జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమలనాధులకు గట్టిషాక్ తగిలింది. వసుంధర రాజె నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందనే ప్రచారంతో కలవరపడుతున్న బీజేపీకి తాజాగా ఆ పార్టీ ఎంపీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దౌసా ఎంపీ, మాజీ డీజీపీ హరీష్ మీనా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మరికొన్ని వారాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీకి మీనా నిష్క్రమణ భంగపాటుగా మారింది.
మీనా సోదరుడు నమో నారాయణ్ మీనా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజస్ధాన్‌లో ప్రాబల్యం కలిగిన మీనాలు తూర్పు రాజస్ధాన్‌లో గణనీయ సంఖ్యలో ఉన్నారు. మీనా వర్గీయులు రాజకీయాల్లో, ప్రభుత్వ సర్వీసుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
2009-13 మధ్య హరీష్ మీనా రాజస్థాన్ పోలీస్ చీఫ్‌గా దీర్ఘకాలం సేవలు అందించారు. కాగా రాజస్ధాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అధికారం నిలుపుకునేందుకు బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment