదీవాసీల కోసం స్కూళ్లు లేకపోవడం, పౌష్టికాహారలోపం తదితర అంశాలను ఆ ఎఫ్బీ పేజీలో ప్రస్తావించేవారు. ‘ఈ పేజీకి ఆదీవాసీ యువతలో మంచి గుర్తింపు వచ్చింది. 2013, మే 16న బద్వానీ గ్రామంలో ఏర్పాటుచేసిన ఫేస్బుక్ పంచాయతీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి మా పేజీని ఫాలో అయ్యేవారు చాలా మంది హాజరయ్యారు. చాలా అంశాలపై ఆరోజు ఆసక్తికర చర్చ జరిగింది. అదే ఏడాది ఇండోర్‌లో అంతర్జాతీయ ఫేస్బుక్ పంచాయతీని నిర్వహించాం’ అని హీరాలాల్ పేర్కొన్నారు. -
జై వాజ్‌పేయి!
రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలే. ఒకరిది సుదీర్ఘ రాజకీయానుభవమైతే.. మరొకరిది మాజీ ప్రధాని కుటుంబం. వీరిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకరు వాజ్‌పేయి శిష్యుడు ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ కాగా.. మరొకరు వాజ్‌పేయి అన్న కూతురు కరుణ శుక్లా. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందన్‌గావ్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇద్దరికీ వాజ్‌పేయితో ఉన్న ఆత్మీయత కారణంగా.. ఆయన వారసత్వం తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. రాజ్‌నందన్‌గావ్ ప్రచారంలో వాజ్‌పేయి పేరే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది. తన గురువు, తమ పార్టీ నేత వాజ్‌పేయి అని సీఎం రమణ్‌సింగ్ ప్రచారం చేసుకుంటుంటే.. కాంగ్రెస్ అభ్యర్థి, వాజ్‌పేయి అన్నకూతురు కరుణ శుక్లా కూడా వాజ్‌పేయినే తమ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తనే వాజ్‌పేయికి అసలైన వారసురాలినంటున్నారు. మాజీ ప్రధాని పేరును వినియోగించుకునే హక్కు బీజేపీకి లేదని ఆమె విమర్శిస్తున్నారు. వాజ్‌పేయి ఆదర్శాలను తూచ తప్పకుండా పాటిస్తానని.. మహనీయుడి ఆదర్శాలను బీజేపీ గాలికొదిలేసిందని మండిపడుతున్నారు. ‘బీజేపీ భావజాలం, మార్గం అన్నీ మారిపోయాయి. ఇది ఎంతమాత్రం వాజ్‌పేయి, అడ్వాణీలు నడిపిన పార్టీ కాదు’ అని శుక్లా తన ప్రసంగాల్లో విమర్శిస్తున్నారు. వాజ్‌పేయి బోధనలు తన రక్తంలో ఉన్నాయంటున్నారు. తనతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిస్తే నీతివంతమైన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలు బీజేపీలో ఉన్న కరుణ 2013లో పార్టీని వీడారు. 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రమణ్‌పై కరుణను కాంగ్రెస్ బరిలో దించింది. రాజ్‌నందన్‌గావ్‌లో రమణ్ సింగ్, కరుణ శుక్లాలు ఎదురెదురు ఇళ్లలో ఉండటం విశేషం. హమారా రమణ్! అయితే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రమణ్ సింగ్‌పై సానుకూలంగానే ఉన్నారు. రాష్ట్రాన్ని ఈయన అభివృద్ది చేశారని మధ్యతరగతి విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అది రమణ్ సింగ్ వల్లేనని స్థానికులంటున్నారు. అయితే జీఎస్టీ, నోట్ల రద్దుతో స్థానిక వ్యాపారుల్లో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. -
మిజోష్.. ఎవరిదో?
1972 నుంచి 1984 వరకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మిజోరం 1987లో రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు రెండేళ్లకు ఎన్నిక అనివార్యం కాగా.. 1989 నుంచి వరుసగా ఐదేళ్లకోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటినుంచి మొత్తం ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ నాలుగుసార్లు (20 ఏళ్లు), మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎమ్మెన్‌ఎఫ్) రెండుసార్లు (పదేళ్లు) అధికారంలో ఉన్నాయి. మొదట్నుంచీ మిజోరంలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీలుగానే కొనసాగింది. అయితే ఈసారి బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో బలంగానే పనిచేస్తుండటం అధికార కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. ఇది మిజోరంలో బీజేపీకి సంస్థాగతంగా బలం పెద్దగా లేకపోయినా.. వరుసగా ఈశాన్య రాష్ట్రాల్లో కమలానికి పెరుగుతున్న పట్టు మిజోరానికీ పాకితే ఏం చేయాలనేదే అసలు ప్రశ్నగా మారింది. 25 ఏళ్లుగా బీజేపీకి భంగపాటే! 1993 నుంచి ప్రతిసారీ బీజేపీ మిజోరంలో పోటీ చేస్తూనే ఉంది. అయినా ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మిజోరంలో అధిక జనాభా అయిన క్రైస్తవులు.. బీజేపీని హిందుత్వ పార్టీగానే చూస్తున్నారు. తమది హిందుత్వంతో కూడిన మైనారిటీ అనుకూల పార్టీ అని కమలనాథులు చెప్పుకుంటున్నారు. దీన్నే ఆయుధంగా మలుచుకున్న కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. మిజోరం సీఎం లాల్ థన్వాలా (మంచి నేతగా పేరుంది) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం బీజేపీకి అంత సులభమేం కాదని పరిశీలకులంటున్నారు. కాంగ్రెస్‌కూ అంత వీజీయేం కాదు ఈ సారి ఎన్నికలు కాంగ్రెస్‌కు కూడా గట్టి పరీక్షేనని విశ్లేషకులంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రహదారులు వంటి మౌలిక సదుపాయాల లేమి, మద్య నిషేధాన్ని ఎత్తేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ప్రజలకు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ రెండు దఫాలు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో రోడ్లు కాస్తంత కూడా మెరుగుపడలేదు. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెన్ఎఫ్లో చేరుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఎమ్మెన్‌ఎఫ్, నేషనల్‌పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), మిజో పీపుల్స్ కన్వెన్షన్ (ఎంపీసీ) వంటి ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. అయితే ఇవి బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ముప్పుగా మారాయి. బీజేపీ: ఈశాన్య భారతంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి పట్టులేని ఏకైక రాష్ట్రం మిజోరం. అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో సొంతగా.. మేఘాలయ, నాగాలండ్‌లో సంకీర్ణంలో బీజేపీ అధికారంలో ఉంది. త్రిపురలో కామ్రేడ్ల కంచుకోట ‘సర్కార్’ను గద్దెదింపి అధికారం చేపట్టింది. కానీ.. ఇప్పటివకు బీజేపీ పట్టుకు చిక్కని మిజోరం ఇకనైనా ఆ అవకాశాన్నిస్తుందా? క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండే మిజోల గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందా? కాంగ్రెస్ ముక్త్ ఈశాన్య భారత్ నినాదంలో బీజేపీ విజయం సాధిస్తుందా? కాంగ్రెస్ బొమ్మతో: ఈశాన్య భారతంలో ఒక్కోరాష్ట్రంలో పట్టుకోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో బలమున్న రాష్ట్రం మిజోరం మాత్రమే. ఇప్పటికే ప్రాంతీయ పార్టీ అయిన ఎమ్మెన్‌ఎఫ్ జోరును తట్టుకుని నిలబడుతున్న హస్తానికి.. బీజేపీ నుంచీ పోటీ తోడయితే పరిస్థితేంటి? క్రిస్టియన్ ఓటుబ్యాంకుపైనే నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలదా? నాలుగుసార్లు అధికారంలో ఉన్నందున క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును కాపాడుకోగలదా? బీజేపీ హిందుత్వ ట్యాగ్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? కీలకాంశాలు ♦ అత్యంత కీలకమైన అంశంగా మద్యనిషేధం ♦ బీజేపీ గెలిస్తే హిందూ రాష్ట్రంగా మారుస్తారంటూ కాంగ్రెస్ ఆరోపణలు ♦మిజోరంలో చక్మాల జనాభా 90 వేలు. వీరికి టికెట్లు ఇవ్వొద్దంటూ మిజోరం ఎన్జీవో సమితి హెచ్చరికలను బేఖాతరు చేసిన అన్ని పార్టీలు. ♦ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ♦ బీజేపీలో చేరిన మిజో అసెంబ్లీ స్పీకర్ హిఫే, మాజీ మంత్రి బీడీ చక్మా, మరో సీనియర్ నేత, చక్మాల నేత బుద్ధధన్ చక్మా ♦ఎమ్మెన్ఎఫ్లోకి కాంగ్రెస్ నేతల వలసలు ఎవరి ధీమా వారిదే! రైతులకు అవసరమైనంత సాగుభూమిని పంపిణీ చేసే న్యూలాండ్స్ యూజ్ పాలసీ (ఎన్నెల్యూపీ)ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. 2008 నుంచి కాంగ్రెస్ ఈ పథకాన్ని అమలుచేస్తోంది. దీనికి దీటుగా ఎమ్మెన్‌ఎఫ్ సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఈడీపీ) పథకాన్ని తెరపైకి తెచ్చింది. బీజేపీ తరపున ఆ పార్టీ చీఫ్ అమిత్ షాయే నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే.. మెజారిటీలైన క్రైస్తవులను ఆకట్టుకునేలా ఆర్థిక విధానాలు ప్రకటించారు. హిందుత్వ ముద్రను తొలగించుకునేందుకు బీజేపీ ఇద్దరు పాస్టర్లకు టికెట్లు ఇచ్చింది. -
అర్బన్ నక్సల్స్‌కు కాంగ్రెస్ అండ..
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.చత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పే కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. అర్బన్ మావోయిస్టులు ఏసీ గదుల్లో కూర్చుని, పెద్ద కార్లలో తిరుగుతుంటారని, వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే పేద ఆదివాసీ యువకుల జీవితాలను మాత్రం వారు నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అర్బన్ నక్సల్స్‌ను కాంగ్రెస్ ఎందుకు సమర్ధిస్తోందని ప్రధాని నిలదీశారు. బీజేపీ అందరినీ సమదృష్టితో చూస్తుందని, లింగ, కుల ప్రాతిపదకిన ఎవరి పట్లా వివక్ష ప్రదర్శించదని పేర్కొన్నారు. జగదాల్పూర్లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రదాని ప్రసంగిస్తూ బస్తర్ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడిఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా చత్తీస్‌గఢ్ అభివృద్ధిపై దృష్టిసారించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం మాటల పార్టీయేనని ఆచరణలో ఆ పార్టీ చేసేది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలు, పేదలు, దళితులను కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తుందని, కానీ వాజ్‌పేయి మాత్రం ఆదివాసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. -
బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అభ్యర్థిత్వం దక్కలేదని కంటతడి పెట్టిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సర్తాజ్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ గురువారం వెల్లడించిన అభ్యర్ధుల మూడో జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన సింగ్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. హోషంగాబాద్ జిల్లా సియోని మాల్వా నుంచి రెండు సార్లు ప్రాతినిథ్యం వహించిన 77 ఏళ్ల సింగ్‌కు వయోభారం కారణంగా టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. పార్టీ నిర్ణయం పట్ల మనస్ధాపం చెందిన సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించిన మీదట భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు. అయితే అనూహ్యంగా సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి తీపికబురు అందింది. బీజేపీ సీనియర్ నేతలను కరివేపాకులా తీసిపారేస్తోందని, అందుకు అద్వానీయే సంకేతమని ఆ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రతినిధి భూపీందర్ గుప్తా అన్నారు. సింగ్‌కు హోషంగాబాద్ నుంచి తమ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
గిరిజనేతరులు ఎటు?
సాక్షి, ఆసిఫాబాద్ : గిరిజన ఖిల్లాలో గిరిజనేతరుల ఓటు బ్యాంకు అభ్యర్థుల గెలుపోటములకు కీలకం కానున్నాయి. జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల పరిధిలో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నా రు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో వీరి మొగ్గు ఎటువైపు ఉంటే అటు విజయావకాశాలు ఎక్కువ. దీంతో గిరిజనేతరుల ఓటుబ్యాంకు కోసం అన్ని రాజకీయ పార్టీలు వారిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాయి. అయితే వీరంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో ప్రస్తుతం కొత్త జాబితా ప్రకారం మూడున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎస్టీ ఓటర్లు సగం వరకు ఉంటే, అందులో ఎస్సీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలు దాదాపు సగానికి పై గా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ వర్గాల ఓటుబ్యాంకు అభ్యర్థుల గెలుపునకు కీలకం కానుంది. అవకాశాలు తక్కువ.. జిల్లాలో ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో, జనరల్ స్థానమైన సిర్పూర్ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గూడేల్లో ఇక్కడి గిరిజనులతో మమేకమై జీవనం సాగిస్తున్న గిరిజనేతరులకు మైదాన ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు తక్కువ. అన్నింటా ఎస్టీ రిజర్వుడు ఉండడంతో ఇక్కడి వారికి సౌకర్యాలు అంతంతే. భూ యాజమాన్యం 1/70 చట్టం ప్రకారం 1970 కంటే ముందున్న సాగు భూములకు మాత్రమే యాజమాన్యం బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేకమంది గిరిజనేతరలు జిల్లావ్యాప్తంగా ఉన్నప్పటికీ వారు కేవలం సాగుదారులుగా మిగులుతారు కానీ పట్టా పొందే అవకాశం లేదు. భూ క్రయ విక్రయాలు జరిగే అవకాశం కూడా లేదు. గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని జైనూర్, సిర్పూర్(యూ) మండలాల్లో గిరిజనేతరులకు పహాణీలు పంపిణీ చేయడంతో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. దీంతో వెంటనే రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గారు. ఇక అనాదిగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి రాజకీయ అవకాశాలు తక్కువే కాబట్టి రిజర్వు స్థానాల్లో వీరంతా ఓటుబ్యాంకుగానే మిగిలిపోయారు. ఇటీవల పూర్వం నుంచి ఈ ప్రాంతంలో ఉండే గిరిజనేతరులకు కూడా అవకాశాలు కల్పించాలని డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకే అన్నింట్లో మొదటి ప్రాధాన్యత ఉండడంతో గిరిజనేతరులకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే వీరి ఓటుబ్యాంకు మాత్రం రానురాను పెరుగుతూ ప్రస్తుతం ఎస్టీలతో సమాన స్థాయికి చేరింది. ఉదాహరణకు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో గిరిజనేతరులు ఎక్కువ. ఇక్కడ గత కొన్నేళ్లుగా వలసలు పెరగడంతో ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గిరిజనేతర ఓటుబ్యాంకుపై దృష్టి పెట్టాయి. కుల సంఘాలకు తాయిలాలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీ అభ్యర్థులు తాయిలాలకు తెరలేపారు. గిరిజనేతరుల్లో అధికంగా ఉన్న బీసీల్లో ఒక్కో కుల సంఘాల నాయకులతో చర్చలు జరిపి సంఘ భవనాలు నిర్మిస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఇక ఎస్సీలు, మైనార్టీలను కూడా ఇదే తరహాలు కమ్యూనిటీ హాళ్లు, కులవృత్తులకు ప్రోత్సాహాకాలు, కుల సంఘ భవనాలు నిర్మించి ఇస్తామంటూ గాలం వేస్తున్నారు. కులసంఘాలు డిమాండ్ల మేరకు పార్టీలు తమ మేనిఫెస్టోల రూపకల్పనలో కూడా పలు అంశాలను చేర్చేలా అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వరకు గిరిజనేతర ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. జిల్లాలో జనాభా (సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం) మొత్తం జనాభా 5,39,579 ఎస్టీలు 1,59,817 ఎస్సీలు 86,829 బీసీలు 2,35,205 ఇతరులు 57,728 మైనార్టీలు 49,304 -
మోదీ పాలనకు రిఫరెండం కాదు..
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్‌లో వరుసగా నాలుగోసారి బీజేపీ ప్రభుత్వమే కొలువుతీరుతుందని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు రిఫరెండంగా చూడటం సరికాదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై కొద్దిపాటి ప్రభావం చూపుతాయని అంగీకరించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. రైతులకు ఇప్పటికే వడ్డీరహిత రుణాలను అందచేశామన్నారు. వ్యవసాయ రంగంలో, ప్రజాపంపిణీ విభాగంలో తాము చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం పట్ల సానుకూల పవనాలు వీస్తున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న క్రమంలో రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని విపక్షాలు పేర్కొంటున్నాయి. -
బీజేపీలో చేరిన మిజోరం స్పీకర్ హైఫీ
ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత హైఫీ(81) సొంత పార్టీకి షాకిచ్చారు. ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్పీకర్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హైఫీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ స్పీకర్ లాల్‌రినవ్మకు హైఫీ సోమవారం తన రాజీనామాను సమర్పించగా, ఆయన ఆమోదించారు. స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లా కౌన్సిళ్ల అధికారాలను పెంచేందుకు కేంద్రం అంగీకరించడంతో బీజేపీ లో చేరినట్లు హైఫీ తెలిపారు. హైఫీ అసెంబ్లీకి ఏడుసార్లు ఎన్నికయ్యారు. -
‘న్యూటన్’ కంటే ముందే.. ఓ హీరో!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగిందనే అంశంపై తీసిన ‘న్యూటన్’ సినిమా గుర్తుంది కదా.. ఎన్ని కష్టాలొచ్చినా, చివరకు మావోయిస్టులు ఎదురైనా.. హీరో రాజ్ కుమార్ రావ్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎన్నికలు నిర్వహించిన తీరుతో ఈ చిత్రం 2018 సంత్సరానికి భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇప్పుడెందుకు ఈ సంగతి అనేగా మీ అనుమానం.. సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే 2013 ఎన్నికల సమయంలో దంతేవాడ జిల్లాలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడు మంగల్ కుంజం కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ మవోయిస్టులు తీవ్రంగా హెచ్చరించి వదిలేయడంతో.. చావుతప్పి కన్నులొట్టబోయి సైలెంటయ్యాడు. 2013లోనూ ఇప్పటిలాగే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే కుంజం మాత్రం ఈ హెచ్చరికలను బేఖాతను చేస్తూ.. ఘమియాపల్ పంచాయతీ (20 తండాలు)లో ఊరూరా తిరిగి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేశాడు. పోలీసులు రక్షణ కల్పిస్తామన్నా ఎవరూ ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ప్రాతంలోని 68% నియోజకవర్గాల్లో ఒక్క ఓటు కూడా నమోదవలేదు. మిగిలిన చోట్ల 20 ఓట్ల కన్నా ఎక్కువ రాలేదు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కుంజంను స్థానిక దళ కమాండర్ పిలిపించి బెదిరించాడు. మరోసారి ఈ తప్పుచేయనని కుంజం బతిమాలుకోవడంతో.. తీవ్రంగా హెచ్చరించి వదిలిపెట్టాడు. నాటి ఘటనను కుంజం గుర్తుచేసుకుంటూ.. ‘పోలీసులు ఎన్నికల వరకే ఉంటారు. ఆ తర్వాత మా పరిస్థితేం కావాలి. అందుకే మావోయిస్టులు చెప్పినట్లుగా ఈసారి మేమెవరమూ ఓటేయబోం’ అని ఆవేదనగా చెప్పాడు. అక్కడ మాత్రమే బీజేపీతో దోస్తీ ! కేంద్రంలోని ఎన్డీయేలో లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ కీలకమైన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ వ్యవహారాలు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బిహార్‌లో కుదిరిన పొత్తుల్లోనూ ఈ పార్టీకి తగిన∙గౌరవం ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే అదంతా అక్కడి లెక్కేనని.. రాజస్తాన్‌లో మాత్రం తమ దారివేరని ఎల్జేపీ తేల్చేసింది. బీజేపీతో పొత్తుల విషయం తేలకపోవడంతో మొత్తం 200 సీట్లలో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. బిహార్‌లో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో ఎల్జేపీకి మంచి పట్టుంది. అయితే ఈ దళితుల ఓట్లపైనే ఆధారపడి రాజస్తాన్‌లో పోటీచేయాలనేది ఈ పార్టీ ఆలోచన. అయితే.. దళితుల ఓట్లను చీల్చి బీజేపీకి మేలుచేయడమే పాశ్వాన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నోటా మీట దడదడ!
పుట్టిన తొలి ఏడే నోటా హీటెక్కించింది. రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో అధికార, విపక్షాలకు చుక్కలు చూపించింది. 2013 ఎన్నికల్లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నోటా ఓట్ల పరంగా బీజేపీ, కాంగ్రెస్, ఓ ప్రాంతీయ పార్టీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. అందుకే ఈ నోటాపై ఇప్పుడు రాజకీయపార్టీల్లో ఆందోళన మొదలైంది. 2013 రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి 45.2%, కాంగ్రెస్‌కు 33.1% ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్ల జాబితాలో మూడోస్థానంలో స్వతంత్రులు (8.2%), ఇటీవలే ఎన్పీపీ (4.3%), బీఎస్పీ (3.4%)లు నాలుగైదు స్థానాల్లో నిలవగా.. నోటా 1.9% ఓట్లతో (5,90,000 ఓట్లు) ఐదో స్థానంలో నిలిచింది. నోటాకన్నా జాతీయ పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎంలకు తక్కువ ఓట్లు వచ్చాయి. 58 పార్టీలు పోటీచేసిన ఈ ఎన్నికల్లో.. 54 పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో.. ఛత్తీస్‌గఢ్ గత ఎన్నికల్లో మూడోవంతు సీట్లలో నోటా మూడోస్థానంలో నిలవడమే ఇందుకు కారణం. 17 చోట్ల తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కన్నా నోటా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. నోటా ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయికి చేరాయి. అందుకే ప్రధాన పార్టీలు తటస్థ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. 17 నియోజకవర్గాల్లో నోటాకు 5వేలకన్నా ఎక్కువ ఓట్లొచ్చాయి. మొత్తంమీద 1.3 కోట్ల ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి 41%, కాంగ్రెస్‌కు 40% ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా నోటా 3.1% (4లక్షలు)ఓట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా ఓ ఆర్టీఐ కార్యకర్త ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆయన నోటా ఓట్లను సరిగ్గా వాడుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. -
వెల్లుల్లి మసాలా దంచుడా!
ఉల్లి ధరలు ఆకాశాన్నంటినపుడు సామాన్యుడి కడుపు మండి.. ప్రభుత్వాలు కుప్పకూలిన ఘటనలు గుర్తున్నాయ్ కదా.. ఇప్పుడు వెల్లుల్లి ధర తగ్గడం అదే తరహాలో ఘాటెక్కిస్తోంది. వ్యవసాయం, రైతు సమస్యలే ప్రధాన ప్రచారాస్త్రంగా సాగుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్ఎన్నికల్లో అధికార పక్షాలను గార్లిక్ గజగజ వణికిస్తోంది. పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్తాన్ ప్రాంతాల్లో ప్రధాన పంట అయిన వెల్లుల్లి ధర అమాంతంగా కిలో రూపాయి, రెండ్రూపాయలకు పడిపోవడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించినప్పటికీ.. రాజస్తాన్‌లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సంతోషం ఆవిరైన వేళ పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం, తూర్పు రాజస్తాన్‌లోని హదోటీ ప్రాంతాల్లో వెల్లుల్లి ప్రధాన పంట. దేశ వెల్లుల్లి ఉత్పత్తిలో 45% ఈ ప్రాంతాలనుంచే వస్తుంది. రెండేళ్ల క్రింది వరకు ఈ రైతులు సంతోషంగా ఉండేవారు. పంటకు తగిన గిట్టుబాటు ధరతో సమస్యల్లేకుండా ఉన్నారు. అయితే.. 2017 మార్చి నుంచి ఈ రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. పంటను తీసుకుని మార్కెట్‌కు తీసుకొచ్చే సరికి రేటు పడిపోయిందనే సమాచారం. సర్లే.. రెండ్రోజుల్లో అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ.. అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో పెట్టుబడికి రెండు, మూడు రెట్ల నష్టంతోనే వెల్లుల్లిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఏడాదిన్నరయినా పరిస్థితిలో మార్పు రాకపోగా.. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. గతేడాది వెల్లుల్లి ధరలు తగ్గేంతవరకు దేశ వెల్లుల్లి ఉత్పత్తిలో 45% వాటా.. ఈ రెండు ప్రాంతాలదే. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2016లో రూ.10వేలకు క్వింటాల్ కొనుగోలు జరిగింది. అంటే కిలోకు రూ.100 అన్నమాట. సీజన్లో అయితే ఈ రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ నాణ్యమైన వెల్లుల్లి సీజన్‌లేని సమయంలోనూ క్వింటాలుకు రూ.13వేలకు మించే పలుకుతుంది. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రూపాయి, రెండ్రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విపక్షాలకు సువర్ణావకాశంగా.. వెల్లుల్లి ధరలు పడిపోవడమే.. విపక్ష కాంగ్రెస్‌కు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ప్రచారం చేసినా.. రాహుల్ వెల్లుల్లి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు కిలో రూ.130గా ఉన్న వెల్లుల్లి ధర.. ఇప్పుడు రూపాయి, రెండు రూపాయలకు పడిపోయిందంటూ గుర్తుచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో రైతు ఆందోళనలు జరగటం.. తదనంతర పరిస్థితుల్లో పోలీసు కాల్పులకు ఆరుగురు అన్నదాతలు మృతిచెందడం గుర్తుండే ఉంది కదా. ఆ ఆందోళనలకు కారణం కూడా ‘వెల్లుల్లే’. 2016 నోట్లరద్దు తర్వాత పరిస్థితుల్లో చాలా దారుణమైన మార్పులు చోటుచేసుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మద్దతు ధర పెంపు, ఇతర ఉద్దీపనల ద్వారా ఇతర పంటలను కేంద్రం ఆదుకున్నప్పటికీ.. వెల్లుల్లి విషయంలో మాత్రం ఎలాంటి ‘ప్యాకేజీ’ అమలు చేయలేదు. రాజేకు గడ్డుపరిస్థితులు రాజస్తాన్‌లోని కోటా పెద్ద వెల్లుల్లి మార్కెట్. ఇక్కడ జూలైలో రూ. 25కు కిలో ఉన్న ధర.. సెప్టెంబర్‌కు రూ.20కి.. ఆ తర్వాత అక్టోబర్ చివరకు ఐదు రూపాయలకు పడిపోయింది. డిమాండ్‌కు మించిన సప్లై కారణంగా ధరలు దారుణంగా తగ్గిపోయాయి. దీంతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. రాజస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో నెలకొన్న నైరాశ్యం ప్రభావం ఈ ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వసుంధరా రాజేపై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిన ఫలితంగా బీజేపీ గద్దె దిగడం ఖాయమంటున్నారు. సినిమా భాషలో చెబితేనే చెవికెక్కుతుంది.. ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం.. ఎన్నికల అధికారుల బాధ్యత. ఇందుకోసం ఒక్కొక్క అధికారి ఒక్కో స్టైల్లో ప్రయత్నిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా ఎన్నికల అధికారి విశేష్ గర్ఫాలే కూడా ఇలాగే వినూత్నమైన పద్ధతిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిమిక్రీ కళాకారుల ద్వారా బాలీవుడ్ స్టార్లు షారుక్, సల్మాన్, అమీర్, అనుష్క శర్మల డైలాగ్‌లతో ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. ‘అధికారులు నిరక్షరాస్యులకు ఒటుపై అవగాహన కల్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఓటు ప్రాముఖ్యత తెలియడం లేదు. ఇందుకోసంబాలీవుడ్ సినిమాల ఫేమస్ డైలాగ్‌లను ఉపయోగించాలని అనుకున్నారు. అలాంటి ఫేమస్ డైలాగుల్లో.. ‘మైనే ఏక్ బార్ కమిట్మెంట్ కర్ ది తో మై వోట్ జరూర్ కర్తాహూ’ (నేను ఒక్క సారి ఓటు వేయాలని కమిటైతే ఓటు వేసి తీరతా), ‘మేరే పాస్ బంగ్లాహై, గాడీహై తుమ్హారేపాస్ క్యా హై’ మేరే పాస్ ఓటర్ కార్డ్ హై!’వంటి డైలాగులతో.. మిమిక్రీ కళాకారులు వీధి ప్రదర్శనలు చేస్తున్నారు’ అని కలెక్టర్ పేర్కొన్నారు. వీటికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ తరహా ప్రచారానికి మరిన్ని వినూత్న ఆలోచనలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ఓ పోటీ నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న వారిలో కొందరు జంగిల్‌బుక్‌లోని కార్టూన్ క్యారెక్టర్స్‌తో అలరించారు. ఈ ప్రదర్శనలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోస్టర్లను అతికించడం ద్వారా మరింత మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముంటుందని గర్పాలే అభిప్రాయపడ్డారు. -
ద్యా..వుడా!
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో బాబాల హడావుడి జోరందుకుంది. కొందరేమో టికెట్లు ఆశించి పార్టీల చుట్టూ తిరుగుతుండా, మరికొందరు కొన్ని పార్టీలకు అనుకూల, వ్యతిరేక ప్రచారాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. స్వామీజీల్లో కొందరు చౌహాన్‌పై అసహనంగా ఉన్నారు. మరికొందరేమో చౌహాన్‌కు జై అంటూ టిక్కెట్ల కోసం యత్నిస్తున్నారు. పార్టీల చుట్టూ బాబాల సందడి పెరగడంతో ఆయా పార్టీల కార్యాలయాల వద్ద మరిన్ని బలగాలు నియమించాల్సి వస్తోంది. ప్రభావం ఎంత ? మధ్యప్రదేశ్ జనాభాలో దాదాపుగా 90శాతం హిందువులే కావడంతో అక్కడ బాబాలకు ఆదరణ ఎక్కువే. అందుకే బాబాల మద్దతు కోసం రాజకీయ నాయకులు వారి ఆశ్రమాల వద్ద క్యూ కడతారు. ఉజ్జయిని, జబల్పూర్, భోపాల్ వంటి పట్టణాల్లో అడుగడుగునా ఆశ్రమాలు కనిపిస్తాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పదేళ్లలో ప్రభుత్వ పాలనపై బాబాల ప్రభావం ఎక్కువైందన్న విమర్శలూ వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. బాబాల సంఖ్య పెరిగిపోవడంతో వారి ప్రభావమూ తగ్గుతూ వస్తోంది. బై బీజేపీ.. బైబై బీజేపీ.. మతగురువులను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. గత ఏప్రిల్‌లో ఒకేసారి ఏకంగా అయిదుగురు బాబాలకు కేబినెట్ హోదా కల్పించింది. కంప్యూటర్ బాబా, యోగేంద్ర మహంత్, నర్మదానంద, హరిహరానంద, భయ్యా మహరాజ్‌కు కేబినెట్ హోదాలు కట్టబెట్టింది. వీరిలో గురువు భయ్యా మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. కంప్యూటర్ బాబా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నర్మదా నదీ తీర ప్రాంతంలో అక్రమ తవ్వకాలను సీఎం ప్రోత్సహిసున్నారని, గోవులకు రక్షణ లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. బరిలోకి దిగుతాం.. దాతియా జిల్లాకు చెందిన పంధోకర్ సర్కార్ ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దూకారు. సాంజీ విరాసత్ పార్టీ పేరుతో 50 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. సంత్ సమాజాన్ని సీఎం తీవ్రంగా అవమానించారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరొక గురువు దేవకినందన్ ఠాకూర్ ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి, రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. చౌహాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు స్వాములేమో బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. బాబా బిపిన్ బిహారి సాగర్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలతో టిక్కెట్ కోసం పైరవీలు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో నేతలు బాబాల కాళ్లు పట్టుకునే దృశ్యాలే కనిపించేవి. ప్రభుత్వమే శంకరాచార్య యాత్ర లాంటివి స్వయంగా జరిపించింది. అలాంటిది ఇప్పుడు బాబాలు టిక్కెట్ల కోసం నేతలతో పైరవీలు చేయించుకోవడం కనిపిస్తోంది. ఇలాంటి దృశ్యం మధ్యప్రదేశ్ రాజకీయల్లో ఇదే మొదటిసారంటూ రాజకీయ పరిశీలకులు అవాక్కవుతున్నారు. కీలక బాబాలు ఆధ్యాత్మిక గురువు శంకరాచార్య స్వరూపానంద సరస్వతికి మహాకోసల ప్రాంతంలో బాగా పట్టు ఉంది. స్వరూపానంద కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన రావత్‌పుర సర్కార్, ఆచార్యదేవ్ ప్రభాకర్ శాస్త్రి దాదాజీ, జాబూ ప్రాంతంలో ఎక్కువ మంది అనుచరగణం ఉన్న స్వామి ఉత్తమ్, రాష్ట్రవ్యాప్తంగా శిష్యులున్న భయ్యాజీ సర్కార్లు ఈ సారి ఎన్నికల్లో కీలకంగా మారారు. కంప్యూటర్ బాబాకు కౌంటర్‌గా స్వామి అఖిలేశ్వరానంద రంగంలోకి దిగారు. గోసంరక్షణ బోర్డు చైర్మనైన ఈ స్వామీజీ ఇటీవల సంత్ సమాగమం పేరుతో సదస్సును ఏర్పాటు చేసి సీఎం చౌహాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. -
అర్థమయ్యేలా చెప్పడానికో పథకం!
రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండంటే రెండే నెలల్లో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తామని కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వాగ్దానం చేశారు. రాజస్తాన్ ఎన్నికల ఇంచార్జ్‌గా ఉన్న జవదేకర్.. జైపూర్‌లోని ఓ మురికివాడలోని ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో ఓ బామ్మ, తాతయ్య దగ్గరికెళ్లి.. ‘బీజేపీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?’అని అడిగారు. దీనికి అటు, ఇటూగా వారు సమాధానం చెప్పడంతో ప్రభుత్వ పథకాల కరపత్రాన్ని అందించారు. అయితే ‘అయ్యా! మేం చదువుకోలేదు. ఇందులో ఏముందో మాకు అర్థం కాదు’అని వాళ్లు సమాధానమిచ్చారు. దీనికి ఒక్క క్షణం ఆలోచించిన జవదేకర్ అక్కడున్న వాళ్ల మనవడు, మనవరాలిని పిలిచి.. నానమ్మ, తాతలకు చదవటం నేర్పించాలని సూచించారు. ‘బడికెళ్తున్న చిన్నారులు.. సమయం దొరికినపుడల్లా నిరక్షరాస్యులైన మీ పెద్దలకు చదువు నేర్చించాలి’అని సూచించారు. ఇందుకోసం రెండు నెలల్లో ఓ పథకాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు. పెద్దలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అక్కడ నీటి కొరతే ప్రతిపక్షం రాజస్తాన్‌లో అజ్మీర్ నగరంలో రెండ్రోజులకోసారి నల్లా నీళ్లొస్తాయి. అదీ అరగంట సేపే. అజ్మీర్ల్ వాసులు.. ఇలా రెండ్రోజులకోసారి నీళ్లు పొందడమే ఓ వైభోగం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్దగా నదుల్లేవు. ఉన్న చిన్నా చితకా వాగులు కూడా ఎప్పుడూ ఎండిపోయే ఉంటాయి. నీటికొరత తీర్చేందుకు ఏ ప్రభుత్వం దీర్ఘకాల కార్యాచరణతో పనిచేయలేదు. ఈసారి కొరత గతంలో కన్నా తీవ్రంగా ఉండటంతో.. నీటికొరతే ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షంగా మారనుంది. 2009లో ఇలాగే తీవ్ర దుర్భిక్షం ఎదురైనపుడు పౌర, కార్మిక సంఘాలు, మార్కెట్ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘నీరివ్వకుంటే ఓటేయబోం’అని ఉద్యమాన్ని లేవనెత్తాయి. ఇది నాటి వసుంధరా రాజే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అజ్మీర్ తాగునీటి అవసరాల కోసమే బీసల్‌పూర్ డ్యామ్ కట్టారు. కానీ ప్రభుత్వం.. రాజకీయ అవసరాల కోసం ఈ నీటిని టోంక్, జైపూర్ నగరాలకు తరలించడం కారణంగానే ఇక్కడ కరువు ఏర్పడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ దర్గా దర్శనం రాజస్తాన్‌లోని మార్వార్ ప్రాంతం పేరు చెబితే బంజరు భూములు, వడగాలులు గుర్తొస్తాయి. కానీ ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు సూఫీ సంస్కృతికి, సాధువులకు అడ్డాగా ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. ముఖ్యంగా నాగౌర్‌లోని 13వ శతాబ్దంనాటి ఖాజీ హమీదుద్దీన్ దర్గా చాలా ఫేమస్. ఇక్కడికి స్థానికంగా ఉండే ఆలయాల పూజారులు సహా అన్ని మతాలను విశ్వసించేవారు వస్తారు. ఎన్నికల సమయంలోనైతే ఈ దర్గా కు వచ్చి దర్శనం చేసుకోని పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు ఉండరనే చెప్పాలి. సుఫీ బాబా పార్టీలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులందరూ క్యూ కడతారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలాగా దీనికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కకపోయినా, ఎన్నికలప్పుడు మాత్రం బాగా సందడి ఉంటుంది. సుఫీ గురువైన ఖాజీ హమీదుద్దీన్ వెజిటేరియన్‌గానే జీవితం గడిపారని ఈ దర్గా సంరక్షకులు చెబుతారు. -
s/o సన్నాఫ్..
మధ్యప్రదేశ్ వారసత్వానికి ఒక లక్షణం ఉంది. అదే పేరు, అదే వంశం,.. ఉంటే చాలు ఏ కాస్త క్వాలిటీ ఉన్నా రాణించేయొచ్చు. రాజకీయాల్లో ఇది ఇంకా ఎక్కువ. మధ్యప్రదేశ్‌లో మరీ ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బడా నేతలంతా పొలిటికల్ పుత్రోత్సాహంతో మురిసిపోతున్నారు. మరి ఈ వారసుల్లో మహావృక్షంగా మారేవారెవరు? మర్రిచెట్టు కింద మొక్కలా మిగిలేవారెవరు? చూడాలి.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి వారసుల జోరు ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్ వరకు అన్ని కుటుంబాల్లో పుత్రోత్సాహం పొంగిపొరలుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే వయసు రాకపోయినా ఈ నయా లీడర్లు వచ్చే ఎన్నికలకు పునాదిగా తండ్రుల నియోజకవర్గాల్లో వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 55 శాతం వరకు 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఉంటే, ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది వృద్ధులే. అందుకే వారసుల్ని రంగంలోకి దింపి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు నేతలు. వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మధ్యప్రదేశ్ అంటేనే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. కొంతమంది మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, మనవలు ఇప్పటికీ వంశం పేరు చెప్పుకునే ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్నారు. రవిశంకర్ శుక్లా కుమారుడు శ్యామ్ చరణ్ శుక్లా, మనవడు అమిత్ శుక్లా, మోతీలాల్ ఓరా కుమారుడు అరుణ్ ఓరా, దిగ్విజయ్‌సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్, దివంగత కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్, ఇలా ఎందరో ఉన్నారు. వీళ్లంతా తండ్రులు, తాతల పేరు చెప్పుకునే రాజకీయాల్లో రాణించారు. ఒకసారి బలపడ్డాక క్రమంగా లీడర్లుగా స్వీయ ప్రతిభ చూపుతున్నారు. చక్రం తిప్పుతున్న సింధియా కుటుంబం సింధియా రాచ కుటుంబం అటు మధ్యప్రదేశ్, ఇటు రాజస్థాన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. విజయ రాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె కుమారుడు, దివంగత నేత మాధవరావు సింధియా భారతీయ జనసంఘ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిపోయారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. విజయ రాజే సింధియా కుమార్తె వసుంధరా రాజె రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ లోక్‌సభ ఎంపీ. కుమార్తె యశోధర రాజె సింధియా మధ్యప్రదేశ్ లో మంత్రిగా ఉన్నారు. నయా లీడర్స్ కార్తికేయ సింగ్ చౌహాన్: ముఖ్యమంత్రిగా పార్టీని ముందుండి నడిపించాల్సిరావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత నియోజకవర్గం బుధ్నీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఈ బాధ్యతల్ని ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఇంకా రాకపోయినప్పటికీ ప్రచారంలో తనదైన ముద్ర చూపుతున్నాడు. బుధ్నీ నియోజకవర్గంలో స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క భోపాల్‌లో పూలు, పాల వ్యాపారాలు చూసుకుంటూనే తండ్రి నియోజకవర్గంలో పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మహానర్యామన్ : కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానర్యామన్కి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. డూన్ స్కూలులో గ్రాడ్యుయేషన్ చేసిన మహానర్యామన్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీకి సెలవులు కావడంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ప్రచార బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు. నకుల్‌నాథ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ కుమారుడు నకుల్ నాథ్. తండ్రి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడే నకుల్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీలో నైట్ లైఫ్‌కు బాగా అలవాటు పడిన నకుల్ ఎన్నికల వేళ మాత్రం భోపాల్‌లోనే ఉంటూ తెగ తిరిగేస్తున్నారు. బోస్టన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన నకుల్ బేతల్ నుంచి పోటీ పడే అవకాశాలున్నాయి. అభిషేక్ భార్గవ్ : మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ కుమారుడైన అభిషేక్ రాజకీయాల్లో బాగా పట్టు సంపాదించారు. రెహిల్ నియోజకవర్గం నుంచి గోపాల్ భార్గవ్ గత ఏడుసార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అభిషేకే తండ్రి తరఫు పొలిటికల్ మేనేజర్‌గా వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచార వ్యూహాలన్నీ అభిషేకే రచించారు. విక్రాంత్ భూరియా: కాంగ్రెస్ నాయకుడు కాంతిలాల్ భూరియా 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కుమారుడు విక్రాంత్ భూరియా తండ్రి నియోజకవర్గమైన రట్లామ్ బాధ్యతలు తీసుకున్నారు ప్రజా సంబంధాలు ఏర్పరచుకొని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తండ్రిని గెలిపించుకున్నారు. పైన చెప్పినవాళ్లే కాకుండా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మంధర్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ వార్గియా కుమారుడు ఆకాశ్ , ప్రజా సంబంధాల శాఖా మంత్రి డా. నరోత్తమ్ మిశ్రా కుమారుడు సుకర్ణ మిశ్రా, ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ కుమారుడు సిద్ధార్థ మాలవీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ తదితరులు సైతం రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వీరిలో పలువురు తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. -
నెగ్గుతామా.. నాథూలాల్‌జీ?
మరు నిమిషం ఏమవుతుందో ఎవరికీ తెలీకపోయినా, తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం తగ్గదు. భవిష్యత్ చెప్పే వాళ్లంటే ప్రజలకు భలే మోజు. చిలక జోస్యుల దగ్గర నుంచి నోస్ట్రడామస్ వరకు ఇందుకే పాపులర్ అవుతుంటారు. రాజకీయ నాయకుల్లో ఈ ఆసక్తి మరీ అధికం. ఎన్నికల వేళ నాయకులకు కాలునిలవదు. గెలుస్తామా, గెలవమా అనే మీమాంసతో జోతిష్యంపై మరింతగా ఆధారపడుతుంటారు. ఇలాంటి నేతలంతా ప్రస్తుతం రాజస్తాన్‌లోని కరోయ్ నగరానికి బారులు తీరుతున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారాకు 20 కి.మీ దూరంలోని చిన్నగ్రామం కరోయ్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల రాజకీయనాయకులు ఈ ఊరికి క్యూ కడుతున్నారు. ఈ ఊర్లో పండిట్ నాథూలాల్ భైరూలాల్ వ్యాస్ అనే 96 ఏళ్ల జ్యోతిష్కుడి కోసం బారులు తీరుతున్నారు. ఎన్నికల సంరంభం ఆరభం కాగానే పార్టీ టికెట్ వస్తుందా? లేదా? అని, షెడ్యూలు వచ్చాక ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని, ఎన్నికల తర్వాత మంత్రి అవుతామా? లేదా? అని తెలుసుకునేందుకు వ్యాస్ వద్దకు వస్తుంటారు. ఆయన లెక్కే వేరు! వ్యాస్ జోస్యంపై పెద్దవాళ్లకు నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల కాలంలో ఈ నమ్మకం మరింత బలపడేందుకు కారణం... ప్రతిభాపాటిల్ సింగ్. దేశంలోనే అత్యున్నత స్థానాన్ని ఆమె అందుకోబోతున్నట్టు ఎవరు ఊహించడానికి ముందే ఆయన తన భవిష్యవాణిలో వెల్లడించారు. నాధూలాల్ను కలుసుకునేందుకు తన భర్త దేవీసింగ్ పటేల్‌తో కలిసి ప్రతిభాపాటిల్ వెళ్లినపుడు ఆమెకు వ్యాస్ ఈ విషయం తెలియజేశారు. ఈ జోస్యం నిజం కావడంతో తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వ్యాస్‌ను ఆమె ఆహ్వానించారు. నాథూలాల్ ప్రాభవం ప్రతిభాసింగ్తోనే మొదలు కాలేదు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబాని కూడా గతంలో వ్యాస్‌ను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వివిధ అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఉండేవాళ్లు. ధీరూభాయ్‌తో పాటు గతంలో యూపీ, ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన అమర్‌సింగ్, ప్రసుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు వ్యాస్ శిష్యబృందంలో సభ్యులుగా ఉన్నారు. పలువురు విదేశీ భక్తులు కూడా ఆయనను కలుసుకునేందుకు వస్తుంటారు. ప్రత్యేకత ఏమిటి? సంస్కృత జ్యోతిష విధానం ‘భృగు సంహిత’లో వ్యాస్ నిష్ణాతులు. ఆయన లెక్క తప్పదని ప్రజల్లో నమ్మకం. భృగు సంహిత ఆధారంగా వ్యాస్ జరగబోయే విషయాలపై రాజకీయశిష్యులకు జోస్యం చెబుతుంటారు. ఆయన చెప్పినట్లు జరుగుతుందనే నమ్మకంతో నేతలు వ్యాస్ చెప్పే సూచనలను, సూచించే పూజలను తప్పక పాటిస్తుంటారు. కేవలం గెలపోటములపై సలహాలే కాకుండా, గెలుపునకు ఏమి చేస్తే బావుంటుంది, ఎలాంటి వ్యూహాలు చేపడితే బావుంటుందన్న దానిపై కూడా సలహాలు తీసుకుంటున్నారు. ‘ సమాజం సాంకేతికరంగంలో అభివృద్ధి సాధిస్తున్నా సాంస్కృతిక మూలాలు మరిచిపోకుండా స్మృతీ ఇరానీ వంటి వారు జ్యోతిషాన్ని నమ్ముతున్నారు. నమ్మకమే వారిని గెలిపిస్తోంది’’అంటారు వ్యాస్. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే కూడా తన శిష్యురాలేనని చెప్పారు. స్మృతీతో పాటు వసుంధర భవిష్యత్ గురించి చెప్పిన జోస్యాలు ఫలించాయని వ్యాస్ చెబుతుంటారు. -
ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య
జైపూర్ : ఎన్నికల వేళ రాజస్థాన్‌లో కలకలం రేగింది. బీజేపీకి చెందిన ఓ నాయకున్ని కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటన ప్రతాప్‌ఘర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. భారతీయ జనతా పార్టీకి చెందిన సామ్రాట్ కుమావత్ ప్రయాణ నిమిత్తం రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో బైకుల వచ్చిన నలుగురు దుండగులు కుమావత్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం కత్తులతో అతనిపై దాడి చేశారు. మెడపై కత్తి వేట్లు పడడంతో తీవ్ర రక్తస్రావంతో కుమావత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని స్థానికులు వెల్లడించారు. చుట్టుపక్కలవారు స్పందించి హంతకుల్ని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారు అక్కడినుంచి ఉడాయించారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. కుమావత్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేశారు. నిందితులని త్వరలోనే పట్టుకుని త్వరలోనే అరెస్టు చేస్తామని ప్రతాప్‌ఘర్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ హామీనివ్వడంతో ధర్నా విరమించారు.మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో ఈ హత్యోదంతం రాజకీయ వేడి రాజేసింది. -
న్యూలుక్.. హైటెక్
ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం. వందల సీట్లకు పోటీ పడే వేల మందిలో గెలుపు గుర్రాలెవరన్నది అంచనా వేయడం అంత సులభం కాదు. అభ్యర్ధిని ఎంచుకోవడం ఒక ఎత్తుకాగా, తిరుగుబావుటా ఎగరేసిన అసంతృప్తులను బుజ్జగించడం మరో ఎత్తు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపికలో ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. పాతవాళ్లను తప్పించడం ఒక పార్టీ వ్యూహం కాగా వివిధ సర్వేలతో ఎంచుకోవడం ఇంకొక పార్టీ పాలసీ. ఎలా ఎంచుకుంటేనేంటి గెలవడమే ముఖ్యమనేది అన్ని పార్టీల కామన్ పాలసీ. ప్రసుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో గెలుపు గుర్రాలను గుర్తించడం కోసం బీజేపీ, కాంగ్రెస్ వివిధ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. యాప్‌తో ఎంపిక ఇంత వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానం అభీష్టం మేరకు జరుగుతూ వస్తోంది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే స్థానిక కార్యకర్తలు భరించాల్సి వచ్చేది. దీనివల్ల చాలా చోట్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతినేవి. రాహుల్ వచ్చాక ఈ పరిస్థితి మారింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నేతల అభ్రిపాయాల మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, దానివల్ల విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నిర్ణయించారు. దీంతో ఈ సారి బూత్ స్థాయి కార్యకర్తల అభిమతం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇందుకోసం శక్తి పేరిట ఒక యాప్‌ను సిద్ధం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలందరూ ఈ యాప్ ద్వారా తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి పంపుతారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇంత వరకు 4 లక్షల మంది ఈ యాప్ ద్వారా అభిప్రాయాలు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌లలో ఇంత వరకు 35,82,595 మంది శక్తి యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, రాజస్థాన్‌లో నూరు శాతం బూత్‌లను కవర్ చేయడం జరిగిందని తెలిపాయి. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల ప్రచారాంశాలుగా వేటిని తీసుకోవాలన్న అంశంపై కూడా బూత్ స్థాయి కార్యకర్త అభిప్రాయాలను తెలుసుకుని వాటి ఆధారంగా ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేయనున్నారు. కొత్త ముఖాలకు టికెట్లు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ఒకటే పాలసీ అనుసరిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం బీజేపీలో ఆనవాయితీ. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను కొంత వరకు అధిగమించవచ్చని కమలనాధుల ఆలోచన. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యూహాన్నే అమలు పరచేవారు. ఈదఫా ఇదే పాలసీని ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 14 మందికి టికెట్ ఇవ్వలేదు. వీరిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. రాజస్థాన్‌లో కూడా ఈ ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇక్కడ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం మందికి ఈ సారి టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది. అయితే కొత్త వాళ్లని పెడితే తప్పనిసరిగా గెలుస్తారన్న హామీ ఏమీ లేదు. సాధారణంగా పార్టీ ఓడిపోతుందని అంచనా ఉన్న నియోజకవర్గాల్లోనే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారు.ఆ అభ్యర్థి నెగ్గితే పార్టీకి అదనపు లాభం వస్తుంది. ఒకవేళ ఓడిపోతే ముందే తెలుసు కాబట్టి పార్టీకి పెద్దగా పోయేదేం లేదు. 2013 ఎన్నికల్లో కొత్త ముఖాలు అందించిన అదనపు విజయం వల్లే బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. గతంలో... - రాజస్తాన్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ న్యూలుక్ వ్యూహాన్ని అమలుపరిచింది, అయితే నూరుశాతం ఫలితం రాలేదు. - 2008 ఎన్నికల్లో బీజేపీ 193 స్థానాల్లో పోటీ చేసింది. వాటిలో 135 చోట్ల కొత్త ముఖాలనే బరిలోకి దింపింది.అయితే, వారిలో 55 మందే గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. - 2013 ఎన్నికల్లో బీజేపీ 92 మంది కొత్తవాళ్లకి టికెట్ ఇస్తే వారిలో 68 మంది నెగ్గారు. ఈ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. -
దళితులే నిర్ణయాత్మకం!
ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ.. ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి బీఎస్పీతో జతకట్టడంతో రాజకీయ ముఖచిత్రం మారింది. ఛత్తీస్‌గఢ్‌లో దళితుల ఓట్లు రానున్న ప్రభుత్వాన్ని నిర్దేశించనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 90 నియోజకవర్గాల్లో 10 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుండగా.. మరో 40 చోట్ల దళితులు నిర్ణాయాత్మక ఓటుగా ఉన్నారు. జోగి, మాయావతిల కూటమిలో సీపీఎం కూడా చేరింది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఉన్న 12% దళితుల ఓట్లను బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు పంచుకుంటూ ఉండేవి. ఇందులో బీఎస్పీ వాటా ఎక్కువగా ఉండేది. అయితే బీఎస్పీతో జతకట్టడంతో ఈ ఓటుబ్యాంకును పూర్తిగా తమ కూటమికి అనుకూలంగా మార్చుకోవాలని జోగి వ్యూహం. కనీసం 13 స్థానాల్లో.. జోగీ, మాయావతి కూటమి ఈ ఎన్నికల్లో కనీసం 13 స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. దళితుల ప్రభావం ఎక్కువగా ఉండే.. జాంగీర్ చంపా, బిలాస్పూర్ ఎంపీ నియోజవర్గాల పరిధిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనేది వీరి వ్యూహం. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రాజకీయ జీవితం (1984లో జంగీర్ చంపా నుంచే గెలిచారు) ప్రారంభించింది కూడా ఈ ప్రాంతంలోనే కావడంతో.. మాయావతి భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2013లో బీఎస్పీ 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఒక్కచోట కూడా గెలుపొందలేదు. రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు, ఈసారి అకల్తారా ప్రాంతం నుంచి అజిత్ జోగి కోడలు రీచా జోగి బీఎస్పీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. ‘మా హృదయాలు ఒక్కటవ్వాలంటే నేను బీఎస్పీ టికెట్‌పై పోటీచేయడమే సరైన నిర్ణయం. అలాగైతేనే దళిత ఓట్లు సంపూర్ణంగా బదిలీ అవుతాయి’ అని రీచా భర్త అమిత్ జోగి పేర్కొన్నారు. బీఎస్పీ బలమేంటి? యూపీలో జాటవ్స్ లాగే ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు బీఎస్పీకి అత్యంత నమ్మకంగా ఉంటారు. అయితే రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థులు బలంగా లేనందున.. ఈ వర్గం మొదట్నుంచీ కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా.. సత్నామీల గురువు బాల్ దాస్‌తో ‘సత్నామీ సేన’ పార్టీని పెట్టించి ఈ వర్గం ఓట్లును భారీగా చీల్చి 10 రిజర్వ్డ్ స్థానాల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకుంది. ఇప్పుడు నేరుగా మాయావతే రంగంలోకి దిగడంతో ఈ స్థానాల్లో బీఎస్పీ పట్టు సంపాదించవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగింది. అయితే ఈ వ్యతిరేక ఓట్లు కూటమిలోని మిగిలిన పార్టీలకు బదిలీ అవుతాయా? లేదా? అన్నదే ఆసక్తికరం. బీజేపీపై వ్యతిరేకత తమకే లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. దళిత ఓట్లు చీలితే మళ్లీ బీజేపీయే గెలుస్తుంది కాబట్టి.. వారంతా తమవెంటే ఉంటారని ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతంలో ఉండే స్వల్ప మార్పును జోగి, మాయావతి కూటమి తీవ్రంగా ప్రభావితం చేయనుందనేది సుస్పష్టం. -
రూపాయికి రూపాయిన్నర!
కాదేదీ కవితకనర్హం అన్నట్లు కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం అంటున్నారు పందేల రాయుళ్లు. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటించగానే పార్టీలు, లీడర్లు, ఓటర్లు, మీడియాతో పాటు బెట్టింగ్ వీరుల జోరు మొదలైంది. షెడ్యూల్ ప్రకటన నుంచి అభ్యర్ధుల ఎంపిక, గెలుపు, ఓటమి, మెజార్టీ ఇలా ప్రతి అంశంపై కోట్ల రూపాయల బెట్టింగులు జరుగుతున్నాయి. పందెంరాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ కాక పుట్టిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు తాజా ఎన్నికలు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్న వేళ పందెంకోళ్లు శివాలెత్తుతున్నాయి. వివిధ సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారు?, ఎంత మెజార్టీ రావచ్చు?, ఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు? అంటూ ప్రతి అంశంపై బెట్టింగ్ వీరులు పందెం కాస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అనుకూలంగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా బెట్స్ నడుస్తున్నాయి. ‘‘మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అందరూ విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్‌కు అవకాశాలు తక్కువ. ఛత్తీస్‌గఢ్‌లో కూడా కమలానిదే వికాసం. రాజస్థాన్ ఒక్కటే కాంగ్రెస్ అనుకూలంగా ఉంది. ఈ ఏడాది ఎన్నికల బెట్టింగ్‌లు క్రికెట్‌ని మించిపోయాయి. అభ్యర్థుల ఖరారైతే మార్కెట్లో జోష్ ఇంకా పెరుగుతుంది. పందెంలో తేడాలు కూడా రావచ్చు’’అని బుకీ ఒకరు చెప్పారు. ఈ సారి బెట్టింగ్‌లకు హైటెక్ హంగులు కూడా అద్దుకున్నాయి. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే కాదు మొబైల్ యాప్స్, వెబ్ సైట్లల ద్వారా కూడా పందేలు కాసే అవకాశం ఉంది. దీంతో కూర్చున్న చోట నుంచి కదలకుండా తమకు ఇష్టమైన పార్టీపై పందెం కాస్తున్నారు. ఆన్లైన్లోనే ఎక్కువగా పందేలు సాగుతూ ఉండడంతో వాటిని కట్టడి చేయడం కూడా పోలీసులకు సవాల్‌గా మారింది. ‘‘ఆన్లైన్ బెట్టింగ్ రూపంలో కేఫ్‌లు, బహిరంగ ప్రదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పందేలు కాస్తున్నారు. అందుకే వారిని పట్టుకోవడం కాస్త కష్టంగా మారింది’’అని మధ్యప్రదేశ్ డిఐజీ ధర్మేంద్ర చౌదరి చెప్పారు. ఆన్లైన్ వ్యవహారాలపైన కూడా ఓ కన్నేసి ఉంచామని ఏ చిన్న క్లూ దొరికినా దాడులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సైబర్ సెల్ మొబైల్ యాప్స్, వెబ్‌సైట్స్‌పై నిరంతర నిఘా పెట్టిందన్నారు. ఇలా బెట్ చేస్తారు.. గెలుస్తుందన్న అంచనాలున్న పార్టీపై పందెం కట్టి గెలిస్తే కేవలం ఒక్క శాతం లాభం వస్తుంది. అదే ఓడిపోతుందన్న పార్టీపై పందెం కట్టి గెలిస్తే వందకు వంద శాతం, ఒక్కోసారి వందకు రెండొందల శాతం చొప్పున లాభం వస్తుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుస్తుందని రూ. 10 వేలు కడితే పందెం రాయుడికి వచ్చే లాభం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. అంటే మొత్తం రూ. 11 వేలు తిరిగి వస్తుంది. అదే కాంగ్రెస్‌పై రూ. 4,400కి పందెం కాస్తే ఏకంగా 10 వేలు చేతికొస్తుంది. అంటే 5,600 రూపాయలు లాభం అన్నమాట. విజయావకాశాలను బట్టి బెట్టింగ్ రేట్లు మారుతుంటాయి. అంతా లాభమేనా... బెట్టింగ్ వదులుకోలేని వ్యసనం. దీనికి అలవాటుపడ్డవాళ్లు ఉన్నదంతా ఊడ్చి మరీ పందేలు కాస్తూ ఉంటారు. రేసుల్లో పాల్గొనేవాళ్లు చేసినట్లు చాలా లెక్కలు కట్టి పందేలు కడుతుంటారు. అలాగని కట్టిన లెక్కలన్నీ ఫలిస్తాయా? అంటే చెప్పలేం. చాలాసార్లు బెట్టింగ్‌ల్లో ఓటమే ఎదురవుతుంటుంది. లాభాలు వస్తే పరిమితంగా, నష్టం వస్తే అపరిమితంగా ఉండడం బెట్టింగ్స్‌లో సహజం. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా మంది బీజేపీ ఓడిపోతుందంటూ కోట్లరూపాయల పందెం కాశారు. చివరకు సర్వస్వాన్ని కోల్పోయారు. మరి ఈసారి బెట్టింగ్ ఎన్ని చిత్రాలు చేస్తూందో చూడాలి. ఫలోది.. పందెంలో అందెవేసిన చెయ్యి ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటే చాలు.. ఆ ఊళ్లో పందేలు మొదలైపోతాయి. వర్షం ఎంత కురుస్తుంది ? ఎంతసేపు కురుస్తుంది ? రోడ్లు జలమయం అవుతాయా ? నాలాలు పొంగి ప్రవహిస్తాయా? ఇలా వాన లాంటి విషయం చుట్టూనే కాసుల జడి వాన కురుస్తూ ఉంటుంది. అలాంటిది ఎన్నికల సీజన్ వచ్చిందంటే వేరే చెప్పాలా ? రాజస్థాన్‌లోని ఫలోదిలో ఎక్కడలేని హడావుడి కనిపిస్తుంటుంది. జోధ్‌పూర్‌కు 120 కిలో మీటర్ల దూరంలో ఉండే ఆ పట్టణంలో జనాభా లక్ష వరకు ఉంటుంది. ఆ పట్టణ ప్రజలకు పందెం అంటే ఎంతో సరదా. అక్కడ ఐపీఎల్ సీజన్లో 2,500 నుంచి 3 వేల కోట్ల రూపాయల వరకు చేతులు మారుతుంటాయి. అలాంటిది ఎన్నికల సీజన్లో ఐదారువేల కోట్లవరకు బెట్టింగ్‌లు జరగవచ్చని అంచనా. ఈ ఊరల్లో బుకీలకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ఫలోదిలో దాదాపుగా 20–25 మంది పెద్ద బుకీలు ఉన్నారు. -
రమణ్‌కు ఎదురెవరు?
రాజకీయాల్లో జంటిల్‌మ్యాన్ అనే ఘనత సాధించిన కొద్ది మంది నేతల్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఒకరు. నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రంలో సవాళ్లన్నీ ఎదుర్కొంటూ నేర్పుగా పాలన చేయగలరని పేరు తెచ్చుకున్నారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్‌కు స్వయంకృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఈ సారి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టేసి సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ జోగి రూపంలో రమణ్ సింగ్‌కు కలిసివస్తుందనే అంచనాలైతే ఉన్నాయి. మరో పక్క ప్రతిపక్ష కాంగ్రెస్‌లో రమణ్ సింగ్‌కు పోటీగా సరైన నాయకుడు కనిపించడంలేదు. ఎవర్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎవరు అలుగుతారో తెలీక అసలు సీఎం అభ్యర్ధి పేరే ప్రకటించకుండానే కాంగ్రెస్ కదనంలోకి దూకింది. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుతూ సీతా స్వయంవరంలాగా ఎన్నికల అనంతరం తమ పార్టీలో సీఎం అభ్యర్ధి ఎన్నిక జరుగుతుందని చత్తీస్‌గఢ్ ప్రతిపక్షనేత టీఎస్ సింగ్‌దేవ్ గంభీరంగా వ్యాఖ్యానిస్తున్నారు. పలు సర్వేల్లో రమణ్‌సింగ్‌కు పోటీగా ఎవరూ దరిదాపుల్లో కనిపించడంలేదు. దీంతో కేవలం రమణ్ సుదీర్ఘ పాలనపై అసంతృప్తే తమకు కలిసిరావచ్చని ప్రత్యర్ధి పార్టీల్లో ఆశావహులు భావిస్తున్నారు. వ్యతిరేకతా.. క్లీన్ ఇమేజా ? ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల ద్వారా చావల్ బాబా అన్న పేరు సంపాదించుకున్న రమణ్ సింగ్‌ను గత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందలం ఎక్కించాయి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కాస్త తిరగబడ్డట్లుంది. అయిదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పట్టు బిగించిన రమణ్ సింగ్, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. చావల్ బాబాగా పేరున్న ఆయన రైతు సమస్యల్ని పట్టించుకోలేదు. దీంతో అన్నదాతలు రమణ్ సింగ్ సర్కార్‌పై ఆక్రోశంతో ఉన్నారు. ఏ ప్రజాపంపిణీ వ్యవస్థనైతే బలోపేతం చేశారో, అదే వ్యవస్థలో మిల్లర్లతో కుమ్మక్కై నకిలీ బియ్యం పంపిణీకి పరోక్షంగా సహకరించారన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ప్రత్యర్ధులందరూ ఈ వ్యతిరేకతపైనే నమ్మకంతో ఉన్నారు. ఈ దఫా ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికి రమణ్‌ను గద్దె దింపడం ఖాయమని ఆశిస్తున్నారు. కానీ కోర్టుల్లో రమణ్ క్లీన్ ఇమేజ్ పొందారు. దీంతో జనంలో నిజాయితీపరుడని ఆయనకున్న పేరు చెక్కుచెదరినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 41శాతం మంది ప్రజలు రమణ్ సింగే సీఎం కావాలనే కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. తర్వాత స్థానాల్లో అజిత్ జోగీ, సింగ్ దేవ్, భూపేష్ తదితరులున్నారు. అజిత్ ఆశ తీరేనా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడేళ్ల పాటు పనిచేసిన అజిత్ జోగి ప్రజల్లో రమణ్ సింగతర్వాత అంతటి ఛరిష్మా ఉన్న నాయకుడు. ఐఏఎస్ నుంచి సీఎంగా ఎదిగిన జోగీ రాజకీయ వ్యూహరచనలో దిట్ట. రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పేరుతో పార్టీ పెట్టిన ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టున్న నాయకుడు. రాష్ట్ర జనాభాలో 12% ఎస్సీలైతే వారిలో సత్నామీలు 75%వరకు ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పట్టున్న బీఎస్పీతో జతకట్టడం, సీపీఐని కూడా తమ గూటికి లాగేసి ఒక కూటమిగా ఏర్పడడంతో కాంగ్రెస్, బీజేపీ ఓట్లను జోగి భారీగా చీలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ దఫా జోగి మార్వాహి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా ఆయన తన పార్టీని ఉత్సాహంగా నడిపిస్తున్నారు. గత ఏడాదిలో బస్తర్ నుంచి సర్గూజా వరకు దాదాపు 300 బహిరంగ సభల్లో ప్రసంగించారు. బూత్ స్థాయిలో 10 లక్షల మంది కార్యకర్తల్ని నియమించారు. ఎక్కడికక్కడ రమణ్‌సింగ్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఛత్తీస్‌గఢ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చేయలేకపోయింది. 2013లో జరిగిన మావోయిస్టు దాడిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎందరినో కోల్పోయింది. అనంతరం జోగి పార్టీని వీడాక కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే భారం మోయాల్సి వచ్చింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ భాఘేల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు టిఎస్ సింగ్‌దేవ్ రేసులో ఉన్నప్పటికీ వారిలో ఎవరికీ రమణ్ సింగ్‌కు ఉన్నంత జనాదరణ లేదు. మరో ఇద్దరు సీనియర్ నేతలు చరణ్ దాస్ మహంత్, తామ్రధావజ్ సాహులు కూడా సీఎం పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో 24% మంది సింగ్‌దేవ్ సీఎం అభ్యర్థి కావాలని కోరుకుంటే, 20% మంది భూపేష్ భాగల్ వైపు మొగ్గు చూపించారు. టీఎస్ సింగ్ దేవ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరిలోకి ధనవంతుడు. రమణ్ సింగ్ అనుకూలం ♦ పరిపాలనాదక్షత, నిజాయితీ ♦ వ్యాపారుల అండదండలు ♦ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నా ఆగని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతికూలం ♦ 15ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ♦ అధికారుల చేతుల్లో కీలుబొమ్మ అన్న పేరు ♦ రైతులు, గిరిజనుల్లో అసంతృప్తి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి అనుకూలం ♦ రాష్ట్ర రాజకీయాలు, పాలనపై పూర్తి అవగాహన ♦ గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టు ♦ బీఎస్పీతో పొత్తు ప్రతికూలం ♦ కుటుంబ సభ్యులు వివిధ పార్టీల్లో కొనసాగడం ♦ గత వైఫల్యాలు, కుంభకోణాల ఇమేజ్ పూర్తిగా చెరిగిపోకపోవడం కాంగ్రెస్ అభ్యర్ధులు అనుకూలం ♦ బీఎస్పీ, అజిత్ పొత్తుతో బీజేపీ ఓట్బ్యాంక్కు గండిపడుతుందన్న అంచనాలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలం ♦ బలమైన ఇమేజ్ లేకపోవడం ♦ అంతర్గత కుమ్ములాటలు అక్కడ అన్నీ సాధ్యమే! మధ్యప్రదేశ్ అసెంబ్లీ పలు ప్రయోగాలకు వేదిక. 1998–2003లో అన్నుపూర్లోని సోహాగ్పూర్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ శబ్నం మౌసీ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శబ్నం స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అంతేకాదు.. దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ మేయర్ కూడా మధ్యప్రదేశ్ లోనే ఎన్నికయ్యారు. 1999లో కత్నీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కమలా జాన్ విజయం సాధించారు. 1977లో పార్లమెంటుకు ఓ అంధుడైన నేతను పంపించిన ఘనత కూడా మధ్యప్రదేశ్‌కే దక్కుతుంది. యమునా ప్రసాద్ శాస్త్రి రేవా నియోజవర్గం నుంచి 1977 నుంచి 1989 వరకు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. 1955లో గోవా ముక్తి పోరాటంలో పోర్చుగీసు పోలీసుల చిత్రహింసలతో ఆయన తన రెండుకళ్లూ పోయాయి. ఈ దఫా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బధిర అభ్యర్థి సుదీప్ శుక్లా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% కోటీశ్వరులే! ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% మంది కోటీశ్వరులే. 2008 ఎన్నికల అప్పుడు 40% మాత్రమే ఉన్న ధనిక ఎంఎల్ఏల సంఖ్య ఐదేళ్లలోనే మరింత పెరిగింది. 2013లో ఎన్నికల సంఘానికి నివేదించిన అఫిడవిట్ ప్రకారం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.5.24కోట్లు. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 161 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలోనూ బీజేపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఎన్నికల సంఘానికి పేర్కొన్న లెక్కల ప్రకారం ఆయన ఆస్తులు రూ.121 కోట్లు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆస్తులు రూ.8.94 కోట్లు మాత్రమే. మరో బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్‌కు రూ.120.39 కోట్లు, సంజయ్ శర్మ అనే మరో కమలం పార్టీ ఎంపీకి రూ.65.42 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తం 161 మందిలో 118 మంది బీజేపీ ఎమ్మేల్యేలు ఉన్నారు. 2013 ఎన్నికలకు ముందు ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 69%, బీఎస్పీ శాసనసభ్యులు 25% ఉన్నారు. 14 ముస్లిం స్థానాలపై కాంగ్రెస్ దృష్టి రాజస్తాన్‌లో 2013 అసెంబ్లీ ఎన్నికలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా అనేక ప్రయత్నాలూ చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్రంగా నష్టం చేసిన 14 ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఈసారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో చిన్నాచితకా ముస్లిం పార్టీల కారణంగా ఓట్లు చీలడంతో.. ఈసారి ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్, ముస్లిం సంఘాల నేతలకు బీజేపీ అన్నివిధాలుగా సహాయపడిందని.. అందుకే ఈ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి అసమ్మతినేతలను బుజ్జగించే పనిలో ఉంది. ఎలాగైనా 14 స్థానాల్లో గెలుపొందాలని గట్టి యత్నాలు చేస్తోంది. -
మహిళా ఓటర్లు ఎక్కువ అయినా..
అక్కడ మహిళల సంఖ్య ఎక్కువే. వారికి ఆత్మవిశ్వాసమూ ఎక్కువే. స్కూటర్ల మీద రయ్ రయ్‌మని వెళ్లిపోతుంటారు. చదువుల్లో మగవారినే మించిపోయారు. పారిశ్రామిక రంగంలో పురుషులతో పోటీ పడుతున్నారు. కానీ.. రాజకీయాలకు వచ్చేసరికి వారికి చోటే లేదు. అదేమంటే రాజకీయం అన్నది మగాళ్లు చేసే పని. ఆడవాళ్లకు చేతకాదు అన్న బూజుపట్టిన అభిప్రాయాలే వినిపిస్తూ ఉంటాయి. అదే మిజోరం.. మిజోరంలో వాస్తవానికి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,051 మంది మహిళలు ఉన్నారు. వారిలో చైతన్యం ఎక్కువే. ఎన్నికలొస్తే గంటల తరబడి పోలింగ్ బూతుల దగ్గర బారులతీరు నిల్చొని మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. కానీ అసెంబ్లీకి పోటీ అంటే అందని ద్రాక్షే. ఇప్పటి వరకు కేవలం నలుగురంటే నలుగురు మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారీ మొండి చెయ్యే ! ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మహిళలకు సీటు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. 2003లో చివరి సారిగా మిజో నేషనల్ ఫ్రంట్ మహిళకి టిక్కెట్ ఇస్తే, కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం ఒక్క మహిళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జోర్‌మాతాంగా మహిళలకు టిక్కెట్లు ఇవ్వకపోవడాన్ని అడ్డంగా సమర్థించుకుంటున్నారు. మహిళలకు గెలిచే సత్తా ఉంటే తప్పకుండా ఇస్తాం. కానీ ఎన్నికల్లో నెగ్గుకొచ్చే మహిళామణులెవరూ కనిపించడం లేదు అని అంటున్నారు. గత ఏడాదే ఏర్పాటైన మరో రాజకీయ పార్టీ జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జడ్పీఎం) ఇద్దరు మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం పార్టీలే కాదు అక్కడ సమాజంలో కూడా ఇంకా మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని కొత్తగానే చూస్తున్నారు. 2003లో అయిదుగురు మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు.. 2008 నాటికి వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కానీ అందరూ స్వతంత్ర అభ్యర్థులగానే బరిలోకి దిగారు. ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. సాధారణంగా మహిళలు ఎక్కువగా ఉండడం సామాజిక పురోగతిని సూచిస్తుంది. కానీ రాజకీయాలు వచ్చేసరికి అదే సంకుచిత ధోరణే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విపక్షాల నుంచి మరో వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మద్య నిషేధాన్ని ఎత్తివేయడంతో ఎందరో మగవాళ్లు చీప్ లిక్కర్ తాగి చనిపోతున్నారని, అందుకే మహిళల సంఖ్య పెరిగిపోతోందని దానివల్ల ఓటింగ్‌లో వారు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారన్న విచిత్ర వాదన ఒకటి తెరపైకి తెచ్చారు. ఇటీవల కాలంలో నమోదైన మరణాల సంఖ్యలో 80–85 శాతం మంది మగవారేనంటూ ఎంఎన్ఎఫ్ నేత జోర్‌మాతాంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మరోవైపు మిజోరంలో యువతులు తమకి రాజకీయాలపై ఆసక్తి లేదని అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో విద్యార్థినుల్ని ప్రశ్నిస్తే కెరీర్వైపే తమ దృష్టి ఉందని అంటున్నారు. ‘‘మిజోరం మహిళలు విద్యావంతులు. మగవారిలో కంటే చిత్తశుద్ధి ఎక్కువే. కానీ ఎందుకో తెలీదు వారికి రాజకీయాలంటే ఆసక్తి లేదు‘అని క్రిస్టీ అనే విద్యార్థిని వెల్లడించారు. కొంతమందిలో ఆసక్తి లేకపోతే లేకపోవచ్చు కానీ కొందరు మహిళల్లో రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహం ఉంది. మరి అలాంటి ఉత్సాహవంతులనైనా పార్టీలు ప్రోత్సహిస్తాయా ? వేచి చూడాల్సిందే. ఆ నలుగురు.. 1. థాన్మావి. 1978లో తొలిసారిగా అసెంబ్లీకి. 2. కె. థాన్సియామి. అయిజ్వాల్ (పశ్చిమ) నుంచి 1984లో ఎన్నిక 3. లాల్హింపూయి హమర్, 1987లో ఎమ్ఎన్ఎఫ్ తరపున ఎన్నిక. 4. 20 ఏళ్ల తర్వాత 2014 ఉప ఎన్నికల్లో వన్లలంపూయీ చ్వాంగ్తూ కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
రామ భక్తుడిగా రాహుల్ గాంధీ!?
సాక్షి, న్యూఢిల్లీ : ఇదివరకు ఎన్నికలు సమీపిస్తున్నాయంటే కేంద్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి వివిధ రకాలుగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించేవారు. ఊరు, వాడా తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించే వారు. ఎక్కడికెళితే అక్కడి సమస్యలను ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేవారు. రాజకీయ ప్రత్యర్థులను ఆడిపోసుకునేవారు. ఇంకా ప్రజల్ని ఆకర్షించేందుకు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసేవారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయింది. బీజేపీ నాయకులు ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ప్రధానంగా ‘హిందూత్వ’ నినాదాన్ని అందుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ముస్లిం పక్షపాత పార్టీ అని ఆడిపోసుకుంటున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు తాను కూడా హిందూత్వ వాదినని చెప్పుకోవడం కోసమేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శివ భక్తుడిగా మారిపోయారు. ఇక ఆయన్ని జంధ్యం ధరిస్తున్న బ్రాహ్మణుడని పార్టీ వారు ప్రచారంలో పెట్టారు. అందుకని రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ముందుగా అక్కడి హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ సోమవారం నాడు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుడి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అక్కడ రాహుల్ గాంధీ గోత్రం అడిగారంటే ఆయన అగ్రవర్ణానికి చెందిన బ్రాహ్మణుడిగా ప్రచారం జరగాలనే. నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని మొదటి నుంచి లౌకికవాద, ఉదారవాద కుటుంబంగానే భారత రాజకీయాల్లో గుర్తించారు. రాజీవ్‌గాంధీ, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీని పెళ్లి చేసుకోవడంతో కాంగ్రెస్‌పై క్రైస్తవ ముద్ర వేసేందుకు ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందే రాహుల్ గాంధీ జంధ్యం వేసుకునే బ్రాహ్మణుడు కాగా, పార్టీ బాధ్యతలు స్వీకరించాక పూర్తి స్థాయి శివభక్తుడిగా మారిపోయారు. సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ టిబెట్‌లోని కైలాస యాత్రకు కూడా వెళ్లి వచ్చారు. గత ఏప్రిల్ నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన ఆ రాష్ట్రంలోని పలు గుళ్లూ గోపురాలను సందర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ, అనుబంధ హిందూత్వ సంఘాలు అయోధ్య నినాదాన్ని అందుకుంది. ఈ విషయంలో బీజేపీని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ రామ భక్తుడిగా మారిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. -
బీజేపీకి తిరుగు‘పోట్లు’.. కాంగ్రెస్‌కు ‘చేరిక’ కష్టాలు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీల ఓటు బ్యాంకులు తారుమారవుతున్నాయి. గత ఎన్నికల్లో అధికారం కట్టబెట్టిన వివిధ వర్గాల ఓటర్లు ఇప్పుడాపార్టీకి దూరమవుతోంటే, మరోవైపు సొంత నేతల నుంచి తిరుగుబాట్లను ఎదుర్కొంటోంది బీజేపీ. వీటన్నిటి ఫలితంగా విపక్ష కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. అయితే, కొత్త చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుండటం విశేషం. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలో ఏర్పాటయిన ఏడు పార్టీల కూటమి –లోక్తాంత్రిక్ మోర్చా– ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఈ కూటమి గెలుపోటములు ఎలా ఉన్నా విజయావకాశాలున్న అభ్యర్థుల ఓట్లను గణనీయంగా చీల్చుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన రాకతో పార్టీకి ఇబ్బందులా..? ఏదేమైనా రాజస్థాన్‌లో అధికారం నిలుపుకోవడం బీజేపీకి అంత సులభం కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తోంటే మరోవైపు కీలక నేతలు పార్టీకి దూరమవుతున్నారు. ఘనశ్యాం తివారి, హనుమాన్ బెనివాల్, కిరోరి సింగ్ బైంస్లా వంటి నేతలు మొదలుకుని తాజాగా జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ వరకు బీజేపీకి రాంరాం చెప్పారు. రాష్ట్రంలో రాజ్‌పుత్, జాట్ వంటి కులాలకు చెందిన ఈ నేతలు తమ వర్గీయులపై గణనీయమైన పట్టు ఉన్నవారు. పది పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల శక్తిమంతులు. వీరి తిరుగుబాటు బీజేపీకి పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఇదిలా ఉంటే, ఈ సారి ఎన్నికల్లో సగానికిపైగా బీజేపీ సిట్టింగులకు టికెట్లు రావన్న ప్రచారం జరుగుతోంది. టికెట్లు రానివారిలో కొందరైనా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి వసుంధర రాజే తీరుపై పార్టీలో పలువురు అసంతప్తితో ఉన్నారు. ఇవన్నీ బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్‌కు కొత్త సమస్య అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, విపక్ష కాంగ్రెస్ మరో సమస్యతో సతమతమవుతోంది. మానవేంద్ర సింగ్ బీజేపీ నుంచి వచ్చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరిక పార్టీకి రాజకీయంగా మేలు కలిగించాలి. అయితే, పార్టీలో జాట్ నేతలు రాజ్‌పుత్ వర్గానికి చెందిన మానవేంద్ర సింగ్ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాక వల్ల తమకు ప్రాధాన్యం తగ్గిపోతుందని హరీశ్‌చౌదరి వంటి సీనియర్‌కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆయన తన అసంతప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. హరీశ్వర్గీయుల (జాట్లు) అసంతప్తి బర్మార్, జైసల్మేర్ జిల్లాల్లో కనీసం 9 నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. తెరపైకి లోక్ తాంత్రిక్ మోర్చా సిపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎంసీపీఐ, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్‌లతో కూడిన ఫ్రంట్ ‘లోక్ తాంత్రిక్ మోర్చా’ ఈ ఎన్నికల్లో 200 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ కూటమి అధికారంలోకి వస్తే అమ్రా రామ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తాము రంగంలోకి దిగుతున్నట్టు తెలిపింది. దూరమవుతున్న రాజ్‌పుత్‌లు జన్‌సంఘ్ కాలం నుంచి బీజేపీకి సంప్రదాయక మద్దతు దారులుగా ఉన్న రాజ్‌పుత్‌లు 25కుపైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయగలరు. ప్రస్తుత ప్రభుత్వంలో ముగ్గురు కేబినెట్, ఒక జూనియర్ మంత్రి రాజ్‌పుత్‌లకు చెందినవారు. వసుంధర తీరుపై రాజ్‌పుత్‌లకు ఏర్పడిన అసంతప్తి రాణి పద్మావతి సినిమా వివాదంతో తీవ్రమయింది. మానవేంద్ర సింగ్ పార్టీని వీడటంతో రాజ్‌పుత్‌లు బీజేపీకి దూరమయ్యారన్నది వాస్తమమని తేలిపోయింది. రాజ్‌పుత్‌లు తమ నాయకుడిగా గౌరవించే జస్వంత్సింగ్కు 2014లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడం, స్వతంత్రంగా నిలబడ్డ ఆయన తరపున ప్రచారం చేసిన మానవేంద్ర సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీ–రాజ్‌పుత్‌ల బంధం ఒడిదుడుకుల్లో పడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్పుత్నేత గజేంద్ర షెకావత్‌ను కాదని ఓబిసీ నేత మదన్‌లాల్‌ను వసుంధర నియమించడం, పద్మావతి సినిమా విడుదలకు వసుంధర అనుమతించడం, రాజ్‌పుత్ వర్గానికి చెందిన అనందపాల్ సింగ్ అనే గూండాను ప్రభుత్వం ఎన్కౌంటర్లో హతమార్చడం వంటి పరిణామాలు రాజ్‌పుత్‌లకు బీజేపీ మధ్య దూరాన్ని పెంచాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో జైపూర్‌లోని రాజమహల్ ప్రవేశద్వారాన్ని మూసివేసింది. ఇది కూడా రాజవంశీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ పరిణామలతో రాజ్‌పుత్‌లు వసుంధర ప్రభుత్వానికి దూరమవుతూ వచ్చారు. రాష్ట్ర జనాభాలో89 శాతం హిందువులు, 9శాతం ముస్లింలు, 2 శాతం ఇతరులు ఉన్నారు. వీరిలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 13 శాతం, జాట్లు 12 శాతం, గుజ్జార్లు,రాజ్‌పుత్‌లు 9 శాతం ఉంటే, బ్రాహ్మణులు, మినాలు ఏడు శాతం చొప్పున ఉన్నారు. జైపూర్ సంస్థానం భారత్‌లో విలీనమైనప్పటి నుంచీ రాజ్‌పుత్‌లు, జాట్లు ప్రత్యర్థులుగా ఉంటున్నారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లకుగాను 54 సీట్లను రాజ్‌పుత్‌లు గెలుచుకుంటే 12 సీట్లు జాట్లకు, ఎస్సీలు పది సీట్లు గెలుచుకున్నారు. తర్వాత కాలంలో జాట్లు, బిష్ణోయిలు బలపడ్డారు. ఫలితంగా తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌పుత్‌ల సీట్లు 26కు పడిపోతే, జాట్లు 23 సీట్లు దక్కించుకున్నారు. దాంతో ఈ రెండు వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా 60 సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గుజ్జార్లు కూడా ఓబీసి జాబితా విషయమై ప్రభత్వం పట్ల అసంతప్తితో ఉన్నారు. రాజకీయంగా తమకు తగిన ప్రాతినిధ్యం లేదని వారు భావిస్తున్నారు. ఐటీ బందాల ఏర్పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నాయి. 2004 ఎన్నికల్లో బీజేపీ విజయంలో సామాజిక మాధ్యమాలు కీలక భూమిక పోషించడంతో అన్ని పార్టీలు అటే దష్టి పెట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 51వేల పోలింగ్ బూత్‌లకు ఒక ఐటీ కార్యకర్త చొప్పున నియమించినట్టు బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి హీరేంద్ర కౌశిక్ తెలిపారు. డివిజన్ స్థాయిలో 10 మందితో ఐటీ బందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా ప్రచారం సాగిస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ తరఫున కూడా సామాజిక మాధ్యమాల బందాలను ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్చార్జి అర్చన శర్మ చెప్పారు.ఈ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేస్తున్న ఆప్ పార్టీ కూడా తమ అభ్యర్థుల తరఫున సామాజిక మీడియా మేనేజర్లను నియమించింది. -
‘కమలానికి’ కఠిన పరీక్ష!
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఈసారి కఠిన పరీక్ష ఎదురు కానుంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కమలదళం ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతి రేకతను ఎదుర్కొంటోంది. ఇంతవరకు ఆ పార్టీకి అండగా నిలిచిన గిరిజనులు, అగ్రవర్ణాలు, రైతులు ఈసారి ఎదురుతిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీ గెలుపు నల్లేరుమీద నడక కాదని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలు జాతీయ రాజ కీయాలపై గణనీయమైన ప్రభావం చూపను న్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుందా లేక కాంగ్రెస్ పునరుత్తేజితమై అధి కారాన్ని చేపడుతుందా అన్నది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనుబట్టి తేలుతుందని విశ్లేష కులు భావిస్తున్నారు. అయితే అంతర్గత కుమ్ము లాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ... బీజేపీ వ్యతిరేక పవనాలను ఏ మేరకు అనుకూలంగా మార్చుకుంటుందన్నది చూడాల్సి ఉంది. గత 3 ఎన్నికల్లో కమల దళానిదే పైచేయి.. బీజేపీ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై విజయం సాధించింది. 2013 ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 45% ఓట్లు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లలో బీజేపీకిపడ్డ అత్యధిక శాతం ఓట్లు ఇవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36% ఓట్లు వచ్చాయి. బీజేపీ మొత్తం సీట్లలో 72% సీట్లను గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా తక్కువే (9%) ఉన్నా సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్‌కంటే బీజేపీ బాగా ముందుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకుగాను బీజేపీ 165 స్థానాలు గెలుచుకుంది. వాటిలో 92 నియోజకవర్గాల్లో బీజేపీ 10% కంటే ఎక్కువ ఆధిక్యత సాధించింది. 58 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ కేవలం 17 చోట్ల మాత్రమే 10% కంటే ఎక్కువ ఆధిక్యత నిలుపుకుంది. రాష్ట్రంలో రిజర్వుడు స్థానాల్లోనూ, జనరల్ సీట్లలోనూ బీజేపీ గణనీయమైన ఆధిపత్యం ప్రదర్శించింది. రిజర్వుడు స్థానాల్లోనూ ముందంజ... మధ్యప్రదేశ్ జనాభాలో షెడ్యూల్డ్ తెగలు 21% ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 47 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ 47 సీట్లలో 31 చోట్ల గెలిచింది. 80% కంటే ఎక్కువ మంది గిరిజనులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరడానికి సంఘ్ పరివార్ కృషే ప్రధాన కారణమని సామాజిక శాస్త్ర వేత్తలు స్పష్టం చేస్తున్నారు. గిరిజన గూడేల్లో సంఘ్ పరివార్ చేసిన సామాజిక సేవలే దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ విజయానికి బాటలు వేశాయని 2008లో వెలు వడిన ఒక అధ్యయన పత్రంలో రాజకీయ విశ్లేష కులు తారిఖ్ తచిల్, రోనాల్డ్ హెరింగ్లు పేర్కొ న్నారు. సంఘ్ పరివార్ కార్యక్రమాల వల్ల బీజేపీ పరపతి పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో హిందుత్వ భావన కూడా పెరిగిందని వారు చెప్పారు. కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందా...? ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే వాటిని అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది అనుమానమే. రైతులు, గిరిజనులు, అగ్రవర్ణాల వ్యతిరేకతతోపాటు సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే ముఠా కుమ్ములాటలకు పేరొందిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎంతవరకు నెగ్గుకు రాగలదో చెప్పలేం. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి ముఠా తగవులే ప్రధాన కారణమని లోక్‌నీతి–సీఎస్డీఎస్కు చెందిన శ్రేయాస్ సర్దేశి 2014లో నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. కాంగ్రెస్ పార్టీ తనకొచ్చే ఓట్లను సీట్లుగా మార్చుకోగలిగితే రాష్ట్రంలో, దేశంలో కూడా మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని సర్దేశి అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చూపగలిగితే హిందీ రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నట్టవుతుంది. ఈ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు 2019 ఎన్నికలను ఉత్సాహంతో ఎదుర్కొంటారు. ఇక నాలుగోసారి అధికార పీఠం కోసం చూస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈసారి కూడా నెగ్గితే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రైతుల్లో తీవ్ర అసంతృప్తి... వ్యవసాయ ప్రధానమైన మధ్యప్రదేశ్‌లో సంప్ర దాయకంగా రైతులు బీజేపీకే మద్దతు పలుకు తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన పరిణామాలు, ప్రభుత్వాల తీరుతో రైతులు బీజేపీపట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం రేపు ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో 10 అతిపేద జిల్లాలతో పోలిస్తే 10 ధనిక జిల్లాల్లోనే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ ధనిక జిల్లాల్లో 50 శాతం ఓట్లు సంపాదించుకుంటే పేద జిల్లాల్లో 39 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రైతుల అసంతృప్తి ఈసారి ఎన్నికల్లో బీజేపీపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. (ప్రజల ఆస్తులు, సౌకర్యాల తదితర అంశాల ఆధారంగా మింట్స్ డిస్ట్రిక్ట్ వెల్త్ ట్రాకర్ సంస్థ రాష్ట్రంలో పేద, ధనిక జిల్లాలను గుర్తించింది) మారిన పరిస్థితులు... ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రంలో ఆ పార్టీ పరపతిని నీరుగారుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణల విషయంలో బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి ఇటు గిరిజనులకు అటు అగ్ర వర్ణాలకు కూడా రుచించలేదు.అలాగే దళితులపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడంలో ప్రభుత్వ తీరును గిరిజనులు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టానికి సుప్రీంకోర్టు సూచించిన సవరణలను తిరస్కరించడం ద్వారా కేంద్రం దళితులపట్ల పక్షపాతం చూపుతోందన్న భావన ఉన్నత వర్గాల్లో నెలకొంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలాగే మధ్యప్రదేశ్‌లో కూడా అగ్రవర్ణాల వారు బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మధ్యప్రదేశ్‌లో రాహుల్‌గాంధీ టెంపుల్ రన్
-
ఫేస్‌బుక్‌తోనే పుట్టుకొచ్చిన ‘జాయ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో కొత్త రాజకీయ చరిత్రను లిఖించేందుకు ఓ కొత్త శక్తి ఆవిర్భవించింది. ఇప్పుడది తన లక్ష్య సాధన దిశగా పురోగమిస్తోంది. అది పాలక పక్ష బీజేపీకి చెమటలు పోయిస్తుండగా, మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఆ శక్తి పేరే ‘జాయ్స్ (జేఏవైఎస్)’. అంటే, జై ఆదివాసి యువ శక్తి. 2009లో ‘ఫేస్బుక్’ పేజీ ద్వారా పుట్టుకొచ్చిన ఈ సంస్థ ప్రజల్లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చి నేడు ‘మాల్వా–నిమర్’లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించింది. వెనకబడిన వర్గాల ప్రాబల్య ప్రాంతమైన మాల్వా–నిమర్‌లో 66 అసెంబ్లీ సీట్లకుగాను 28 సీట్లకు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంది. వాటిలో 22 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన స్థానాలే కావడం గమనార్హం. రాష్ట్రంలో 22 శాతం జనాభా కలిగిన ఆదివాసీలను అనాదిగా అగ్రవర్ణాలు అణచివేస్తున్నా, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న కసితో కొంత మంది ఆదివాసీ విద్యార్థులు తమ సొంత గొంతును వినిపించేందుకు 2009లో ‘యువ శక్తి బిలాల’ పేరుతో ఓ ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. అది కాస్త 2011లో ‘జై ఆదివాసీ యువ శక్తి’గా మారింది. దాన్ని ఆదివాసీ విద్యార్థులంతా ‘జాయ్స్’గా పిలుచుకుంటారు. దేవీ అహల్య విశ్వవిద్యాలయం, రాణి దుర్గావతి యూనివర్శిటీ పరిధిలోని విద్యార్థి సంఘాల ఎన్నికల్లో మొత్తం 250 పోస్టులకుగాను 162 పోస్టులను జాయ్స్ గెలుచుకుంది. రాష్ట్రంలోని కుక్షీ ప్రాంతానికి చెందిన హీరాలాల్ అలావ, రేవాలో మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచి ఈ సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేశారు. ఆయన వెంట ప్రస్తుత ఇండోర్ సిటీ జాయ్స్ అధ్యక్షుడు రవిరాజ్ బఘెల్ కలిసి నడిచారు. 2013లో ‘ఫేస్బుక్ పంచాయతీ’ పేరిట బర్వాణిలో రెండువేల మంది ప్రజలతో మొదటిసారి సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత ‘ఫేస్బుక్ మహాపంచాయతీ’ పేరుతో ఇండోర్‌లో భారీ సమావేశాన్ని నిర్వహించగా, రాష్ట్రం నుంచి వేలాది ఆదివాసీలు తరలిరాగా, ఆరు రాష్ట్రాల నుంచి యువజన ఆదివాసీ కార్యకర్తలు తరలి వచ్చారు. జాయ్స్ ఉద్యమం ఊపందుకుంటుండంతో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలోని ఢిల్లీ వైద్య కళాశాలలో క్లినికల్ ఇమ్యూనాలోజీ, రెమటాలోజిలో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న హీరాలాల్ అలావ 2017లో వైద్య వృత్తికి గుడ్‌బై చెప్పి సొంతూరుకు వచ్చారు. కొంత మంది తోటి కార్యకర్తలతో కలిసి ప్రతి ఊరుకెళ్లి పంచాయతీలను నిర్వహించడం, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్ కింద ఆదివాసీలకున్న అటవి హక్కులు, పంచాయతీలకున్న హక్కుల గురించి వివరిస్తూ వచ్చారు. ఆదివాసీల వలసలు, స్థ్రానభ్రంశం, పునరావాసం లాంటి అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తొలుత విద్యార్థులకు పరిమితమైన ‘జాయ్స్’ ప్రజల ప్రాతినిధ్యంతో ప్రజా సంఘంగా విస్తరించింది. తొలుత ఈ సంఘంలో భిలాల ఆదివాసీలే ఉండగా, నేడు భిలాలతోపాటు భిల్, భరేలా, పటేలియా ఆదివాసీ జాతులు కూడా వచ్చి చేరాయి. ఆరెస్సెస్ రోజువారి శాఖల నిర్వహణకు చోటు దొరక్కుండా జాయ్స్ చేయగలిగింది. అలీరాజ్‌పూర్, రత్లం, జాభ్వా, ధర్, ఖర్గావ్, బుర్హాన్పూర్, ఖండ్వా, దేవాస్, బడ్వానీ జిల్లాల్తో జాయ్స్‌కు ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఈ స్థాయిలో తమ సంఘం జనంలోకి చొచ్చుకు పోవడానికి 90 శాతం ఫేస్బుక్ పేజీయే కారణమని రవిరాజ్ బఘెల్ వ్యాఖ్యానించారు. గత జూలై 29వ తేదీన మాల్వా–నిమర్ ప్రాంతంలో పాలకపక్ష బీజేపీ ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’కు పిలుపునిచ్చింది. అందుకు ప్రతిగా అదే రోజున ‘ఆదివాసీ అధికార్ యాత్ర’కు జాయ్స్ పిలుపునిచ్చింది. దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జాయ్స్ నాయకత్వాన్ని పిలిపించి చర్చలు జరిపారు. మాల్వా–నిమర్ ప్రాంతంలో ఓ వైద్య, ఓ ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆదివాసీల భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆయన సమ్మతించకపోవడంతో బీజేపీతో రాజీ కుదరలేదు. రాష్ట్రంలో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతోని ఎన్నికల పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెస్ నాయకులు జాయ్స్‌తో సంప్రతింపులకు వచ్చారు. రానున్న ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఆఫర్ తీసుకొచ్చారు. కనీసం 20 సీట్లు కావాలని కోరుతున్న జాయ్స్ నాయకత్వం హీరాలాల్ అలావ పోటీ చేసేందుకు కుక్షీ అసెంబ్లీ నియోజక వర్గాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ నియోజక వర్గానికి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ విధేయుడు సురేంద్ర సింగ్ బఘెల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లక్ష మందికిపైగా తమ ఆదివాసీ ఓటర్లు, ఐదువేల మంది జాయ్స్ కార్యకర్తలను కలిగిన కుక్షీ నుంచి హీరాలాల్ పోటీ చేయకపోతే తమ ప్రజలు నిరాశకు గురవుతారని జాయ్స్ నాయకత్వం వాదిస్తోంది. గుజరాత్లో హార్దిక్ పటేల్, మెవానీ, ఠాకూర్లను సమర్థించిన కాంగ్రెస్ కుక్షీలో హీరాలాల్‌కు మద్దతిస్తే మునిగేదేముంటుందని నాయకత్వం ప్రశ్నిస్తోంది. మధ్యప్రదేశ్‌లో జాభ్వా బహిరంగ సభలో ప్రసంగించేందుకు సోమవారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈ రోజు రాత్రికి జాయ్స్ నాయకత్వం కలుసుకోబోతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే తాము ఒంటరిగా పోటీ చేస్తామని హెచ్చరించింది. -
ఉజ్జయిని శివాలయంలో రాహుల్ పూజలు
సాక్షి, ఇండోర్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర ఆలయంలో కాంగ్రెస్ చీఫ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పాటు సాగే ప్రచారానికి ముందు రాహుల్ ఆలయ సందర్శన చేపట్టారు. గతంలో బీజేపీ చీఫ్ అమిత్ షా మధ్యప్రదేశ్ సీఎం చేపట్టిన జనాశీర్వాద్ యాత్ర ప్రారంభించే ముందు ఈ ఏడాది జులై 14న ఉజ్జయిని ఆలయం సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ హిందుత్వ కార్డును ప్రయోగించేందుకే ఆలయాల చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ శివభక్తుడని, ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ బదులిస్తోంది. కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ జబువ, ఇండోర్, దర్, ఖర్గోన్, మోలో జరిగే ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోర్‌లో జరిగే రోడ్‌షోలోనూ పాల్గొంటారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. -
కొత్త ముఖాలతో.. గెలుపు బాటలో...
ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం. వందల సీట్లకు పోటీ పడే వేల మందిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి... ఎవరు ఎన్నికల్లో గెలుస్తారు..అన్నది అంచనా వేయడం పార్టీలకు అంత సులభం కాదు. టికెట్ లభించని వారు తిరుగుబావుటా ఎగరేస్తే వారిని బుజ్జగించడం మరో తలనొప్పి వ్యవహారం. అభ్యర్థుల ఎంపికలో ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడమే ఆ వ్యూహం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను కొంత వరకు అధిగమించవచ్చని కమలనాథుల ఆలోచన. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యూహాన్నే అమలు పరిచి వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్నారు. రాజస్థాన్‌లో సగం మంది ఔట్ ! త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్లలో అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఈ వ్యూహాన్నే అమలు పరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 78 మందితో తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 14 మందికి ఈ సారి టికెట్ ఇవ్వలేదు. వీరిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ తర్వాత ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో కూడా ఈ ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇక్కడ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం మందికి ఈ సారి టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది. గ్యారెంటీ లేదు కొత్త వాళ్లని పెడితే తప్పనిసరిగా గెలుస్తామన్న హామీ ఏమీ లేదు. అయితేగియితే ఘోర పరాజయాన్ని తప్పించుకోవచ్చు. రాజస్థాన్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలుపరిచినా నూరుశాతం ఫలితం దక్కలేదు. 2008 ఎన్నికల్లో బీజేపీ 193 స్థానాల్లో పోటీ చేసింది. వాటిలో 135 చోట్ల కొత్త ముఖాలనే బరిలోకి దింపింది. అయితే, వారిలో 55 మందే గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. 2013 ఎన్నికల్లో బీజేపీ 92 మంది కొత్తవాళ్లకి టికెట్ ఇస్తే వారిలో 68 మంది నెగ్గారు. ఈ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. కొత్త వాళ్లతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా గణనీయంగానే నెగ్గుకు రావడం ఇక్కడ విశేషం. సాధారణంగా పార్టీ ఓడిపోతుందని అంచనా వేసిన నియోజకవర్గాల్లోనే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. ఆ అభ్యర్థి నెగ్గితే పార్టీకి అదనపు విజయమే. ఒకవేళ ఓడిపోతే ముందే తెలుసు కాబట్టి పార్టీకి పోయేదేం లేదు. 2013 ఎన్నికల్లో ఈ కొత్త ముఖాలు అందించిన అదనపు విజయం వల్లే బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. కొత్త ముఖాలంటే రాజకీయాలకు పార్టీకి మరీ కొత్త వాళ్లు కాదు. గతంలో పార్టీలో పనిచేసి గుర్తింపు పొందిన వారు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లనే ఎంపిక చేస్తారు. అంతర్గత సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పరపతి ఎలా ఉంది. మళ్లీ టికెట్ ఇస్తే గెలుస్తాడా లేదా అన్నది నిర్థారిస్తారు. గెలవడని తేలితే అక్కడ కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. ఓటర్లు కూడా రెండు, మూడు సార్లు ఒకే వ్యక్తికి ఓటేయడానికి ఇష్టపడరు. అలాంటి చోట్ల కొత్త వారిని పెడితే గెలిచే అవకాశాలు బాగా ఉంటాయని బీజేపీ వ్యూహకర్త ఒకరు తెలిపారు. శక్తియాప్‌తో కాంగ్రెస్ ఎంపిక బీజేపీ కొత్త ముఖాలను దింపి గెలుపుకోసం ప్రయత్నిస్తోంటే, కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల అభిమతం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇంత వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానం ఇష్టం మేరకే జరుగుతూ వస్తోంది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే భరించాల్సి వస్తోంది. దీనివల్ల చాలా చోట్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతింటున్నాయి. రాహుల్ వచ్చాకా ఈ పరిస్థితి మారింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నేతల అభ్రిపాయాల మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, దానివల్ల విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నిర్ణయించారు. అంతేకాకుండా పోలింగ్ బూత్ స్థాయి నుంచీ దృష్టి పెడితే గెలుపుబాటనందుకోవచ్చని కూడా ఆలోచించారు. ఇందుకోసం శక్తి పేరుతోఒక యాప్‌ను కూడా సిద్ధం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలందరూ ఈ యాప్ ద్వారా తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి(రాహుల్ గాంధీకి) పంపుతారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇంత వరకు 4 లక్షల మంది ఈ యాప్ ద్వారా అభిప్రాయాలు పంపారని పార్టీ విశ్లేషణ విభాగం వర్గాలు తెలిపాయి. అన్ని బూత్‌లు కవర్ అయ్యాయి.. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌లలో ఇంత వరకు 35,82,595 మంది శక్తి యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, రాజస్థాన్‌లో నూరు శాతం బూత్‌లను కవర్ చేయడం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే కాక ఎన్నికల ప్రచారాంశాలుగా వేటిని తీసుకోవాలన్న అంశంపై కూడా బూత్ స్థాయి కార్యకర్త అభిప్రాయాలను తెలుసుకుని వాటి ఆధారంగా ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేయనున్నారు. -సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
వసుంధర రాజే x సచిన్
‘‘ఆమెకేం మహారాణి. రాజ కుటుంబీకుల వంశం నుంచి వచ్చారు. అందుకే అంత ఆధిపత్య ధోరణి. పరిపాలనలోనూ నియంతృత్వ పోకడలు. ఎవరికీ అందుబాటులో ఉండరు. ప్రజా సమస్యలు అసలే పట్టవు’’ ఇవీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజెపై వినిపిస్తున్న విమర్శలు. ఆమె ఒంటెత్తు పోకడలు, పార్టీ నేతలకూ అందుబాటులో ఉండకపోవడం, ఎవరినీ లెక్క చేయకపోవడం వంటివి వసుంధరా రాజె పరిపాలనపై తీవ్ర వ్యతిరేకతను పెంచా యి. వచ్చే ఎన్నికల్లో ఆమె సీఎం కాకూడదని ఏకంగా 48% మంది కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. సొంత పార్టీలోనూ ఆమె వ్యవహార శైలి మింగుడుపడనివారు సీఎం అభ్యర్థిని మార్చాలంటూ స్వరం పెంచారు. కానీ బీజేపీ అధిష్టానం ఆ సాహసం చేయలేకపోయింది. దానికీ కొన్ని కారణాలున్నాయి. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో వసుంధరా రాజెకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. కుల సమీకరణలతో రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. 120 మంది వరకు ఎమ్మెల్యేలు ఆమె కనుసన్నల్లోనే ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా శత్రువులు ఉన్నప్పటికీ వారిలో చీలికలు తేవడంలో ఆమెకు ఆమే సాటని నిరూపించుకున్నారు. అందుకే తనకు ఎదురైన రాజకీయ సంక్షోభాల నుంచి చాలా తేలిగ్గా బయటపడ్డారు. దీంతోపాటు ప్రజల్లో కాస్తో కూస్తో చరిష్మా కలిగిన నేతలు బీజేపీకి కరువయ్యారు. ఓం మాథుర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ఉన్నప్పటికీ వారు అందరికీ ఆమోదయోగ్యమైన నేతలు కారు. ఆరెస్సెస్ ఆశీస్సులు కూడా ఆమెకే ఉండడంతో బీజేపీ అధిష్టానానికి మరో మార్గం లేకపోయింది. ఎన్నికల వ్యూహాలు ‘‘నేను రాజ్పుట్ల కూతురిని, జాట్ల కోడలని, గుజ్జార్ల వియ్యపురాలిని’’ ఇదీ ఎన్నికల సభల్లో వసుంధరా రాజె సాగిస్తున్న ప్రచారం. తన కోడలు నిహారికా సింగ్.. గుజ్జార్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని కులాల వారికి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుని చ్చిన రాజ్పుట్లు, గుజ్జార్లు దూరమవడంతో ఆమె ప్రతిచోటా భావోద్వేగాలతోనే వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. 40 రోజుల పాటు సాగే రాజస్థాన్ గౌరవ యాత్ర ప్రారంభించి గ్రామ గ్రామానికి వెళుతున్నారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా భావిస్తూ వాటి గురించే పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను మించి పార్టీలో కేడర్ వ్యతిరేకతే కలవరపెడుతూ ఉండడంతో జనసంవాద్ పేరుతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. జాట్లకు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగా కీలకమైన ప్రభుత్వ పదవుల్లో జాట్ అధికారుల్ని నియమించారు. హిందూ కార్డుని బయటకు తీసి ముస్లిం పేర్లుగా ధ్వనిస్తున్న గ్రామాల పేర్లకి హిందూ పేర్లు పెడుతున్నారు. వ్యక్తిగత జీవితం మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌కు చెందిన రాజమాత విజయరాజె సింధియా, జివాజీరావు సింధి యా దంపతుల నాలుగో సంతానమే వసుంధరా రాజె. ముంబైలో 1953, మార్చి 8న జన్మించారు. సోఫియా కాలేజీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు. 1972లో ధోల్పూర్కు చెందిన హేమంత్సింగ్ను వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత విభేదాలతో భర్త నుంచి విడిపోయారు. వారికి దుష్యంత్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. అభిరుచులు.. వసుంధరా రాజె పుస్తకాల పురుగు. చిన్నతనం నుంచి పుస్తకం కనిపిస్తే చాలు ఆసాంతం చదివేదాకా నిద్రపోయేవారు కాదు. ఇప్పటికీ రాత్రి పడుకునే ముందు కాసేపు పుస్తకం చదువుతారు. ఆమె అభిమాన రచయిత్రి హిలరీ మాంటెల్. వందల పుస్తకాలు ఆమె లైబ్రరీలో ఉన్నాయి. పెంపుడు జంతువులన్నా ఆమెకు వల్లమాలిన ప్రేమ. కుక్కల్ని పెంచుతారు. గుర్రాలంటే కూడా ఎంతో ఇష్టం. క్రీడలకి ఆమె పెద్ద ఫ్యాన్. అన్ని రకాల ఆటల్ని ఫాలో అవుతారు. క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. టీమిండియా గెలిచిన ప్రతీసారి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు పెడతారు. మొక్కల పెంపకం కూడా రాజెకి ఎంతో ఇష్టమైన అంశం. ఖాళీ సమయం దొరికితే పెరటి తోటలో చెట్ల మధ్యే గడుపుతారు. రాజకీయ ప్రస్థానం తల్లి విజయరాజె ప్రోద్బలంతోనే 1984లో రాజె రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీ తీర్థం తీసుకున్న రెండేళ్లలోనే బీజేపీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ధోల్పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర విదేశాంగ సహాయమంత్రిగా కూడా పనిచేశారు. 2003 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో పరివర్తన యాత్ర చేపట్టి ప్రజలకి దగ్గరయ్యారు. ఆమె నేతృత్వంలో 120 సీట్లతో పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2008 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజె ప్రాభవాన్ని కోల్పోలేదు. మంచి పరిపాలనా దక్షురాలిగా పేరు తెచ్చుకున్న వసుంధరా రాజె ఈసారి మాత్రం ఎవరికీ అందుబాటులో ఉండక చేజేతులారా తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకున్నారు. ‘‘స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్’’ ఇదీ కాంగ్రెస్ యువనేత సచిన్ పైలెట్ విధానం. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్.. పార్టీ పటిష్టతలో తనదైన పాత్ర పోషించారు. ఒకప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగడానికి కూడా భయపడే నియోజకవర్గాల్లో.. గెలుపు మాదే అన్న ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పారు. పార్టీ కార్యకర్తలతో నిరంతరం టచ్‌లో ఉంటూ వారు చురుగ్గా పనిచేసేలా చర్యలు చేపట్టారు. గత ఫిబ్రవరి ఉపఎన్నికల సమయంలో గ్రామగ్రామాన పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్నారు. అల్వార్, అజ్మీర్ లోక్‌సభ స్థానాలు, మండల్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కీలక పాత్ర పోషించారు. దీంతో సచిన్ సీఎం అభ్యర్థి రేసులో ముందుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ సమయంలో నూ, పెట్రో ధరలు పెరిగేటప్పుడు జరిగే నిరసనల్లో నూ ముందుండి విజయవంతంగా నడిపించారు. అనుకూల అంశాలు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు - కుల సమీకరణలకి అనుగుణంగా రాజకీయ వ్యూహరచన - భామాషా ఆరోగ్య బీమా పథకం, రాజశ్రీ యోజన వంటి పథకాలతో మహిళల నుంచి మద్దతు ప్రతికూల అంశాలు - ఎవరికీ అందుబాటులో ఉండరన్న చెడ్డపేరు - నియంతృత్వ పోకడలు - రాజ్పుట్లు, గుజ్జార్లు వంటి బలమైన సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం ఎన్నికల వ్యూహాలు.. ఎన్నికల ప్రచారం అంటే మాటలు కోటలు దాటేస్తాయి. తిట్లు, శాపనార్థాలు చివరికి బూతులు కూడా మన నేతలు మాట్లాడడం సర్వసాధారణమై పోయింది. సచిన్ దీనికి భిన్నం. పాజిటివ్ క్యాంపెయిన్ ఆయన విధానం. మంచి మాటకారి. ఏ అంశం మీదనైనా ధారాళంగా, స్పష్టంగా మాట్లాడతారు. ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా విడమరిచి చెబుతూనే, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. నియోజకవర్గాలవారీగా మేనిఫెస్టోలు రూపకల్పన చేస్తూ ప్రజాసమస్యలే ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. రైతు సమస్యలు, నిరుద్యోగం గురించి ఎన్నికల ర్యాలీల్లో ప్రస్తావిస్తున్నారు. ఈసారి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 65 లక్షలకుపైగా ఉన్నారు. దీంతో వారి ఓట్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కోసం క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. గుజ్జార్ సామాజిక వర్గానికి చెందిన పైలెట్ వారి ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు తిరిగి మళ్లించడంలో కీలకపాత్ర పోషించారు. బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్న రాజ్పుట్లను తనవైపు తిప్పుకుంటున్నారు. అయితే జనాకర్షణ అంశంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. వివిధ సంస్థల సర్వేల్లో 11% మంది మాత్రమే సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడైంది. రాజకీయ ప్రస్థానం.. కాంగ్రెస్ దివంగత నాయకుడు రాజేష్ పైలెట్ కుమారుడు సచిన్ పైలెట్. ఉత్తరప్రదేశ్‌లో సహరణ్‌పూర్‌లో 1977 సెప్టెంబర్ 7న జన్మించారు. డబుల్ ఎంబీఏ చేశారు. ఒక కోర్సు అమెరికాలో చదివారు. 2004లో రాజస్థాన్ అజ్మీర్ నుంచి లోక్‌సభకు తొలిసారి ఎన్నికయ్యారు. దేశంలోనే అతి పిన్న వయసులో అంటే 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009లోనూ విజయం సాధించారు. యూపీఏ–2లో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. గ్రామీణాభివృద్ధిపై పైలెట్‌కు ఆసక్తి ఎక్కువ. వ్యక్తిగత జీవితం.. రాజకీయాల్లోకి రాక ముందు బీబీసీ ఢిల్లీ బ్యూరో లో జర్నలిస్టుగా సేవలందించారు. ఆ తర్వాత జన రల్ మోటార్స్‌లో కూడా çకొంతకాలం పనిచేశారు. అమెరికాలో చదువుకునే సమయంలోనే జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లాతో ప్రేమలో పడ్డారు. అయితే వారి వివా హానికి ఫరూక్, ఒమర్ అంగీకరించలేదు. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగానే వాళ్లు 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరన్, వెహాన్.. ఇద్దరు కుమారులు. తర్వాత కాలంలో అబ్దుల్లా కుటుంబం పైలెట్‌తో రాజీకొచ్చింది. తన తండ్రి రాజేశ్ పైలెట్ కోరిక మేరకు కేంద్ర మంత్రి అయ్యాక సరిహద్దు రక్షక దళంలో చేరారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడానికి సిటిజెన్ అలయెన్స్‌ను ఏర్పాటు చేశారు. తన తండ్రి స్మృతిలో ‘రాజేశ్ పైలెట్: ఇన్ స్పిరిట్ ఫరెవర్’ అనే పుస్తకాన్ని సోదరి సారికా పైలెట్‌తో కలిసి రచించారు. అశోక్ గెహ్లాట్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మరో నాయకుడు అశోక్ గెహ్లాట్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. 1998 నుంచి 2003 వరకు, తిరిగి 2008 నుంచి 2013 వరకు రాజస్థాన్ సీఎంగా ఉన్నారు. పరిపాలనలోనూ తనదైన ముద్ర వేశారు క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం. ప్రజలకి అందుబాటులో ఉంటారని పేరు సంపాదించారు. 2013 ఎన్నికల సమయానికే మోదీ వేవ్‌లో రాజస్థాన్‌లో బీజేపీ నెగ్గింది తప్ప గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. ఇప్పటికీ 35% మంది ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారని సర్వేల్లో తేలింది. రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన, హిందూత్వ కార్డు తీయడం వెనుక వ్యూహకర్త గెహ్లాటే. లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాలు రచించడానికి గెహ్లాట్ సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే పైలెట్‌నే ముందుంచి అసెంబ్లీ ఎన్నికల్ని నడిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం అభ్యర్థి రేసులో గెహ్లాట్‌తో పాటు సీపీ జోషి పేరు కూడా వినిపిస్తోంది కానీ పార్టీ గెలిస్తే ఆయన్ను సీఎంని చేసే అవకాశాలు చాలా తక్కువ. అయితే ప్రచారంలోనూ, టికెట్ల పంపిణీలోనూ జోషికి కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
క్షీణిస్తున్న ‘కాషాయ ప్రభ’!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో వచ్చే నెలలో జరగనున్న శాసన సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుందా లేక కాంగ్రెస్ పునరుత్తేజితమై అధికారాన్ని చేపడుతుందా అన్నది మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఈ సారి ఎదురుగాలులు బలంగా వీచనున్నాయి. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం వల్ల సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇంత వరకు ఆ పార్టీకి వెన్ను కాసిన గిరిజనులు, ఉన్నత కులీనులు, రైతులు ఈ సారి ఎదురుతిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో బీజేపీ గెలుపు నల్లేరుమీద నడక కాదని స్పష్టమవుతోంది. అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేక పవనాలను తనక అనుకూలంగా ఎంత వరకు మార్చుకుంటుందన్నది అనుమానమే. గత మూడు ఎన్నికల్లో కాషాయందే పై చేయి బీజేపీ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై పైచేయి సాధిస్తూనే ఉంది. ఓట్లు, సీట్ల శాతాన్ని కూడా పెంచుకుంటోంది. 2013 ఎంపీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 45 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో 30 ఏళ్లలో బీజేపీకి పడ్డ అత్యధిక శాతం ఓట్లు ఇవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, బీజేపీ మొత్తం సీట్లలో 72 శాతం సీట్లను గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం తక్కువే (9%) ఉన్నా సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ కంటే బీజేపీ బాగా ముందుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శాసన సభలో ఉన్న 230 సీట్లలో బీజేపీ 165 స్థానాలు గెలుచుకుంది. వీటిలో 92 నియోజకవర్గాల్లో బీజేపీ 10 శాతం కంటే ఎక్కువ ఆధిక్యత సాధించింది. 58 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ కేవలం 17 చోట్ల మాత్రమే 10 శాతం కంటే ఎక్కువ ఆధిక్యత నిలుపుకుంది. రాష్ట్రంలో రిజర్వుడు స్థానాల్లోనూ, జనరల్ సీట్లలోనూ కూడా బీజేపీ గణనీయమైన ఆధిపత్యం ప్రదర్శించింది. రిజర్వుడు స్థానాల్లోనూ ముందంజ మధ్యప్రదేశ్ జనాభాలో షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) 21 శాతం ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 47 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ 47 సీట్లలో 31 చోట్ల గెలిచింది. 80 శాతం కంటే ఎక్కువ గిరిజనులు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరడానికి సంఘ్ పరివార్ కృషే ప్రధాన కారణమని సామాజిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గిరిజన గూడేల్లో సంఘ్ పరివార్ చేసిన సామాజిక సేవలే దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ విజయానికి బాటలు వేశాయని 2008లో వెలువడిన ఒక అధ్యయన పత్రంలో రాజకీయ విశ్లేషకులు తారిఖ్ తచిల్, రోనాల్డ్ హెరింగ్లు పేర్కొన్నారు. సంఘ్ పరివార్ కార్యక్రమాల వల్ల బీజేపీ పరపతి పెరగడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో హిందూత్వ భావన కూడా పెరిగిందని వారు చెప్పారు. హిందూత్వ కార్డు ప్రయోగం రాష్ట్ర జనాభాలో 91శాతం ఉన్న హిందువులను ఆకట్టుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో తమ హిందూత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దూరమవుతున్న కీలక ఓటు బ్యాంకు ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్రంలో ఆ పార్టీ పరపతిని నీరుగారుస్తున్నాయి. ఇంత వరకు పార్టీకి అండగా నిలిచిన గిరిజనులు, ఎస్టీలు, రైతులతో పాటు అగ్ర వర్ణాలు కూడా ఇప్పుడు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణల విషయంలో బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి ఇటు గిరిజనులకు అటు అగ్ర వర్ణాలకు కూడా రుచించలేదు. అలాగే, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడంలో ప్రభుత్వ తీరును గిరిజనులు తప్పు పడుతున్నారు. మరోవైపు ఎస్సీఎస్టీ చట్టానికి సుప్రీం కోర్టు సూచించిన సవరణలను తిరస్కరించడం ద్వారా కేంద్రం దళితులపట్ల పక్షపాతం చూపుతోందన్న భావన ఉన్నత వర్గాల్లో నెలకొంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలాగే మధ్య ప్రదేశ్‌లో కూడా అగ్ర వర్ణాల వారు బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ ప్రధానమైన మధ్య ప్రదేశ్‌లో స్రంపదాయకంగా రైతులు బీజేపీకే మద్దతు పలుకుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన పరిణామాలు, ప్రభుత్వాల తీరుతో రైతులు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం రేపు ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో పది అతిపేద జిల్లాలతో పోలిస్తే పది ధనిక జిల్లాల్లోనే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ ధనిక జిల్లాల్లో 50శాతం ఓట్లు సంపాదించుకుంటే పేద జిల్లాల్లో 39శాతంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. రైతుల అసంతృప్తి ఈ సారి ఎన్నికల్లో పేద జిల్లాలో బీజేపీపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.(ప్రజల ఆస్తులు, సౌకర్యాల తదితర అంశాల ఆధారంగా మింట్స్ డిస్ట్రిక్ట్ వెల్త్ ట్రాకర్ సంస్థ రాష్ట్రంలో పేద, ధనిక జిల్లాలను గుర్తించింది) కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందా ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలులు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే, వీటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది అనుమానమే. రైతులు, గిరిజనులు, అగ్రవర్ణాల వ్యతిరేకతతో పాటు సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత( ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది)కు క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే, ముఠా కుమ్ములాటలకు పేరొందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎంత వరకు నెగ్గుకు రాగలదో చెప్పలేం. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి ముఠా తగవులే ప్రధాన కారణమని లోక్‌నీతి–సిఎస్‌డిఎస్ కు చెందిన శ్రేయాస్ సర్దేసి 2014లో నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. కాంగ్రెస్ పార్టీ తన కొచ్చే ఓట్లను సీట్లుగా మార్చుకోగలిగితే రాష్ట్రంలో, దేశంలో కూడా మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని సర్దేసి అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చూపగలిగితే హిందీ రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నట్టవుతుంది. ఈ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు 2019 ఎన్నికలను ఉత్సాహంతో ఎదుర్కొంటారు. ఇక నాలుగో సారి అధికార పీఠం కోసం చూస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి కూడా నెగ్గితే రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
మిజోరం..ఎవరి పరం?
పదేళ్లుగా అధికారంలో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని హ్యాట్రిక్ కొట్టాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుంటే ఆ పార్టీ చేతిలో ఉన్న చిట్టచివరి రాష్ట్రాన్ని కైవసం చేసుకొని కాంగ్రెస్ ముక్త ఈశాన్య భారత్ కలను సాకారం చేసుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇక ప్రాంతీయంగా బలంగా ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) స్థానిక సమస్యలే అస్త్రంగా అందలం ఎక్కడానికి వ్యూహాలు రచిస్తోంది.మరి ఈ ఎన్నికల్లో మిజోలు ఎటువైపున్నారు? 1993 నుంచి మిజో ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో కేవలం 0.37% ఓట్లతో కమలం పార్టీ సరిపెట్టుకుంది. అయినప్పటికీ మిజోరం అభివృద్ధి అనే కార్డుని ప్రయోగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలతో బీజేపీ ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్‌లో రాష్ట్రానికి చెందిన మరో ప్రధానపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగానే పోటీకి దిగుతున్నాయి. చక్మాల నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి... మిజోరం జనాభాలో అత్యధికులు క్రైస్తవులే. అలాగే 8 శాతం మంది బౌద్ధులు ఉన్నారు. వారి ఓట్లకే బీజేపీ గాలం వేసింది. చంపాయి జిల్లాలో బుద్ధ మతానికి చెందిన చక్మాల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత బుద్ధధన్ చక్మాను తమ గూటికి లాగేసింది. కేంద్రం అన్నివిధాలా మిజోరం అభివృద్ధికి పాటుపడుతూ నిధుల్ని విడుదల చేస్తుంటే మిజోరంలో లాల్ తన్హావాలా సర్కార్ అవినీతి మకిలితో వాటిని స్వాహా చేస్తోందంటూ ప్రచారం మొదలుపెట్టింది. నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ (ఎన్ఈఎస్ఐఎస్) కింద సదుపాయాలు కల్పిస్తామని చెబుతోంది. రియా–తిద్దిమ్ రోడ్డు నిర్మించి మయన్మార్‌తో వాణిజ్యం బలపడేలా చేస్తామంటూ బీజేపీ హామీలు గుప్పిస్తోంది. సీఎంకూ అవినీతి మకిలి... మిజోరంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది. అయిదుసార్లు ముఖ్యమంత్రి అయిన లాల్ తన్హావాలా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, కోల్‌కతాలో ఒక ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మరికొందరు మంత్రులపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. లాల్ రోబైకా అనే ఎమ్మెల్యే ఆస్తులు ఏకంగా 2 వేల రెట్లు పెరిగిపోవడం వంటివి ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. కూటములే కూటములు... మిజోరంలో స్థానిక సమస్యలైన అక్రమ వలసలు, పేదరికం, నిరుద్యోగాన్ని ప్రధాన అస్త్రాలుగా చేసుకొని చిన్నాచితకా పార్టీలు కూటములుగా ఏర్పడ్డాయి. పీపుల్స్ రిప్రజెంటేషన్ ఫర్ ఐడెంటిటీ అండ్ స్టేటస్ ఆఫ్ మిజోరం (ప్రిజ్మ్), మిజోరం చాంతూల్ పాల్ (ఎంసీపీ), సేవ్ మిజోరం ఫ్రంట్, ఆపరేషన్ మిజోరం పార్టీలు కలసి ఎన్నికలకు ముందే జతకట్టాయి. గతేడాదే జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ ఎక్సోడస్ మూవ్మెంట్ వంటి పార్టీలన్నీ కలసి జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ పేరుతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. ఇక బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) స్థానికంగా శాఖను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఎన్ని కూటములు వచ్చినా బీజేపీ అభివృద్ధి కార్డు బయటకు తీసి ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నా కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌లో వలసల కలవరం... కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లాల్ జిర్లియానా మిజో నేషనల్ ఫ్రంట్‌లోకి వెళుతున్నారనే ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. మరో మాజీ మంత్రి బుద్ధధన్ చక్మా బీజేపీలో చేరిపోయారు. ఇక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ మరింత మంది నాయకులు కాంగ్రెస్‌ను వీడవచ్చనే వార్తలు ఆ పార్టీలో ఆందోళన పెంచుతున్నాయి. బీజేపీ తమ పార్టీపై ఆపరేషన్ ఆకర్‡్షను ప్రయోగించి నేతల్ని లాగాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తు న్నారు. సీఎం లాల్ తన్హావాలా తన వారసుడిగా సోదరుడు లాల్ తంజారాను తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారని, కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకు అది కూడా కారణమన్న వార్తలూ గుప్పుమన్నాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ సంస్థాగతంగా భారీగా మార్పులు తెచ్చింది. పార్టీ మిజోరం కార్యదర్శిగా భూపేన్ కుమార్‌ను నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లుజినో ఫలైరోని ఈశాన్య భారత్ ఇన్చార్జిగా నియమించింది. వాళ్లిద్దరూ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు... రాష్ట్ర జనాభాలో 11 లక్షలకుపైగా ఉన్న రైతుల ఓట్లు (దాదాపుగా 70%)ఈసారి కీలకంగా మారనున్నాయి. తీవ్ర అసంతృప్తిలో ఉన్న రైతులు భూ సంస్కరణలు, మార్కెట్ వ్యవస్థను నియంత్రించడం వంటి చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ రాష్ట్ర జనాభాలో ఇంకా 20 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. అలాగే 65 వేల మందికిపైగా యువత నిరుద్యోగంలో మగ్గిపోతోంది. మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి అక్రమ వలసలను కట్టడి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. మిజోరంలో పురుష ఓటర్లు 3.74 లక్షలు (48.8%) ఉండగా మహిళా ఓటర్లు 3.93 లక్షలు (51.2%) ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురు షులకు 1,051 మంది మహిళలు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన మహిళలు నలుగురే. 1987 తర్వాత 2014లో జరిగిన ఉప ఎన్నికలో ఓ మహిళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేకపోవడం మహిళల్లో అసంతృప్తికి దారితీస్తోంది. త్రిపుర రాష్ట్రంలోని తాత్కాలిక శిబిరాల్లో తలదాచు కుంటున్న బ్రూ గిరిజన తెగ ఎదుర్కొంటున్న సమస్యలూ ఎన్నికల అంశంగా మారాయి. 1997లో మిజోలు, బ్రూలకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో వారంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఉత్తర త్రిపురలో ఆరు తాత్కాలిక శిబిరాల్లో 32 వేల మంది బ్రూ తెగవారు నివసిస్తున్నారు. వారిని వెనక్కి తీసుకురావడానికి మిజోరం, త్రిపుర, బ్రూ తెగ సంక్షేమం కోసం పోరాడుతున్న సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ ఇప్పటివరకు కేవలం 31 కుటుంబాల వారే తిరిగి రాష్ట్రానికి వచ్చారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేడు బీజేపీ తొలిజాబితా!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు పూర్తయింది. గురు, శుక్రవారాల్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశమైన ఎన్నికల కమిటీ 30 మందితో మొదటి జాబితాను సిద్ధం చేసింది. దీనిపై శనివారం ఢిల్లీలో జాతీయ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి.. ఎలాంటి సమస్యలు లేని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతలు లక్ష్మణ్, కృష్ణదాస్, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లారు. మిగతా నియోజకవర్గాల్లో పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో మరోసారి చర్చించి పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీ తరఫున పోటీకి ఉత్సాహం చూపించిన అభ్యర్థులు మరికొన్నాళ్లు వేచిచూడక తప్పేట్లు లేదు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వెయ్యిమందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. కొన్నిచోట్ల ఒక్కో నియోజకవర్గంలో 10–15 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఈనెల 4, 5, 6 తేదీల్లో పార్టీ నాయకత్వం అభిప్రాయ సేకరణను చేపట్టింది. వాటిపై ఎన్నికల కమిటీ చర్చించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. అంతకుముందే.. మొదటి దశలో 30 పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. భారీగా ఆశావహులు బీజేపీ టికెట్ కోసం కొన్ని నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మాత్రమే పోటీ పడుతుండగా చాలాచోట్ల 5–6 మంది, మరికొన్ని చోట్ల.. పదుల సంఖ్యలో దరఖాస్తు పెట్టుకున్నారు. పార్టీకి ఉన్న ఐదు సిట్టింగ్ స్థానాల్లో మాత్రం ఎవరూ పోటీ పడలేదు. అటు, రాష్ట్ర పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న నేతలు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, పార్టీలో కొంత బలంగా ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోలేదు. తాము కోరుకునే నియోజకవర్గాల్లో టికెట్లపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే వీరికి స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు (వరంగల్ వెస్ట్), శ్రీవర్ధన్ రెడ్డి (షాద్‌నగర్), మనోహర్ రెడ్డి (మునుగోడు), యెండల లక్ష్మినారాయణ (నిజామాబాద్ అర్బన్), సంకినేని వెంకటేశ్వర్రావు (సూర్యాపేట), శ్యాంసుందర్ రెడ్డి (భువనగిరి), పొనుగోటి అరుణకుమార్ (నర్సంపేట), కూరపాటి విజయ్‌కుమార్ (పాలకుర్తి), డాక్టర్ కొరదాల నరేష్ (శేరిలింగంపల్లి), కొప్పు భాష (వికారాబాద్), కీర్తిరెడ్డి (భూపాలపల్లి), పుంజా సత్యవతి (భద్రాచలం), రేష్మ రాథోడ్ (వైరా), ఆర్.లింగయ్య (సత్తుపల్లి), భూక్యా ప్రసాద్ (అశ్వరావుపేట), విజయ రాజు (మధిర) తదితరులు ఉన్నారు. వరంగల్ వెస్ట్ (మార్తినేని ధర్మారావు– రావు పద్మ), మునుగోడు (మనోహర్ రెడ్డి – కడగంచి రమేష్), పరకాల (డాక్టర్ విజయచందర్ రెడ్డి – డాక్టర్ సంతోష్) స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బుధవారం అభిప్రాయ సేకరణ జరిగింది. కేవీఎల్ఎన్ రెడ్డి – నెల్లుట్ల నర్సింహారావు (జనగాం), కాసం వెంకటేశ్వర్లు – దొంతి శ్రీధర్ రెడ్డి (ఆలేరు), బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి – రమేష్ (కొత్తగూడెం), పురుషోత్తం రెడ్డి – పాడూరి కరుణ (మిర్యాలగూడ) మధ్య కూడా టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. మిగతా నియోజకవర్గాల్లో ముగ్గురికంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. మొదటి జాబితాలో (అంచనా): డాక్టర్ లక్ష్మణ్ (ముషీరాబాద్), కిషన్ రెడ్డి (అంబర్‌పేట), ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (ఉప్పల్), చింతల రాంచంద్రారెడ్డి (ఖైరతాబాద్), రాజాసింగ్ (గోషామహల్), ఎన్ రాంచందర్‌రావ్(మల్కాజిగిరి), రఘు నందన్ రావు (దుబ్బాక), ఆచారి (కల్వకుర్తి), బండి సంజయ్ (కరీంనగర్), గుజ్జుల రామకృష్ణా రెడ్డి (పెద్దపల్లి), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), డాక్టర్ రమాదేవి (ముధోల్), ఆనంద్ రెడ్డి (నిజామాబాద్ రూరల్), వెంకటరమణారెడ్డి (కామారెడ్డి), వినయ్ రెడ్డి (ఆర్మూర్), లింగయ్యదొర కుమారుడు (పిన పాక), కుంజా సత్యవతి (భద్రాచలం), శ్రీధర్ రెడ్డి (పాలేరు), రవిశంకర్ పటేల్ (తాండూరు), శ్రీవర్ధన్ రెడ్డి (షాద్‌నగర్), రతంగ్ పాండురెడ్డి (నారాయణ పేట), మల్లేశ్వర్ (అచ్చంపేట), ఎగ్గెని నర్సింహులు (దేవరకద్ర), వెంకటాద్రి రెడ్డి (గద్వాల్), కీర్తి రెడ్డి (భూపాలపల్లి), డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి (పరకాల), కొండయ్య (మక్తల్), మోహన్ రెడ్డి (మేడ్చల్), రేష్మ రాథోడ్ (వైరా), బాబుమోహన్ (ఆందోల్). -
నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేసిన రాహుల్
-
వైరల్ : అచ్చం మోదీలాగా రాహుల్‌గాంధీ..!
మోరేనా : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార హోరు పెంచారు. భారీ బహిరంగ సభల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోరేనాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. మోదీ హవాభావాలతో ప్రసంగిస్తూ.. ‘మిత్రులారా..! నన్ను ప్రధాన మంత్రి అని పిలవకండి. వాచ్మెన్ అని పిలవండి’ అంటూ తియ్యగా మాట్లాడి నరేంద్ర మోదీ ప్రజల్ని మభ్యపెడతాడని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజలను మిత్రులారా అని పేర్కొంటూ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో వేల కోట్లు ఎగవేసిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు ‘సోదరుడి’గా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కాగా, రాఫెల్ డీల్‌లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించిందనే ఆరోపణలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వరసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నుంచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవితవ్యం ఏమిటి?
15 ఏళ్ల అధికార బీజేపీ జైత్రయాత్రను అడ్డుకోగలదా? కీలకమైన మధ్య ప్రాంతాల్లో పట్టు సాధించగలదా? నవంబర్ 28న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీపై తలెత్తుతున్న అనుమానాలివి. కూటమి కుదర్లేదు మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై పోరుకు విపక్ష కూటమిని కూడగట్టాలన్న కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. అదే కూటమిని రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని భావించింది. కానీ విపక్ష కూటమి ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. కూటమిలో ప్రధాన పక్షాలుగా భావించిన పార్టీలన్నీ ఒంటరి పోరుకే మొగ్గు చూపాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు వేర్వేరుగానే రంగంలోకి దిగాయి. సొంతంగా 200 సీట్లకు పోటీచేస్తున్నట్టు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదంపై కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. మధ్యప్రాంతాలే కీలకం అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలోని మాల్వా, మధ్య ప్రాంతాల్లోని (సెంట్రల్ రీజియన్) 86 సీట్లు అత్యంత కీలకం. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది 10 సీట్లలో మాత్రమే. అప్పటివరకు కాంగ్రెస్‌కు ఆ ప్రాంతాల్లో కనీసం 30 సీట్లలో గెలవగలిగే బలముండేది. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో బీజేపీ 50% పైగా ఓట్లతో 74 సీట్లలో విజయ భేరీ మోగించింది. బీజేపీ గెలిచిన వాటిలో మాల్వా ప్రాంతంలో 45, సెంట్రల్ రీజియన్‌లో 29 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ మాల్వాలో 4, సెంట్రల్ రీజియన్‌లో 6 సీట్లలో మాత్రమే గెలవగలిగింది. సెంట్రల్ రీజియన్‌లోని బుధ్ని నుంచే సీఎం శివరాజ్‌చౌహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండోర్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేతలు సుమిత్ర మహాజన్, కైలాష్ విజయ్‌లకు మాల్వా ప్రాంతంపై మంచి పట్టుంది. కీలకమైన ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రదర్శన పూర్తిస్థాయిలో మెరుగైతేనే అధికార సాధన సులువవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. హిందూ మంత్రం గట్టెక్కించేనా? బీఎస్పీతో కోరుకున్న పొత్తు కుదరకపోవడంతో అగ్రవర్ణాలు ముఖ్యంగా బ్రాహ్మణుల ఓట్లను తిరిగి సాధించడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలనన్నింటినీ సందర్శిస్తూ హిందువుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్‌ను శివభక్తుడిగా చూపుతూ, శివలింగానికి రాహుల్ అభిషేకం చేస్తున్న ఫొటోలతో స్వాగత తోరణాలు, బ్యానర్లు వెలిశాయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన దారిలో ఉన్న చిత్రకూట్‌లోని కామ్టానాథ్ దేవాలయంలో పూజలతో రాహుల్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆంటోనీ కమిటీ ఏం చెప్పింది ? మైనారిటీ పక్షపాత రాజకీయాల కారణంగా మెజారిటీ హిందువులకు దూరం అవుతున్నామన్న భావన కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో మూడోసారి ఓటమితో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసినప్పటి నుంచి ఈ విషయంలో అంతర్మథనం మొదలైంది. దీనిపై సీనియర్ నేత ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీ ఒక కమిటీని వేసింది. ముస్లిం అనుకూల వైఖరి కారణంగానే వరస ఓటముల బారిన పడుతున్నట్లు ఆ కమిటీ తేల్చింది. కాంగ్రెస్‌ను ముస్లిం అనుకూల పార్టీగా భావించి మెజారిటీ హిందువుల్లోని కొన్ని వర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని పేర్కొంది. సెక్యులరిజానికి కొత్త నిర్వచనం ఇస్తూ మెజారిటీ హిందువుల మన్నన పొందేందుకు ప్రయత్నించాల్సిందిగా ఈ కమిటీ సూచించింది. ప్రభావం చూపే అంశాలు.. ♦ రైతాంగ సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించాలని, రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2017 జూన్‌లో మందసోర్లో ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చి.. పోలీసు కాల్పులకు దారి తీసింది. ఆ కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు. ♦ సపాక్ అనే సంస్థను స్థాపించి జనరల్, ఓబీసీ, మైనారిటీ ఉద్యోగులు ఏకతాటిపైకి వస్తున్నారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ♦ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలు 20.3%, ఎస్సీలు 15.2% ఉన్నారు. ఈ వర్గాల ఓట్లు మెజారిటీ స్థానాలను ప్రభావితం చేయనున్నాయి. ♦ నిరుద్యోగంతో 11.2 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్లో నమోదు చేసుకుంటే 2017లో 422 మందికే ఉద్యోగాలొచ్చాయి. గత 3 ఎన్నికల్లో ఇలా..! 2003లో బీజేపీ – 173 (42.5%) కాంగ్రెస్ – 38 (38.87% (ఈ ఎన్నికల్లో ఉమాభారతి సారధ్యంలో బీజేపీ పదేళ్ల దిగ్విజయ్ పాలనకు చరమగీతం పాడింది) 2008లో బీజేపీ – 143 (37.64%) కాంగ్రెస్ – 71 (32.39%) 2013లో బీజేపీ – 165 (44.88%) కాంగ్రెస్ – 58 (42.67%) (2008, 2013 ఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీని విజయతీరాలకు చేర్చారు) -
ఎన్నికలు : ఈవీఎంల హ్యాకింగ్‌పై షాకింగ్ రిపోర్టు
చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల హాడావుడి ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వీవీపీఏటీ ఆధారిత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విస్తు గొలిపే బీబీసీ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. దేశీయ ఈవీఎంలను హ్యాక్ చేసే మార్గాన్ని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ సైంటిస్ట్‌లు కనుగొన్నట్టు రిపోర్టు చేసింది. మొబైల్ టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఎన్నికల ఫలితాలను యూఎస్ యూనివర్సిటీ సైటింస్ట్‌లు తారుమారు చేయొచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బీబీసీ న్యూస్ రిపోర్టు ఆన్లైన్లో పోస్ట్ చేసింది. మిషన్లలో వెనుక డిస్ప్లే ఎలా ఉంటుందో అచ్చం అదే మాదిరి డిస్ప్లే బోర్డును రూపొందించినట్టు ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రొఫెసర్ జే అలెక్స్ హాల్డ్రర్మ్యాన్ చెప్పారు. ఈ డిస్ప్లే బోర్డు, మిషన్ చూపించే మొత్తం ఓట్లను కొల్లగొట్టి, వాటి స్థానంలో వేరేవి చూపించేలా రూపొందించామన్నారు. అదేవిధంగా ఈవీఎంలకు మైక్రోప్రాసెసర్లను కూడా మిచిగాన్ యూనివర్సిటీ రీసెర్చర్లు జత చేసి చూపించారు. దీని ద్వారా ఓటింగ్‌కు, ఓట్ల కౌంటింగ్‌కు మధ్య ఫలితాలను తారుమారు చేయొచ్చని బీబీసీకి తెలిపారు. భారత్ ఈవీఎంలను ప్రపంచంలో అత్యంత ట్యాంపర్ప్రూఫ్ ఓటింగ్ మిషన్లుగా వర్ణించారు. ఈ డివైజ్‌లో ఉన్న సాఫ్ట్వేర్ అసలు ట్యాంపర్ చేయడానికి ఉండదు. ప్రజలు వేసే ఓట్లను, దాని కోసమే ప్రత్యేకంగా రూపొందించే కంప్యూటర్ చిప్స్‌లో స్టోర్ చేస్తారు. దీంతో ట్యాంపర్ చేయడం చాలా కష్టతరమవుతుంది. కానీ భారత ఎన్నికల కమిషన్ వాడే ఈవీఎంలను కూడా హ్యాక్ చేసే అవకాశముందని మిచిగాన్ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు తేల్చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్రాలకు కావాల్సిన ఈవీఎంలు, వీవీపీఏటీ లను కేటాయిస్తోంది. -
..ఆ ఇద్దరిలో ఎవరు అధికారిక అభ్యర్ధి ?
ఓ రాజకీయ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టయితే, వారిలో ఎవరు అధికారిక అభ్యర్ధి అవుతారు? అభ్యర్ధులు సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎప్పుడు కోల్పోతారు? ఓ వ్యక్తి తనకు కింది కోర్టు మూడేళ్లు జైలుశిక్ష విధించిన పక్షంలో – హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత పొందగలరా? మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రిటర్నింగ్ / అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి ప్రశ్నలు సంధించింది. ఆగస్టులో వారికి పరీక్ష పెట్టింది. అదనపు జిల్లా మేజిస్ట్రేట్లు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు, రెవెన్యూ ఆఫీసర్లు గంటసేపు నిర్వహించిన ఈ పరీక్షకు హాజరయ్యారు. సగానికి పైగా అధికారులు పై ప్రశ్నలకు సమాధానాలు రాయలేక తెల్లమొహం వేశారట! మొత్తం 58 శాతం మందికి పైగా తప్పారట!! వీరంతా ఈ ఏడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలక విధులు నిర్వర్తించాల్సిన వాళ్లు. ఎన్నికల విధుల్లో వున్న ప్రతి అధికారికి నియమ నిబంధనలు తప్పక తెలిసి వుండాలనే ఉద్దేశంతోనే ఈ పరీక్ష నిర్వహించామంటున్నారు మధ్యప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వీఎల్ కాంతారావు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం – వెయ్యి మందికి పైగా అధికారులు ఎన్నికల బాధ్యతల్లోకి దిగాల్సివుంది. వీరిలో 567 మంది అధికారులు పరీక్ష రాయగా, 244 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసిన వారికి ఎన్నికల నిర్వహణపై నాలుగు రోజుల శిక్షణ ఇచ్చారు. విషయాలను బాగా తలకెక్కించేందుకు కొంత సమాచారం కూడా అందించారు. 70 శాతం పైబడి మార్కులొచ్చిన వారిని మాత్రమే ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు అర్హులుగా ప్రకటించారు. తప్పిన అధికారులు మరోసారి పరీక్ష రాయాల్సిందే. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న బ్యాచ్‌తో కలిపి, వారికి మరోసారి పరీక్ష పెడతామని చెబుతున్నారు కాంతారావు. రెండోసారి కూడా తప్పిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాన ఎన్నికల కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాస్తుందని తెలిపారు. పరీక్షకు హాజరైన పలువురు అధికారులు ఏ మాత్రమూ సంతోషంగా లేరట. రెవెన్యూ వసూళ్ల సంగతి చూసుకోవాలి. శాంతి భద్రతలు చక్కదిద్దుకోవాలి. పనిభారంతో సతమతమైపోతున్నాం. పరీక్ష పెట్టే బదులు మాకో గైడు ఇవ్వొచ్చు కదా.. దాని సాయంతో శుభ్రంగా ఎన్నికల డ్యూటీ పూర్తి చేసేస్తాం కదా.. అంటున్నారు ఓ రెవెన్యూ అధికారి. ఒక గంట సమయమివ్వాల్సి వుండగా, అరగంటలోనే పరీక్ష ముగించేశారని ఆరోపిస్తున్నారు పరీక్ష తప్పిన మరో అధికారి. పోలింగ్ నిర్వహణ తాలూకూ ప్రాథమిక పరిజ్ఞానం లేనివాళ్లు ఎన్నికలు సజావుగా జరపగలరని ఎలా విశ్వసించగలమని ప్రశ్నిస్తున్నారు సమాచార హక్కు కార్యకర్త అజయ్ దూబే. ప్రజాస్వామ్యంలో పారదర్శకత తప్పనిసరి కాబట్టి, పరీక్షా పత్రాలను బహిరంగపరచాలని ఆయన ఈసీని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అధికారులను అవస్థల పాల్జేసిన పై ప్రశ్నలకు సమాధానాలేంటి? పార్టీ నుంచి నామినేషన్ లెటర్ (బిఫామ్) పొందిన వ్యక్తే అధికారిక అభ్యర్ధి. పోలైన మొత్తం ఓట్లలో ఆరింట ఒక వంతు ఓట్లు పొందలేని అభ్యర్ధులు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు. ఒక వ్యక్తి దిగువ కోర్టు తనకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే ఇస్తే – ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. -
ఎలక్షన్ టైమ్
-
ఆ ఐదింటిలో ఎవరు..?
-
‘బీజేపీతో పొత్తా?.. వెలేస్తా’
సాక్షి, బెంగళూరు: జనతా దళ్(సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ.. తనయుడు కుమార్‌స్వామికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీతో పొత్తు లాంటి ప్రయత్నం చేస్తే కొడుకని కూడా చూడకుండా కుమారస్వామిని వెలేస్తానని ప్రకటించారు. సోమవారం తన నివాసంలో ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు దేవెగౌడ ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీతో కుమారస్వామి పొత్తు అంశం గురించి జర్నలిస్ట్ ప్రస్తావించగా... ‘ఒకవేళ అలాంటిదే జరిగితే నేను, నా భార్య, నా కుటుంబమే కుమార స్వామిని వెలిస్తుంది. గతంలోనే అతను (కుమారస్వామి) తప్పు చేశాడు. వ్యక్తిగతంగా నష్టపోవటంతోపాటు పార్టీని కొలుకోలేని దెబ్బతీశాడు. మళ్లీ ఇప్పుడు అదే తప్పు చేస్తానంటే ఎలా ఊరుకుంటా?. పార్టీలోంచే కాదు, ఇంట్లో కూడా అతనికి స్థానం ఉండదు’ అని దేవెగౌడ హెచ్చరించారు. తండ్రి ప్రకటనపై తనయుడు కుమారస్వామి స్పందించారు. ‘ఆయన(దేవెగౌడ) ఆ మాటలు ఏ సందర్భంలో అన్నారో నాకు తెలీదు. కానీ, అలాంటి పరిస్థితి రాదనే నా నమ్మకం. ఖచ్ఛితంగా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని కుమారస్వామి తెలిపారు. కాగా, సర్వే ఫలితాల్లో ‘హంగ్’ ఏర్పడొచ్చన్న కథనాలమేర కుమారస్వామి.. బీజేపీతో దోస్తీ వైపు అడుగులు వేస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
‘అమిత్‌షా హిందువు కాదు, జైనుడు’
మైసూరు: పోటాపోటీగా సాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న తరుణంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడిక్కింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కర్ణాటక ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. ‘అమిత్ షాకు దమ్మూ, ధైర్యం ఉంటే సరైన ఆధారాలతో హిందువునని ఆయన నిరూపించుకోవాలి. ఆయన అచ్చమైన జైనుడు. అమిత్ షా ఎంతమాత్రం వైష్ణవ మతస్తుడు కాద’ని శుక్రవారం జరిగిన మైసూరు జిల్లా జర్నలిస్టుల సమావేశంలో పాల్గొన్న సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా సిద్దరామయ్య హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేస్తున్న అమిత్ షాపై ఆయన ఘాటుగా స్పందించారు. చావులను కూడా రాజకీయం చేయాలని చూసే నీచ రాజకీయాలే బీజేపీ విధానమని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైన సందర్భంలో కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే స్పందించిన తీరు దారుణమని అన్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసమే ఆ ప్రమాదం ఘటన చిత్రీకరించారని అనడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు మచ్చుతునక అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. నిజంగా బీజేపీకి మత పిచ్చి లేదనుకుంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దక్షిణ్ కన్నడ’ జిల్లాలో పర్యటించినప్పుడు హిందువుల ఇళ్లల్లోకి వెళ్లి పలకరించిన ఆ పార్టీ నాయకులకు.. అదే ప్రాంతంలో, ప్రమాదం బారిన పడి చనిపోయిన వారి ముస్లిం కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా? అని ప్రశ్నించారు. మతం ముసుగులో రాజకీయాలు చేసే బీజేపీ ద్వంద్వ వైఖరికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. -
మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు