జైపూర్ : సెమీఫైనల్స్‌గా భావిస్తున్న అయిదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అందరి దృష్టీ ఈనెల 11న వెలువడే ఎన్నికల ఫలితాలపైనే నెలకొంది. కీలక రాష్ట్రాలైన రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. ఇక అధికారం నిలుపుకుని సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పాలక బీజేపీ భావిస్తోంది.
రాజస్ధాన్‌లో ముగిసిన పోలింగ్
రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాజస్ధాన్‌లో మొత్తంగా 72.62 శాతం పోలింగ్ నమోదైంది. 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. బీఎస్పీ అభ్యర్థి మృతితో అల్వార్ జిల్లా రామ్‌గర్ స్ధానంలో పోలింగ్ వాయిదా పడింది. పోలింగ్‌లో సందర్భంగా కొన్నిప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి.
సికార్‌లో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రం వద్దే బాహాబాహీకి దిగిన కార్యకర్తలు వాహనాలకు నిప్పంటించడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకూ మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. రాజస్ధాన్‌లో అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఈ ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి. డిసెంబర్ 11న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment